* * * *
"ఏంటి మాధవరావు! నువ్వు చెప్పేది నిజమే!" అన్నాడతని స్నేహితుడు నాగేశ్వరరావు.
"అవున్రా, అంతా మా ఖర్మ. అసలేం జరిగిందో మనం వెంటనే వాడితో కలిసి మాట్లాడాలి. ఆ ఇన్స్ పెక్టర్ ఎవరికో డబ్బుకి అమ్ముడుపోయి కేసు తారుమారుచేస్తున్నాడని నా ఉద్దేశం. అందుకే నువ్వు బయలుదేరు. వాడితో మనం మాట్లాడితేగానీ అసలు నిజం ఏంటో బయటకు రాదు. రేపు బెయిల్ కూడా నువ్వే ట్రై చేయాలి" అన్నాడు మాధవరావు.
"సరే...సరే....నువ్వు కంగారుపడకు, పదినిమిషాల్లో బయలుదేరదాం" అని చెప్పాడు నాగేశ్వరరావు.
గుమాస్తాకు ఏవో సూచనలు ఇచ్చి "నేను ఓ గంట సేపటిలో వస్తాను. అన్ని సిద్దం చేసి వుంచు" అని చెప్పాడు నాగేశ్వరరావు.
"పదరా, వెళ్దాం" అంటూ పోలిస్ స్టేషన్ కు వెళ్ళారు ఇద్దరూ నాగేశ్వరరావు కారులో.
దారిపొడువునా మాధవరావు మిత్రుడికేవో సలహాలు, సూచనలు ఇస్తూనే వున్నాడు. కారు పోలిస్ స్టేషన్ కు చేరుకుంది. ఆ కారు చూడగానే ఇన్స్ పెక్టర్ కు చెమటలు పోశాయి. అది పట్టణంలోనే ప్రముఖ క్రిమినల్ లాయర్ నాగేశ్వరరావుది కావటంవల్ల ఇన్స్ పెక్టర్ కంగారుపడ్డాడు.
23
"ఏంటి ఇన్స్ పెక్టర్! బావున్నారా?" అడిగాడు నాగేశ్వరరావు.
"బావున్నాను సార్!" వినయంగా చెప్పాడు.
"ఏడీ , మా వాడ్ని ఎక్కడ పెట్టావ్? అదే ఈయన తమ్ముడ్ని " అన్నాడు మళ్ళీ.
ఇన్స్ పెక్టర్ బిత్తర చూపులు చూస్తున్నాడు.
"ఏంటి చెప్పవే....ఎందుకు కంగారుపడుతున్నావ్? అప్పుడే స్టేషన్ మర్చేశావా?" అన్నాడు కాస్త కటువుగా లాయర్ నాగేశ్వరరావు.
"లేదు సార్!" అంటూ అరేయ్ టునాట్ త్రీ...ఇటురా" అంటూ పిలిచాడు.
"సార్ ని రాత్రి హత్య కేసు నిందితుడి దగ్గరకు తీసుకెళ్ళు..." అన్నాడు.
వాడు "రండి సర్" అంటూ ఇద్దర్ని లాకప్ గది దగ్గరకు తీసుకెళ్ళాడు.
మాధవరావు లాకప్ గది లోపలికి చూశాడు. సుందరం లోపల గోడకు అనుకుని నీరసంగా, శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. వాడిని ఆ విధంగా చూసేసరికి మాధవరావుకి దుఃఖం పొంగివచ్చింది. అంతలోనే ఆ దుఃఖం ఆవేశంగా మారింది.
వీళ్ళిద్దర్ని చూసిన సోమసుందరంలో చలనం వచ్చింది. నెమ్మదిగా లాకప్ దగ్గరకు వచ్చి "నన్ను క్షమించన్నయ్యా...నేను వరాలు విషయంలో తప్పు చేశాను కానీ, ఈ హత్య మాత్రం నేను చేయలేదు" అన్నాడు కళ్ళవెంట జలజలా రాలిపోతుండగా.
మాధవరావుకు కూడా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.
"అసలేం జరిగింది సుందరం?" అడిగాడు లాయర్.
"ఇదంతా ఆ కరణంగాడే చేశాడు...." అన్నాడు కోపంతో రగిలిపోతూ.
మాధవరావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
"కరణమా?!" అన్నాడు ఆశ్చర్యంగా.
"అవునన్నయ్యా! నాకు తాగుడు అలవాటు చేసింది వాడే! ఆ వరాలని పరిచయం చేసింది వాడే" అంటూ జరిగిన కధంతా మెల్లగా చెప్పసాగాడు.
* * * *
"ఏంటి కరణం! మొత్తానికి సర్వోత్తమరావు తమ్ముడ్ని హత్యానేరంలో ఇరికించావు....నువ్వు సామాన్యుడివి కాదు" అన్నాడు గోపాలరావు నవ్వుతూ.
"నేను ఇరికించటమేమిటండి! మిరేకదా చేయమంది. పదకమంతా మీది....ఆచరణ నాది. అసలు వాడు.....మన భీమరావుగాడు ఆ గదిలో ఏమి వదిలిరాలేదు కదా?" అన్నాడు కరణం భయంతో.
చేసిందంతా చేసి ఇప్పుడు భయపడితే ఎలాగయ్యా " అన్నాడు గోపాలరావు నవ్వుతూ.
"అయ్యా! ఇదేం బాగోలేదండి......మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. మాధవరావు అసలే ఆ క్రిమినల్ లాయర్ నాగేశ్వరరావుని పెట్టాడట.....వాడు అసాధ్యుడు. హత్య తనే చేసి నేను చేశానని నిరుపించగల సమర్ధుడు. ఈపాటికి సుందరం వాళ్ళ అన్నయ్యకు, లాయర్ కు చెప్పే ఉంటాడు నా హస్తముందని. నేనే చేయించానని ఖచ్చితంగా చెప్పుంటాడు. మహా ప్రభో! మీరే రక్షించాలి నన్ను, నేను ఇంటికి వెళ్ళలేను, జైలుకు వెళ్ళలేను" అన్నాడు కరణం గజగజా వణికిపోతూ.
"ఈ భయం ముందుండాలయ్యా! సర్లే, నేను చూసుకుంటాలే, ఊరికే వాగకు" అన్నాడు గోపాలరావు.
"అలా అన్నారు బావుంది....మిరున్నారనే ధైర్యంతోనే కదా నేను ఆ సుందరంగాడితో శతృత్వం పెంచుకుంది. లేకపోతే అతనితో నేనెందుకు తలపడతాను" అన్నాడు కరణం.
"నీ వాలకం చూస్తుంటే కరణం , కోర్టుకు ముందే పోయి ఇందులో నా ప్రేమేయం ఏమిలేదు అంతా గోపాలరావే చేయమన్నాడని చెప్పెలాగున్నావు" అన్నాడు గోపాలరావు తీవ్రస్వరంతో.
"అయ్యో! నన్ను అపార్ధం చేసుకోకండి....ప్రాణం పోయినా సరే మీ మాట చెప్పను" అన్నాడు కరణం.
"అయినా మీ చోద్యం గానీ కరణం ....ఈ కుట్రలో మిరున్నారని ఈపాటికే వాళ్ళకు తెలిసిపోయుంటుంది. మీరొక్కరే ఇంత సాహసం చేస్తారనుకోరు....మీ వెనుక అయ్యగారి హస్తం ఉంటుందనేది జగమెరిగిన సత్యం ....కనక నువ్వు నిశ్చింతగా వుండు. అంతా ఆయనే చూసుకుంటాడు" అన్నాడు భీమారావు.
"ఏంట్రా నన్ను కూడా చాలా తెలివిగా ఇరికిస్తున్నవే, చంపేస్తానురోయ్" అన్నాడు గోపాలరావు.
