"మీ తమ్ముడ్ని హత్యానేరం కింద అరెస్టు చేశామండి" చెప్పాడు ఇన్స్ పెక్టర్ .
క్షణం సేపు వాళ్ళ చెవులను వాళ్ళే నమ్మలేకపోయారు. ఏంటి ఇది కలా , నిజమా? హత్యానేరమేమిటి? అని ఇంటిల్లిపాదీ స్థాణువుల్లా నిలబడి పోయారు.
ముందుగా మాధవరావు తేరుకుని,
"ఏంటి ఇన్స్ పెక్టర్ మీరనేది? మా తమ్ముడంటే ఎవరనుకుంటున్నారు? మీరు పొరపడి వుంటారు. ఎవర్నో చూసి మా తమ్ముడనుకుని వుంటారు" అన్నాడు మాధవరావు ఇన్స్ పెక్టర్ తో సీరియస్ గా.
"చూడండి, మేము అన్ని వివరాలు కనుక్కోకుండా రామండి.....ఇలా పొరపాట్లు చేస్తూ వుంటే మా ఉద్యోగం ఎలా చేస్తాం? రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో వరాలనే అమ్మాయిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. బహుశా తాగిన మైకంలో హత్య చేసి వుండొచ్చు. ఆమె పక్కనే తనూ స్పృహ తప్పి పడిపోయి వున్నాడు" అని వివరించాడు ఇన్స్ పెక్టర్.
ఆ మాటలు వినగానే శివపార్వతి "ఏమండి! ఎంతపని చేశారండి నన్ను, నా పిల్లల్ని అన్యాయం చేశారు కదా" అంటూ పెద్దగా అరిచి కుప్ప కూలిపోయింది.
దాక్షాయణి, కస్తూరి ఆమె దగ్గిరకు పరుగున వెళ్ళారు.
సర్వోత్తమరావు నోటివెంట మాట రావటంలేదు. అలాగే నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు.
పిల్లలు ఏడుస్తున్నారు.
"ఇప్పుడు వాడు ఎక్కడ వున్నాడు ఇన్స్ పెక్టర్?" అడిగాడు మాధవరావు.
"పోలిస్ స్టేషన్ లో వున్నాడు ....ఈరోజు ఆదివారం కదా.....రేపు కోర్టుకు హాజరుపర్చుతాము" అని.....
"వస్తామండి" సర్వత్తమరావుకు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
అప్పటికే ఇంటిముందు జనం గుంపులు గుంపులుగా చేరారు.....ప్రెసిడెంటుగారి ఇంటికి పోలిస్ జీప్ వచ్చిందని తెలిసి, వారిని వెళ్ళిపొమ్మని పోలీసులు లాఠీలతో బెదిరించి జీపెక్కి వెళ్ళిపోయారు.
"ఏంట్రా-పోలీసులు ఏంటి? హత్యేంటి?" సగం అర్ధమయి, సగం అర్ధం కానీ అయోమయంలో అడిగాడు రామశేషు.
"ఏం లేదు అన్నయ్యా! నువ్వు పడుకో" అన్నాడు మాధవరావు.
"ఏంట్రా మాధవా! ఏంటిది? మన పరువు ప్రత్రిష్టలన్ని గంగలో కలిసిపోయాయిరా, ఇక నేను ఉళ్ళో తలెత్తుకుని ఎలా తిరిగేదిరా...." అంటూ సర్వోత్తమరావు భోరున ఏడ్చాడు. అయన ఏడవటంతో కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి, పిల్లలంతా ఒక్కసారిగా ఘొల్లుమని ఏడ్చారు.
"అన్నయ్యా....అన్నయ్యా......ఏంటది......ఊరుకోండి.....మీరే ఇలా అధైర్యపడితే ఎలా? వాళ్ళు చూడు ఎలా బెంబేలుపడిపోయారో.....ఊరుకోండి......నాకెందుకో ఈ హత్య వాడు చేసివుండడు అనిపిస్తుంది" అన్నాడు మాధవరావు.
"చేసినా చేయకపోయినా మచ్చ మచ్చే గదరా....అయినా వీడు తాగటం ఏమిటి, దాని కొంపకు పోవటం ఏమిటి? ఈ హత్యలేంటి?" అన్నాడు సర్వోత్తమరావు.
"అన్నీ నేను చూసుకుంటాగా, మీరు కంగారుపడకండి, ఏం చేద్దాం చేసిన ఖర్మ....జరగరానిది జరిగిపోయింది. ఇక జరగవలసింది చూడాలి కదా....నేను స్టేషన్ కు పోయి వాడిని కలిసి వస్తాను. అసలేం జరిగిందో తెలుసుకుంటాను" అన్నాడు మాధవరావు.
లోపలికి వచ్చి దాక్షాయణితో చెప్పాడు---
"శివపార్వతి జాగ్రత్త. రామశేషు అన్నయ్యకు విషయం తెలియనియకండి. ఆయన ఆరోగ్యం కూడా సరిగాలేదు. నేను ఓ గంటలో వస్తాను" అని చెప్పి బండి తీసుకుని బయలుదేరాడు.
దార్లో అడుగడుగుకు అడగడమే ఈ విషయం మాధవరావుని , అతనికి తల కొట్టేసినట్లయింది. ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాడు.
"ఏడి ఇన్స్ పెక్టర్! మా వాడు ఎక్కడున్నాడు?" అడిగాడు మాధవరావు.
"లోపల లాకప్ గదిలో వున్నాడు" అన్నాడు క్లుప్తంగా.
"నేను వాడితో కొంచెం మాట్లాడాలి" అన్నాడు మాధవరావు.
"ఇప్పుడు కుదరదండి!" అన్నాడు ఇన్స్ పెక్టర్ నిర్లక్ష్యంగా.
మాధవరావుకు ఒళ్ళు మండిపోయింది. ఇదివరకు వీడు ఎక్కడ కనిపించినా నమస్కారం సార్ అంటూ వినయంగా పలకరించేవాడు. ప్రతి పండక్కి మామూలు తీసుకునేవాడు. అలాంటిది ఏంటి వీడు ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు? మాధవరావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి.
"అయితే ఇప్పుడు కుదరంటావ్" అన్నాడు తీవ్రంగా.
ఆ స్వరానికి ఇన్స్ పెక్టర్ ఖంగుతిన్నాడు.
"కుదరదన్నానుగా" అన్నాడు మళ్ళీ.
"మరెప్పుడు కుదురుతుంది?" అడిగాడు మాధవరావు.
"రేపే.....రేపు కోర్టుకు తిసుకోస్తాం కదా....మీరేదైనా మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడుకోవచ్చు." అన్నాడు నిర్లక్ష్యంగా.
"ఏంట్రా కోర్టులో మాట్లాడేది. చంపెస్తానేమనుకుంటున్నావో?" అంటూ ఇన్స్ పెక్టర్ చొక్కా పట్టుకుని ముందుకు గుంజాడు.
"ఏ....ఎంటండి.....మీ దౌర్జన్యం?" అన్నాడు ఇన్స్ పెక్టర్ కంగారుగా.
"దౌర్జన్యమా? వాడ్ని అయిదు నిముషాలు కలిసి మాట్లాడాలంటుంటే వీలుపడదంటావా? చూడు ఇన్స్ పెక్టర్! మావాడ్ని లక్షరూపాయలు పోసి అయినా సరే బయటకు రేపటికల్లా తీసుకొస్తాను. నీ వెనుక అసలు ఎవరుంది.....నీచేత ఎవరు ఇలా మాట్లాడిస్తుంది అంతా కూపీ లాగుతాను- వాడు బయటకు వచ్చిన తరువాత నీ సంగతి చెప్తాను. వస్తాను....పది నిముషాల్లో వస్తాను" అంటూ మాధవరావు మోటారు సైకిల్ స్టార్టు చేసుకుని వెళ్ళిపోయాడు.
ఇన్స్ పెక్టర్ అచేతనంగా కుర్చీలో కూలబడి తలపట్టుకుని కూర్చున్నాడు. ఒక్కక్షణం తరువాత టెలిఫోన్ పట్టుకుని రింగ్ చేయసాగాడు.
