సత్యవతి గుండెల మీద చేతులు వేస్కుని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. 'అమ్మో! ఇరవై నాలుగ్గంటలు, ముక్కులో వేలు పెట్టి తిప్పితే ముక్కు మంటెక్కిపోతుంది... హెంత కష్టమో!!.. అందుకనే గిన్నిస్ బుక్ లోకి అతని పేరు ఎక్కింది!!
"ఉహు.. ఉహు.." నోట్లో చొక్కా ఎత్తిపెట్టుకుంటూ దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించసాగాడు లింగరాజు.
"ఊర్కే వేరేవాళ్ళని చూసి ఆట్టా ఏడవకపోతే మీరుకూడా ఏ వెధవపనో చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కొచ్చుగా?" భర్తని మందలించింది సత్యవతి.
"ఏం చెయ్యమంటావ్?" ఏడుపాపి అడిగాడు లింగరాజు.
"మీ ఆఫీసతను ముక్కులో వేలుపెట్టి తిప్పాడుగా.... మీరు చెవిలో వేలుపెట్టి ముప్పయి ఆరుగంటలపాటు తిప్పండి". సలహా ఇచ్చింది సత్యవతి.
"ఆ పని గన్నాయ్ బాబు అనేవాడు ఇదివరకే చేసి రికార్డు సృష్టించాడు" నీర్సంగా అన్నాడు లింగరాజు.
"పోనీ కంట్లో వేలు పెట్టి తిప్పకూదదూ?
"ఏం... నేను లొట్టకన్నువాడిగా మారిపోవాలనా నీ ఉద్దేశ్యం?.... కోపంగా అరుస్తూ అన్నాడు లింగరాజు.
"మరేం చేస్తారబ్బా..." కళ్ళు పైకి పెట్టి ఆలోచించింది సత్యవతి.
"ఆ! మీరు ముందుకి బదులు వెనక్కి నడిచి రికార్డు సృష్టించండి" రెండు క్షణాల తరువాత సంతోషంతో కేకేస్తూ చెప్పింది.
"ఆ పనికూడా ఇదివరకు ఎవడో చేశాడు-"
"పోనీ పే...ద్ద మీసాలు పెంచండి!"
"మీసాలు పెంచేసిన వాడున్నాడు, గడ్డాలు పెంచేసినవాడున్నాడు."
"పోనీ చెవుల్లో ఒత్తుగా వెంట్రుకలు పెంచుతేనో??" సంబరంగా అడిగింది సత్యవతి.
"అదికూడా ఓ ఏబ్రాసిగాడు చేశాడు" "పోనీ మీరు గోళ్లు పొడవుగా పెంచండి"

"లాభం లేదు - అదీ అయిపోయింది" నీర్సంగా జవాబు చెప్పాడు లింగరాజు.
"అర్రే! ఏంటబ్బా ఇదీ? ఏం చెప్పినా అది అయిపోయిందని అంటున్నారు!!-" బాధగా అంది సత్యవతి.
"మరేమనుకున్నావ్? గిన్నిస్ బుక్ లోకి ఎక్కడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఒక జంట వదలకుండా ఇరవైనాలుగ్గంటలపాటు ముద్దులు పెట్టుకుని గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు... తెల్సా..." అన్నాడు లింగరాజు భార్య వంక కళ్ళెగరవేస్తూ.
వెంటనే అతనికి ఒక బ్రిలియంట్ అయిడియా వచ్చింది. అతని మొహం విప్పారింది.
సత్యవతి చెవిలో తన ఆలోచన గురించి చెప్పాడు. "మనం అలా చేస్తేనో?" చిలిపిగా అడిగాడు.
"ఛీ...పాడు...పద్దుబాబూ..." అంది రెండు చేతుల్తో మొహాన్ని కప్పుకుంటూ సత్యవతి.
"మరేం చెయ్యాలబ్బా!!..." అంటూ ఆలోచించాడు లింగరాజు.
వాళ్ళు గిన్నిస్ బుక్ ఎద్దురుగా పెట్టుకుని చూస్తే దాంట్లో అన్ని రికార్డులూ ఉన్నాయి. కొత్తగా ఎటెమ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమీ కనిపించడంలేదు.
ఆఖరికి జుట్టు పీక్కున్నవాడిదీ, గడ్డి తిన్నవాడిదీ, రెండ్రోజులు నేలమీద పాక్కుంటూ వెళ్ళినవాడిదీ, నాల్రోజులు కంటిన్యూస్ గా ఏడ్చిన వాడిదీ... ఇలా అన్నిరకాల రికార్డులూ ఉన్నాయ్.
లింగరాజుకి కాస్సేపు ఏమీ పాలు పోలేదు గానీ హఠాత్తుగా అతనికి ఒక బ్రిలియంట్ అయిడియా వచ్చింది.
"నేనిప్పుడే వస్తా" అని భార్యకి చెప్పి జనరల్ స్టోర్సుకి పరుగుతీశాడు.
"బాబూ, ఓ పది ఆముదం సీసాలు ఇస్తావా...?" లింగరాజు షాపు వాడిని అడిగాడు.
షాపువాడు లింగరాజుకి పది ఆముదం సీసాలు ఇచ్చాడు. లింగరాజు వాడికి డబ్బులు పే చేశాడు.
"సార్! పది ఆముదం సీసాలు ఎందుకు సార్...?" షాపువాడు అడిగాడు.
"రికార్డు సృష్టించడానికి!!" గర్వంగా అన్నాడు లింగరాజు.
ఆ రోజు ఎట్లాగూ కొళాయి నీళ్ళు వదిలేరోజే కాబట్టి ఫర్వాలేదు!!
***

(ఏవైనా గేమ్స్ లో హ=గానీ, స్పోర్ట్సులో గానీ ఇతర లలిత కళల్లోగానీ రికార్డు సృష్టిస్తే దాన్ని గిన్నిస్ బుక్ లో వేస్తే అందం చందంగానీ... కుంటిన వాడిదీ, దగ్గిన వాడిదీ, గోళ్ళూడ గొట్టుకున్న వాడిదీ రికార్డుకింద వేస్తే అలాంటి పిచ్చి పిచ్చి రికార్డులు సృష్టించడానికి చాలామంది పిచ్చివాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలే వేస్తారు.)
