అభిమాన సంఘాలు పెడ్డాం రండి!
సుదర్శనం తన స్నేహితుడు రంగారావు యింటికి వెళ్లాడు.
"రావోయ్ రా.... ఏంటిలా వేంచేశావ్....?" అని అడిగాడు రంగారావు.
"ఊర్కే..... నిన్ను చూసి చాలాకాలం అయింది కదా... చూసి పోదామని వచ్చా..." అన్నాడు సుదర్శనం.
"ఏంటి మీ ఆఫీసు విశేషాలు? అంతా నవ్యంగానే ఉంది కదా....? నీకేమి ప్రమోషన్ లాంటిది రాలేదా?...." అని అడిగాడు రంగారావు.
"రాలేదుగానీ నా పేరు ప్రమోషన్ లిస్టులో ఉంది... వచ్చేవారం ఇంటర్య్వూ ఉంది... బహుహ నాకు ప్రమోషన్ రావొచ్చు..." చెప్పాడు సుదర్శనం గర్వంగా.
"ఏంటి అంత కచ్చితంగా చెపుతున్నావ్?.... నీకెవరయినా యమ్మెల్లే తెల్సా?"
"లేదే..." ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సుదర్శనం.
"పోనీ మినిష్టర్ తెల్సా?"
"ఉహూ.... తెలీదు...."
"పోనీ మినిష్టర్ బామ్మర్దో లేదా ఆ బామ్మర్దికి బామ్మర్దో తెల్సా?"
సుదర్శనం గుడ్లప్ప జెప్పి చూశాడు.

"తెలీదు... ఎందుకలా అడుగు తున్నావ్?...." ఎందుకలా అడుగుతున్నాడో చెప్పకుండా మళ్ళీ అడిగాడు రంగారావు.
"పోనీ నీకు రాజకీయ నాయకులో లేదా వాళ్ళ బామ్మర్దులో లేదా వాళ్ళకి వేలువిడిచిన మేనమామలో ఎవరు తెల్సో చెప్పు..."
"నాకెవరూ తెలీదు!..." తెల్లమొహం వేస్తూ అన్నాడు సుదర్శనం. "ఒరేయ్ బాబిగా... ఓ మారిలా అద్దం పట్రామ్మ..."లోపలికి చూస్తూ అరిచాడు రంగారావు.
బాబిగాడు అద్దం తెచ్చి ఇచ్చాడు.
"ఇదిగో వోయ్.... ఈ అద్దం తీస్కుని అందులో నీ మొహం ఓసారి చూస్కో..."

"ఎందుకూ...?" అయోమయంగా ప్రశ్నించాడు సుదర్శనం.
"చెప్తాగా... ముందు చూస్కో...."
సుదర్శనం అద్దంలో మొహం చూస్కున్నాడు.
"ఎలా ఉంది నీ మొహం?"కళ్ళెగరవేస్తూ అడిగాడు రంగారావు.
"బాగానే ఉందే!!.." అన్నాడు సుదర్శనం అద్దంలోని తన ప్రతిబింబం కేసి చూస్కుంటూ.
"ఎవరు నాన్నా... ఈ దేభ్యం మొహం?" అని బాబిగాడు రంగారావుని అడిగాడు.
"విన్నావా మా అబ్బాయ్ ఏమన్నాడో..." అన్నాడు రంగారావు చిలిపిగా నవ్వుతూ.
విన్నానన్నట్టు తలూపాడు సుదర్శనం.
"ఏమన్నాడు?"
"దేభ్యం మొహం అని అన్నాడు" జవాబు ఇచ్చాడు సుదర్శనం.
"మరిప్పుడు అద్దంలో మొహం చూస్కుని చెప్పు నీ మొహం ఎలా ఉందో?..."
"దేభ్యం మొహంలానే ఉన్నట్టుంది" అన్నాడు నీర్సంగా సుదర్శనం.
"అద్గదీ... అందుకే నీకేమీ తెలీదు... ఎవరూ తెలీకుండా నీకు ప్రమోషన్ ఎలా వస్తుందని అనుకంటున్నావ్?..."
"హిహి... దేభ్యం మొహం.... హిహిహి..." అంటూ చప్పట్లుకొట్టి నవ్వాడు బాబిగాడు.
సుదర్శనం బాబిగాడివంక చూసి ఒక్క క్షణం బిక్క మొహం వేసి అన్నాడు "మరి నా పర్సనల్ రికార్డు అందరికంటే బాగుంది. నా సర్వీసు కూడా అందరికంటే ఎక్కువ... క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ... మరి నాకు ప్రమోషన్ ఎందుకు రాదు?"
"అందుకే నిన్ను దేభ్యం మొహం అన్నది... అవన్నీ ఉంటే సరిపోదు, మాంచి రికమెండేషను పట్టాలి. అప్పుడు నీకు ప్రమోషన్ వస్తుంది..." అన్నాడు రంగారావు.
"మరి నాకెవరూ తెలీదే! నువ్వే ఈ విషయంలో నాకు సహాయం చేయాలి!" ప్రాధేయపడ్తూ అన్నాడు సుదర్శనం.
రంగారావు కాస్సేపు ఆలోచించాడు.
"నాకెవరూ యమ్మెల్లేలూ, మినిష్టరులూ తెలీదే! ఎలా? ఎలా?" అన్నాడు.
"బాగా ఆలోచించు... మినిష్టర్ కాకపోయినా వాడి బామ్మర్దయినా పరవాలేదుగా..." అన్నాడు సుదర్శనం.
హఠాత్తుగా కెవ్వుమని అరిచాడు రంగారావు.
"ఏంటి ఏమైంది?!..." కంగారుగా అడిగాడు సుదర్శనం.
"నువ్వు ముందు పద" లేచి చెప్పులు తొడుక్కుంటూ అన్నాడు రంగారావు.

"ఎక్కడికి?"
"పదమన్నానా!..." కసురుకున్నాడు రంగారావు.
సుదర్శనం లేచిరంగారావుని అనుసరించాడు.
రంగారావు ఓ కిళ్ళి కొట్టు దగ్గర ఆగాడు.
"మాంచి కిళ్ళీ తింటే అయిడియాలు బాగా వస్తాయనా ఇక్కడ ఆగావ్?హిహి?" అన్నాడు సుదర్శనం.
