Previous Page Next Page 
త్రీ ఇన్ వన్ పేజి 51

                                             రికార్డ్
   
    లింగరాజు గుండెలు బాదుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.

    హాలు మధ్యలో నిలబడి "బేర్...." మన్నాడు.

    అతని భార్య సత్యవతి కంగారుగా అతని దగ్గరికి వచ్చింది.

    "ఏమైందండీ... ఎందుకలా ఏడుస్తున్నారు?" చొక్కా కాలరు పట్టి ఊపేస్తూ అడిగింది.

    ఆ ఊపడంతో లింగరాజు చొక్కా సర్రున చిరిగింది. లింగరాజు ఏడుపాపి ఓసారి తన చొక్కా ఆశ్చర్యంగా చూస్కున్నాడు.

    "హర్రే!.... చొక్కా భలే చిరిగిందే!!... ఏదీ మళ్ళీ నా కాలరు పట్టి పీకుతూ ఊపు" భార్యని అడిగాడు లింగరాజు

    సత్యవతి మళ్ళీ అతని చొక్కా కాలరుపట్టి గాఠిగాఊపింది.

    అతని చొక్కా మళ్ళీ సర్రున చిరిగింది.
                                                                 

                                             

     లింగరాజుకి హుషారు పుట్టింది. "హర్రే... హర్రే - భలే చిరిగిందే నా చొక్కా?! హిహి... ఏదీ మళ్ళీ చింపాలమ్మా..." అన్నాడు సంబరంగా
   
    "ఉహూ నేను చింపను!" అంది సత్యవతి.

    "చింపమంటున్నానా?...." కాస్త విసుగ్గా అన్నాడు లింగరాజు కళ్ళు చిట్లించి భార్యవంక చూస్తూ.

    "నేను చింపనంటున్నానా?...." అంతే విసుగుతో అంది సత్యవతి.

    "ఏం?... ఎందుకని చింపవు?.... నేనేమైనా నీ చీరని చింపుకోమని అంటున్నానా?.... నా చొక్కాని చింపమంటున్నాగానీ... త్వరగా చింపు....

    "అమ్మా... ఇంకా చింపుతే అది నాకెందుకైనా పనికొస్తుందా అని?... నేను చింపనుగాక చింపను..."

    లింగరాజు భార్యవంక ఆశ్చర్యంగా చూశాడు. "నా చొక్కా నీకు ఎలా పనికొస్తుంది?"

    భర్త అమాయకత్వానికి సత్యవతి ఫక్కున నవ్వింది.

    "భలే... మీరు భోంచేసే కంచం ఎక్కడిదీ?... మీరు తాగే గ్లాసు ఎక్కడిదీ?.... అన్నం, పులుసూ ఉడకేసే గిన్నెలు ఎక్కడివీ... ఆఖరికి ఆఫీసుకి మీరు తీస్కెళ్ళే టిఫిన్ బాక్సు ఎక్కడిదీ?... అన్నీ మీ చొక్కాలు, ప్యాంట్లు స్టీలు సామాన్లవాడికేసి సంపాదించినవేగా? మరీ ఎక్కువగా చింపేస్తే స్టీలు సామాన్లవాడు ఆ చొక్కాని తీస్కుంటాడా? ఇప్పుడు ఆ చొక్కాని వాడికిస్తే ఓ స్టీలు గరిట ఇస్తాడు ఎంచక్కా...." సంబరంగా అంది సత్యవతి.

    "స్టీలు గరిటపోతే పోయిందిగాని నా చొక్కా చింపు ముందు..." గట్టిగా అరిచాడు లింగరాజు.

    "నేను చింపను..." మొండిగా అంది సత్యవతి.

    "చింపకపోతే నీకు విడాకులిస్తా.... నిన్నొదిలేస్తా" జుట్టు పీక్కుంటూ అన్నాడు లింగరాజు.
    "అట్టాగైతే నేనెంచక్కా మీ కంటే మంచోడిని చేస్కుంటా... తెల్సా?" కళ్ళు తిప్పుతూ అంది సత్యవతి.

    లింగరాజు ఓసారి బాధగా"ఈ..." అని అరిచి తల గోడకేసి కొట్టుకోవడం మొదలెట్టాడు.

    "మీరట్టా తల గోడకేసి బాదేస్కుంటే మీ ఫోటోకి దండెయ్యాల్సి వస్తుంది.... ముందు ఆ తల బాదుకోవడం ఆపండి..." అంటూ సత్యవతి భర్త తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆపింది. "మీ చొక్కాని పీలికలు పీలికలుగా చింపేస్తాగాని అసలు మీ చొక్కాని ఎందుకు చింపమంటున్నారో కాస్త వివరంగా చెప్తారా?....."

    "ఎందుకా?.... రికార్డ్!! రికార్డ్ సృష్టించడం కోసం!!... నువ్వలా నా చొక్కాని పరపరా చింపేశావనుకో! భర్త చొక్కాని ఏక బిగిన చింపిన భార్యగా రికార్డు సృష్టించి నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కుతావు..." అన్నాడు లింగరాజు.

    "అమ్మో... అమ్మో... నిజ్జంగా నాకంత పేరొచ్చేస్తుందా?.... అట్టాగైతే చొక్కాతోబాటు మీ ప్యాంటు, బనీను డ్రాయరు అన్నీ చింపేస్తే ఇంకెంత పేరొస్తుందో!!...." భర్తవంక చిలిపిగా చూస్తూ చేతులు పంజాల్లా పెట్టి అడుగులు ముందుకు వేయసాగింది సత్యవతి.

    లింగరాజు భార్యవంక చికాకుగా చూశాడు.

    "ఇప్పుడు నువ్వు నా చొక్కా ప్యాంట్లని చింపినా నా తోలు వలిసినా లాభంలేదు. ప్రెస్సు వాళ్ళని పిలిచి 'వాళ్ళ ముందుచింపితే వాళ్ళు పేపర్లలో నీ గురించి గొప్పగా రాస్తారు....అప్పుడు ఆ కటింగ్స్ అన్నీ గిన్నిస్ బుక్ వాళ్ళకి పంపితే వాళ్ళు నీ పేరుని వాళ్ళ పుస్తకంలో ప్రింటుచేస్తారు..."

    "ఓ అలాగా?" అమాయకంగా మొహం పట్టి అంది సత్యవతి.

     లింగరాజుకి సడన్ గా ఇందాకటి విషయం గుర్తుకొచ్చి మళ్ళీ భోరున ఏడ్చాడు.

                                        

      "రికార్డు సృష్టించడం కోసం మీ చొక్కా ప్యాంట్లని చింపుతాలెండి... మీ తోలేం వల్చెయ్యను.... ఏడవకండీ..." బుజ్జిగించింది సత్యవతి.

    "నేనేడుస్తుంది అందుకేం కాదు" అన్నాడు లింగరాజు కళ్ళు తుడుచుకుంటూ.

    "మరి?"

    "మా ఆఫీసులో ఒకడి పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది తెల్సా?ఉహూ....ఉహూ - కుమిలిపోయాడు.

    "ఎందుకు ఎక్కింది?"

    "వాడేమో ఇరవైనాలుగ్గంటల పాటు ముక్కులో వేలుపెట్టి తిప్పకున్నాట్ట!!! అందుకని వాడి పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS