Previous Page Next Page 
విశిష్ట పేజి 51

     "రాత్రి శోభనం గదిలో మా వాడితో చాలా మోటుసరసం ఆడినట్టున్నావే! సరస సామాజ్ఞివన్న  బిరుదు ఇవ్వాలనిపిస్తోంది."

    విశిష్ట మాట్లాడలేదు. ముఖం  మాత్రం ఎర్రబడింది.

    ఆమెను తేరిపార చూస్తూ ఓ మందహాసం విసిరాడు. "మంచి స్ట్రక్చరే!మావాడు నువ్వంటే ఎందుకు కసి పెంచుకున్నాడో ఇప్పుడు అర్దమైంది. నీ ఒంపుసొంపులు చూస్తుంటే మునికైనా దిమ్మ తిరిగేలా వుంది. నెలరోజులపాటు వాడిని సంసారానికి పనికిరాకుండా  చేశావుకదా? ఒక్కదానివే ఎలా పడుకొంటావు?తోడు నేనొస్తాను. గడియ తీసి వుంచు."

    ఆమె జవాబుకోసం చూడకుండా అక్కడినుండి వెళ్లిపోయాడు మాధవరావు.

     "నువ్వు చెడ్డ మనిషివనుకొన్నాను. కాని మరీ ఇంత చెడ్డమనిషివనుకొలేదు.ఎంత అధారిటీగా 'గడియ తీసి వుంచు' అని చెప్పావు! కోడలంటే వంటింటి కుందేలనుకొన్నావా? నీ కొడుకుటెంపరరీగా సంసారానికి పనికిరాకుండా పోతే నువ్వు పర్మినెంట్ గా పనికిరాకుండా పోతావు నా జోలికి వస్తే" అనుకొంది విశిష్ట.
 
     ఆ రాత్రి విశిష్ట గది తలుపు తట్టిన మాధవరావు అవతల గడియ పెట్టి వుండడం గమనించాడు.

     అంత తొందరగా కోడలు లొంగుతుందని ఆశ పెట్టుకోలేదు మాధవరావు.

     ఇనుములాంటి పెళుసు లోహం కూడా కాల్చి సమ్మెటతో కొడితేనే ఎలా కావలిస్తే అలా ఒంగుతుంది.

     ఆ పని మరునాటి నుండే ప్రారంభించాడు మాధవరావు.

                                                                  *    *    *    *    *

     ఉదయం వేళ టిఫిన్ చెయ్యడంలో బిజీగా వున్న కాంతం అక్కడే వున్న కోడలితో చెప్పింది. "మామయ్య ముఖం కడుక్కొని వచ్చారు. పాలలో హార్లిక్స్ కలిపి ఇచ్చిరా. అమ్మా!"

    పాలు పొయ్యిమీద వేడిగానే వున్నాయి.

     కప్పులోకి పాలువంచి, చక్కరడబ్బా చేతిలోకి తీసుకొని, "చక్కెర మామూలుగానే వేయాలా అత్తయ్యా!" అనడిగింది విశిష్ట.

     "మామూలుగానే వెయ్యి! షుగర్ లాంటి వ్యాధులేమీ లేవు మీ మామయ్యకు.

     పాలలో చక్కెరా, హార్లిక్స్ కలిపి డైనింగ్ టేబిల్ ముందు పేపర్ తిరగేస్తున్న  మాధవరావు ముందు పెట్టి వెంటనే వచ్చేసింది. ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని!

    అయిదు నిమిషాలు కూడా కాలేదు.

     మాధవరావు పెద్దగా కేకలు పెడుతుంటే పరిగెత్తింది కాంతం. "ఏం జరిగిందండీ?"

    "ఇంకా ఏం జరగాలి?" అది ఈ ఇంట్లో అడుగుపెట్టిందే మన కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యడానికి. దానికి మొదటి టార్గెట్ నేను. పాలలో హార్లిక్స్ కలిపి మామ్యకియ్యవే అంటే అది చక్కగా విషం కూడా కలిపి యిచ్చింది. అనుమానం వచ్చి పిల్లికి పోశాను. చూడు - చూడు ఆ పాలు తాగి చావలేక అది ఎలా గిలగిల్లాడుతుందో! అనుమానం వచ్చింది కనుక  బ్రతికి పోయాను. లేకపోతే  ఆ పాలు నేనే త్రాగివుంటే ఆ పిల్లిలా గిలగిల్లాడుకూ పడేవాడిని."

    "నా ముందే ఆ పిల్ల పాలలో హార్లిక్స్ కలిపి తీసుకువచ్చింది. విషం ఎప్పుడు కలిపిందండీ?"

    "నేను అబద్దం చెబుతున్నానా? పాలల్లో విషం కలపకపోతే ఆ పిల్లి ఎందుకు చస్తుందే? మనమెందుకు గొడవ పడ్డం? ఆ పాలల్లో విషం వుందో లేదో పోలీసులు వచ్చి తేలుస్తారు. పాలల్లో విషం వుందని రూఢి అయితే దీన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. అప్పుడుగాని అణగదు దీని పొగరు."

     "ఎలాగో ఒకలా నన్ను సాధించాలనే నన్ను కోడలిగా ఇంటికి తెచ్చుకున్నారని నాకు తెలుసు.  ఆ సాధించడంలో భాగమే ఈ విషప్రయోగం!ప్రయోగించింది మాత్రం నేను కాదు. మీరు! మీరే పాలలో విషం కలిపి ఈ నాటకం ఆడుతున్నారు మామగారూ!"

    "పాలల్లో విషం కలిపింది చాలక నేరస్తుడ్ని చేస్తున్నావా? నేను తాగేపాలలో నేనే విషం ఎందుకు కలుపుకొంటాను?నీతో నాకు వాదనేమిటి?"పాలల్లో ఎవరు విషం కలిపారో పోలీసువు వ్చచి తేలుస్తారు?"  మాధవ రావు ఆగ్రహంగా పోలీసులకు ఫోన్ చెయ్యడానికి వెడుతుంటే కాంతం ఆయన చేతిని పట్టుకుని ఆపింది.

     "ఇంటి కోడల్ని మీరే పోలీసులకి పట్టిస్తారా? ఈ ఇంటి పరువును మీరే బజారున పడేస్తారా?"

    "అది కోడలు కాదే! పగబట్టిన పాము. పగబట్టిన పాముని ఇంట్లో స్వేచ్చగా తిరగనిస్తే అది అదనుచూసి అందరినీ కాటేసి చంపుతుంది. దాని కోరలు పీకి బుట్టలో బంధించకపోతే లాభంలేదు."

    "అనవసరంగా  లేనిపోని అబాండాలు వేయకండి ఆ పిల్లమీద. నా కళ్లముందే హార్లిక్స్ , చక్కెర కలిపింది. నా కళ్ళముందునుంచే పాల కప్పు కిచెన్ లోంచే తెచ్చి మీకిచ్చింది. అవతల మీరున్నారు. ఇవతల నేనున్నాను. అక్కడికీ ఇక్కడికి కనబడుతూనే వుంది."

     "నేను  పేపరు చదువుతున్నాను. తను రావడం నేను చూడలేదు. జాకెట్లో దాచుకొన్న కాగితం పొట్లం పాలలో కలపడానికి ఎంత టైం కావాలి?"

    "కోడలు అలాంటిదంటే నేను నమ్మను! మీ మనసులోనే ఏదో దుర్బుద్ది తిష్టవేసింది. మీరు ఏ వుద్దేశ్యంతో ఈ పెళ్లి జరిపించినా, ఏ స్వార్దంతో చేసినా కోడలు కోడలే! ఆమె ఈ  ఇంటి మహలక్ష్మి. ఆ పిల్లను  ఏడిపిస్తే మనకెవరికీ మంచిది కాదండీ"

    "ఏం మత్తుమందు  చల్లిందో దాని తరఫున వకాల్తా పుచ్చుకున్నావు?" మండిపడ్డాడు.

     "మంచితనం మత్తుమందుకంటే ఎక్కువే పని చేస్తుందండీ! ఆ పిల్లలో మంచితనం చూశాను. మానవత్వం చూశాను.  ఆ పిల్లను చూసి మీరూ నేనూ అంతా నేర్చుకోవలసింది ఎంతో వుంది."

     "ఏమిటో అంత ఇది?"

    "మీరేమీ వెక్కిరించక్కర్లేదు. కొద్దిరోజులు పోతే మీకే తెలుస్తుంది."

    "ఆహా! పెళ్లి కాకముందు ఈ జ్ఞానం ఏమైందట? ఈ దుర్మార్గురాలు మనింటికి కోడలిగా రావడానికి వీల్లేదన్నావే?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS