31
వారిద్వారం చేరుకున్నాము. మా అమ్మగారు '' కాశీలో, ప్రయాగలో, బృందావనంలో, గోవర్ధనంలో, హస్తినాపురంలో, లక్నోలో, అయోధ్యలో మనుష్యుల సంపర్కం ఎక్కువ. కాని హరిద్వారం వచ్చేసరికి దేవతా సంపర్కం కలుగుతున్నది'' అన్నది.
హరిద్వారానికి పూర్వపు పేరు మాయావతి. మాయావతి పట్టణ శిథిలాలు ఇప్పటికీ చూస్తే హరి ద్వారానికి సంబంధించే కనబడుతున్నవి. పట్టణంలో కొంతభాగాన్ని మాయాపురి అనే పిలుస్తారు. హరిద్వారంలో గంగానది అందమే వేరు. గంగానదిలో మాత్రు భావం పొంగిపోతూ ఉంటుంది. యమునలో ప్రియురాలి భావం పరవశత్వం కలిగిస్తుంది. గంగ జ్ఞాన స్వరూపిణి, యమునా ప్రేమస్వరూపిణి. అంతర్వాహినియై, సరస్వతి విజ్ఞానరూపిణి.'' పూర్ణగంగామాయి తేజోరూపిణియై, ప్ర్తాపంచిక పథాల విహరించడానికి అవతరించిన మోక్షదేవి'' అన్నారు మా స్వామీజీ.
హరిద్వారంలో హిందువులు కానివారు ఆస్తి సంపాదించకూడదు. ఒక్క మసీదుగాని, చర్చిగాని హరిద్వారంలో లేవు. హరిద్వార పట్టణ సరిహద్దులలో మాంసము తినరాదు. చేపల పట్టరాదు. పక్షుల హింసింపకూడదు. సారాయి మొదలైన మత్తుపదార్దాలు పట్టణంలోకి రారాదు. ఈ నిబంధనలన్నీ ఇతర పుణ్యస్థలాల్లో లేవు. నేను సిగరెట్లు పట్టణం బైటనేకొనుకున్నాను. ఇచట బ్రహ్మచర్యాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడనుండి యాత్రికులైన స్త్రీ పురుషులు కామసంపర్కం వదలివేస్తారు. హిమాలయ వాసులకే అది ఆరోగ్యకరమటగాని, ప్రయాణీకులకు రోగకారణ మౌతుందట. వేదాధ్యయనం ప్రతిచోటా వినబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉచ్ఛారణ వేరు. మన ఆంధ్రుల ఉచ్ఛారణమే స్పష్టంగా, సలక్షణంగా ఉంటుంది. వానప్రస్థాశ్రమాలు, గురుకులాలు, ఆయుర్వేద కళాశాలలు ఎన్నో ఉన్నవి.
మేము మదరాసీ ధర్మశాలలో మకాం పెట్టాము. మా సుబ్బులుకు ఈ పట్టణం కన్నుల వైకుంఠంగా ఉంది. వాడి ఆనందం వర్ణనాతీతం. గంగాద్వార దేవాలయం ఉండేదని హుయన్ త్సాంగు వ్రాశాడు. ఆ దేవాలయం ఇప్పటకీ అక్కడ ఉన్నది. గంగాద్వారం తర్వాత ప్రసిద్దికెక్కిన స్థలం బ్రహ్మకుండం. ఇక్కడ బంగారు వెండి పాత్రలలో అస్తులు కలుపుతారు. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు. ధర్మాంగదుడు పామై ఉన్నప్పుడు అతని భార్య అతన్ని ఇక్కడకు తీసుకువచ్చి స్నానం చేయించగానే, అతడు శాపంపోయి అందమైన రాజకుమారుడయ్యాదట. ఈ కథ నిజమై ఉండాలంటాడు మా వెర్రి సుబ్బులు. తల్లీకుమాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కామించుకోగానే కుష్టురోగులయ్యారట. అప్పుడు బుద్ది వచ్చి దేశాలు తిరిగి తిరిగి ఈ బ్రహ్మకుండలో స్నానం చేసేసరికి, వారి పాపాలు క్షయమై యథారూపాలు పొందారట.
గంగానది ఇక్కడ రెండు పాయలౌతుంది; ఆ చీలికలను ధార అంటారు. చండీపర్వతం. ప్రక్కనే దక్షిణంగా ప్రవహిస్తుంది. రెండవధార శివాలిక్ పర్వతం ప్రక్కగా వచ్చి, హరిద్వారం, మాయాపురం, కనఖల పట్నం పవిత్రంచేసి, చండీధారతో కలుస్తుంది. ఈ ఉత్తరధార శివాలిక్ పర్వతాన్ని స్పృశించినచోట బ్రహ్మకుండం ఉంది. బ్రహ్మకుండం దిగువగా గంగాద్వారాలయం, హరిచరణఘట్టం ఉన్నాయి. గంగ విష్ణుపాదజ అనే భావానికి చిహ్నం ఈ హరిచరణ ఘట్టం. భారతదేశంలోని సంస్థానాధీసులు ఈ రోజులలో క్షేత్రాలన్నిటా మెట్లు, ఇనుప గొలుసులు మొదలైన అనుకూలా లెన్నో చేశారు.
బ్రహ్మకుండానికి దక్షిణంగా గోఘట్ట తీర్థముంది. గోహత్యాపాతకం పోతుండట. దత్తాత్రేయ మహర్షి ఇక్కడే తపస్సు చేశాడట. ఆ తర్వాత కుశాతీర్ధముంది. తర్వాత విష్ణుతీర్థము, తర్వాత బిల్వపర్వతము, ఇంతటితో శివాలిక్ పర్వతం ఆఖరు. ఇక్కడ బిల్వకేశ్వరుడు వెలిసి ఉన్నాడు. మయాపురం దగ్గిర గణేశతీర్థము, నారాయశిల తీర్థము ఉన్నాయి. చండీ ధార ప్రక్కనున్న చండీపర్వతం మీద చండీ దేవాలయం ఉంది. పర్వత పాదం కడ గౌరీశంకర దేవాలయం ఉంది. అక్కడే ఇల్లేశ్వర దేవాలయం ఉంది. హరిద్వారానికి ఎదురుగా ఈ చండీపర్వతముంది.
మా సుబ్బులు నన్నీ తీర్థాలన్నీ తిప్పాడు. మా అమ్మగారు అన్ని దుఖాలు మరచిపోయి, నేను కైలాసం నుంచి తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉందామనుకొన్నది. కాని స్వామీజీ ఆవిడ హరిద్వారంలో ఉన్నంతకాలం ఉండి, భట్టిప్రోలు మాత్రం వెళ్ళాలని ఆదేశం ఇచ్చారు.
స్వామీజీని కలుసుకొన్న పదవరోజున మేమంతా భీమగోడాతీర్థానికి వెళ్ళాము. ఇదే మా కైలాస యాత్ర ప్రారంభం. మా అమ్మగారూ, సుబ్బులూ హృషీకేశం వరకూ వస్తారు. అక్కడ మేమంతా మూడురోజులుంటాము. ఆ తర్వాత హిమాలయం ఎక్కుతాము. ఇది మా ప్రయాణం ఏర్పాట్లు. మా యాత్ర సాగిన తర్వాత కూడా మా అమ్మగారూ, సుబ్బులూ కొన్ని రోజులు హృశీకేశంలో మకాంచేసి, హరిద్వారం వెళ్ళి అక్కడ ఇంకా కొన్ని రోజులుండి, ఇంటికి వెడతారు.
మొదట సప్తస్రోతతీర్థము వెళ్ళాలి. హరిద్వారానికి మూడుమైళ్ళు తూర్పుగా వెళ్ళాలి. ఇక్కడ గంగానది ఏడుపాయలుగా చీలింది. సప్తస్రోతంలో ఏకాంతవాసం చేసే ఋష్యాశ్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడనుంచి హరిద్వారానికి దక్షిణంగా కనఖలతీర్థం వెళ్ళాము. కాళిదాసు తన మేఘసందేసంలో ఈ నగరాన్ని అందంగా వర్ణించాడు. ఈ కనఖల పురం దగ్గిర పతితపావనేస్వర, తక్షేస్వర, తిలవథేశ్వర మహా దేవాలయాలున్నాయి. ఇక్కడే సతీకుండం ఉన్నది. సతి ఇక్కడ దక్షయజ్ఞశాలలో ప్రాయోపవేశం చేసింది. ప్రక్కనే దక్షేశ్వరాలయమూ ఉన్నది. ఇవన్నీ చూచుకొని భీమగోడాకు పోయాము. అక్కడ స్నానంచేసి హరిద్వారం వచ్చి రైలెక్కి పదిహేనుమైళ్ళ దూరంలో ఉన్న హృషీకేశం చేరుకున్నాము.
32
హృషీకేశం ఎంతో విచిత్రమైన పట్టణం. అక్కడ శ్రీరామ మందిరము, భరతాలయాలను దర్శించినాము. మా స్వామీజీ మా కోసం చేసిన సదుపాయాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరీ స్వామీజీ? వీరు పూర్వాశ్రమంలో, నెల్లూరు జిల్లా కావలిపుర వాసులు. వారింటి పేరు ధనికొండవారు. వారి పూర్వాశ్రమం పేరు నారాయణరావుగారు. ఎం. ఏ; బి. ఎల్. పరీక్షలో కృతార్ధుడై, నెల్లూరులో న్యాయవాది పనిచేస్తూ, 1909లో భార్య, ఇద్దరు కుమాళ్ళూ, తండ్రీ ఇన్ ప్లూ ఎంజా జబ్బువల్ల మరణిస్తే, జీవితాన్ని రోసి, హిమాలయాలకు వచ్చి బదరీ, కేదార, గంగోత్రి, గోముఖ యమునోత్రి, సత్పథాతి యాత్రలుచేసి హృషీకేశంలో అఖిలానంద భారతీ స్వాములవారి శిషుడై, ఆశ్రమం తీసుకొన్నారు.
