Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 52

 

    బాగా ఆలోచించాను. బాగాబాగా ఆలోచించాను. హటాత్తుగా చక్కని ఆలోచన స్పురించింది. జాగ్రత్తగా అమలు జరిపితే మూడో కంటివాడికి తెలియకుండా సుబ్బారావు హరీ మంటాడు.

                                     2

    నేను తలుపు తట్టే సమయానికి సుబ్బారావు గదిలో ఎవరో ఆడపిల్ల ఉంది. గాజుల చప్పుడు వినబడుతోంది. గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఆశ్చర్యపోయాను. అమ్మా, నాన్నా ఊళ్ళో లేకపోవడం చూసి వెధవ తిన్నగా ఇంటికే ఆడపిల్లలను తీసుకు వచ్చేస్తున్నా డన్నమాట. రాజ్యంతో అనుభవం తర్వాత వెధవకి- బుద్ది మారి ఉంటుంది.
    "తలుపు తీయడం కొద్దిగా ఆలశ్యమైంది - క్షమించాలి?" అన్నాడు సుబ్బారావు.
    "అవదూ మరి -" అన్నాను కాస్త పరీక్షగా చుట్టూ చూస్తూ.
    "ఎంత వెదికినా ఎవరూ కనబడరు. ఇక్కడ నేనెవర్నీ దాచలేదు. ఆమె వెళ్ళిపోయింది."
    షాక్ తిన్నాను.- "ఎవరామె?"
    "ఎవరైతే నీకేం- రాజ్యం మాత్రం కాదు -"
    "ఏదో పవిత్రుడి వనుకున్నాను. నువ్వు అందరి లాగే...."
    "షటప్, నా దగ్గర నువ్వు పవిత్రత గురించి మాట్లాడకు. నేను ఒకే ఒక్కసారి నీ అభిప్రాయంలో అపవిత్రుడి నయ్యాను. అంతే!"
    "మరి ఈరోజు...."
    'చెప్పవలసిన అవసరం వస్తే తప్పకుండా నీకు చెబుతాను. ప్రస్తుతానికి నోరు మూసుకుని వచ్చిన పనేమిటో చెప్పు?"
    వచ్చిన పని ....యేమని చెప్పను?
    వాడు నాకేసి దీక్షగా చూస్తూ -- "మాట్లాడవేం?" అన్నాడు.
    "ఏం లేదు- వచ్చే ఆదివారం నాడు గురువారం కొండ మీదకు చిన్న ప్రోగ్రాం పెట్టాను. నేనూ, చెల్లాయ్, నువ్వూ - ఏమంటావ్?"
    "ఏమిటి విశేషం ?"
    "చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను-" అన్నాను కాస్త సీరియస్ గా.
    "ఆ అవసరం ఇప్పుడే వచ్చింది. చెప్పకపోతే వీడు రాడు మరి-" అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
    "రాకపోతే మేమిద్దరమే వెడతాం. నా విద్యుక్తధర్మాన్ని నేను చెప్పాను . ఆపైన నీఇష్టం."
    సుబ్బారావు మాట్లాడలేదు. మౌనంగా తన జేబులోంచి ఒక పాకెట్ తీశాడు. అందులోంచి ఒక టాబ్లెట్ తీసుకుని తను తిన్నాడు. నాకొకటి ఆఫర్ చేశాడు. "ఏమిటిది?" అన్నాను.
    "ఎనర్జీ టాబ్లెట్ " అన్నాడు సుబ్బారావు.
    నా బుద్ది చకచకా పని చేస్తోంది. టాబ్లెట్ తీసుకుని నోట్లో వేసుకున్నాను. తియ్యగా ఉంది. ఇట్టే కరిగిపోతుంది.
    "ఇదేప్పట్నించీ?' అన్నాను.
    సుబ్బారావు చాలా తమాషాగా నవ్వాడు -" మగవాడికి ఎనర్జీ అవసరమంటావా కాదంటావా?"
    "అవసరమే - కానీ ఈ గుర్తింపు నీకేప్పట్నించీ కలిగిందంటాను?"
    "అది నీ కనవసరం -"
    'అయితే నా కవసరమైన దింకోకటుంది. అన్నీ పట్టింపులు కదా నీకు. కనీసం ఈ టాబ్స్ అయినా నాలుగు కాలాల పాటు వాడ దల్చుకున్నావా ? లేక రాజ్యం లా...."
    "షటప్ ఆమె పెరేత్తకు. ఈ టాబ్స్ నాకు నచ్చేయి. బ్రతికున్నంత కాలం వాడతాను. నా నిర్ణయానికి తిరుగులేదు-" అన్నాడు వాడు.
    చాలు. ఈ సమాచారం చాలు నాకు. బ్రతికున్నంత కాలం ఈ టాబ్స్ తినాలనుకుంటున్న సుబ్బారావు తుది క్షణాలలో కూడా ఈ టాబ్స్ నోట్లో ఉంచుకుంటాడు. అంతేకాదు అదే అతని తుది క్షణాలకు తోలి పలుకు పలుకుతుంది. నా బుర్రలోని పధకం మార్పు చెందుతోంది.
    వాడి దగ్గర సెలవు తీసుకుని కాసేపు రోడ్ల మీద తిరిగి ఇల్లు చేరాను. చెల్లాయి ఈరోజు నాకోసం- స్పెషల్ గా కంది పచ్చడి చేసింది. దానికి తెలుసు నాకు ఇష్టమైన వంటకాలాన్నీ.
    "ఇలారా" అన్నాను- దగ్గరగా వచ్చింది. దాని చేతులు పట్టుకుని- అరిచేతులు పరీక్షించాను.
    "పో- అన్నయ్యా- ఆడదాని చేతులు పచ్చడి రుబ్బడంతో కందిపోవు -- " అందది చేతులు వెనక్కి లాగేసుకుంటూ.
    నా చెల్లెలు చాలా సంసార పక్షం మనిషి. దాన్ని చేసుకున్న వాడెవడైనా సుఖపడతాడు. "నాకే డబ్బుంటే - వంట మనిషిని పెట్టి ఉండేవాడిని --" అన్నాను కాస్త బాధగా.
    "కానీ ఇప్పుడు కూడా ఆ వంటమనిషి అన్నయ్యా ఇలాగె అనుకుంటాడు--" అంది చెల్లాయి నవ్వుతూ.
    నిజమే ననిపించింది. అందరికీ డబ్బుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ పని చేయరు. డబ్బు కోసమే గదా ఎవరైనా ఏ పని కైనా ఓడబడేది! అయితే నేను- ఒక హత్య కార్యాన్ని - డబ్బు కోసం కాదు- ఆడదాని కోసం చెయ్యాలను కుంటున్నాను. సిల్లీ అనిపించింది.
    "చూడవయ్యా - ఈరోజు పేపర్లో...."
    నేను వినడం లేదు కానీ అది ఏమిటో చెప్పుకుపోతోంది. దాని చివరి వాక్యాలు మాత్రం నన్ను ఈ లోకంలోకి తీసుకు వచ్చాయి --" అంత తెలివిగా హత్య చేశాడు - అయినా పోలీసులు పట్టేశారు. తప్పును దాచడం కష్టం. ఏమంటావ్?"
    ఉలిక్కిపడి మళ్ళీ అడిగి వివరాలు తెలుసుకున్నాను. ఒక పిచ్చయ్యకి నిద్రమాత్రల అలవాటుందిట. ఆ పిచ్చయ్య మిత్రుడు పుల్లయ్య అందులో ఒక మాత్రను మర్చాడుట. పిచ్చయ్య చనిపోయాడు. డాక్టర్ వచ్చి విష ప్రయోగమన్నాడు. రకరకాల పరిశోధనలూ జరిగాయి. అందులో పిచ్చయ్య మీద పుల్లయ్య ఒక స్త్రీ కారణంగా పగబట్టిన విషయం బయటకు వచ్చింది. పుల్లయ్య ప్రయోగించిన విషం ఆ ఊళ్ళో ఒకే ఒక షాపులో దొరుకుతుంది. ఆ షాపువాడు పుల్లయ్యను గుర్తు పట్టేశాడు.
    ఇంకా ఇలాగే యేవో కొన్ని విశేషాలున్నాయి. అవన్నీ నాకు సరిగా ఎక్కలేదు. జరిగినదేమిటంటే ఇంచుమించు అసాధ్యమని పించే పరిస్థితుల్లో పుల్లయ్య నేరం బయట పడింది. నా ప్లాను పుల్లయ్య ప్లానంత పకడ్బందీగా లేదని పించింది. అటువంటప్పుడు.....
    చెల్లాయి నావంక ఆప్యాయంగా చూస్తోంది.
    పోలీసుల తెలివితేటల్ని తప్పు అంచనా వేయకూడదు. చెల్లాయి కంటే రాజ్యం నా కేక్కువది కాదు. సుబ్బారావుని చంపను. అనుకోకుండానే ఈ ఆలోచన నా మనసును తేలిక పరిచింది.
    
                                    3
    "ఇంకా పధకం వేయడంలోనే ఉన్నావా? వ్యవహారం ఇంకా ముందుకొచ్చిందా?"
    రాజ్యం ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటె నో అనేస్తే ఇంక ఆమెకీ నాకూ ఏవిధమైన సంబంధమూ ఉండదు. అంత త్వరగా బంధాలు తెంచుకోవడానికి నా మానసంగీకరించ లేదు.
    "ఒక మాట చెప్పాలని వచ్చాను. ఇదివరలో నీకు చెప్పినట్లుగా -- ఈ పని చేస్తే నువ్వు కోరిన దిచ్చే ఉద్దేశ్యం విరమించుకున్నాను-" అంది రాజ్యం.
    నా పక్కన బాంబు పడింది- "ఏం?"
    "నువ్వు కోరేది నాకు తెలుసు కనుక!"
    నేను మాట్లాడలేదనడం కంటే నానోట మాతరాలేదనడం సరియైన విషయం.
    'అంతేకాదు . అంతకుమించిన ఆఫర్ ఉందిప్పుడు -" అంది రాజ్యం.
    రాజ్యానికి మించిన ఆఫర్ ఉందా?"నేను నమ్మలేను.
    "నీకు తెలుసో తెలియదో - ఈ పని చేస్తే సుమతి నీ యిల్లాలవుతుంది..."
    సుమతి నాకు తెలుసు. లక్షాధికారి బిడ్డ. కానీ తండ్రి పిసినిగొట్టు కావడం మూలాన --- వాళ్ళనెవ్వరూ లక్షాధికారులనుకోరు. సుమతి తండ్రి రామన్న పంతులిది బియ్యం వ్యాపారం. వాళ్ళది సామాన్య పు పెంకుటిల్లు. ఇటీవలే సుమతి తండ్రి చనిపోవడంతో -- సుమతి కాస్త పాపులర్ అయింది. బోలెడు ఆస్తికి ఏకైక వారసురాలు కావడంతో చాలామంది ఆమె బంధువులమంటూ ఎగబడ్డారు. ఎవ్వరినీ ఆమె దగ్గరకు రానీవ్వలేదు. రాజ్యం తండ్రి ఆచార్లు గారంటే ఆమెకు విపరీతమైన నమ్మకం. సుమతి వ్యవహరా లాయనే చాలా వరకూ చూస్తున్నాడు. ఇంతకీ సుమతి కేమయింది? నన్ను వివాహం చేసుకోవాలనుకోవడానికి?
    రాజ్యం చెబుతోంది - "సుబ్బారావు, రామన్న పంతులు గారి మొదటి కొడుకట. అయన వయసులో చేసిన తప్పుకి ప్రతిఫలంగా పుట్టాడట. అయితే తల్లీ బిడ్డలను అయన ఆదరించలేదు. దాంతో ఆ తల్లి కొడుకుని రామన్న పంతులు ఇంటి అరుగు మీద వదిలి - ఆత్మహత్య చేసుకున్నది. చేసేది లేక రామన్నపంతులు తన కొడుకుని - పిల్లలు లేని పేద బ్రాహ్మణ దంపతుల కిచ్చి - కొద్దిగా ధన సహాయం కూడా చేశాడు. సుబ్బారావు గురించిన వివరాలు మూడో కంటి వాడికి తెలియనీయరాదని అయన శాసించాడు. చనిపోయే ముందేమయిందో ఏమో - అయన ఆస్తిలో సగం వాటా సుబ్బారావుకి రాశాడు.
    ఆ విల్లు ఇంకా బయటకు రాలేదు. కానీ సుమతి ఈ విషయంలో బాగా ఆలోచిస్తోంది. ఆస్తిలో సగం అంటే కొన్ని లక్షలు మరి!"
    అర్ధమైంది నాకు. సుబ్బారావు- నీకు చావు తప్పదు!
    సుమతికి డబ్బుండడమేకాదు , సుమారైన అందం కూడా వుంది. అలంకరణలతో వయసులో వున్న అనాకారి కూడా అందంగా కనబడుతుంది. సుమతి అనాకరి కాదు. పైగా డబ్బు!
    భగవంతుడు నాపక్షాన ఉండి నన్ను, ధనవంతుణ్ణి చేయబోతున్నాడు. మరో ఆలోచనలేదు . సుబ్బారావుని చంపి తీరాతాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS