Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 53

 

    ఒకసారి వెళ్ళి సుమతిని కలుసుకుని ప్రైవేటుగా మాట్లాడాను. ఆమె సంకోచం లేకుండా అన్నీ చెప్పింది. "సుబ్బారావు బ్రతికుండడం వల్ల నాకు చాలా నష్టాలున్నాయి. నా తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. ఒక అనామకుడిని అన్నగా చెప్పుకోవాల్సి వస్తుంది. నా గౌరవం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కాక ధన నష్టం. వాడు చనిపోతే వ్యవహారం బయటకు రాకుండా గప్ చుప్ గా అన్నీ కోర్టులో నడిపించేయవచ్చు. ఈ అవకాశం ఏ మగాడి కిచ్చినా సక్రమంగా వినియోగించుకుంటాడు. కానీ నిన్ను నేను చాలాకాలంగా ప్రేమిస్తున్నాను. అందుకే ఈ అవకాశం నీ కిస్తున్నాను. ఒక హంతకుడిని భర్తగా స్వీకరిస్తానా అని అనుమాన పడవద్దు. నామీద ప్రేమతో హత్య చేయడానికి కూడా సిద్దపడే వాడే నాకు భర్త కావాలి. డబ్బు కోసం హత్య కోరే ఆడదాన్ని భార్యగా భరించగలనా అని అనుమాన పడవద్దు. భర్తతో భవిష్యత్తులో సుఖాన్నాశించే ఈ హత్య కోరుతున్నాను నేను---"
    సుమతి మాటలు నాకు నచ్చాయి. ఒక చిన్న హత్యతో ఎన్నో సమస్యలు తీరిపోతాయి.
    "హత్యకు ప్రతిఫలం - కేవలం నేను నీ భార్యను కావడమే కాదు. సుబ్బారావు వాటా ఆస్తి నీ పేరున పెడతాను. అది నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించు కోవచ్చు. నా పేరు నుండే ఆస్తి నాతొ పాటు ఎలాగూ నీదే అవుతుంది -"
    నేను ఏదో లోకంలో తెలిపోతున్నాను. మరో కొద్ది నిముషాల్లో సుమతి నాకు ఒక కాగితం రాసిచ్చింది. అందులో అతి త్వరలో తను నన్ను వివాహం చేసుకోడానికి నిర్ణయించుకున్నట్లుగా రాసింది. ఇంచుమించు ప్రేమ లేఖ  అనవచ్చు ఆ కాగితాన్ని. రాసి సంతకం పెట్టి తేదీ కూడా వేసి ఇచ్చింది. "మరో వారం రోజుల్లో నీకు నాలుగు లక్షలు బాకీ ఉన్నట్లుగా ఒక నోటు కూడా రాసి ఇస్తాను. సరా?"
    తక్షణం అక్కణ్ణించి లేచాను. సుమతి నిజంగా నన్ను నమ్ముతోంది. ఆమె కోసం ఏమైనా చేసి ఆమెను నా భార్యగా చేసుకోవాలి.
    ఆలోచించిన కొద్ది అవస్థ ఎక్కువవుతోంది. కాబట్టి పెద్ద పధకం వేయదల్చుకోలేదు. సుబ్బారావు ని ఉరి తీయాలి- ఆత్మహత్య  పద్దతిలో అది జరగాలి.
    ఆరోజు సాయంత్రం 4 గం || ప్రాంతాల సుబ్బారావు రూముకి వెళ్ళాను. తలుపు తట్టబోయి ఆగిపోయాను. రూములో గుసగుస లు - కొద్దిగా గాజుల చప్పుడు . ఎందుకో నాకా స్త్రీ రాజ్యం అయుంటుందనిపించింది. ఎందుకంటె గుసగుసల్లో ఆ స్వరం నాకు కాస్త పరిచయ మైనదిగా అనిపించింది. ఆమెను చూడాలి. రాజ్యమే అయితే - నన్ను హత్యకు పురికొల్పి తను సుబ్బారావుతో కులకడం లోని అంతర్యం తెలుసుకోవాలి . ఎలా?
    తలుపు తట్టాను. లోపల కాస్త అలజడి కలిగింది. తలుపు తీయడానికి సుబ్బారావు కాస్త ఆలస్యంగా వస్తాడని తెలుసు. ఈలోగా నేను మరోసారి తలుపు తట్టి అక్కణ్ణించి శ్రద్దగా గమనించసాగాను.
    సుబ్బారావు ఇంటి ముఖద్వారం చేరాలంటే వీధి అరుగుల మధ్య నించి మెట్లేక్కాలి. ముఖ్యమైన గది అక్కడే ఉండడం వాళ్ళ దురదృష్టం. ఇంటి నానుకునే ఉన్న గోడ ద్వారా దొడ్డి గుమ్మముంది. బయటకు ఎవరు రావాలన్నా ఈ రెండు ద్వారాలే గతి.
    ఒకస్త్రీ దొడ్డిగుమ్మం ద్వారా బయటకు వచ్చింది. త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ పక్క సందులోకి మళ్ళింది. రాజ్యం ఇంటికి వెళ్ళాలంటే అదే దారి. అనుసరించానామెను. ఆమె రాజ్యం ఇల్లు చేరింది. అక్కడ ఆగలేదు. అరే - అనుకున్నాను.
    ఆమె తిన్నగా నా ఇల్లు చేరింది. ఉలిక్కిపడ్డాను నేను. ఎవరామె? కొంపతీసి--- ఉరకలు పరుగుల మీద వెళ్ళి తలుపు తట్టాను. చెల్లాయి తలుపు తీసింది. సుబ్బారావు ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆమె ధరించిన నీలం రంగు చీర ఆమె వంటి మీద తళతళ మెరుస్తోంది. చెల్లాయి ముఖంలో కొద్దిగా కంగారు కనబడింది.
    "ఇప్పుడే వస్తాను?' అని అక్కణ్ణించి బయట పడ్డాను. తిన్నగా సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. తలుపు తీయగానే తెరచుకుంది. సుబ్బారావు దీర్ఘాలోచనలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
    "ఇందాక తలుపు తట్టింది నీవేనా?' అన్నాడు సుబ్బారావు.
    "నేనే! కానీ ఇంకా ప్రశ్నలు వేయకు. నేను నిన్ను చాలా అడగాల్సి ఉంది-"
    "అడుగు -"
    "నీ అసలు స్వరూపమేమిటి? పైకి మంచిగా కనిపిస్తూ ఎందరి గొంతుకలు కోస్తున్నావు?"
    "నా అసలు స్వరూపం కనబడుతూనే ఉంది. గొంతుకలు కోసే పని ఇంతవరకూ చేయలేదు-"
    "ఎందుకురా కోస్తావు? అప్పుడు రాజ్యం సంగతి అలా గయింది. కానీ ఇప్పుడు నా చెల్లాయి...."
    "ఏం నాయనా/ రాజ్యం మీదకు నన్నుసిగొల్పి నప్పుడు నీకూ రాజ్యం లాంటి చెల్లాయి ఉన్నదని గుర్తు రాలేదా?"
    నా దగ్గర సమాధానం లేదు కానీ -- "నా చెల్లాయికి అన్యాయం జరగడానికి వీల్లేదు . నిన్ను నేను చంపి...."
    "అగు - చంపడం నీ వల్ల కాదు. కర్మం చాలక నువ్వు చంపితే నీ చెల్లాయి ని భగ్న ప్రేమికురాలిని చేసినవాడివవుతావు-"
    "కానీ - ఒక మోసగాడి బారి నుండి ...."
    "చాల్చాల్లే -- నా బ్రతుకు నీకు లాంటిది కాదు. రాజ్యాన్ని మోసం చేయడం పందేనికి సంబంధించిన విషయం. కానీ నీ చెల్లెల్ని నేను నిజంగా ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను."
    సుబ్బారావు ఆగాడు. నా ఆలోచనలు పరుగెడుతున్నాయి. సుబ్బారావు చెల్లాయిని వివాహమాడతాడు. కానీ వాడిని నేను చంపాలనుకుంటున్నాను. ఎందుకు - డబ్బు కోసం. అయితే సుబ్బారావు ఇప్పుడు ధనవంతుడు. వాడికా సంగతి తెలియక పోవచ్చును. కానీ త్వరలో తెలుస్తుంది. వాడి డబ్బు వాడిని చెరక మానదు. ఏ హత్యా అవసరం లేకుండా నా చెల్లాయి ధనవంతురాలవుతుంది. మగావాడిని -- నా బ్రతుకేలాగైనా బ్రతకగలను -- కానీ చెల్లాయి ధనవంతురాలవుతుంది. నేను హంతకుడిని కానవసరం లేదు. అయితే ఏమిటి చేయడం?
    చంపనా? మాననా?
    వెధవది - ఈసమస్యకు అంతం కనిపించేలా లేదు. అయినా సుబ్బారావు ని ట్రాప్ చేయడం మానలేదు. "నువ్వు నిజంగా నా చెల్లాయిని పెళ్ళి చేసుకుంటావన్న నమ్మకమేమిటి?" అన్నాను.
    "నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దానికి మరి తిరుగుండదు-"
    'అయితే ఈరోజే వివాహం చేసుకుంటావా?"
    "కుదరదు. దానికి పెద్దల ద్వారా ఏర్పాట్లు జరగాలి. అదీ ఆరునెలల తర్వాత-"
    ఆరునెలల్లో వాడు లక్షాధికారి అయి తీరుతాడని నాకు తెలుసు - "అనుకోకుండా నువ్వు ఈ ఆరునెలల్లోనూ లక్షాధికరి వయ్యావనుకో - అప్పుడు కూడా నువ్వు చెల్లాయిని వివాహం చేసుకుంటావా?"
    సుబ్బారావు నవ్వాడు. "నిజమైన అన్న వనిపించుకున్నావు. ఆరునెలల్లో సుబ్బారావు లక్షాధికారి కావడం జరిగితే - ఇంకా ఎన్నో అసంభావాలు కూడా జరిగీ తీర్తాయి. కానీ నీకు నా నిర్ణయం లోని బలం తెలియజేయడానికి సాక్ష్యం -" అంటూ వాడొక కాగితం రాసిచ్చాడు. అందులో తను ఏ పరిస్థితుల్లోనైనా జంకకుండా నా చెల్లెలిని వివాహం చేసుకుంటానని రాశాడు. తను నా చెల్లెలిని వివాహం చేసుకోక పోవడం మోసమవుతుందని కూడా రాశాడు. వాడి సంతకం ఆ వాక్యాల అడుగున మెరుస్తోంది.
    నా హృదయం తేలికపడింది. మరి సుబ్బారావుని చంపనవసరం లేదు.
    "ఈరోజు శనివారం - ఆదివారం నాడు గురువారం కొండ మీదకు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం మాటేమిటి?" అన్నాడు సుబ్బారావు.
    "బాగానే గుర్తుంచుకున్నావు. కానీ ఈ ఆదివారం కాదు. పై ఆదివారం నాడు -" అన్నాను.
    అందుకు కారణముంది. అప్పటికి నా చేతికి సుమతిచ్చే నోటు కూడా అందుతుంది. ఆ నోటు సహాయంతో సుమతిని మోసం చేయడమే నా లక్ష్యం. అంతవరకూ సుబ్బారావు తో అట్టే తిరగరాదు.
    
                                                               4
    మాట తప్పలేదు సుమతి. గురువారం నాడామే 4 లక్షల బాకీ ఉన్నట్లు ప్రామిసరీ నోటు రాసిచ్చింది. ఆమె ముఖంలో కొద్దిగా భయం కూడా కనబడింది. "ఆడదాన్ని - అన్నింటికీ నిన్ను నమ్మాను. నిన్ను నమ్మవచ్చునని రాజ్యం చెప్పింది. నన్ను మోసం చేయవద్దు --" అంది దీనంగా.
    కొద్దిగా జాలేసింది. ఆ నోటు తీసుకు వెళ్ళి జాగ్రత్తగా భద్రం చేసి సాయంత్రం మరోసారి ఆమె ఇంటికి వెళ్ళాను. సింపుల్ గా -- "వెరీ సారీ -- నేను సుబ్బారావుని చంపబోవడం లేదు -" అన్నాను.
    సుమతి ఉలిక్కిపడింది --" ఏమిటి నువ్వనేది ?" కంగారు ఆమె ముఖంలో కనబడింది.
    "ఏం చేయను? నా చెల్లెలు అతన్ని దారుణంగా ప్రేమించేసింది. అతను లేకపోతె చచ్చిపోతానంటుంది. ఆటగాడూ అంతే. ఒక ఆరునెలలు ఆగమనీ, అంతవరకూ నమ్మకంగా ఉంటుందని ఒక కాగితం కూడా రాసిచ్చాడు. అటువంటి వాడిని ఎలా చంపేది?"
    "ఇది మోసం -" అంది సుమతి.
    "నేను మోసగాడిని కాదు. నువ్వు బాకీ ఉన్న నాలుగు లక్షలూ నీవే అవుతాయి- నన్ను వివాహం చేసుకుంటే -"
    "నిన్ను వివాహం చేసుకోవడమా? నీలాంటి మోసగాడిని?"
    "నీ ఇష్టం. నీఅస్తిలో సగం సుబ్బారావు కు పోగా మిగిలిన సగం నా అప్పు తీర్చగా - ఇంక నీకు మిగిలేదేమిటి? నిన్ను మోసం చేయడం ఇష్టం లేక నిన్ను వివాహం చేసుకోవాలను కుంటున్నాను."
    "కానీ -- నోటు ఎందుకు రాశాను? సుబ్బారావుని హత్య చేస్తావనేగా?"
    "కానీ -- కాబోయే చెల్లేని మొగుణ్ణి -- హత్య చేయడం ధర్మమా?"
    "ధర్మం కాదు, అందుకే నా నోటు నాకు వెనక్కు ఇచ్చెసెయ్యి. లేకపోతె ఫలితం తీవ్రంగా ఉంటుంది."
    "చూద్దాం?"
    "చూద్దాం కాదు. అంత తెలివి తక్కువగా నీకు నేను నోటు రాసివ్వలేదు. మోసం చేసే పక్షంలో నీ అంతం చూడగలను."
    "ఇంతకీ నన్ను వివాహం చేసుకొనంటావు?"
    "అల్పాయుష్కుడిని వివాహం చేసుకోవలసిన కర్మ నాకు పట్టలేదు. వెళ్ళు" అంది సుమతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS