Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 51

 

                          అతన్ని చంపేయ్

                                                               వసుంధర

    సుబ్బారావు దగ్గర నేను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నప్పటికీ అన్నింటి కంటే ముఖ్యమైన దొకటుంది. అదే నిర్ణయం తీసుకోవడం.
    సుబ్బారావు మంచివాడు, బుద్ది మంతుడు. అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళే రకం కాదు. అయితే ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాడంటే ఆ పని చేసి తీరతాడు. నిర్ణయం తీసుకున్నాక ఆ పని అమల్లో జరపడానికి అతను జాప్యం చేయడు.
    సుబ్బారావు ను నేను చిన్నప్పట్నించీ ఎరుగుదును. నేను వాడిని ఏరా - ఒరేయ్ అని పిలుస్తాను. వాడూ నన్ను అంతే . ఇద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం. అయినా నాకు వాడంటే కాస్త భయమూ, గౌరవమూ రెండూ కూడా వున్నాయి. కారణం నాలో లేని ఎన్నో తెగింపు గుణాలు వాడిలో ఉండడమే.
    ఇంతకీ చెప్పుకోతగ్గ విశేషమేమిటంటే పదిమంది లోనూ సుబ్బారావు కున్నంత మంచి పేరు నాకు లేదు. కాస్త ఆలశ్యంగా నిర్ణయం తీసుకున్నా స్వతహాగా నా బుద్ది చెడ్డది. అన్ని రకాల అలవాట్లూ నాకున్నాయి. నీతి నియమాలగురించీ నాకు పట్టింపు లేదు.
    సుబ్బారావు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. వాడికి ఆదర్శాలున్నాయి. వాడు ఆల్కహాలు మాట అటుంచి, కాఫీ, టీలు కూడా తాగడు. మాంసం సంగతి చెప్పనే అక్కర లేదు. కోడిగుడ్లు కూడా మాంసమే వాడికి. భోగం వాళ్ళ పేరెత్తితేనే మండి పడతాడు మరి. వెధవ. ఈ ఆదర్శాలతో బ్రతకాలని అనుకోవడం కూడా ఎందుకో తెలియదు.
    అయితే సుబ్బారావు లోని రెండో మనిషిని కూడా చూశాను నేను. ఒకసారి నలుగురు స్నేహితులుండగా మాంసాహారం ప్రసక్తి వచ్చింది. మాలో వెంకటరత్నం అని ఒక హుషారైన వాడున్నాడు. వాడికి ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఎడిపించడమే పని. ఒకరోజున వాడి దృష్టి సుబ్బారావు మీదకు మళ్ళింది. కోడి కూర తినడం కోసం ఒక బ్రాహ్మడు కోరి ఇంకో జన్మలో శూద్రుడిగా పుట్టాదన్నాడు వెంకటరత్నం.
    అనుకున్నట్లుగానే సుబ్బారావు లో రియాక్షన్ వచ్చింది. "బోడి కోడి కూర తినాలనుకుంటే , ఇంకో జన్మ ఎత్తడం కూడా ఎందుకు -" ఆ జన్మలోనే తిని ఉండవలసింది-" అన్నాడు కాస్త కోపంగా.
    "బ్రహ్మడిగా పుట్టిన వాడికి కోడి కూర తినే దమ్మెక్కడుంటుంది?" అన్నాడు వెంకటరత్నం.
    "ఎందుకలాగనుకుంటావ్?" అన్నాడు సుబ్బారావీసారి తాపీగా.
    "వేరే చెప్పాలా? ఒకసారి కోడి కూర తిన్నవాడు మరిదాన్ని వదలలేడు. కనీసం వారాని కోక్కసారైనా తినందే ఉండలేడు. నాకు తెలిసినంతవరకూ అటువంటి వాడు...."
    "అది నీ అభిప్రాయం. ఎన్నోసార్లు నా ప్రక్కన నాన్ వెజిటేరియన్స్ కోడికూర తిన్నా నాకెప్పుడూ ఆకర్షణ కలగలేదు."
    "అందుకే చెప్పాను గదా - ఊహ వేరు, వాస్తవం వేరు. ఒకసారి తింటే నువ్వు కూడా రేపు ఇస్మాయాల్ రెస్టారెంట్ కు పరుగెత్తి తందూరీ చికెన్ కావాలంటావు?" అన్నాడు వెంకటరత్నం.
    "అనకపోతే....?" అన్నాడు సుబ్బారావు తీవ్రంగా.
    "వందరూపాయల పందెం!"
    వెంకటరత్నం వందరూపాయలు ఓడిపోయాడు. జన్మలో మాంసాహారం ముట్టని సుబ్బారావు కోడికూర తిన్నాడు. తన ఆదర్శం చెడి పోతుందన్న బాధ వాడిలో వీసమెత్తు కనవడలేదు. కానీ ఆ సంఘటన వాడిని మాంసాహారిగా మార్చలేదు.
    అలాగే పందెం వేసి ఒకరోజు మా గ్రూపులో అందరి కంటే ఎక్కువ విస్కీ తాగాడు. కానీ మళ్ళీ ముట్టలేదు. మా పక్కవీధిలో ఉంటున్న రంగాచార్లు గారి మూడో అమ్మాయితో నాలుగు రోజులు వ్యవహారం నడిపాడు. ఇదీ పందెం మీదనే. కానీ ఆతర్వాత నించి ఆడపిల్లను గౌరవించడం మానలేదు.
    ఈ సంఘటనలతో మా మిత్ర బృందం లో అందరికీ వాడంటే కాస్త భయమూ, గౌరవమూ ఎక్కువయ్యాయి. వాడిలో చాలా పోటేన్షియల్ పవర్ వుంది. కానీ నివురు గప్పిన నిప్పులా ఉంటాడు. వాడు శక్తివంతుడు కానీ బుద్ది మంతుడు. తప్పు చేయాలనుకోడు. తప్పు చేసి కృంగి పోడు. భయపడడు. అచార్లు గారి అమ్మాయి అందుకు పెద్ద సాక్ష్యం.
    ఆమె ఏడుస్తూ వాడి దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమందిట. సుబ్బారావు ఆమెకు స్పష్టంగా ఇలా చెప్పాడుట!
    "నేను నిన్ను ప్రేమించలేదు. స్నేహితులతో పందెం కట్టాను. చొరవ చేశాను. నీకూ ఇష్టముంటుంది. నిన్ను పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేయలేదు. నా పందెం నాలుగు రోజులకే. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. నీసంగతి పదిమందికీ తెలియడం తప్పితే నా చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనముండదు వెళ్ళు."
    సినిమాల్లోనూ కధల్లోనూ ఒక దుర్మార్గుడు చెప్పవలసిన ఈడైలాగులు సుబ్బారావు లాంటి బుద్ది మంతుడి నోట వచ్చాయి. ఇది వాడి దుర్మార్గాన్ని నిరోపిస్తుందో , ఆత్మ బలాన్ని స్పురించజేస్తుందో నా కర్ధం కాదు. ఇంతకీ సుబ్బారావు నా దగ్గర అచార్లు గారి అమ్మాయి తన దగ్గరకు వస్తే ఇలా చేస్తానన్నప్పుడు నేను అంతగా నమ్మలేదు. అయితే ఆ అమ్మాయే నా దగ్గరకు వచ్చి సుబ్బారావు తన దగ్గర ఇలా అన్నాడని చెప్పినపుడు నేను నిజంగానే ఆశ్చర్యపోయాను.
    "నువ్వు సుబ్బారావుని చంపాలి?' అంది రాజ్యం.
    నాగురించి ఆగింది. ఏమిటంటుంది రాజ్యం! హత్య- హత్య గురించి మాట్లాడుతోంది రాజ్యం.
    "ఏమిటీ?' అన్నాను.
    "అవును - సుబ్బారావుని చంపాలి నువ్వు -----"
    "ఎందుకు చంపాలి? అందువల్ల ఎవరికీ ప్రయోజనం?' అప్రయత్నంగా అడిగాను.
    రాజ్యం కూడా నాకు చిన్నప్పట్నించీ తెలుసు. నేను అయిదో క్లాసు చదువుతున్నపుడు  రాజ్యం రెండో క్లాసులో చేరింది. నేను స్కూలు ఫైనల్ పూర్తీ చేసే సమయానికి యువకుల నాకర్షించే స్థాయికి ఎదిగింది. నేను కాలేజీలో చేరాక రాజ్యం గొప్పతనాన్ని గ్రహించాను. రాజ్యం అందంలో ఎంత ఆకర్షణ ఉందొ - ఆమె ప్రవర్తనలో అంత ఆకర్షణ ఉంది. నాగుపాము ఎంత అందమైనదైనా కావచ్చు, కానీ అది చరచరా పాకిపోతుంటే ఎవడికైనా కనీసం ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచనైనా కలుగుతుందా? రాజ్యం అంటే యువకులందరికీ భయమే!
    ఈ రాజ్యానికి ఒకసారి ప్రేమ లేఖ రాశాను నేను. అది ఇప్పటికీ ఆమె వద్దనే ఉంది. అది కాలేజీ ప్రిన్సిపాల్ కు చూపిస్తానని భయపెట్టి నాచేత చాలా పనులు చేయించుకుంది. ఎన్నోసార్లు ఆమె పుస్తకాలు మోశాను. ఆమెకు కోకాకోలాలు తెచ్చి పెట్టాను. ఆమె రాణి, నేను సేవకుడిని.
    రాజ్యం అందరి ఆడవాళ్ళ లాంటిదీ కాదు. మగవాడు చేసిన తప్పులకు తనే స్వయంగా శిక్ష విశిస్తుంది. నా వంటి బాధితులు చాలా మంది రాజ్యం మీద పగబట్టారు. సుబ్బారావు ని ఉసి గొలపడం కూడా ఈ పగలో భాగమే! అయితే సుబ్బారావు జయించి రాజ్యం ఓడిపోయింది. సుబ్బారావుని శిక్షించడానికి రాజ్యం నా సహాయం కోరడం - ఆమె ఓటమిని మరింత బలపరుస్తోంది.
    "చంపవలసింది నువ్వు, ప్రయోజనం నాకు?" అంది రాజ్యం.
    "నాకు కూడా ఏదైనా ప్రయోజన ముండాలి కదా?"
    రాజ్యం కంఠంలో దీనత్వం గోచరించింది. "సుబ్బారావు ని నువ్వు నిజంగా చంపగలిగితే -- నువ్వు ఏమడిగినా కాదనకుండా ఇస్తాను." అంది.
    "ఓహో -- ' అన్నాను హుషారుగా - "నీకోసం సుబ్బారావు ని చంపగల ననుకుంటాను-"
    'అనుకుంటే కాదు. నీలో ఏ ఆశలున్నా వాడిని చంపెకనే --"
    "నమ్మవచ్చా?"
    "ఒక హత్య చేసిన వాడికింకో హత్య చేయడం కష్టం కాదని నాకు తెలుసు-" అంది రాజ్యం.
    మరో పావుగంటలో ఆమె వెళ్ళిపోయింది.
    రాజ్యాన్ని పొందాలన్నది నా జీవితాశయం. ఈ జన్మలో అది సాధ్యపడుతుందని నేనాకించ లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. సుబ్బారావుని చంపాలి! కేవలం ఒక ఆడదాని కోసం సుబ్బారావుని చంపాలి.
    ఒక్కసారి నా పరిస్థితిని సింహాసలోకనం చేసుకున్నాను. తల్లీ తండ్రి లేరు నాకు. ముసలి అమ్మమ్మ, వయసులో ఉన్న ముద్దుల చెల్లెలు ఉన్నారు. బుద్ది ఎలా ఎడిసినా - ఎలాగో నేను డిగ్రీ సంపాదించాను. కాబట్టి- ఉద్యోగంలో ఉన్నాను. నెలకు నాలుగొందలు వస్తుంది. రోజులు బాగానే గడిచిపోతున్నాయి. చెల్లెలి పెళ్ళికి ఖర్చు పెట్టాల్సి వచ్చినా నాకిచ్చే కట్నం డబ్బులతో ఆ ఖర్చు కిబ్బంది ఉండదు. హాయిగా రోజులు గడిపేయవచ్చు.
    కొన్ని సినిమాల్లో దుర్మార్గులైన అన్నయ్యలకు చెల్లెళ్ళ అంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు చూపిస్తుంటారుచూడండి. నాలో దుర్మార్గం ఎంతుందో తెలియదు కానీ చెల్లెలంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. దాని పెళ్ళి కోసమే నేను ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తున్నాను. మంచిసంబంధం చేయాలన్నది నా ఆశయం.
    ఇప్పుడు నేను హత్య చేస్తే - ఆ నేరం బయటపడితే - నా ఉద్యోగం ఊడడం మాటటుంచి జీవితానికే స్వస్తి చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా చెల్లెలి జీవితం వీధిన పడడమే కాక- ఒక హంతకుడి చెల్లెలిగా దాని బ్రతుకు బండలవుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే సుబ్బారావుని చంపడం చాలా తెలివి తక్కువ అవుతుంది.
    అయితే మరి రాజ్యం సంగతి ఏమిటి? జన్మలో నాకిటు వంటి అవకాశం రాదు. రాజ్యం త్రిలోక సుందరి. ఇరవై రెండేళ్ళ రాజ్యాని కింకా పెళ్ళికాక పోవడమూ , సుబ్బారావు మీద ఆమె పగ బట్టడమూ రెండూ నా అదృష్టం కొద్దీ జరిగాయి. తప్పు చేసినా రాజ్యం నిప్పులాంటి మనిషి. మాట తప్పేరకం కాదు.
    అవును చంపాలి. సుబ్బారావుని చంపాలి! నా తెలివి తేటలన్నీ ఉపయోగించి చల్లని ప్లాను వేసి మరీ చంపాలి. ఎవ్వరికీ తెలియకూడదు- సుబ్బారావు ఎలా మరణించాడో? ఏం చేయాలి? విష ప్రయోగమూ, ఉరిత్రాడా , కత్తి పోటా....ఎలా చంపాలి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS