Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 51


    తన శరీరంలోంచి ఒక భాగం తెగిపోయినట్లే వుంది. కోటనించి  రధం ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న కొద్దీ ఆమె బాధ అధికం అవుతోంది.
    ఆ బాధ చాలదన్నట్టు 'మళ్ళీ ఎన్నాళ్ళకో కన్పించటం?' అని కవ్వించాడు వెంగళరాయుడు జగ్గమాంబని ఉద్దేశించి.
    "దానికొక ముహూర్తం అంటూ వేరే వుంటుందా చిన్నిబావా? ఎప్పుడు చూడాలని అనిపిస్తే అప్పుడే!" అంది జగ్గమాంబ కాని అది అబద్దం అని తెలుసు.
    ఆమె మనసులోని బాధ ఏమిటో వెంగళరాయుడుకి తెలుసు. ఆమె మూగనోము వదిలిం\చాలనే అలా అడిగాడు.
    వైశ్యుల వీధిలోంచి రధం పోతోంది జగ్గమాంబ రధం ఆపమని అడిగింది ఆ చోటు గుర్తించాడు వెంగళరాయుడు. అది వీణకోసం తామిద్దరూ వెళ్ళిన అంగడి జగ్గమాంబ దిగి లోపలకు వెళ్ళింది. ఆమెవెంట వెంగళరాయుడు దిగి లోపలకు వెళ్ళాడు.
    రాచవారింటి రధం తమ కొట్టుముందు ఆగటం ఎంతో గొప్ప అనిపించి అంగడివాళ్ళు పరుగు పరుగున వచ్చారు.
    వీణ తీసుకుని వెంగళరాయుడు చేతుల్లో వుంచింది జగ్గమాంబ.
    "చిన్నిబావా! యీ చిరుకానుక స్వీకరించు."
    "జగ్గమ్మా! నాకెందుకు యీ కానుక?"
    "నన్ను జ్ఞాపకం పెట్టుకుంటావని__?"
    "కానుకలు యివ్వకపోతే మర్చిపోతాననా."
    "యివ్వాళా రేపూ వున్నంత బాగా యింకొక ఏడాది పోయాక జ్ఞాపకం వుంటానా......?" అని అడిగింది జగ్గమాంబ.
    వెంగళరాయుడు నిజంచెప్పి బాధ పెట్టటానికీ, అబద్దం ఆడటానికీ ఇష్టంలేక మెదలకుండా వూరుకున్నాడు.
    "కాలం చాలా శక్తివంతమయింది చిన్నిబావా! అది కొన్ని జ్ఞాపకాల్ని చెరిపివేస్తూ మనసుమీద కొత్త జ్ఞాపకాల్ని ముద్రిస్తుంది. ఆ క్రొత్త జ్ఞాపకాలతో క్రొత్త పుంతలో జీవితరగం సాగిపోతుంది. అటువంటి రోజులు వచ్చాక యీ వీణ ఎప్పుడయినా నా గురించిన జ్ఞాపకాల్ని నీకు అందివ్వగలిగితే నాకు ఎంతో సంతోషంగా వుంటుంది. వీణతీగల్ని మీటితే కమ్మని నాదం వస్తుంది. మొరటుతనం మాని ముద్దుగా తీగల్ని సవరించటం నేర్చుకో అవి ఎన్నాళ్ళయినా తెగిపోకుండా కమ్మని పాటలు పాడుతాయి" అంటూ ఆ వీణను అతని చేతుల్లోవుంచి తన చేతులు వెనక్కు తీసుకుంది.
    వెంగళరాయుడుకి యిది క్రొత్త అనుభూతి. అతని పరాక్రమం విషయం అందరికీ తెలుసు. అతని అభిరుచుల సంగతి తెలియనివాళ్ళు లేరు. అందునించి ఎవరైనా అతనికి బహుమానం యివ్వదలిస్తే కత్తులూ, డాళ్ళూ, యీటెలు, గుర్రాలు యిస్తారు యిటువంటి బహుమానాలు యిచ్చి అతని మనసులోని మరొక వైపుని, మారుమూలని, లాలిత్యాన్ని తట్టిలేపిన వాళ్ళు ఎవరూ లేరు.
    ఎంతో ఆప్యాయతతో ఆ బహుమానాన్ని స్వీకరించాడు వెంగళరాయుడు. ఇద్దరూ తిరిగివచ్చి రధంమీద కూర్చున్నారు. పొలిమేరల వరకూ వెంగళరాయుడు రధంతోలాడు. పొలిమేరలు వచ్చాక రామరాయుడికీ, వెంకమాంబకీ నమస్కరించి దిగిపోయాడు.
    జగ్గమాంబ ముఖం ప్రక్కకు త్రిప్పుకుంది.
    "జగ్గమ్మా అన్నట్టు నీకొక విషయం చెప్పటం మర్చాను" అన్నాడు వెంగళరాయుడు క్రిందనిలబడి అప్పటికి రధసారధి ఎక్కాడు.
    "ఏమిటది చిన్నిబావా."
    "నా నల్లగుర్రానికి నామకరణం చేశాను."
    "ఏమిటో ఆ పేరు" అని ఆసక్తిగా అడిగింది జగ్గమాంబ.
    "జగ్గు" అని బదులిచ్చాడు వెంగళరాయుడు.
    "చిన్నిబావకి చిలిపితనం వచ్చిందే గుర్రానికి నా పేరేమిటో?" అని ప్రశ్నార్ధకంగా వెంగళరాయుడువైపు చూచింది జగ్గమాంబ.
    "అది నీ మాటలకన్నా వేగంగా పరుగెడుతుందనీ."
    "పరుగెత్తటం బాగా నేర్చిన గుర్రాలే పడవేస్తాయి చిన్నిబావా!"
    "కళ్ళెం నా చేతిలో ఉంటుందిగా!"
    "కళ్ళెం నీ చేతిలో ఉన్నా విధి ఎవరి చేతిలోనూ ఉండదు" అంటూ అతన్ని యుద్దాలలో దూకుడుతనం తగ్గించుకోమని హెచ్చరిక చేసిందామె.
    "చిన్ని బావా! చీమలా నిన్ను కుట్టాను నన్ను, క్షమించు" అంది మళ్ళీ.
    "నువ్వు ఎంతసేపయినా యిలాగే మాటలతో బంతు లాడగలవులే. ఇహ బయలుదేరండి" అన్నాడు వెంగళరాయుడు నవ్వుతూ.
    అదే ఆజ్ఞగా భావించుకుని రధంతోలేవాడు గుర్రాలను అదలించాడు రధం కనుమరుగు అయ్యేవరకూ అక్కడే నిలబడి చూచాడు వెంగళరాయుడు.
    ప్రొద్దు వాలిపోయేవరకూ ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వేళకు వదినగారికోసం ప్రత్యేకంగా కట్టి చిన గోపాలస్వామి ఆలయం దగ్గరకు వచ్చాడు.
    దేవాలయమంటే అది ఘనమైన నిర్మాణం కాదు. యిరవైమంది శిల్పులు ఒక వారం రోజుల్లో చెయ్యగలిగిన పనితో తయారు అయిన గుడి. గోపాలస్వామిమూర్తి కూడా స్థానిక శిల్పులు తయారు చేసిందే!
    గర్భగుడి దాటితే వెలుపల మంటపమే! గుడి పొడవు పద్దెనిమిది అడుగులు, వెడల్పు పది అడుగులు మాత్రమే ఉంటుంది.
    ఆ గుడిముందు గుడి కట్టకముందునించీ ఉన్న పారిజాతంచెట్టు ఉంది. అది చైత్రమాసం కావటంనించి పారిజాతం పూత అయిపోయింది.
    ఆ చెట్టు క్రింద కూర్చుని నీడని ముందుపెట్టుకుని దాంతో నానా అనర్దాలూ పడుతున్నాడు వెంగళరాయుడు. దాంతో కొంతసేపు అవస్థపడి వారి వీణను మీటి సుస్వరాలను పలికించటం కత్తి పట్టటం అంత తేలిక అయినపని కాదని అతనికి తెలిసి వచ్చింది. దాంతో కుస్తీపట్టి కాస్సేపటకి ఒక తీగను తెంపి వేశాడు. దిగులుపడి దాన్ని ముందుపెట్టుకుని కూర్చున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS