Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 51


    "ఇదిగో వచ్చేసా!" వరూధిని గదిలోనుంచి బయటకు వచ్చింది. వేంకటపతికి వరూధిని తన భార్యలా అనిపించలేదు. ఏ సినిమాలోనో చూసిన దేవకన్యగానో, నాగకన్యగానో అనిపించింది.
    "ఆలస్యం అయిపోయింది గదూ రసూల్? మీ అయ్యగారికి కోపం రాదుకదా?" కారు స్టార్టు చేస్తున్న డ్రైవర్ను ఉద్దేశించి అన్నది వరూధిని.
    అయ్యగారి సంగతేమోగాని వాడికి మాత్రం కోపం వచ్చినట్టే ముఖంపెట్టి, కారు అదిరిపాటుగా తోలడం మొదలుపెట్టాడు. జనరల్ బజారూ, బస్ స్టాండూ దాటి సినిమాహాలు ముందుకొచ్చి కారాగింది. రెండో ఆటకు టికెట్స్ దొరకని జనం గోడలమీద పోస్టర్లు చూస్తూ నిలబడ్డారు. హాలుముందు నిలబడ్డ రామనాథబాబు వచ్చి ముందు డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. కారు సాగింది.
    "ఆలస్యం అయిపోయింది కదూ?" మృదుమధురంగా సాగదీస్తూ అన్నది వరూధిని.
    "రోజూ ఇదే టైంగా? రెండో ఆట మొదలు పెట్టాకనే నేను వెళ్ళేది. ఆ తర్వాతే భోజనం చేసేది. మీకే ఆలస్యం అయిందనుకుంటాను" అన్నాడు రామనాథబాబు.
    "నా సంగతెలావున్నా, మా వారికి మాత్రం ఆలస్యమైనట్టే! ఎనిమిదయ్యేసరికి భోంచెయ్యాల్సిందే వారు!"
    "చేసిన ఆలస్యం అంతా నువ్వేచేసి అయనగార్నంటావేం?" ఆకలితో నకనకలాడిపోతున్న వెంకటపతి అన్నాడు.
    "అయ్యో, నేను కాదన్నానా! ఆలస్యం అంతా నాదేనని చెప్తున్నాకదండీ!" అంది వరూధిని రాణి నవ్వును తెచ్చుకొంటూ.
    "ఏమిటీ? వెంకటపతిగారికి ఎనిమిదింటికే భోజనం చేసే అలవాటా? ఆ సంగతి తెలిస్తే ముందే ఏర్పాటు చేయించేవాడ్నికదా?" అన్నాడు రామనాథబాబు. కారు హెడ్ లైట్ వెలుగు ముందుపోతున్న జట్కాలో ఉన్నవాళ్ళ మీదపడుతుంటే అందులోవున్న వాళ్ళకేసి కన్నార్పకుండా చూస్తూ.
    "ఇంకా నయం గదూ? పల్లెటూళ్ళో వున్నప్పుడు ఊరు పొద్దుకూకకుండానే తినేవారు. ఈపాటికి ఒక నిద్దరకూడా తీసేవారు." ఈసారి వరూధిని వస్తోన్న నవ్వు ఆపుకొంటూ అన్నది. ముందున్న జత్కాను కారు దాటేసింతర్వాత రామనాథబాబు కూడా వరూధిని మాటలకు నవ్వాడు.
    రామనాథబాబు ఇంటిముందు కారాగింది.
    చుట్టూ ప్రహరీ. అందమైన గేటు, గేటు ప్రక్కన ప్రహరీ గోడ మీద అతికివున్న చలపతి పలకమీద 'శ్రీ నిలయం' అనీ, రెండో పక్కన 'రామనాథబాబు' అనీ రాసి వుంది. మాలి వచ్చి గేటు తెరిచాడు. కారు పూలచెట్ల మధ్యనున్న బాటమీదగా వచ్చి, విశాలమైన మెట్లముందు ఆగింది. రామనాథబాబు దిగి కారు డోరు తెరిచాడు. పున్నమి వెన్నెల. ఇంటిముందు 'నైట్ క్వీన్' మత్తును వెదజల్లుతోంది. సువిశాలంగా వున్న ఆవరణలో గున్నమామిడి, నందివర్ధనం, మందారం, సన్నజాజి పందిరీ, పుచ్చపువ్వులాంటి వెన్నెలా, చల్లని గాలీ వరూథిన్ని ఆహ్వానించాయి. వెంకటపతికి వరికంకులు పాలు పోసుకొనే తరుణంలో, పొలాన గనెంనరికి చేనుకు నీళ్ళు పెట్టేనాటి రాత్రి అనుభూతులు గుర్తొచ్చాయి.
    రామనాథ బాబు వరూథిన్నీ, వెంకటపతినీ తీసుకొచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టాడు. సోఫాలో కూర్చున్న వెంకటపతికి తమ ఇంట్లో వున్నవాటికంటే ఇవే బాగున్నట్లు అనిపించింది.
    రామనాథబాబు 'నాయర్' అంటూ కేకవేశాడు. నాయర్ వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
    "వాళ్ళింకా రాలేదా?"
    "డి.యస్.పి. అర్జంటుగా క్యాంప్ కెళ్ళాల్సి వచ్చిందట. వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి చెప్పి వెళ్ళాడు."
    "ఏం, అంత కొంపలంటుకుపోయే కేసా! భోజనం చేసి వెళ్ళి ఉండొచ్చుగా?" రామనాథబాబు చిరాగ్గా అన్నాడు.
    "ఎస్పీగారు వచ్చారట. ఇద్దరూ కలిసి వెంటనే వెళ్ళాల్సి వచ్చిందట!" నాయర్ నీళ్ళు నములుతున్నట్టుగా అన్నాడు.
    "ఓహో! హోం మినిష్టర్ మన జిల్లాలో టూర్ చేస్తున్నాడుగా?" నొసలు విరిచి సాలోచనగా అన్నాడు రామనాథబాబు.
    వరూధిని కళ్ళు మెరిశాయి. వెంకటపతి బుర్ర గోక్కుంటూ చూశాడు.
    "మంత్రిగారు మన జిల్లాలో మకాం వేశారంటే మన డి.యస్.పి. గారంటే మంత్రిగారికి చాలా ఇష్టం. ఆయనే ప్రొమోషన్ కూడా ఇప్పించారు. సర్కిల్ ఇన్స్ పెక్టర్నుంచి ప్రమోషన్ ఇచ్చి కూడా మన ఏరియాలోనే వుంచారంటే మంత్రిగారు కావాలని పట్టుబట్టు చేయించారు. అందుకు నేనే కారణం అనుకోండి."
    "మంత్రిగారు మీకు చుట్టమా?" అమాయకంగా అడిగాడు వెంకటపతి.
    "చుట్టంకంటే ఎక్కువే!" అని తనలో తనే నవ్వుకొన్నాడు రామనాథబాబు.
    "మీకు ఆయన బాగా స్నేహితుడన్నమాట! మాటమాత్రం అన్నా చెప్పలేదేమండీ?" అన్నది వరూధిని రాగం తీస్తూ.
    "అసలు ఆయన మంత్రి కావటానికి కారణం ఎవరంటారూ?" ముసి ముసి నవ్వులు నవ్వుతూ ముఖం అంతా ఓ పెద్ద ప్రశ్నార్ధకంగా పెట్టాడు రామనాథబాబు.
    వరూథినికి ఆశ్చర్యంతోపాటు ఆనందం, గర్వం కూడా కలిగాయి. వెంకటపతి అయోమయంలో పడిపోయాడు. అంత పెద్ద మంత్రి పదవిని సినిమా హాలు రామనాథబాబు ఎలా ఇప్పించగలిగాడా అనే సందేహం పట్టుకుంది వెంకటపతికి.
    "జిల్లాలో వున్న యం.ఎల్.ఏ.లలో ఏడుగురు మనవాళ్ళే. రిజర్వుడు సీట్లల్లో గెలిచిన ముగ్గుర్లో ఇద్దరికి సీట్లు నేనే ఇప్పించాను. ఏ బాపతున్నా గానీ, వాళ్ళందరికీ లక్షన్నరపైగా ఎలక్షన్ ఫండ్ ఇచ్చాను."
    "ఎట్టెట్టా? లక్షన్నరా! అంత డబ్బే?" వెంకటపతి నోరు వెళ్ళబెట్టాడు.
    "వెంకటపతిగారూ, వీళ్ళంతా ప్రయోజకులు అనుకుంటున్నారా? వెనక మనలాటి వాళ్ళ అండదండలుంటేనే అంతవల్లవుతున్నారు, తెలుసా?"
    "అవును మరి!" అంది వరూధిని.
    అంతే అయివుంటుందన్నట్టు తల ఆడించాడు వెంకటపతి.
    కారు డ్రైవర్ ఒక కేసులో సోడాలు పట్టుకొని లోపలకు వెళ్ళాడు ఎండాకాలం మధ్యాహ్నం తాగే సోడాలు ఈ చల్లటి రాత్రి ఎందుకో అర్ధంకాక వెంకటపతి ఆలోచనలో పడ్డాడు.
    "అంతా రెడీ అయింది, వడ్డించమంటారా?" అడిగాడు నాయర్.
    "ఇంకా డాక్టరుగారు రాలేదుగా?" అంది వరూధిని.
    "ఆయనగారు ఊర్నించే రాలేదట. మొన్న ఈ ఉదయానికల్లా వస్తానని చెప్పాడు. అలా అంటేనే ఈ డిన్నర్ పెట్టుకొన్నాను. అసలు ఈ పార్టీ మన డి.యస్.పి ప్రమోషన్ సందర్భంగా కదా ఇస్తుంది? ఆయనా రాలేదు! ఇప్పుడు వెంకటపతిగారే ముఖ్య అతిథి!" అంటూ వరూధినికేసి చూశాడు రామనాథబాబు. వేంకటపతికి ఆ జోక్ అర్ధంకాలేదు.
    "ఇదీ మంచిదేలెండి. అంతా ఓ ఫామిలీ మెంబర్సులా - మన పార్టీ....లేవండి వెంకటపతిగారూ!" అంటూ రామనాథబాబు డైనింగ్ రూంలోకి దారి తీశాడు. వరూథిన్నీ, వెంకటపతినీ టేబుల్ ముందు కూర్చోబెట్టి రామనాథబాబు పడక గదిలోకి వెళ్ళాడు.
    నాయర్ ప్లేట్లు పెట్టి, అన్నం కూరలూ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు.
    "ఈయన భార్యాపిల్లలూ కనబడరేం?" భార్యను అడిగాడు వెంకటపతి.
    "ఆవిడా! ఎప్పుడూ పుట్టింట్లోనే వుంటుంది. కొడుకూ, కూతురూ తల్లి దగ్గరే వుంటారు." వరూధిని ఓ క్షణం ఆగి గొంతు చిన్నది చేసి, భర్త మీదకు వంగి "ఆయన భార్య బుద్దికూడా మంచిది కాదట! వీళ్ళిద్దరికీ అంత మంచి సంబంధాలు కూడా లేవు. వీళ్ళ వ్యవహారం ఆమధ్య తెగతెంపులు చేసుకునేవరకూ వచ్చింది." అని చెప్పింది.
    భార్య చెప్పింది బుర్రలో దూరి అర్ధం అయేసరికి వేంకటపతికి కొద్ది క్షణాలు పట్టింది. చిత్రహింస ఏదో తన కళ్ళముందు జరుగుతున్నట్టయిపోయాడు.
    "ఏంటి అట్లా చూస్తారు? రామనాథబాబు భార్య మా పెద్దన్నయ్యను పెంచుకొన్నాయన మేనకోడలేగా? ఇది ఈనాటిదికాదు. మన పెళ్ళినాటికే దాని వ్యవహారం వీధిన పడింది! ఈయన పెద్ద మనిషీ, పరువుగలవాడు కాబట్టి దాని ఆటలు సాగుతున్నాయి. మరోవాడైతేనా?" రామనాథబాబును చూసి ఆపేసింది వరూధిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS