"దాని గురించే ఇంట్లో ఇంతసేపూ రాద్దాంతం అయ్యింది. చక్కగా నువ్వె పూజ చేసుకో నీకు ఎలాగూ ఈ దేవుళ్ళూ - దయ్యాలూ ఉన్నారుగా! మడి కట్టుకుని కూర్చొనే నీలాంటి వాళ్ళకి అవి బాగా ఉపయోగపడతాయి" అన్నారు.
"అంటే నన్ను దెప్పుతున్నారా?"
"దెప్పడం ఏమిటి సరోజా! ఆవిడ కూడా పూజలు చేస్తూంటుంది. కానీ నీ అంత పిచ్చి లేదనుకో, "పూజ సామానులు ఎందుకు తిరిగి పంపించేశావ"ని అడిగాను. తనకిష్టంలేదు, పంపించేశానంది. అనవసరంగా బోలెడు డబ్బు తగలేసి కొని వుంటావు. నువ్వె ఉంచుకో! నీ సెంటిమెంట్ ప్రకారం నీకు శుభమేగా?" అని నవ్వారు.
"మీరే ఉద్దేశంతో అన్నా, తిరిగి పంపించేశాక ఏం చేస్తాను? పూజ గదిలోనే పెట్టుకున్నాను" అన్నాను.
"మంచిపని చేశావు. నాకు టైమయ్యింది. ఓసారి అన్నపూర్ణా ఆఫీసుకి వెళ్ళి అక్కడ్నుంచి యింటికి పోతాను. హాయిగా భోంచేసి రెస్ట్ తీసుకో నిన్న చాలా కష్టపడ్డావు" అని వెళ్ళిపోయారు.
వారి రాకా, మాటలూ ఎంతో బాధతో వున్న నాకు మనశ్శాంతిని కలిగించేయి.
మర్నాటి నుండీ మామూలుగా మా పనులు ప్రారంభించాం. ఊపిరాడనంత పని రోజుకి మూడు పిక్చర్లు, మూడు డిఫరెంట్ కాల్ షీట్లలో చెయ్యాల్సి వచ్చింది. అలాగ చాలా కష్టపడి పన్నెండు సంవత్సరాలు పనిచేశాం.
ఇంత హడావుడిలో కూడా శ్రీశ్రీగారు ఇటున్న సూర్యుడు అటు ఉదయించినా కూడా తన పద్ధతుల్ని మార్చుకునేవారు కాదు.
ముఖ్యంగా రెండు పద్దతులు ఖచ్చితంగా పాటించేవారు. మొదటిది - భోజనం చేస్తే, ఇంట్లోనే చెయ్యాలి. లేకుంటే ఆరోజు పస్తన్నమాటే! రెండవది - ఎక్కడున్నా రాత్రయ్యేసరికి, ఇంటికెళ్ళి నిద్రపోవాలి.
అందులోనూ ఈ మధ్య ఆవిడ శ్రద్ద, గమనింపు ఎక్కువయ్యింది. అది కనిపెట్టి నేనూ ఈ పద్దతులపట్లా ప్రత్యేక శ్రద్ద చూపి, తప్పనిసరిగా ఇంటికి పంపించేసేదాన్ని, క్రమేపీ స్ట్రయిట్ పిక్చర్ పాటలనీ, ఈ పనీ ఆ పనీ అనీ, డబ్బింగ్ బాధ్యతలన్నీ నామీదే వదిలేసేవారు. పిక్చర్ కి డైలాగ్స్ రాసే శక్తి సంపాదించి, పిక్చర్ పనంతా పూర్తి చేసేదాన్ని. మధ్యలో తీరిక దొరికిందంటే చాలు శ్రీశ్రీగారు వెంటనే వచ్చేసేవారు. చేసినపని చెక్ చేసి, సరిగ్గా పని జరగలేదని తనకి తోస్తే, నాకు అష్టోత్తర పూజ చేసి మరీ వెళ్ళేవారు. వారి టైమింగ్స్ తో వేగలేక చచ్చేదాన్ని.
నేను అప్పుడు శ్రీరామనగర్ ఇంట్లో వుండేదాన్ని చెయ్యడనికి తీరిక లేనన్ని పిక్చర్లు - ఊపిరాడానంత పని.....చేతినిండా డబ్బు......! నాకు కూడా అసిస్టెంట్ గా ఒక్కో పిక్చర్ కె అయిదువేలు ముట్టేవి.
వచ్చిన ఆదాయంతో ఓ ఇల్లు కొనాలని బుద్ది పుట్టింది. టైమొచ్చినప్పుడు గురువుగారి చెవిలో వేద్దాంలే అనుకున్నాను.
ఓరోజు - ఓ పెద్ద కంపెనీ (చాలా పెద్ద కంపెనీలెండి మంచి పిక్చర్లు తీశారు. పేరు అనవసరం) శ్రీశ్రీగారిని పాట రాయాలి రమ్మని కారు పంపారు. నాకా విషయం తెలియదు.
ఆ రోజు డబ్బింగ్ కాల్ షీట్ ఉదయం ఏడుగంటల నుండీ సాయంకాలం అయిదు గంటల వరకూ, నేను మామూలుగా ముందు వెళ్ళిపోయాను. మొదట్లో ఇద్దరం వెళ్ళేవాళ్ళం. కాని తఃరువతః ముందు నేను ఒక్కర్తినే వెళ్ళేదాన్ని. శ్రీశ్రీగారు తాపీగా లేచి తొమ్మిదిగంటలకి వచ్చేవారు. అది అలవాటయిపోయింది.
రోజూలా తొమ్మిది గంటలకి వస్తారని ఎదురు చూస్తున్నాను.
తొమ్మిదిన్నర.....పదిన్నర..... పదకొండున్నర.....అయ్యింది. శ్రీశ్రీగారు అడ్రస్ లేదు. నా ఆశ్చర్యానికి అంతులేదు.
ఎంత బిజీగా వున్నా, వచ్చి పలకరించయినా వెళతారు కానీ రాకుండా మాత్రం వుండరు. ఎక్కడికైనా వెళ్ళారా? లేక యింట్లోనే కూర్చున్నారా? ఇంట్లో వుంటే సంతోషమే కానీ అలా వుండరే?
పోనీ తాగి వుంటారా? అబ్బే, పని వుంటే చచ్చినా తాగరు. వారికున్న ప్రిన్సిపుల్స్ లో అది చాలా ముఖ్యమైంది. తాగితే రాయరు. రాసినప్పుడు తాగరు.
అందుకనే టైము అవుతున్నకొద్దీ నాలో ఆరాటం ఎక్కువౌతోంది.
కంపెనీ కారు వచ్చి వుంటుందా? వచ్చి వుంటే - తప్పకుండా ఓ మారు ఇక్కడికొచ్చి చూసి వెళ్ళేవారు. ఏదేమైనప్పటికీ విషయం తెల్సివుంటే ఇంత ఆరాటం వుండేదికాదు.
నా ముఖంలో అలజడి ప్రొడ్యూసర్లు గమనిస్తూనే వున్నారు. పని మాత్రం బాగానే జరిగిపోతోంది.
ఆర్టిస్టుల పోర్షనులు ఇచ్చేశాను. ఆ లూప్ లో మా రామం కూడా వుంది. అది నా పరిస్థితి అర్ధం చేసుకుని అందరి పోర్షన్లూ చూస్తోంది. అంటే నాకు అసిస్టెంట్ అన్నమాట - అనుకున్నాను. మామూలుగా అయితే నవ్వేదాన్ని!
ఆర్టిస్టులంతా రిహార్సల్స్ చేస్తున్నారు. ఇంతలో - "అమ్మగారూ! మీకు ఫోన్ వచ్చిందండీ" అని బాయ్ చెప్పాడు.
"ఎవరి దగ్గిర్నుండి?" అని అడిగాను.
"శ్రీశ్రీగారు చేశారండి" అన్నాడు.
అంతే... ఒకే పరుగులో ఫోన్ దగ్గరకి వెళ్ళాను.
ఫోన్ థేఉస్కొని "హల్లో" అన్నాను.
"సరోజా!...." అన్న పిలుపు విన్న మీదట ప్ర్రాణం కుదుటపడింది.
"ఎక్కడనుండి మాట్లాడుతున్నారండీ?...." అనడిగాను.
"ఫలానా - చోట వున్నాను. పాట అయిపోవచ్చింది. అనగానే వచ్చేస్తాను" అన్నారు.
"రక్షించారు. మీ గురించి ఏమీ తెలియక ఏమైపోయారా? అని కొట్టుకుపోతున్నాను" అన్నాను.
"ఏమైపోతాను సరోజా! నేను బాగానే వున్నానులే! నీ పని ఎలా సాగుతోంది" అనడిగారు.
"అంతా ఓకే. త్వరగా వచ్చెయ్యండి" అన్నాను.
"సరే" అని ఫోన్ పెట్టేశారు.
నాకా కంపెనీ బాగా తెలుసు. ప్రొడ్యూసర్ కూడా తెలుసు. అందుకనే కాస్త ధైర్యం తెచ్చుకున్నాను.
శ్రీశ్రీగారు ఇంకా రాలేదు. కాల్ షీట్ అయిపోయింది.
ఆ కంపెనీలో వున్నారో లేదో తెలియదు. అయినా వెళ్ళేతోవే కదా, చూసిపోదాం అనుకున్నాను.
అమ్మతో సహా తిన్నగా ఆకంపెనీకి వెళ్ళాను. ఉదయం నుండీ గురువుగారు అక్కడే వున్నారని తెలిసింది. వారిని చూడడానికి ఎవ్వరూ అనుమతించకుండా వున్నారు. "ఎక్కడున్నార"ని అడిగితే చెప్పడంలేదు. వారిని చూస్తే కానీ వెళ్ళనని అక్కడే తిష్టవేశాను.
"పాటంతా అయిపోయినట్టే....ఆఖరి చరణం మాత్రం రాయల"ని కంపెనీ అసిస్టెంట్ అన్నాడు.
"ఇంతకీ వారేర"ని ఈసారి గట్టిగానే అడిగాను.
"భోంచేసి ఇప్పుడే పడుకున్నార"ని చెప్పాడు.
"ఇక్కడ భోంచేశారా? అంటే మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేదన్న మాట. వారెక్కడున్నారు? నేను చూడాలి. చెప్తారా లేదా....?" అని అరిచాను.
"ఎందుకమ్మగారూ! అలా కోపగించుకుంటారు. ప్రొడ్యూసర్ గారు కూడా వున్నారమ్మా-" అని ఆఫీసు గుమాస్తా అన్నాడు.
"ఏం నాయనా? శ్రీశ్రీగారికి ఇల్లూ, వాకిలీ, పెళ్ళాం, పిల్లలూ లేరనుకున్నారా?" అన్నాను.
శ్రీశ్రీగారు ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ చేస్తున్న రాచకార్యం ఏమిటో నాకు అర్ధంకాలేదు అంటూ.
ఏం చేద్దాం? ఎలా వారిని చూడడం? అని ఆలోచిస్తుండగా, కంపెనీ మేనేజర్ వచ్చారు. ఆయన నాకు బాగా తెలిసినాయన. వస్తూనే పలకరించారు.
ఆయనని ప్రశ్నలతో వేధించాక - వేరే గత్యంతరం లేక "ఆ గదిలో వున్నారమ్మా" అని తీసుకువెళ్ళారు.
"ఇంత రాద్దాంతం చేస్తేకానీ వారి ఉనికి చెప్పారు కారు. భలేవారే.....అంటూ వెళ్ళి తలుపు తెరచి చూశాను కదా - గుప్పని వాసన కొట్టింది. చాలా అప్ సెట్ అయిపోయాను.
ఏడుపొచ్చేసింది. "ఏవండీ ఏవండీ" అని పిలిచాను.
ఇంతలో కుర్రాడొచ్చి "అయ్యగారూ! అయ్యగారూ" అని లేపాడు. ఆయన లేచి, నన్ను చూసి ఉలిక్కిపడ్డారు.
* * *
