Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 51


    "ప్లీజ్ వద్దు. ఈ టైమ్ లో మనం బయటకెళ్తే ఆఫీసు మొత్తం గుసగుసలాడారు. నాకది ఇష్టం లేదు. "ఈవెనింగ్ వెళ్ళాం కావాలంటే..."
    "ఈవెనింగ్ ఊరెళ్ళాలిగా" అన్నాడు కన్ ఫర్మ్ అన్నట్టు.
    "ఊరికి మనం కల్సి...వెళ్ళాలా...?" గుండెల మీద చేతులేసుకుంటూ అంది "అమ్మో అన్నట్టు.
    "కల్సి కాకపోతే ఇద్దరం చెరో ఫ్లైట్ లో వెళ్ళాం సరేరా?" అన్నాడు కఠినత్వం గొంతులోకి తెచ్చుకుంటూ.
    "అలా అని కాదు, పెళ్ళి కాకుండా అలా ఊళ్లు తిరగడం నా కెందుకో భయం." అంది అదోలా ముఖం పెట్టి.
    "కనీసం (ఫ్రెండ్ గా రావచ్చుగా. అయినా ఏంటి నీ కళ్ళకి విలన్ గా కనపడుతున్నానా? సర్లే రాకు.... నీ ఇష్టం..."
    "పోనీ.....ప్రసూనాంబను తీసుకెళ్ళండి ఈసారికి. నేనీరోజు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. రిలేటివ్స్ అందరూ వస్తారు..." అంది తప్పించుకుంటూ.
    ప్రసూనాంబనీ, పక్కింటి పంకజాన్ని, ఎదురింటి ఎలిజబెత్ ని తీసుకెళ్తాలే...థ్యాంక్స్ ఫర్ యువర్ ఎడ్వైస్."
    "సారీ ప్రభాత్. ఈ ఒక్కసారికే..."
    "నీ ఇష్టం."
    ఇక అక్కడ ఉంటే ఘర్షణ పెరుగుతుందని ఛాంబర్ బయటకు నడిచింది ప్రనూష.
    సీట్లో కూర్చోబోతూ అనుకుంది "ఎలా అయినా ఈ రోజా శ్రీచరణ్ ఇచ్చే డిన్నర్ మిస్ కాకూడదు" అని.
    
                                                        * * *
    
    రోజులు గడిచిపోతూ ఉన్నాయి.
    కాలం ఎవరి కోసమూ ఆగదు. దానిలో ఏమార్పు ఉండదు. మార్పుండేది మనుషులలోనే. మనస్సులలోనే.
    ఎప్పుడూ ఒకేలాంటి జీవితం రొటీన్ అయిపోతుంది. మనిషి కోరుకున్న మార్పు జరిగితే సంతోషం. తలకిందులైతే నష్టాలు, కోపాలు, అవిశ్రాంతి, అశాంతి అన్నీను...
    ప్రనూష ముడుచుకు పడుకుంది.
    వళ్ళంతా వేడిగా వుంది. నోరంతా చేదుగా వుంది. రాత్రే అనీజీగా అనిపించింది. పొద్దున్నే శ్రీచరణ్ తన గదిలోకి వచ్చి "ఏమైందని?" అడిగాడు తను ఏం లేదని విసురుగా చెప్పింది.
    లేవడానికి కూడా శక్తి లేదు ప్రనూషకు.
    నిన్న జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
    ఆమె మనస్సు బాధతో మూల్గింది.
    నిన్న ఉదయం ప్రభాత్ తనని ఛాంబర్ లోకి పిలిచి...
    ఆ సంఘటన ఆమె కళ్ళకు కట్టనట్టు కనపడసాగింది.
    
                                                          * * *
    
    "రండి ప్రనూషా... మరేం లేదు....ఇవ్వాళ మనస్సు బావోలేదు. అలా వెళ్ళొద్దామా? అరే మా ఇంటికి. మా ఇల్లు కూడా చూపినట్టు వుంటుంది. ఏవుంటారు?" అడిగాడు.
    తడబడింది ప్రనూష ఏం చెప్పాలో అర్ధంగాక అప్పటికే ప్రనూష మీద గుసగుసలు మొదలయ్యాయి.
    ప్రసూనాంబ తనని చాటుకు పిలిచి, తన మనస్సులో మాట చెప్పేసింది.
    "ప్రనూషా.....నువ్వేమనుకోనంటే ఓ మాట.....మేనేజర్ తో నీ చనువు ఎక్కడికి దారితీస్తుందో...అది మంచివైపుకు అయితే ఫర్లేదు. చాలామంది పైకి కనిపించినంత మంచిగా వుండకపోవచ్చు. కామాక్షి ఇన్సిడెంట్ తెలుసుగా... నీ జాగ్రత్తలో నువ్వు వుండడం మంచిది. తర్వాత బాధపడాల్సింది మనమే. ఆనక నీ యిష్టం..."
    ప్రసూనాంబ మాటలు తేలిగ్గా తీసిపారేయలేకపోతోంది.
    మరోవైపు ప్రభాత్ ప్రేమను రెఫ్యూజ్ చేయలేకపోతోంది. ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోంది.
    "అలా కామ్ గా ఉండిపోయారేంటి? ఏమైనా ఇబ్బందా? నా మీద అపనమ్మకమా? అయితే వద్దులెండి" అన్నాడు ప్రభాత్ మొహమంతా బాధను పులుముకొని (అలా నటించి) "అబ్బే... అదెం లేద్సార్. ఆఫీసు టైంలో..."
    "ఏమవుతుంది? అయినా మనం త్వరలో కాబోయే దంపతులం...."
    ఆ మాట వినగానే ప్రనూష మొహం సిగ్గుతో ఎర్రబడింది.
    "చూశారా...అప్పుడే మీ బుగ్గలో ఎరుపు....మీ మనస్సులో సిగ్గు....ఇప్పుడు మీరెంత అందంగా వున్నారో తెలుసా...అమాంతం దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకోవాలన్నంత..."
    ప్రనూష ఏం మాట్లాడలేకపోయింది.
    "పోనీలే... నాకా అదృష్టం రావాలంటే ఇంకెంత కాలం ఆగాలో...ఎనీహౌ... ఇప్పుడు మీరొస్తున్నారా?
    "అలాగే అన్నట్టు తలూపింది.
    కానీ లోలోపల భయంగా వుంది. తను తప్ప చేస్తుందా? ఆ గిల్టీ ఫీలింగ్ ఆమెలో అలాగే వుండిపోయింది. కొన్ని తప్పులు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. కానీ, ఇది తప్పా? ఒప్పా? అన్న సమస్య ఎదురవుతే...
    ప్రభాత్ ముందుగా వెళ్ళిపోయాడు.
    ప్రభాత్ వెళ్ళిపోయిన పది నిముషాలకు ప్రనూష వెళ్ళింది. స్టాఫ్ అంతా తనని వింతగా గమనించడం అర్ధమైంది. తను వెళ్ళాక చెవులు కొరుక్కుంటారని, తన గురించి కామెంట్ చేసుకుంటారని కూడా అర్ధమైంది.
    "ఛ...తను మరీ బరితెగిస్తుందా?" అన్యమనస్కంగానే కారు ఎక్కింది.
    దారిలో ఏమి మాట్లాడలేకపోయింది.
    
                                                          * * *
    
    కారు ఖరీధైన ఆ బంగ్లా ముందు ఆగింది.
    గూర్ఖా వచ్చి ప్రభాత్ కు సెల్యూట్ చేశాడు. గేటు తెరిచాడు.
    కారు పార్క్ చేసి, ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు ప్రభాత్. అతని వెనకే అదురుతున్న గుండెలతో ప్రనూష.
    ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. ప్రభాత్ "రిచ్" అని తెలుసు. కానీ ఇంత "రిచ్ అని తెలియదు. ఆ బంగ్లా, అందులోని ఖరీదైన డెకరేషన్.
    "ఇదేనా కుటీరం ఎలా వుంది ఈ పేదవాని కుటీరం" అడిగాడు డ్రమెటిగ్గా ప్రభాత్.
    "సినిమా స్టార్ ఇల్లులా వుంది. సినిమా సెట్టింగ్ లా వుంది" ఎక్సయిట్ అయిపోతూ అంది.
    "నిజమా.....హమ్మయ్య బెటరాఫ్ కు నచ్చితే చాలు..." అంటూ ఒక్కో గది ఆమెకు చూపించసాగాడు.
    చివరగా ఓ గది తలుపు తెరిచి...
    "వెల్ కమ్.....వెల్ కమ్ టు ప్యారడైజ్..... ఇది నా స్వర్గం...." అన్నాడు.
    విశాలమైన బెడ్రూం అది.
    ఏ.సి. చల్లదనం, గదిని ఆహ్లాదంగా మార్చుతుంది.
    మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు.
    ఇంగ్లీష్ మ్యూజిక్ చెవులకింపుగా వినవస్తోంది.
    బెడ్రూం గోడల నిండా రొమాంటిక్ పెయింటింగ్స్.
    ఆ గదిలో ఎక్కువసేపు వుంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేనని అర్ధమైంది.
    "హలో.... ఏంటీ...." అంటూ తన వెనగ్గా వచ్చిన ప్రబాత్ ని చూసి ఉలిక్కిపడింది.
    "పదండి..... ఇల్లంతా చూద్దాం...." అంది అక్కడ్నుంచి వెంటనే బయటపడ్డం కోసం.
    "అదేంటి ఈ స్వర్గాన్ని వదలి వెళ్ళాలనిపించడం ఆశ్చర్యంగా వుంది" అన్నాడు ఆమె భుజం మీద చేయివేసి.
    సున్నితంగా అతని చేయి తప్పించింది.
    "ప్రనూ.....ప్రనూ డార్లింగ్. ఐ లవ్ యు..." ప్రభాత్ కంఠంలో మత్తు వినిపిస్తోంది.
    ఒక్కసారిగా ఆ పిలుపుకు ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళుగా లేని ఆ పిలుపు ఇప్పుడెలా.....తనిలా వచ్చి తప్పు చేసిందేమో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS