Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 51

 

    "హే భగవాన్! నేనెందుకు పుట్టానో నాకు తెలియదు. నా పుట్టుకతో తండ్రి ఋణాన్ని తీర్చుకునే అవకాశాన్ని కలిగించావని పొంగిపోయానే తప్ప ఇలాంటి హృదయ వేదనకు గురికావలసి వస్తుందని తెలిసి వుంటే ఎప్పుడో జీవితాన్ని చాలించి వుండేవాడిని.
    "నేను ఏ పాపం చేశానని నా తండ్రిని నా కళ్ళముందే తీసుకెళ్ళి పోయావయ్యా! తప్పటడుగులు వేసింది మొదలు చిన్న దెబ్బ తగిలినా గుండెల్లో పోడుపుకుని మాత్రుత్వపు మధురిమను రుచి చూపించిన కన్నతల్లిని నానుంచి దూరం చేశావే......! ఏ జన్మల పాపఫలమో నాకు అక్కలుగా జన్మించిన నేరానికి అనాధలుగా చేశావు....
    "ఇన్ని ఘోరాలను నా కళ్ళారా చూసి ఎలా తట్టుకోమంటవయ్యా నా జీవితానికి ఏ సాఫల్యత లేదని నువ్వే రుజువు చేశావు. అలాంటప్పుడు కన్నవాళ్ళ ప్రేమకు, ఆత్మీయత , అనురాగాలకు దూరమైనప్పుడు ఇక నేనెందుకు జీవించి వుండాలి. నా శేషజీవితానికి ఇక నిష్కృతి ఒక్కటే మార్గం.....

    "ఎలాంటి కోరికలు లేని నన్ను నా వాళ్ళ దగ్గరకే చేర్చు. ఈ అంతిమ ఘడియల్లో నిన్ను చేతులెత్తి వేడుకునే నాకు మోక్షం మార్గం చూపు. నా ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోనివ్వు....."
    కాంతికి కనిపించని దైవాన్ని వేడుకుంటున్న విష్ణు ఉన్నట్టుండి విద్యుల్లత ఏదో తాకినట్టు ఉలికిపడ్డాడు.
    అప్పుడే ఏదో గాలితెర అతని చెంపలను మృదువుగా స్పుర్శించి వెళ్ళిపోయింది.
    మరుక్షణం అతని శరీరం జివ్వుమని జలదరించింది.
    క్రిందకు దూకాలి అనే విషయమే మరచిపోయి కొన్ని క్షణాల పాటు అలానే నిలిచాడు విష్ణు.
    అప్పుడు అతని భుజాన్ని తాకిందొక అమృత హస్తం!
    అలౌకికానమ్డంతో తల తిప్పి చూశాడతను.
    తెల్లటి ముగ్గు బుట్టలాంటి తల జడలు కట్టివుంది. చేతి కర్ర సాయంతో నిటారుగా నిలుచున్నా ఆ వ్యక్తీ , పరిచయమున్నట్టు విష్ణుని చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు.
    అంత ముదుసలి ఆ కొండ ఎక్కి రావడమే విశేషం....
    పైపెచ్చు తానెవరో తెలిసినట్టు ఆ చిరునవ్వు......
    "బాబూ....నువ్వు ఎక్కడకో వెళ్ళాలని వచ్చినట్టున్నావు......."
    అయన కంఠం గంభీరంగా వుంది.
    చూడడానికి వయోవృద్ధుడైనప్పటికీ ఆ గొంతులో మాత్రం ఆ ఛాయాలేమీ కనిపించడం లేదు.
    'అవును......."ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చానన్న సంగతి చెప్పడం ఇష్టం లేక అర్ధోక్తిలో ఆపేశాడు విష్ణు.
    "ఈ పర్వతాలలో వున్న గుహలో వుండే పకీరు బాబాను నేను.....నీ సాహసం నన్ను ముచ్చట పరిచింది. అందుకని ఏం చేస్తావో చూద్దామని వచ్చాను. ఊ కానియ్! నువ్వు ఏం చేయాలని వచ్చావో ఆ పని చేసేయ్?"
    ఫకీర్ బాబా మాటలతో హేళన ధ్వనిస్తోంది.
    తను ఎందుకు వచ్చాడో తెలిసినట్టున్నాయి అతని మాటలు....
    విష్ణు తల తిప్పి చూశాడు.
    ఎక్కడో నేల అంచున వున్న చెట్లు చేమలు అతి చిన్నవిగా కనిపిస్తున్నాయి.
    కొండ లోయ పరమ భయంకరంగా కనిపించింది ఈ సారి.
    'అమ్మో.......' ఇంత ఎత్తు నుంచి దూకడమే అనే భీతి అతనిలో ప్రవేశించింది.
    "ఏం బాబూ.......భయపడుతున్నావా? చావడానికి వచ్చినవాడికి భయం ఎందుకు?"
    తన మనసులోని విషయం అతనికి ఎలా తెలిసిందో!
    విష్ణు ఆశ్చర్యపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS