Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 51


    నిజమే! స్వప్న కూడా ఆ చిత్రం గురించి వింది. చాలామంది దాన్ని పొగుడుతూ పత్రికల్లో రాస్తున్నది కూడా వింటోంది. ప్రతిరోజూ రేడియోలో ఏదో ఓ కేంద్రంలో ఎప్పుడో ఓసారి ఆ సినిమా పాట వింటుందామె! చూడాలని కుతూహలం కూడా వుంది.
    స్వప్నకి మంచి సినిమాలు చూడాలంటే భలే యిష్టం. కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఫ్రెండ్స్ తో కలసి వెళ్ళేది. మంచి పిక్చరైతే భాషా బేధం లేకుండా చూసేది. అమ్మమ్మగారి ఆజ్ఞ అనుమతి సులభంగా సంపాదించేది.
    కానీ యిప్పటి పరిస్థితి వేరు. ఆ ఫ్రెండ్స్ లేరు. ఆ అమ్మమ్మా లేదు. మళ్ళీ ఆ రోజులు రావు. పెళ్ళయిన తర్వాత తాము యిద్దరూ కలసి ఏ సినిమాకీ వెళ్ళలేదు.
    అతనికి సినిమాలంటే ఇష్టం వుండదా? సినిమాలు అసలు చూడడా? లేక తనతో రావటం యిష్టంలేక వెళ్ళటం లేదా__?
    చప్పున ఆలోచనల నుంచి బయటపడి "స్వాతీ! మీ అన్నయ్యకి సినిమాలు చూసే అలవాటు లేదా?" అని కుతూహలంగా అడిగింది.
    హఠాత్తుగా ఆలోచనల్లో పడిపోయి, అంతకంటే హఠాత్తుగా ప్రశ్నించేసరికి స్వాతికి చిత్రంగా అనిపించింది. అసలు స్వప్న ప్రశ్నే వింతగా అనిపించింది.
    "అదేం వదినా? మా అన్నాయ్ ఎందుకు సినిమాలు చూడడు. అతనికి చాలా యిష్టం!" అంది.
    స్వప్న ఏమీ అనకుండా మౌనం వహించింది.
    "వదినా? మీరు పెళ్లైన తర్వాత మెడ్రాసు, బెంగుళూరు అలా అలా వెళ్ళొచ్చారు కదా! అప్పుడు పిక్చర్స్ కి వెళ్ళలేదా?"
    తను అనవసరంగా ఆ చిన్నపిల్ల ముందు బయటపడిపోయాననిపించింది స్వప్నకి. అందుకని చప్పున "అక్కడ తెలుగు సినిమాలు ఉండవు. ఒకవేళ ఉన్నా అప్పుడు సినిమాలకి వెళ్ళేంత తీరికెక్కడిది?" అంది.
    స్వాతి గలగలా నవ్వింది.
    "సరే! రేపు మనం సినిమాకి వెళదాం. మీ అన్నయ్యని టికెట్స్ రిజర్వ్ చేయమందాం! సరేనా?"
    "నేనెందుకు? మీరు వెళ్ళిరండి!"
    "ఏం నువ్వెందుకు రావు!"
    "అబ్బ! నాకదోలా వుంటుందమ్మా, నేను రాను. మీ యిద్దరూ పోట్టాడుకున్న వాళ్ళమల్లే అసలు మాట్టాడుకోరాయె. రేపు సినిమాకి వెళ్ళినా అంతేకదా! నాకేమో అలా మౌనవ్రతం పట్టినట్టుగా వుండటం చేతవదు."
    "స్వాతీ!" గంభీరంగా పిలిచింది. "ఇది సిటీ! ఇక్కడ సినిమా హాల్లో ఎవరూ మాటాడుకోరు తెలుసా? అలా మాటాడుకుంటే పక్కవాళ్ళకి డిస్ట్రబెన్స్."
    "ఊఁ ఇంట్లో కూడా మాటాడుకోరేం మరి? మరయితే వదినా! మా వూళ్ళో మా యింటి పక్కన సీతారామారావని ఓ అతను వుండేవాడు. అతను డాక్టర్, అతని భార్య కృష్ణవేణి__అతనెప్పుడూ భార్యని కృష్ణా కృష్ణా అని పదేపదే పిలుస్తూ వుండేవాడు. వాళ్ళిద్దరూ సిజర్స్ జంటలాగా ఎంతందంగా వుండేవారని, వాళ్ళకి ఎప్పుడూ కబుర్లే! వదినా నువ్వు అన్నయ్యని జడకి కట్టేసుకున్నావనేదాన్ని నేను. అవునమ్మా మీ వదిన కృష్ణవేణి అనేవాడతను. అలా వుండాలనిపిస్తుంది నాకు. కానీ మీరేమో గంభీరంగా చెస్ చాంపియన్స్ లాగా వుండిపోతారు!"
    తన నీలాల కళ్ళని, గుండ్రంగా తిప్పుతూ అంది స్వాతి.
    స్వప్న గుండెలు దడదడలాడేయి.
    ఆమె ఏదో అనబోయేటంతలో ఆయా వచ్చి "అమ్మా! మీకు ఫోన్ వచ్చింది!" అంది.
    "ఎవరు?"
    "అడగలేదమ్మా! అర్జంటంటే పరిగెత్తుకొచ్చాను!" భయం భయంగా అంది ఆయా.
    మరి ప్రశ్నించకుండా లేచి వెళ్ళింది స్వప్న.


                                    40


    ఫోన్లో మాటాడిన వ్యక్తి తనపేరు చెప్పలేదు స్వప్నకి. ఆ గొంతుతో పరిచయం కూడా లేదు. ఎవరో శ్రేయోభిలాషినన్నాడు. ఏమిటా శ్రేయస్సు అంటే మీరే నిదానంగా తెలుసుకుంటారన్నాడు. ఏమిటా ఇంట్రెస్ట్ అంటే మీ కుటుంబం అంటే గల గౌరవం, అభిమానం, ప్రేమ అన్నాడు. తర్వాత అమ్మమ్మగారంటే వున్న గౌరవప్రపత్తులు ముఖ్యకారణం అన్నాడు.
    "సరే! విషయం ఏమిటో చెప్పండి?" చిరాగ్గా అడిగిందామె.
    "చూడండి మేడమ్! మీరు నా మాటల్ని నమ్ముతున్నట్టు లేదు. మీది చాలా పెద్ద జమీందారి. మీ ఆస్తి, మీ ఐశ్వర్యం చూసి మిమ్మల్ని మోసపుచ్చాలని చూసేవాళ్ళు ఎక్కువ!"
    "ఏమిటి సోది? ఫోన్ పెట్టెయ్యనా?" కఠినంగా అడిగింది.
    "మీ యిష్టం! నాకేం అభ్యంతరంలేదు. కానీ ఓ చిన్నమాట వినేసిన తర్వాత మీరెలాగయినా చెయ్యండి... మీకు కష్టాలు ఎప్పటినుండి ప్రారంభమయ్యాయి! ఐ మీన్ మీ టాక్సీ ఏక్సిడెంటుని కూడా గుర్తుచేసుకోండి."
    స్వప్న మాటాళ్ళేదు.
    "అది మొదలు! మీపై దౌర్జన్యం జరిగింది. మిమ్మల్ని సాధించలేక మీ అమ్మమ్మగారిని చంపేశారు."
    "అమ్మమ్మని చంపేశారా?" ఆశ్చర్యంగా అడిగింది.
    ఆ గొంతులో కనిపించిన కుతూహలాన్ని గమనించగానే తన పాచిక ఫలిస్తోందనుకున్నాడు అవతలి వ్యక్తి.
    "ఆఁ లేకపోతే ఆమె మామూలుగా చనిపోయిందనుకున్నారా? మీ అమ్మగారిని అక్కడ నర్సింగ్ హోంలో చంపేశారు. ఆ న్యూస్ ని షాకింగ్ గా అందజేశారు. తర్వాత పాయిజన్ యింజక్ట్ చేశారు. అది నేరుగా గుండెకి ఎక్కించారు. హార్ట్ ఎటాక్ వచ్చిందని నమ్మేట్టుగా చేశారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS