Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 52


    "బర్ద్ర్స్ గురించి ఇంత ఇంటరెస్టు చూపిస్తున్నారు. సైన్సెస్ చదివారా మీరు లేకపోతే భావుకత్వం...." అంది అలేఖ్య.
    నవ్వాడు సంజయ్. "కాదు కాదు భావుకత్వం కాదు. ఐయామ్ ఏ డిన్ టూ ఎర్త్ మాన్! చాలా ప్రాక్టికల్ మనిషిని నేను. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం నా ఆశయం. పక్షులైనా, పసువులైనా, మనుషులైనా సరే! బట్ యాజ్ ఏ మేటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరన్నట్లే నేను సైన్సెన్ చదివాను డాక్టర్ కావాలన్న ఆశతో కానీ డాక్టర్ ని కాలేదనుకోండి!" అతని కళ్ళలో ఒక్క క్షణంపాటు బాధమెదిలింది.
    "మరి?"
    అతను ఆ సంభాషణ ఇంక పొడిగించడం ఇష్టంలేనట్లు  "మీరు హైదరబాద్ కేనా?" అన్నాడు.
    "అవును ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళివస్తున్నాను" అంది అలేఖ్య.
    "ఎక్కడ?"
    చెప్పింది అలేఖ్య "శోభనా బెస్ట్ ఫ్రెండ్. చాలా మంచిది కానీ ఆమె పెళ్ళి శోభాయమానంగా చెయ్యాలన్న తపనతో వాళ్ళవాళ్ళు చేసిన ఆడంబరాలేనాకు నచ్చలేదు" అంది స్వగతంలా ఉన్నాయి ఆమె మాటలు.
    "ఎలక్షన్ లో ఇంత డబ్బుకి మించి ఖర్చు పెట్టకూడదానిరూలు ఉన్నట్లు పెళ్ళిళ్ళలో కూడా ఒక లిమిట్ కి మించి ఖర్చు పెట్టకూడదని శాసనంచేస్తే బాగుండు. ఒక మంగళసూత్రం, ఒక కొత్తచీరె, ఒక కొత్త సూటు, రెండు పూలదండలు, ఒకపూట విందూ బస్! అంతే! అంతకుమించి ఖర్చుచేస్తే ఆ పెళ్ళిచెల్లదని రద్దుచెయ్యాలి ఏమంటారు?" అన్నాడు సంజయ్.
    నవ్వింది అలేఖ్య "చెప్పడం సులువే! మీ మటుకుమీరు అలా అంటే జనతారకం పెళ్ళి చేసుకోగలరా? ఏమిటి?"
    "నామటుకు నేను చేసుకుని చూపిస్తాను చూస్తూ ఉండండి. మీకు తప్పకుండా కార్డు వస్తుంది. మీరు లేకుండానా పెళ్ళి జరగదు సరేనా?"
    "కట్నాలూ, లాంఛనాలూ కూడా ఏమీ తీసుకోరా?"
    "చంపేస్తానని బలవంతం చేసినా తీసుకోను! లాంఛనాలు అంటే నిజంగా జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది చెప్పనా?"
    "చెప్పండి?"
    "నా ఫ్రెండు చెల్లెలు ఒక్మమ్మాయి ఉంది. బాగా చదువుకుంది. పెద్ద కట్నంతో గొప్ప లాంఛనాలతో ఒక సంబంధం సెటిల్ చేశారు. తీరా పీటలమీద కూర్చున్న తర్వాత స్కూటరు కూడా ఇస్తేగానీ తాళికట్టనన్నాడు వరుడు.
    అమ్మాయి తరపువాళ్ళు తల్లడిల్లిపోయి అప్పటికప్పుడు డబ్బు ఆప్పుతెచ్చి బ్లాక్ లో స్కూటర్ కొని అరగంటలో పెళ్ళిపందిట్లో నిలిపారు. అప్పుడు ప్రసన్నవదనంతో పెళ్ళికూతురు మెడలో తాళి కట్టడానికి లేచాడు వరుడు.
    అప్పటిదాకా మెదలకుండా కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్న ఆ అమ్మాయితోక తొక్కిన తాచులాబుస కొడుతూ లేచి 'తాళి నాకు కాదు. ఆ స్కూటర్ కి కట్టు!' అని విదిలించి కొట్టి విసవిసా నడిచివెళ్ళిపోయింది. ఆ అమ్మాయిలా అందరు అమ్మాయిలూ ధైర్యంగా ఎదురు తిరిగే రోజువస్తే నేను పర్సనల్ గా చాలా సంతోషిస్తాను."
    అతని మొహంలోకి చూసింది అలేఖ్య. అతని పెదిమలు పట్టుదలని సూచిస్తూ వంపు తిరిగివున్నాయి. అతని చూపులు అప్రయత్నంగానే ఆమె చూపులతో కలిశాయి.
    అయినా వెంటనే కళ్ళు తిప్పుకోలేదు అలేఖ్య. కొద్ది క్షణాలపాటు అతనివైపు చూస్తూ ఉండిపోయింది. అతనూతదేకంగా ఆమెవైపు చూస్తున్నాడు. "హైదరాబాద్ వచ్చేస్తోంది" అన్నాడు అతను నెమ్మదిగా ట్రైన్ అప్పటికే గంట లేటు.
    కానీ ఇంకో గంట లేటయితే బావుండనిపిస్తోంది ఇద్దరికీ. అయితే ఎవరూ ఆ  మాట పైకి అనలేదు.
    రైలు స్టేషన్ లో ఆగింది.
    వెంటనే ఫ్లాట్ ఫారం మీద రెడీగా నిలబడ్డ పోలీసులు కనబడ్డారు అలేఖ్యకి. ఎవరినో వెదుకుతున్నట్లు ఉన్నారు వాళ్ళు.
    "పోలీసులు!" అన్నాడు సంజయ్ నిర్లిప్తంగా "ఎదురు చూస్తున్నారు నాకోసం!"
    అదిరిపడింది అలేఖ్య. "ఎందుకు?" అంది గాభరాగా.
    "పోలీసులు ఎందుకు వస్తారు? పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళడానికి. వీళ్ళను తప్పించుకునే ప్రయత్నంచెయ్యడం ఇంక నిష్పలం అనుకుంటాను ఓకే. ఇదినా విజిటింగ్ కార్డ్! ఉంచండి!" అని కార్డు ఇచ్చాడు.
    ఆకార్డువైపు చూడలేదు అలేఖ్య. ఫ్లాట్ ఫారం మీద ఉన్న పోలీసులనే చూస్తుంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి భయంతో.
    సూట్ కేస్ పట్టుకుని ఫ్లాట్ ఫారం మీదికి దిగాడు సంజయ్.
    వెంటనే ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లూ, ఆరుమంది సబ్ ఇన్ స్పెక్టర్లూ, పదిమంది కానిస్టేబుళ్ళూ అటెన్షన్ లో నిలబడి సెల్యూట్ చేశారు. ఆశ్చర్యంతో నోటమాట రాలేదు అలేఖ్యకి. అప్పుడు చూసింది చేతిలో ఉన్న విజిటింగ్ కార్డుని.
    "ఆర్. సంజయ్ కుమార్.
    ఓ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్
    హైదరాబాద్" అని ఉంది దానిమీద.
    బయటనుంచి చూడటానికి చాలాసాదాగా కనబడుతోంది ఆ పోలీసు స్టేషను బిల్డింగు. దానిలోకి అడుగుపెట్టి ఒక గంట గడిపిన వాళ్ళకి గానీ దాని పవర్ ఏమిటో పూర్తిగా అర్ధం కాదు. దానిలోకి అడుగుపెట్టవలసిన అవసరం తమ జీవితంలో రాకూడదని జనాభాలో ఎక్కువశాతం మంది అనుకుంటూ ఉంటారు. ఆ పోలీసు స్టేషనులో ఉండే మనుషులు తమ జీవితంలోకి తొంగి చూడకూడదని కూడా చాలామందికి కోరిక ఉంటుంది.
    పోలీసు స్టేషను ముందు ఆగింది జీపు. అందులోనుంచి దిగుతున్న అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ ని చూడగానే అక్కడ తుపాకి పట్టుకుని యమభటుడిలా నిలబడి ఉన్న కానిస్టేబుల్ అటెన్షన్ లోకి వచ్చాడు. తలపంకించిలోపలికి నడిచాడు సంజయ్. సబ్ ఇన్స్ పెక్టర్లూ, అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్లూ సీట్లలో నుంచి లేచి నిలబడ్డారు. సర్కిల్ ఇన్స్ పెక్టరు నాగరాజ్ గౌరవ పురస్కారంగా ఎదురొచ్చి సంజయ్ కి స్వాగతం చెప్పాడు.
    "బంగళావసతిగా ఉందా సర్?" అన్నాడు నాగరాజ్ వినయంగా.
    "యస్! యస్! ఎవిరిథింగ్ ఈజ్ జస్ట్ ఫైన్!" అంటూ చుట్టూతా చూశాడు సంజయ్ కొద్దిగా డిమ్ గా, చిరుచీకటిగా ఉంది అక్కడి వాతావరణం. ఒకవైపు వైర్ లెస్ లో నుంచి రేడియో వార్తలలాగా మెసేజెస్ వస్తున్నాయి. లాకప్ రూంలో నుంచి కటకటాలను ఆనుకుని ఇద్దరి మనుషులు బోనులోపడ్డ జంతువులలాగా నిలబడి చూస్తున్నారు.
    కర్టెన్ తొలగించుకుని లోపలికి వచ్చాడు సంజయ్. అక్కడ అసిస్టెంట్ కమీషనర్స్ ఆఫీస్ ఉంది.
    పోలీస్ స్టేషనూ, అసిస్టెంట్ కమీషనర్స్ ఆఫీసూ ఒకే బిల్డింగులో ఉండడంతప్పనిసరి కాదు. కానీ అక్కడ అలా కుదిరిపోయింది.
    వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు సంజయ్.
    అతను సీటు ఆఫర్ చేసిన తర్వాత తను కూర్చున్నాడు నాగరాజ్. ఆ సీటు ఆఫర్ చెయ్యడానికి పట్టిన కొద్ది సెకండ్ల వ్యవధిలో కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాడు అతను. రెండు దశాబ్దాల సర్వీసు తర్వాత తను ఈ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పోస్టులోకి వచ్చాడు. తన వయసులో సగం ఉన్నట్లు కనబడే ఈ యంగ్ ఏసీపీ ఇండియన్ పోలీసు సర్వీసుకి సెలెక్ట్ అయి డైరెక్టుగా పెద్ద పోస్టుకి వచ్చినవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS