"అయ్యలారా! కడుపుకోసం దొంగతనాలు చేస్తాం మేం. మా కడుపులు కొట్టితినే గజదొంగలు పోలీసులు. మేము దోపిడీ చేసినప్పుడల్లా బస్సుకి మూడువేలరూపాయల చొప్పున పోలీసులకి మామూలు ఇవ్వాలి.
ఇవాళ మీ అందరి దగ్గరా ఉన్న డబ్బంతా కలిపి నా రెండువేలు లేదు. ఈ దోపిడీ గనక చేశామంటే మాకు దమ్మిడీ రాకపోగా పైగా మేమే పోలీసులుకు వెయ్యి రూపాయలు ఎదురుకట్టాల్సివస్తుంది. మా దారినమమ్మల్ని ఇట్లాపోనియ్యండి నాయనల్లారా" అని బస్సు దిగి వెళ్ళిపోయారు.
నవ్వింది అలేఖ్య.
అతనుకూడా "గుడ్ నైట్" అన్నాడు.
"గుడ్ నైట్!"
అతను వెళ్ళిపోయాక ఒక యాపిల్ పండు తిని మంచినీళ్ళు తాగి తలుపులు వేసి లైట్లు ఆర్పేసి డిమ్ గా ఉన్న లేతనీలంరంగు నైట్ లాంప్ వేసిపడుకుంది అలేఖ్య. రైలు కుదుపు ఉయ్యాలలా ఊపుతుంటే ఆమెకి త్వరగానే నిద్ర పట్టేసింది.
పొద్దున తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. మెలకువ రావడంతోనే కాఫీ గుర్తు వచ్చింది అలేఖ్యకు. నిద్రలేవగానే కాఫీ తాగకుండా ఉండలేదు తను. నెక్స్ ట్ స్టేషన్ లో కాఫీ దొరకవచ్చా?
ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయింది. తలుపు తెరిచింది అలేఖ్య. రైల్వే కేటరింగ్ సర్వీస్ బాయ్ నిలబడి వున్నాడు. అతని చేతిలో ఒక ట్రే. అందులో అందమైన పింగాణీ కప్పులు ఉన్నాయి. ఒక చిన్న జగ్గులో డికాక్షన్, మరొక జగ్గులో పాలూ, ఒక చిన్న బవుల్ లో షుగర్ క్యూబ్ లు ఉన్నాయి. ఒక ప్లేటులో శాండ్ విచెస్ ఉన్నాయి. వాటన్నిటిమీదా అతి పల్చటి లేసుగుడ్డ కప్పి వుంది.
ప్రశ్నార్ధకంగా చూసింది అలేఖ్య.
"కాఫీ అమ్మా! సాబ్ ఇవ్వమన్నారు"
"ఎవరు?"
"ఆసాబ్!" పక్క కంపార్టుమెంట్ వైపు చూపించాడు ఆ బాయ్.
రాత్రి తనతో మాట్లాడిన అతనే అవి పంపిఉంటాడని అర్ధం చేసుకుంది అలేఖ్య.
రైల్వేవాళ్ళూ ఇంత మర్యాదగా సర్వీసు చేస్తున్నారంటే అతనికి చాలా పరపతి ఉండి ఉండాలి.
"థ్యాంక్స్! అక్కడ పెట్టు" అని చెప్పి బ్రష్షుమీద పేస్టు వేసుకుని బాత్ రూం వైపు నడిచింది.
అప్పటికీ అతను షేవ్ చేసుకుని బట్టలు మార్చుకుని ఫ్రెష్ గా కనబడుతున్నాడు. అప్పుడు మొదటిసారిగా గమనించింది అలేఖ్య. అతను చాలా పొడుగు బలిష్టంగా ఉన్నాయి భుజాలు. చిన్నప్పటినుంచి క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేసినట్లు కండలు తిరిగి ఉంది శరీరం.
"మీకు అనవసరంగా శ్రమ ఇస్తున్నట్లున్నాను" అంది అపాలజెటిక్ గా.
"నాటెటాల్! ఇటీ జె ప్లెజర్!" అన్నాడతను చిరునవ్వుతో.
ఆమె మొహం కడుక్కుని వచ్చేసరికి ఆమెసీట్లో న్యూస్ పేపర్ పెట్టివుంది. కాఫీ సిప్ చేస్తూ శాండ్ విచెస్ ని మునిపంటితో కొరకుతూ పేపరు చదువుతూ మధ్యమధ్యలో తలెత్తి పరుగెత్తిపోతున్నట్లు కనబడుతున్న స్థంభాలను చూడడంచాలా ఆహ్లాదకరంగా ఉంది.
హఠాత్తుగా అతను తలుపు దగ్గరకనబడ్డాడు.
"మీరు కూడా చూశారా?" అన్నాడు అతని గొంతులో ఎక్సయిట్ మెంట్ వినబడుతోంది.
"ఏమిటి?" అంది తెల్లబోతూ.
"పక్షి! ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్!"
"ఎక్కడ?"
"అక్కడరాళ్ళమీద కూర్చుని వుంది అదిగో అక్కడ!"
"ఎక్కడ?" అంది అలేఖ్య మళ్ళీ ఆమెకు అదీ కనిపించలేదు.
ఎగ్జయిట్ మెంట్ తో అతను తన మేనర్సుని ఒక్క క్షణంపాటు మర్చిపోయినట్లున్నాడు. ఆమె మీదుగా ఒంగి కిటికీలోనుంచి చూపించాడు. 'అదిగో అక్కడ! మూడు పెద్ద బండరాళ్ళున్నాయే? వాటి వెనక నల్లటిగుండు. దానిమీద మార్వెలస్!"
"అరెఅరెఅరె! అవిగో గుంపు అయిదు పక్షులు దిసీజ్ సింప్లీ సెన్షేషనల్! గవర్నమెంటుకి రిపోర్టు చెయ్యాలి. అవిగో ఇంకో రెండు మొత్తం ఎనిమిది!"
బలంగా వున్న అతని భుజం మృదువుగా వున్న ఆమె భుజానికి ఒరుసుకుంటోంది. అతని ఆఫ్టర్ షేవ్ లోషన్ పరిమళం ఆమె నాసికాపుటాలకి సోకుతోంది. ఇబ్బందిగా కొద్దిగా పక్కకు జరిగింది అలేఖ్య. ఇప్పుడు ఆమెకి కనబడుతున్నాయి ఆ పక్షులు.
"మనం వెళ్ళీ వెళ్ళగానే వెంటనే రిపోర్టు చెయ్యాలి!" అన్నాడు అతను అక్కడే సీట్లో కూర్చుంటూ. పక్షులు కనుమరుగైపోయాయి.
"దిగ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్!" అన్నాడు అతను అలేఖ్యతో కలవరిస్తున్నట్లు. "చాలా అరుదైన పక్షులు అవి. డోడో అన్న పక్షిలాగా ఈ జాతి కూడా అంతరించిపోతోందని భయపడుతున్నారు శాస్త్రజ్ఞులు. రాజస్తాన్ లో కొద్ది పక్షులు మాత్రమే మిగిలివున్నాయ్. మొన్న మొన్నరాయలసీమలో కొన్ని కనబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఎనిమిది! తెలుగులో బట్టమేక పక్షులంటారు వినలేదా మిస్?"
"విన్నాను కానీ చూడడం ఇదేమొదటిసారి" అంది అలేఖ్య.
"ఫాంటాస్టిక్ కదూ?"
అవునన్నట్లు తలవూపింది అలేఖ్య.
"గవర్నమెంటుకి రిపోర్టు చెయ్యడంతోబాటు సలీం ఆలీకి కూడా కబురుచెయ్యడం అవసరం. సలీం ఆలీగారు మీకు తెలుసా? బర్డ్స్ మీద ఎక్స్ పర్టు ఆయన!"
"విన్నాను!"
"నాకు పక్షులంటే చాలా ఇంటరెస్టు. ఒకసారి ఆయన్ని మీటయినప్పుడు ఆయన నాతో అన్నారూ 'చూడుసంజయ్....."
"సంజయ్" అన్నమాట ఇతనిపేరు అనుకుంది అలేఖ్య. అతను సలీం ఆలీగురించి, బర్డ్స్ గురించీ ఏదో చెబుతూనే ఉన్నాడు, కానీ ఏకాగ్రతతో వినలేక పోతోంది అలేఖ్య. అతనివైపు మాత్రం తదేకంగా చూస్తోంది.
అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నాడు అతను. అమితాబ్ వాయిస్ లాగే చాలా చక్కటిగొంతు ఇతనిది.
"మీరు బాస్కెట్ బాల్ ఆడతారా?" అంది ఉన్నట్లుంది.
అతను చిత్రంగా చూశాడు.
"ఆడతాను ఎందుకనుకున్నారు అలాగ?"
చిరునవ్వు నవ్వింది అలేఖ్య "మొదటిది మిమ్మల్ని చూడగానే స్పోర్ట్స్ మన్ అనిపిస్తుంది. రెండు మీరు చాలాపొడుగు కాబట్టి బాస్కెట్ బాల్ ఆడితే సునాయాసంగా పాయింట్సు స్కోర్ చెయ్యగలరు?"
"వెరీగుడ్! ఆడపిల్లలు రొమాంటిక్ గా తప్ప హేతువాదంతో ఆలోచించరనే ఒక అపవాదు ఉంది. దాన్ని తప్పని నిరూపించారు మీరు" అన్నాడతను నవ్వుతూ.
