* * * *
సమయం రాత్రి పదకొండు గంటలు!!
సర్వోత్తమరావుఇంట్లో ఎవరూ పడుకోలేదు....అందరి మనసులు అందోళనగా వున్నాయి. సోమసుందరం ఇంకా రాలేదేంటిఅనే అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
శివపార్వతి అయితే ఏడుస్తూ కూర్చుంది. దాక్షాయణి ఆమెను ఒదార్చుతుంది.
"ఛ! ఏంటే పిచ్చి మొద్దు...ఎందుకు ఏడుస్తావ్? వచ్చేస్తాడ్లే. ఏదో పనుండి పట్నంలో ఆలస్యమయి వుంటుంది. ఈమాత్రం దానికే ఏడవాలా?" అంటూ ఆమెకు ధైర్యం చెపుతోంది.
మాధవరావు ఆలోచనలు మాత్రం వేరేవిధంగా వున్నాయి. వాడు ఖచ్చితంగా దాని కొంపకే వెళ్లుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావటం బావుంటుందా?
నన్ను ఈ సమయంలో అక్కడ చుస్తే వాడు ఏమనుకుంటాడు? అసలు ఏమాత్రం ఉహించని పరిణామం , దరిద్రుడు! ఇన్నాళ్ళు దాని దగ్గరకు వెళ్ళినా రాత్రికి తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు రాత్రిళ్ళుకూడా దాని దగ్గరే పడుకుంటున్నాడన్నమాట.....ఇప్పుడు వెళ్ళి తీసుకురావటమే మంచిదేమో....లేకపోతే రేపు పొద్దుటే వాడే వస్తాడు కదా, ఇంత రాత్రి వేళ అక్కడకు నేను వెళ్ళటం, నా పరువుతక్కువ అవుతుంది. వెళ్ళకపోవటమే మంచిది.
"ఏంట్రా మాధవా! నువ్వెళ్ళి చూసి వస్తావా? వాడు యింకా రాలేదెంట్రా?" అన్నాడు సర్వోత్తమరావు అందోళనగా.
"ఎక్కడని చూసేది అన్నయ్యా" అన్నాడు మాధవరావు.
"సెంటర్ వరకు వెళ్ళిరా. ఏమయిందో ఏమిటో , ఎప్పుడూ వాడు ఇంత ఆలస్యంగా రాలేదు" అన్నాడాయన అందోళనగా.
మాధవరావు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు అన్నయ్య వెళ్ళమంటున్నాడు కనక వెళ్ళక తప్పదు. నాకయితే తెలుసు వాడు ఎక్కడ వుండేది. పాపం వీళ్ళకు తెలిదుకదా....అందుకే ఆ విధంగా అందోళన చెందుతున్నారు అనుకుంటూ బయలుదేరాడు.
"దాక్షాయణి! నేను అలా సెంటర్ వరకు వెళ్ళివస్తాను" అంటూ మోటర్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.
తిన్నగా పట్నం పోనిస్తున్నాడు. ఎటుతిరిగి బయటకు వచ్చాం.....వాడి దగ్గరికే వెళ్ళి నాలుగు చివాట్లు పెట్టి, తీసుకురావటం మంచిది అనుకుని పట్నం బయలుదేరాడు. మోటర్ సైకిల్ ఆ నిశిరాత్రిలో స్పీడ్ గా దూసుకుపోయింది.
27
వరాలు ఇంటి గేటు దూకింది ఓ ఆకారం!
మెల్లగా అడుగులు వేస్తూ పెరటి గుమ్మం వేపు వెళ్ళింది. అక్కడ తలుపు నెట్టి చూసింది. తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ ఇంటిముందు వరండాలోకి వచ్చి కిటికీలో నుంచి లోపలికి తొంగిచూసింది. లోపల మసకమసక చీకటిలో సోమసుందరం మంచం పై పడుకుని వుండటాన్ని గమనించింది ఆకారం. కిటికీలోంచి చేయిపెట్టి లోపలి తలుపు బోల్టు తీయటానికి ప్రయత్నించింది. బోల్టు చేతికి అందింది గానీ....ఎంతకీ నట్టు దొరకటం లేదు బోల్టు తీయటానికి. కాసేపు అలానే తంటాలు పడిన తరువాత తలుపు బోల్టు వచ్చింది. ఆ ఆకారం తృప్తిగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. బోడ్డులోంచి కత్తి తీసి వరాలు నోరునొక్కి, బలంగా గుండెల్లో దించింది. వరాలు కాసేపు పెనుగులాడి క్రమంగా అచేతనంగా ఉండిపోయింది. గుండెల్లో దింపిన కత్తిని సుందరం చేతిలో పెట్టి, లైటు వేసింది ఆకారం ఆ దృశ్యాన్నీ తృప్తిగా చూసుకుని లైటు అర్పి, లోపల తలుపు బోల్టు వేసి పెరటి గుమ్మంలో నుంచి బయటకు వచ్చి వీధి గేటు దూకి చీకటిలో అదృశ్యమయిపోయింది.
* * * *
మాధవరావు సగం దూరం వచ్చి బండి ఆపాడు. జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి, కాసేపు ఆలోచించాడు.....ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళటం ఏమాత్రం మంచిది కాదు. రేపు వాడు నా ముఖం చూడలేడు. సిగ్గుతో చితికిపోతాడు. రేపు పొద్దుటే తప్పకుండా వస్తాడు. ఒకవేళ వాడు దాని ఇంట్లో ప్రస్తుతం లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ఏమని అడుగుతాం?! అందుకే తిరిగి ఇంటికి వెళ్ళటమే శ్రేయస్కరం అనుకుని సిగరెట్ పారేసి, బండిని వెనక్కి తిప్పి ఇంటివేపు పోనిచ్చాడు మాధవరావు.
అప్పుడు సమయం సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు!
* * * *
వరాలకు హత్య చేసిన ఆకారం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి హత్య గురించి ఫోన్ లో వివరించి ఫోన్ పెట్టేసింది.
పోలీసులు వెంటనే జీప్ లో హుటాహుటిన హత్య జరిగిన స్థలం దగ్గరకు బయలుదేరారు.
వరాలు ఇంటి ముందు పోలిస్ జీప్ ఆగింది.
ఆ హడావుడికి చుట్టుపక్కల ఇళ్ళవారు మేల్కొని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
పోలిసులు మెయిన్ తలుపు నెట్టారు. అది లోపలి నుంచి బోల్టు పెట్టి వుండటంతో పెరటి వేపుకు వెళ్ళారు. అక్కడ తలుపు నెట్టగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి వెళ్ళి లైటు వేసి చూడగానే, కన్పించిన దృశ్యం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
* * * *
సమయం ఉదయం ఆరుగంటలు.
కస్తూరి అప్పటికే లేచి స్నానం చేసి, పూజ ముగించి, వంటగదిలో కాఫీ పెడుతుంది.
శివపార్వతికి రాత్రంతా కంటిమీద కునుకులేదు.
దాదాపు అందరి పరిస్థితి అలానే వుంది.
రాత్రి మాధవరావు ఒంటరిగా తిరిగి రావటంచూసి వాళ్ళు దిగులుగా కూర్చున్నారు.
రామశేషుకు జ్వరం తగ్గలేదు. పంతులు ఇచ్చిన ఏవో మాత్రలు వాడుకున్నారు.
జయంతి వీధిగుమ్మంలో ముగ్గు వేస్తుంది.
వీధి చివర పొలీస్ జీప్ చూసి ఆమె ఆశ్చర్యంగా చూసింది.
జీప్ వచ్చి ఇంటిముందే ఆగింది.
జయంతి అలానే చూస్తుంది.
"ప్రెసిడెంటుగారు వున్నారా అమ్మాయ్?" ఇన్స్ పెక్టర్ అడిగాడు.
"ఉన్నారండి" అంటూ లోపలికి పరుగుతీసింది.
లోపలికి వెళ్ళి సర్వోత్తమరావుకు చెప్పింది.
"నాన్నా! మనింటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు" అంది.
వాలుకుర్చిలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న సర్వోత్తమరావు కూతురు మాటలకు ఉలిక్కిపడ్డాడు.
"ఎంటమ్మా నువ్వనేది! పోలీసులా?" అన్నాడు.
ఇంతలో పోలీసులు లోపలికి వచ్చారు.
గొడ్లచావిడిలో గేదెలను శుభ్రంగా కడుగుతున్న వెంకటేశం పోలీసులను చూసి నోరు తెరిచాడు.
"ఏంటి ఇన్స్ పెక్టర్ ఇలా వచ్చారు....?" అన్నాడు గంభీరంగా సర్వోత్తమరావు.
"సారీ సర్! మీకో విషయం చెప్పటానికి వచ్చాం" అన్నాడు ఇన్స్ పెట్టార్.
"కూర్చోండి" అంటూ తనూ వాళ్ళకేదురగా కుర్చీలో కూర్చుంటు అన్నాడు సర్వోత్తమరావు.
శివపార్వతి కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి.
మాధవరావు, దాక్షాయణి వారి నోటినుంచి ఏం వినాల్సివస్తుందోనని భయంతో చూస్తున్నారు.
రామశేషుకు ఇదేమి అర్ధంకాలేదు, అయన అసలే నీరసంగా వున్నాడు.
జయంతి తల్లి భుజం మీద గెడ్డం ఆనించి భయంతో చూస్తుంది.
