పాలు ఎలా తేవాలా అని ఆలోచిస్తూ జితేంద్ర గదిలోకి వెళ్ళింది.
"గుడ్ మార్నింగ్ మీరు ఇక్కడే వున్నారా?" అతను ఆమెకి విష్ చేసి అడిగాడు.
"ఆ"
"ఇది నర్సింగ్ హోమా?" పక్కన పరిశీలిస్తూ అడిగాడు.
"అవును" అని ప్రారంభించి మొత్తం జరిగిందంతా చెప్పింది.
"మీకు చాలా కష్టం కలిగించానే" అతను బాధపడిపోయాడు. తనకు పాము కరిచింది అన్న విషయం కన్నా ఆమెను రాత్రంతా ఇబ్బంది పెట్టానన్న బాధ అతన్ని తొలుస్తోంది.
"మరి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలానే అవుతుంది. అంత రాత్రి పూట వచ్చి శుభాకాంక్షలు చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి?" ఆమె చిరుకోపాన్ని ప్రకటించింది.
"మీ అంత అందమైన అమ్మాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా వుండడమే" అతను నవ్వుకున్నాడు.
"సంతోషించాంలే ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులో! ఖర్చు కూడా దాదాపు మూడువేల రూపాయలు అయ్యాయి."
"ఆ డబ్బు తీరేవరకు మీ ఇంట్లో పనిచేస్తాలెండి"
"మా ఇంట్లోనా?"
"ఆ! ఇప్పుడు చిన్నస్వామి ఇంట్లో చేయడం లేదూ- అలానే"
"అంటే మా ఇంట్లో పేడా చెత్తా వూడుస్తావా? ఎందుకొచ్చిన కష్టం ఇదంతా కేవలం వాళ్ళింట్లో వుండనిచ్చినందుకు గాడిద చాకిరీ చేస్తున్నావ్. హాయిగా మీ వూరికే వెళ్ళిపోకూడదు"
"అది నావల్ల కాని పని మిమ్మల్ని చూడకుండా వుండలేను" స్థిరంగా చెప్పాడతను.
ఆమె ఏదో చెప్పబోయింది కానీ అది సమయం కాదనిపించింది. ఇలాంటప్పుడు అతని మనసుకు కష్టం కలిగించే మాటలు చెప్పడం బావోదు.
"సరే-పాలు తీసుకొస్తాను వుండు" అని బయటికి వచ్చింది.
హాల్లో దాదాపు పదిమంది పేషెంట్ల దాకా వున్నారు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళతో గందరగోళంగా వుంది.
ఓ మధ్య వయస్కురాలయిన స్త్రీ దగ్గరికి వెళ్ళి "మీ దగ్గర ఫ్లాస్కు వుందా?" అని అడిగింది.
ఆమె లిఖితను ఎగాదిగా చూసి సంతృప్తి చెందినట్లు ముఖంలో రంగులు మార్చి పక్కనున్న సంచిలో నుంచి ఫ్లాస్కును బయటికి లాగి ఇచ్చింది.
"త్వరగా రామ్మా! మీరు వచ్చాక మేం కాఫీకి పంపించాలి...." అంది.
లిఖిత అలాగేనన్నట్టు తలవూపి ఫ్లాస్కు తీసుకుని టీ అంగడికి బయలుదేరింది.
అక్కడి నుంచి టీ సెంటర్ కి రెండు ఫర్లాంగుల దూరముంటుంది.
అప్పటికి బాగా తెల్లవారిపోయింది. వెలుగుకి భయపడ్డ చీకట్లు స్త్రీల కురుల్లోనో, వాళ్ళ నల్లటి కనుపాపల్లోనో దాక్కోవడానికి వెళ్ళిపోయినట్టున్నాయి. గాలి పాలకుర్రాడిలాగా వేగంగా వీధుల్లో తిరుగుతోంది.
టీ కొట్టుకెళ్ళి రెండు గ్లాసుల పాలు తీసుకుని తిరిగి క్లినిక్ కి వచ్చింది.
రెండు యూజ్ అండ్ త్రో గ్లాసులు కొనుక్కొచ్చింది. వాటిలో పాలు నింపుకుని ప్లాస్కు తిరిగి ఇచ్చివేస్తూ "చాలా సహాయం చేశారు" అంది.
"దాన్దేముందిలేమ్మా" అని అంటూ ప్లాస్కు తీసుకుని "ఆ అబ్బాయికి పాము కరిచిందటగా ఇంతకీ అతను నీకేం అవుతాడు" అని అడిగింది ఇల్లాలు.
గ్లాసులు తీసుకుంటూ "అదే తెలియడం లేదు...." అని నవ్వింది లిఖిత.
"అమ్మో చోద్యం" అంటూ ఆ ఇల్లాలు బుగ్గలు - నొక్కుకోవడం గమనించనట్టే రూమ్ లోకి నడిచింది లిఖిత.
"పాలు" అంటూ ఓ గ్లాసును అతని కందించి అతని కెదురుగ్గా వున్న కుర్చీలో కూర్చుంది.
అతనూ, ఆమె పాలు తాగడం ప్రారంభించారు.
వెచ్చగా పాలు గొంతులోంచి దిగుతుంటే ఇద్దరికీ ప్ర్రాణం లేచినట్టుంది.
"ఏమిటి మీకు మీరే నవ్వుకుంటున్నారు" అని అడిగాడు జితేంద్ర ఆమె పెదవుల మీద పాలనురగతో పాటు చిరునవ్వు పారడం చూసి.
"నువ్వు నాకేం అవుతావని ఓ ఇల్లాలు అడిగితే, అది నాకూ తెలియడం లేదు అన్నాను. అది తలుచుకుంటే నవ్వొచ్చింది" అని ఆగి ఆ తరువాత "ఇంతకీ నువ్వు నాకేమౌతావ్?" అని ప్రశ్నించింది.
"మీరు ఎలా అనుకుంటే అలా" అన్నాడు.
"నువ్వు చెబితే గదా మొన్న ఏదో అంటూ మధ్యలో ఆపేశావ్....."
"మరి ఏం చేయను? పదానికి వంద రూపాయలు ఇవ్వాలన్నారు. నా దగ్గరేమో కేవలం రెండు వందలున్నాయి. అందుకే రెండు పదాలే వదిలేశాను"
"మరి ఇప్పుడు చెప్పు- డబ్బు షరతు లేదులే"
అతను సర్దుకున్నాడు. తన మనసులోని ఆ మూడు మాటలనూ చెప్పడానికి అతఃను శరీరంలోంచి శక్తినంతా కూడదీసుకున్నట్టు కదిలాడు.
"నేను మిమ్మల్ని....." ఆమె కళ్ళలోకే చూస్తూ చెబుతున్న అతను ఎవరో వచ్చినట్టనిపించడంతో ద్వారం కేసి తల తిప్పాడు.
రంగనాయకి లోపలికి వస్తోంది.
ఆమెను చూడగానే నాలుకలోని తడి అంతా ఆరిపోయినట్టు మాట బయటికి రాలేదు.
అతను మధ్యలోనే ఎందుకు ఆపేశాడో తెలియని లిఖిత అతను చూస్తున్నవైపుకి చూడడానికి తల తిప్పింది.
రంగనాయకి లోపలికి వస్తూ "తెల్లవారుజామున మీ నాన్న వచ్చి చెప్పాడు. దాంతో హడావుడిగా బయల్దేరి ఫస్ట్ బస్ కి వచ్చాను" అంది.
అలా అతను తను చెప్పాలనుకున్నది రెండోసారి మిస్సయ్యాడు.
రంగనాయకి రావడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యింది లిఖిత. ఎవరూ లేకపోతే వెర్రిమొర్రి ఆలోచనలు మనసును పీక్కు తినేస్తాయి. కానీ రంగనాయికి వచ్చిన టైమే సరైంది కాదు. మరో అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే జితేంద్ర తనతో చెప్పాలనుకున్నది చెప్పేవాడు. ఈసారి తను మిస్సయ్యింది. అతని నోటివెంట తను ఏం వినాలనుకుంటోంది? అతను తనను ప్రేమిస్తున్నానని చెబితే తన అన్వేషణ పూర్తయినట్టు అనిపిస్తుందేమో ప్రేమ కోసం తను అంతగా మొహం వాచి పోయిందా?
