"ఎదురుగా మనిషున్నా ఎక్కడో వున్నావే" రంగనాయికి అనడంతో ఈ లోకంలోకి వచ్చింది లిఖిత.
మాటల తూటాలకు ఆలోచనల పావురాళ్ళు ఎగిరిపోయాయి.
"ఏంలేదు- ఒంటరితనంతో విసిగిపోయాను. నువ్వు రావడం హాయిగా వుంది. రా కూర్చో" అంటూ తన పక్కనున్న స్టూల్ ని ముందుకి జరిపింది.
"ఇంతకీ ఎలా వుంది?" జితేంద్ర ను చూస్తూ అడిగింది.
"ప్రమాదం తప్పింది. సాయంకాలమో, రేపో ఇంటికి పంపించేస్తారు" లిఖిత చెప్పింది. అతను చిన్నగా నవ్వుతూ వుండిపోయాడు.
"పోనీలే అంతా దేవుని దయ, ఏమయ్యిందో ఏమోనని హడావుడిగా పరిగెత్తాను"
"నువ్వు రావడం మేలయ్యింది. రా టిఫిన్ తీసుకొద్దాం" అని రంగనాయకిని లేవదీసింది.
హాస్పిటల్ కి ఎదురుగానే చిన్న హోటలుంది. అందులోకి వెళ్ళి ముగ్గురికి టిఫిన్ తీసుకొచ్చారు.
టిఫిన్ చేయడం పూర్తవుతుండగా నర్స్ వచ్చి "మీరు పైనున్న గదిలోకి మారిపోండి. డాక్టర్ చెప్పారు" అంది.
"ఇక్కడేమిటి ఇబ్బంది?" రంగనాయికి అడిగింది.
"కిందయితే గందరగోళంగా వుంటుంది. పైన ఒకే గది వుంది. మీకు బావుంటుందనే డాక్టర్ గారు రూమ్ మార్చమన్నారు" నర్స్ వివరణ ఇచ్చింది.
"అలా అయితే ఓకే" అని జితేంద్రను తీసుకుని పైగదికి వెళ్ళారు.
నిజంగానే బావుంది గది ఒకటే గది వుండడంతో హాస్పిటల్ వాతావరణం లేదు. గందరగోళం లేకపోవడంతో ప్రశాంతంగా అనిపిస్తోంది.
గదిలోకి మారిపోయాక నర్స్ వచ్చి జితేంద్రకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి "మధ్యాహ్నం వరకు లేవరు. మీరు డిస్టర్బ్ చేయకండి" అని చెప్పి వెళ్ళిపోయింది.
అతను మరో అయిదు నిముషాలకు నిద్రలోకి జారుకున్నాడు.
"మరిక్కడ మనమెందుకు? అలా ముందు కూర్చొందాం" అంటూ రంగనాయికి గదిలో వున్న రెండు కుర్చీలను ఎత్తుకుని ముందున్న కారిడార్ లో వేసింది.
ఇద్దరూ ఎదురెదురుగ్గా కూర్చున్నారు.
ముందంతా ఓపెన్ గా వుండడంతో మొత్తం కనిపిస్తోంది.
ఆకాశం పగిలిపోయిన అద్దం ముక్కలా ఉంది. దూరంగా కనిపిస్తున్న కొండ చెక్కేసిన ఆకుపచ్చటి రాయిలా వుంది. నులివెచ్చటి ఎండ ఇష్టమైన వ్యక్తి స్పర్శలా వుంది.
"చెప్పా పెట్టకుండా వచ్చేశావే మీ నాన్న వచ్చి చెప్పేవరకు నాకు విషయమే తెలియదు" అంది రంగనాయికి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక.
లిఖిత మొత్తం జరిగిందంతా చెప్పి "నాకూ చివరి నిముషంలో తెలిసింది. దాంతో కంగారుగా ఇక్కడికి తీసుకొచ్చాం. చాలా భయపడి పోయాననుకో. నువ్వొచ్చేవరకు ఒకటే ఆలోచనలు- ఏమిటేమిటో- అందుకే నిన్ను చూస్తూనే పోయిన ప్ర్రాణం తిరిగి వచ్చిందనుకో" అంటూ హాయిగా నవ్వింది.
"ఇలాంటప్పుడు ఎవరో ఒకరు తోడువుంటే బావుంటుంది. కానీ ఆ తోడు వల్లే అప్పుడప్పుడూ కష్టాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వుండాలి"
"కష్టాలా?" ఆశ్చర్యపోయింది లిఖిత.
"ఆ"
"ఇదేదో నువ్వు పట్టిన కేసులోంచి లాగిన థీరీలా వుంది"
"అవును నేను పట్టిన నాలుగో కేసు ఇలాంటి క్లూ వల్లే"
తనకూ కాలక్షేపం కావాలి గనుక "ఆ కేసేదో చెప్పు" అంది లిఖిత.
"మనకూ టైమ్ పాస్ కావాలి గనుక చెబుతా విను" అంటూ ప్రారంభించింది రంగనాయికి.
మన పక్కవూరు ఆంజనేయపురం రోడ్డులో మూడేళ్ళక్రితం ఇప్పుడున్నట్టు సందడిగా వుండేది కాదు. బస్సుకోసం వచ్చినవాళ్ళు తప్ప మరొకరు కనిపించేవాళ్ళు కాదు.
రంగనాథం అనే ఒక ఆసామి ఇల్లు కట్టడానికి గాళ్ళు తవ్వుతుండగా మూడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది. అది పంచలోహాలతో తయారుచేసిన విగ్రహం. ఒక్కో కోణంలోంచి ఒక్కో రంగులో కనిపించే ఆ విగ్రహం చూడటానికి అందంగా, గొప్పగా వుంది.
ఆరోజు రాత్రి రంగనాథం వూర్లోని పెద్దలనంతా ఓ చోట చేర్పించి "మా యింట్లో దొరికినా ఇలాంటివి వూరికంతా చెందుతాయి. అది పంచలోహ విగ్రహం అయినా దానిని నా దేవుడింట్లో పెట్టుకోవాలని లేదు. ఇలాంటి విగ్రహాల తీక్షణతను భరించలేం అందువల్లే ఎక్కడో దీనిని ప్రతిష్టించాలన్నది నా కోరిక" అని చెప్పాడు.
"నిజమే- అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు" అని మిగిలిన వాళ్ళు కూడా వంత పాడారు.
మరి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలి? రకరకాల ఆలోచనలు చేశారు. చివరికి రోడ్డులో ఓ పక్కగా దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
బస్సు రోడ్డు పక్కగా ఓ పదిగుంటల స్థలాన్ని సంపాదించారు. అప్పటికప్పుడు చందాలు వేసుకొని చిన్న దేవాలయాన్ని నిర్మించారు. అందులో విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఎప్పుడయితే అక్కడ ఆంజనేయుల దేవాలయం వెలిసిందో రోడ్డులో వెళ్ళే వాహనాలు అక్కడ ఆగడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా లారీలు విధిగా అక్కడ నిలిచేవి. దానిపక్కనే చిన్నకాలవ వుండేది. లారీల వాళ్ళు ఆ కాలవలో తమ వాహనాలను కడుక్కొని, దేవాలయం దగ్గర నిలబెట్టి టెంకాయ కొట్టుకుని హుండీలో తమకు తోచింది వేసి వెళ్ళేవారు.
ఇలా దేవాలయం దగ్గర రష్ పెరిగింది. చెట్టూ చేమలతో చల్లగా వుండడం వల్ల కార్లు, వ్యాన్ లు కూడా ఆగేవి. వాటిలో ప్రయాణించేవారు భోజనాలు అక్కడే ముగించేవాళ్ళు.
జనం ఎప్పుడూ వుండేటప్పటికి మెల్లగా వూర్లోంచి మునెయ్య అనే అతను తన టీ కొట్టును రోడ్డు దగ్గరికి మార్చాడు. వూర్లో అయితే అప్పులు పెట్టేవాళ్ళు. ఇక్కడయితే ఆ సమస్యలేదు. దాంతో మునెయ్య వ్యాపారం మూడు టీలు ఆరు రూపాయలుగా పెరిగింది.
