Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 51

 

    ఆ చిన్న టౌన్ లో పాము కరిస్తే ట్రీట్ చేసే విషయంలో డాక్టర్ నాయక్ కి చాలా పేరుంది.
    
    సరాసరి బండిని వీరాస్వామి నాయక్ క్లినిక్ దగ్గర ఆపాడు.
    
    అది రెండు అంతస్తుల బిల్డింగ్ కింద ఫ్లోర్ లో క్లినిక్. పై ఫ్లోర్ లో డాక్టర్ వుంటాడు.
    
    డాక్టర్ ని నిద్ర లేపింది లిఖిత.
    
    ఆయన ఏ మూడ్ లో వున్నాడో గానీ వెంటనే కిందికి వచ్చాడు. పేషంట్ ను చూశాడు.
    
    "చాలా సీరియస్" లిఖితతో అని ట్రీట్ మెంట్ ప్రారంభించాడు.
    
    పాము కరిచిన చోట కండనంతా కట్ చేస్తుంటే లిఖిత చూడలేకపోయింది.
    
    ఆ గదిలోంచి బయటికి వచ్చింది.
    
    ఆమె చాలా రోజుల తరువాత భగవంతుడ్ని ప్రార్దించింది.
    
    తన కోసం వచ్చిన వ్యక్తి పాముకాటుకి గురై మరణిస్తే తను తట్టుకోలేదు. అంటే తఃనూ అతనిని ప్రేమిస్తోందా? ఏమిటి అతని ఉద్దేశ్యం? అర్దరాత్రి వచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలా? ఏమిటిదంతా పిచ్చి కాకపోతే? తన తల్లిదండ్రులకూ సందేహం వచ్చి వుంటుంది కాబోలు.
    
    తనకూ అతనికీ మధ్య ఏమిటి సంబంధం? దీన్ని ఆరా తీయమని రంగనాయకిని తన తండ్రి నియమిస్తాడా?
    
    రంగనాయకి వస్తే బావుండు. ఏదో చెబుతూ వుంటుంది. ఎప్పుడు బాగవుతుంది జితేంద్రకు! ఈ గండం నుంచి అతను బయటపడగలడా? భగవాన్? అతనికి ఏం కాకుండా చూడు.
    
    ఆమె మరోమారు కళ్ళు మూసుకుని దేవుడ్ని ప్రార్దించింది.
    
    "ఏమ్మా! నిన్ను డాక్టర్ రమ్మంటున్నారు" వీరాస్వామి చెప్పడంతో లోపలికెళ్ళింది.
    
    "మొత్తం మూడువేల రూపాయలు అవుతాయి. ఇతను మీకేమౌతాడు?" డాక్టర్ అడిగాడు.
    
    "ఫరవాలేదు- ముందు ట్రీట్ చేయండి. బిల్లునే కడతాను" ఆమె తొందర తొందరగా అంది.
        
    ఈ డిష్కషన్స్ వల్ల ట్రీట్ మెంట్ ఆలస్యం కావడం ఆమెకి ఇష్టం లేదు.
    
    "సరే" అని డాక్టర్ తన పనిలో తాను మునిగిపోయాడు.
    
    మరో గంట వరకు లిఖిత మిగిలిన వాళ్ళతో పాటు బయటే వుండిపోయింది.
    
    ఆ తరువాత డాక్టర్ వచ్చాడు. "ఓకే ప్రమాదం తప్పింది. రేపు సాయంకాలం వరకు వుండనివ్వండి. ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే చూడవచ్చు" అని చెప్పి ఆయన తమ పోర్షన్ లోకి వెళ్ళిపోయాడు.
    
    ఒక్కసారిగా గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నది లిఖిత. ఎలా వున్నాడో చూడడానికి గదిలోకి వెళ్ళింది.
        
    అతను ఆ అలికిడికి కూడా కళ్ళు విప్పలేదు. పాము కరిచిన చోటు పెద్ద కట్టు మాత్రం కనపడింది.
    
    "జితేంద్రా" పలకరించిందిగానీ అతను స్పృహలో లేడు.
    
    "నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేశారు. మగత కమ్మేసుంటుంది. ఇక మాట్లాడేది తెల్లవారే" సిస్టర్ చెప్పింది.
    
    దాంతో పలకరించే ప్రయత్నం మానుకుంది ఆమె.
    
    వీరాస్వామి తిరిగి బండి కడుతున్నాడు వెళ్ళిపోవడానికి.
    
    "మనమూ వెళదామా అమ్మా" లిఖితను అడిగాడు తండ్రి. అప్పుడు వెళ్ళిపోయినా వూరి జనం పెద్దగా ఏమీ అనుకోరు. అందుకే ఆయన కూతుర్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు.
    
    "మనమూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు నాన్నా? మీరెళ్ళండి. నేను వుండి రేపు ఉదయం వస్తాను" అంది.
    
    ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. తన కూతురు కథ ఆయనకు బాగా తెలుసు. ఏదయినా పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తిగా చేస్తుంది. మధ్యలో ఎవరు చెప్పినా వినదు. తనూ కూతురితో వుండాలన్నా కుదరదు. నిద్ర మధ్యలో లేచి వచ్చెయ్యడంతో ఒళ్ళంతా నొప్పులు ప్రారంభమయ్యాయి. వెళ్ళి కాసేపు నడుం వాలిస్తే గానీ తిరిగి కోలుకోలేదు.
    
    "సరే- నే వెళతాను" ఆయన బయల్దేరాడు.
    
    "నాన్నా! రేపు ఉదయం రంగనాయకిని యిక్కడకు పంపించు. నాకు తోడుగా వుంటుంది" బయలుదేరుతున్న తండ్రితో చెప్పింది.
    
    "అలానే అమ్మా" ఆయన వీరాస్వామి బండిలో వెళ్ళిపోయాడు.
    
    ఇక మిగిలింది లిఖిత ఒక్కతే.
    
    ఆమె ఆతృత ఎలా వుందంటే ప్రతి నిమిషానికోమారు గదిలోకి వెళ్ళి జితేంద్రకు ఎలా వుందో చూస్తోంది. ప్రమాదం తప్పిందని డాక్టర్ అన్నా పూర్తిగా కంగారు తగ్గడం లేదు. అతను లేచి మాట్లాడితే తప్ప ఆందోళన తగ్గదని తేల్చుకుంది.
    
    వరండాలో వున్న బెంచీమీద కూర్చుంది.
    
    జితేంద్ర తనకు పరిచయం అయిన దగ్గర్నుంచి అన్నిటికీ కళ్ళ ముందేసుకుంది.
    
    ఒక్కోసారి నవ్వూ, ఒక్కోసారి వేదనా, మరోసారి ప్రేమా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
    
    నర్సింగ్ హోమ్ లో చిన్నగా కలకలం మొదలయింది.
    
    పేషెంట్లు ఒక్కొక్కరే లేస్తున్నారు.
    
    తూర్పు నుంచి వెలుగురేఖలు చుట్టుకుంటున్నాయి.
    
    పేషెంట్ల దగ్గర వున్నవాళ్ళు టీ చెంబులు, ఫ్లాసులు ఎత్తుకుని కాఫీకి కాబోలు టీ అంగళ్ళ దగ్గరికి బయలుదేరారు.
    
    లిఖితకూ కాఫీ తాగాలనిపించింది.
    
    తలంతా భారంగా వుంది. రాత్రి టెన్షన్ కి తల పగిలిపోతోంది.
    
    "మీ పేషంట్ నిద్ర లేచాడు. వెచ్చగా పాలివ్వండి...... బాగా కోలుకుంటాడు" నర్స్ వచ్చి చెప్పడంతో పైకి లేచింది లిఖిత. కానీ పాలు ఎందులో తేవడం? తను వచ్చేప్పుడు ఏమీ తెచ్చుకోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS