'ఎందుకు చేస్తున్నావో చెప్పునిన్నేమీ అనను'
'ఊరికే ఆంటీ'
'ఎవరు చెయ్యమన్నారో చెప్పు'
కిరణ్ మాట్లాడలేదు' 'నేను ఎవరికీ చెప్పను, మీ అమ్మమ్మకీ చెప్పను. నిన్నుకొట్టించను" - శారద ఆ అబ్బాయితో ప్రేమగా అంది.
ఊ, ఇంకా, ఎన్నో ఫోనుల - దినేష్ పేరున, -
'బాబూ', శారదకి పిల్లాడి మీద కోపం రావటం లేదు.
'మరి రెండు ఉత్తరాలు కూడా నువ్వేరాశావుకదూ'
'నేను కాదు ఆంటీ - వాడు - రవి" -
ఏ ఊరినుంచి వచ్చిందో, ఏ రోజు రాసిందో తెలియకుండా వచ్చిన ఉత్తరాలు - పిల్లచేష్టలంటే ఇవే - కానీ వీళ్ళకేంపని ఇలాంటి పెద్ద వ్యవహారాలలో కల్పించుకోటానికి.
కిరణ్ భయంగా నిలబడివున్నాడు.
'కూర్చో - ఏం భయంలేదు - నేను ఎవరికీ చెప్పను - ఇప్పుడా గొడవేలేదు నువ్వు పేపరు చూడలేదు - నీకెవ్వరూ చెప్పలేదు కదూ" అంది శారద.
'ఏముంది ఆంటీ పేపరులో'
'తీసుకురా చెప్తాను'
కిరణ్ పరిగెత్తాడు - ఒక్క నిముషంలో పేపరు తెచ్చాడు.
'ఇటు చూడు - నీకు చదవటం వచ్చుగా'
'ఆ' గబగబాచదివి అయ్యో, పాపం, అంకులే, ఇతనే "అన్నాడు గట్టిగా" ఒరేయ్ రవీ ఇటురా"
పక్కింట్లోంచి రవి పరిగెత్తి వచ్చాడు. పేపరు చూపించాడు కిరణ్.
"మన అంకుల్ - దినేష్ అంకుల్" రవి గట్టిగా అన్నాడు ఇద్దరూ ఒకరికి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శారద పిల్లలిద్దరి వంక చూసింది. ముద్దుగా చక్కగా వున్న పిల్లలు చదువుకుంటున్న, పిల్లలు, మంచి కుటుంబాలలో పిల్లలు - వీళ్ళకి ఈ ధోరణి ఏమిటి - ఫోన్లు ఎందుకు చేశారు. ఎవరో వీళ్ళ చేత చేయించారు - ఎవరయి వుంటారూ.
రామం - ఛీ, ఛీ - మహాపాపం తన ఆలోచన ఆస్థాయికి వెడితే - శారద మనసులోనే దేముడికి దణ్ణం పెట్టుకుంది - రామం వ్యక్తిత్వం తను గుర్తించలేకపోయింది - అది తన దురదృష్టం. అంతే!
మరెవరో ! - తనకి శత్రువులు ఎవరున్నారు.
ఆ రోజు విజయవాడ నుంచి వచ్చి తనని హోటల్ ముందు దించి వెళ్ళిపోయిన దినేష్ మళ్ళా నాలుగురోజులనాడు అర్దరాత్రి పన్నెండుగంటలకి రావడమే రావటం - ఈమధ్యలో ఫోన్లు, ఉత్తరాలు - శారద అబ్బాయిలవంక చూసింది. వాళ్ళిద్దరూ తలొంచుకున్నారు.
'మిమ్మల్ని నాకు ఫోను చేయమని ఎవరు చెప్పారో, చెప్తారా, చెప్పరా'
రవి, కిరణ్ చెవిలోచెప్పాడు కిరణ్ శారదవైపు చూసాడు భయంగా 'చెప్తారా, చెప్పరా' -
'మాకు భయంగా వుంది ఆంటీ'
'నేను మిమ్మల్ని ఏమీ చేయను - ఎవరికీ చెప్పను - చెప్తున్నానుగా'
'నిజంగా చెప్పరుగ 'పిల్లలిద్దరూ ఒకేసారి అన్నారు. 'చెప్పను' శారద ఊపిరి బిగపట్టింది ఎవరి పేరు చెప్తారోనని ఒక్కక్షణం గడిచింది.
'మాకు ఒకసారి ఒక ఏభై రూపాయలిచ్చి, ఫోన్లు చేయండి. ఉత్తరాలు రాయండి అని చెప్పారు. అదివరకు వచ్చినప్పుడల్లా సందుచివర మాకు ఐస్ క్రీములు కొనిపెట్టేవారు - ఎవరికీ తన పేరు చెప్పద్దని ప్రామిస్ చేయించుకున్నాడు' - పిల్లలిద్దరూ ఇంక భయంగానే శారద వంక చూస్తున్నారు.
'ఎవరూ' అంది ఆత్రంగా శారద
'అంకుల్, దినేష్ అంకుల్'
శారద తల తిరిగిపోయింది - దినేష్, దినేష్ శారదకి ఏడ్వాలో నవ్వాలో తెలియలేదు - కాసేపు అలాగే కూచుంది. పిల్లలు బెదురుతున్నారు.
శారద పకపకానవ్వింది. గలగలానవ్వింది. పిచ్చిగానవ్వింది రవి, కిరణ్ కూడా శారదతో కలసి నవ్వేశారు -
* * *
22
కలం పరిగెడుతోంది - జీవితానుభవంతో శారద ఎంతో ఎత్తు ఎదిగిపోయింది - ఎదురు దెబ్బలు మనసుని గట్టి పరిచేశాయి.
శారద ఇల్లు అద్దెకుతీసుకుంది - రాజారావు, వెంకడు శారదతోబాటే - ఇప్పుడు రాజారావుకి కూతురు, కొడుకు కూడా శారదే. కూతురు దగ్గర వృద్దాప్యం హాయిగా గడుస్తున్నందుకు ఆనందంగానే వుంది రాజారావుకి. కాకపోతే ఈ మధ్యే ఒక బెంగబయలుదేరింది - తన తర్వాత ఈ శారద గతి ఏమౌతుంది - ఎవరు చూస్తారూ, ఎవరి దగ్గరుంటుందీ. ఈ బెంగతో రాజారావుకి అన్నం తినబుద్ది పుట్టడం లేదు నిద్ర పట్టదు !! -
వెంకడితో ఓరోజు సాయంత్రం ఇదే విషయం ఓ గంట మాట్లాడాడు రాజారావు.
ఆ రోజు పొద్దున్న మొక్కల దగ్గర నిలబడి చూస్తోంది శారద. మందారం విరగబూసింది - ఆ పక్కనే గులాబీ మొగ్గతొడిగింది. శారద అవి చూస్తూ దొడ్డి గుమ్మంవైపు వచ్చింది - దోసపాదు పిందెలతో నిండిపోయింది. పొట్లకాయలు పందిరికి వేలాడుతున్నాయి -
"వెంకడూ - ఇటు చూడు - దొండ తీగకి పందిరి వేయాలి. లేకపోతే"
వెంకడు ఫక్కున నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలియదు లేదు శారదకి. వెంకడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. శారదకి చిరాకేసింది.
'ఏమిటానవ్వు' అరిచింది.
'కాదండీ - మీరేమో మొక్కలు, పాదులు పందిళ్ళు అంటున్నారు - అయ్యోగారేమో - పెళ్ళి - పిల్లలు - అంటున్నారు' - వెంకడు నేల మీద పాకిన దొండతీగవంక చూస్తు అన్నాడు.
'ఏమిటీ - అంది శారద'
'అదేనండీ - అయ్యగారికి ఒకటే బెంగ మీరు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని అయ్యగార్కి వెంకడు ఏదో చెప్పబోయాడు.
'నాకు కావలసింది పెళ్ళికాదు - పిల్లలు, పిల్లలు"శారద మాటలు అర్ధంకాలేదా వెంకడికి.
వెంకడు చిత్రంగా శారదవంక చూస్తూ వుండి పోయాడు!!
నెల రోజులు గడిచాయి.
పరుపుకిందపడి వున్న ఉత్తరం తీసింది శారద. అది వచ్చిరెండురోజులయింది - అంటే లలిత నిన్న వచ్చి వుంటుంది !! - ఎదురుగా ఉన్న కేలండర్ వంక చూస్తూ అనుకుంది శారద - శారద చేతిలో ఉత్తరం కదులుతోంది. గత జీవితం కళ్ళముందు మెదులుతోంది ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు లేకుండా వుంటాయా ! - ఏ వ్యక్తులకయినా రాజీ అన్నది లేకుండా జీవితమంతా గడుస్తుందా ! అహం, ఆవేశం ఎల్లవేళలా వ్యక్తిని నడిపిస్తాయా !
- ఏ ఒక్క ప్రశ్నకి జవాబు తెలియకుండా నడిచిపోయిన రోజులు శారద మనసుని మరొకసారి కలచివేసాయి కొత్త మనుషుల్ని వెంటనేనమ్మేయద్దని అమ్మ చెప్పేమాట, దురాశ దుఃఖానికే దారితీస్తుంది. అని ఎప్పుడూ నాన్న అనే మాట ఎంత వాస్తవమయినపాఠాలో, అర్ధం చేసుకోటానికి ఎంత సమయం పట్టిందీ !!
