దినేష్, నీరజ ఎవరు - తనకి వాళ్ళతో అసలు ఏంపని - ఏ ప్రలోభం తనని రామన్నించి దూరం చేసిందీ - ఏ అవివేకం, అర్ధంలేని సిద్దాంతాళ అలజడి తనని మరోమార్గంలో నడిచిందీ - రామం, హిమాలయమోన్నత శిఖరం - అతని ముందు తను, శారదకి అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి - ఆ కన్నీళ్ళు గుండెలోతుల్లోంచి పొంగిపొర్లాయి. కన్నీళ్ళే తనకి ఊరట - ఎన్నో పోగొట్టుకున్న తను ఎందుకింకా జీవితం పైన మమకారం పెంచుకోవాలీ - ఏం మిగిలింది తనకు - శారద చేతిలో ఉత్తరం కదులుతూ ఉంది. జీవితంలో మరో వసంతం రావచ్చుగా - రావచ్చుగా.
ఉత్తరం గబగబా మళ్ళీ మళ్ళీ చదివింది శారద!
తుఫాను బీభత్సం తల్చుకుంటుంటే మళ్ళీ భయమేసింది శారదకి. ఎన్నెన్ని కుటుంబాలు మట్టిలో కలిసిపోయాయో మరెన్ని పచ్చని గ్రామాలు స్మశానాలయ్యాయో !! ఎందుకో, ప్రకృతికి ఈ మనుషులపై అంతకోపం
శారద చేతిలో ఉత్తరం మడతలు పెట్టింది - కళ్ళలో కొత్తవెలుగు - తమసోమా జ్యోతిర్గమయా !!
ఇద్దరు పిల్లలు - తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్న అనాధలు - ఆ పిల్లలిద్దరిణీ తీసుకొచ్చింది లలిత, ఆమె భర్త మోహన్.
ఆడపిల్లని తీసుకుంటానని నా స్నేహితుడొకడు చెప్పాడు - ఇంక మగపిల్లవాడు - వాణ్ణి నీవు పెంచుకుంటే బాగుంటుందనిపించింది" అది లలిత ఉత్తరం సారాంశం.
శారదా - నువ్వు పెంచుకోక పోయినాబాగానే వుంటుంది అంది లలిత.
తను ఇద్దరు పిల్లలకి తల్లి అయింది కదా - మరొక పిల్లాడికి - అంతే ! ఇలా మనసులో నిశ్చయించుకున్న లలిత స్నేహితురాలుకదా అని శారదకి ఉత్తరం రాసింది !!
శారద ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంది. వెంకడూ - నాతో రా' అంది మెట్లు దిగుతూ. అమ్మాయిగారు ఈరోజు ఇంత ఆనందంగా ఎందుకున్నారో, ఏమి విశేషమో అనుకుంటూ శారద వెంట బయలుదేరాడు వెంకడు !! మళ్ళీవసంతం రాదా - శారద అడుగులు ముందుకుపడ్డాయి !! శారద మనసు ఆనందంతో పరవశించింది.
లలిత ఇంట్లోకి అడుగు పెట్టగానే శారద మనసు క్షణంలో మారిపోయింది -
రామం రూపం కళ్ళలో మెదిలింది.
ఆనాటి నర్సింగ్ హోమ్ మెట్లు కళ్ళముందు కదులుతుంటే గుండె బరువెక్కినట్లయింది " - అక్కడే సోఫాలో కూచుని, ఆడుకుంటున్న పిల్లల వంక చూస్తోంది శారద.
లలిత, ఆమె భర్త, పిల్లలు అంతా సందడిగా ఉంది ఇల్లు -
"చూడు - వీడికి మూడేళ్ళు, దీనికి ఏడాది నిండిందేమో !! - అయినా నీకు ఆడపిల్ల వద్దుకదా అని ఒకరు అడిగితే ఆడపిల్లని వాళ్ళకిస్తానన్నాను - వీడు, ఈ పసివాడు - పాపం పసివాడు కదూ! లలిత ఆడుకుంటున్న వాడిని ఎత్తుకు ముద్దుపెట్టుకుంది - శారద అలా చూస్తోంది.
ఇదిగో ఈ బుట్టలో వీడి బట్టలున్నాయి మా వారు వాడికోసం అప్పుడే ఎన్నో బొమ్మలు, బట్టలు కొన్నారో - వీడికి పేరు కూడా పెట్టారు - 'ఉదయ్' అని - మా వారన్నారు. ఈ పిల్లలిద్దరినీ మనమే పెంచుకుందామని, కానీ నలుగురి పిల్లలకి ఒక్కసారి తల్లినయిపోతా - లలిత గలగలా నవ్వింది - ఆ తర్వాత అమ్మమ్మని, నాయనమ్మని అయిపోతా - లలిత మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతుంటే శారద అలా చూస్తోంది.
అంతలో గుమ్మంలో ఆటో ఆగింది రామం, గాయత్రి రెండేళ్ళ పిల్లాడు లోపలకొచ్చారు - శారద ఒక్కక్షణం నిర్ఘాంతపోయింది !! శారద ముఖం కిటికీవైపుకి తిప్పికూచుంది. రామం, గాయత్రి లోపల గదిలోకెళ్ళారు ఏమీ గమనించకుండా.
పదినిముషాలు దాటింది లోపల లలిత, ఆమె భర్త, గాయత్రి, రామం మాట్లాడుకుంటున్నారు.
శారద అటు ఇటు చూసింది - ఇంతకుముందు లలిత యిచ్చిన బాబు బట్టలు, బొమ్మలు వున్న బుట్ట అక్కడున్న బల్లమీద పెట్టేసింది.
'లలితా' - శారద గొంతులో గాద్గద్యం !! 'లలితా - ఆపాపని టియ్యి' అంది వెంటనే 'పాపనా' - లలిత విస్తుపోయింది "అవును - పాపనే" - ఆడుకుంటున్న పాపని ఒక్కసారి ఎత్తుకు గుండెలకి హత్తుకుంది. ఎప్పుడో అణగారిన మాతృత్వం పొంగిపొర్లింది - శారద కన్నీళ్ళు జలజలారాలి పాప బుగ్గలపై పడ్డాయి.
పిల్లని ఎత్తుకుని నడుస్తున్న శారదని చూస్తున్న రామం కళ్ళలో నీటిపొర అడ్డం పడింది!
వీధి గుమ్మంలో నుంచున్న రాజారావు నమ్మలేక పోతున్నాడు.
'నాన్నా - మనింటికో వసంతం వచ్చింది. నిజం నాన్నా' ఆ పాపని ఎత్తుకు ఇంట్లో కొస్తున్న శారదని చూస్తూ మంచి పని చేశావు' అన్నాడు శారద తలనిమిరి తండ్రి రాజారావు.
"అవును - మంచిపనే' - తనలో తనే అనుకుంటూ వసంతని చేతుల్లోకి తీసుకున్నాడు వెంకడు.
-సమాప్తం-
