Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 51

 

        తలుపు తీసింది శారద. తండ్రి నులకమంచంమీద పడుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. వెంకడు ఆయన మంచం పక్కన కూర్చుని నిద్రపోతున్నాడు.
   
    చిన్నన్నయ్య వీధి వరండాలో అటు ఇటు తిరుగుతున్నాడు. శారద వెంకడిని లేపింది నెమ్మదిగా.
   
    "ఒరేయ్ -నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఊరు - నాన్నగారిని లేపకు లేచాక చెప్పు - వచ్చే బుధవారం వస్తాను. వచ్చి నాన్నగారిని నాతో తీసికెళ్ళిపోతాను - నిన్ను కూడా. ఇక నాన్నగారూ నేనూ ఎక్కడుంటే నువ్వూ అక్కడే - సరేనా నాన్నగారు ఖంగారు పడకుండా చెప్పు - నేను చాలా ముఖ్యమయిన పని మీద వెడుతున్నా - వెంకడు తల ఊపాడు. తన చిన్న నాటి నుంచీ తన యింట్లోనే వుంటున్నాడు.
   
    శారద దొడ్డి గుమ్మం నుంచి వెళ్ళిపోయింది. చిన్నన్నయ్య శ్రీనివాసుకి ఎంతకీ ఏమీ పాలుపోలేదు - ఎంత డబ్బు, ఎంత డబ్బు - డబ్బు తిరిగి ఎలా సంపాదించగలడు - నాన్నని బలవంతంగా ఒప్పించి కొబ్బరితోట అమ్మించిందే తను - ఈ శారదకి దినేష్ ఎక్కడుంటాడో వివరాలు తెలుస్తాయి. ఇది ఖచ్చితంగా ఎలాగైనా వెళ్ళివాణ్ణి కలుస్తుంది. ముందు ఏం చేయాలో దీని చేత చెప్పించాలి - ఈ పోలీసులు, జైళ్ళు గొడవలు తేలాక వాన్నే పెళ్ళాడుతుందేమో కూడా. ఎవరికీ తెలుసు. దాని దగ్గర వాడి ఎడ్రసు ఖచ్చితంగా వుండి వుంటుంది - ఎలాగైనా అది తీసుకోవాలనే పట్టుదలతో వున్నాడు.
   
    శారద నిద్రలేచిందా లేదా అని గదిలోకొచ్చిన చిన్నన్నయ్య ఆ గదిలో ఎవరూ లేక పోవటంతో ఆశ్చర్యపడ్డాడు - ఎక్కడికెళ్ళి వుంటుందీ ! ముసలాయనా వేంకడూ నిద్రపోతున్నారు. ఎవర్నడిగాలి. శ్రీనివాడు అటు ఇటు తిరిగాడు. వెంకడు నిద్రలేచి పనులు చేస్తున్నాడు బట్టలు ఉతుకుతున్నాడు.   

    'ఒరేయ్ - శారదమ్మ ఎక్కడి కెళ్ళిందీ '-
   
    'నాకు తెలియదండి'బనీనుకి సబ్బురాస్తూ తలెత్తలేదు వెంకడు. తండ్రికి తనువెడుతున్నట్టు చెప్పమంది కానీ, అన్నకి చెప్పమనలేదు - తనెందుకు చెప్తాడు - వెంకడు పంచెలకి సబ్బురాసి అక్కడున్న రాతిమీద ఉతికాడు.
   
    శ్రీనివాసు కి చిరాగ్గా వుంది. ఎంతసేపు కూచుంటాడు ఇక్కడ 'నాన్నగారూ నే వెడుతున్నా' -
   
    రాజారావు లేచాడు. భోజనం చేశావా'
   
    'ఆ - హోటల్లో చేసే ఇక్కడ కొచ్చాను. శారద లేదే' -
   
    'ఎందుకుండదూ - ఎక్కడికెడుతుందీ' రాజారావు అంటుండగానే వెంకడు పరిగెత్తి వచ్చాడు.
   
    'అమ్మాయిగారు హైదరాబాదు వెళ్ళారండి - బుధవారం వస్తానని చెప్పమన్నారండి' - వెంకడు శ్రీనివాసువంక చూస్తూ వెళ్ళిపోయాడు. వాడు దీని దగ్గర డబ్బులు దాచి వుంటాడు -కాకపోతే ఇది ఎందుకు అంత అర్జంటుగా వెడుతుందీ - నేనూ అక్కడికే వెడతా - విషయం తెలుస్తుంది - శ్రీనివాసు మనసులో అనుకున్నాడు 'మరో బస్సు' అంతేగా !!
   
    'ననంగారూ - నేను వెడతాను - దానొక్కర్తి మూలంగా కుటుంబమంతా నష్టపోయాంలెండి' అన్నాడు.
   
    'ఆకూతే కూయద్దన్నా - దాని మూలంగా నువ్వు నష్టపోలేదు - నీ దురాశ మూలంగా నువ్వు నష్టపోయావంతే" -
   
    శ్రీనివాసు మాట్లాడకుండా బాగ్ పట్టుకువెళ్ళి పోయాడు.....తను శారద దగ్గర కెళ్ళటం దండగ.....తన ఊరికే బస్సుటిక్కెట్టు కొనుక్కున్నాడు.           
   
                                    *    *    *
   
                                         21

   
    శారద ఇంట్లో అడుగుపెట్టేసరికి సుబ్బలక్ష్మి భుజంగరావు ఊళ్ళోలేరని, పెళ్ళికెళ్ళారని తెలిసింది. 'హమ్మయ్య' అనిపించింది ఇందిర, పిల్లలువున్నారు.
   
    శారద తలుపు తీసి ఇంట్లోకి రాగానే పక్కింటిపిల్లాడు తొంగి చూసాడు. ఆంటీ వచ్చింది అంటు పరిగెత్తి వెళ్ళిపోయాడు.
   
    ఇల్లంతా చిరాగ్గా వుంది. శారద ముందు ఇల్లు శుభ్ర పరుచుకుంది. అర్ధరాత్రి వచ్చిన దినేష్ కాల్చిన సిగరెట్టు పీకలు గదిలో పడివున్నాయి. గబగబాతీసి బయట విసిరేసింది శారద. ఒకసారి దినేష్ శారదకి ఒక చీరకొని ప్రజంటుచేశాడు. ఆ రోజు దసరా పండగ. ఆచీర షెల్పులో వేలాడుతోంది. శారద ఆ చీర కవర్లోచుట్టబెట్టింది. ఇల్లు ఊడ్చింది. ఆ చెత్త, ఈ చీర పొట్లంలో చుట్టి సందుచివర చెత్తకుండీలో వేసేసింది. నిజమైన స్నేహితుడని దినేష్ పై తను కట్టుకున్న ఆశాసౌధం ఎప్పుడయితే కూలిపోయిందో అప్పుడే శారద మనసు వికలమైపోయింది. ఆ జ్ఞాపకాలు తనకి ఇక వద్దు కనిపించేవేకాదు, గుండె అడుగున ఎవరికీ కనిపించకుండా వున్నవి కూడా తీసిపారేయాలసిందే - కాలం అన్నిటినీ తనలో కలుపుకోగలదు. తమసోమాజ్యోతిర్గమయా! పేపరులో దినేష్ ఫోటో వచ్చాక, పెద్ద మోసగాడని అందరికీ తెలిసిపోయాక తనగురించి ఎవరే మనుకుంటున్నారో - లలిత, రామం - ఏమనుకుంటున్నారో !! శారద వంట చేసుకుంది. మనసుని వీలయినంతవరకు ప్రశాంతంగా వుంచుకునే ప్రయత్నం అతి కష్టం మీద చేస్తోంది. తన చిన్నవయసుకి జీవితం ఎంత పెద్ద అనుభవాన్ని సంపాదించి పెట్టిందో అనుకుని నవ్వుతుంది.
   
    'ఆంటీ - ఫోను' -మేడ మీదనుంచి పిలుపు. తనకి ఎవరు చేస్తారు - ఏ రామమయినా చేయచ్చుగా' శారదమేడపైకి వెళ్ళింది. 'నేను దినేష్ ని - సాయంత్రం వస్తా - వచ్చేప్పుడు నీకిష్టమని" -
   
    "హలో ఎవరు" శారద శ్రద్దగా వింటోంది.
   
    "దినేష్ ని సాయంత్రం వస్తా" -
   
    "హలో" - ఫోను పెట్టేశారు.
   
    'దినేష్ సాయంత్రమొస్తాడా. ఈ ఫోను ఖచ్చితంగా పేపరు చదవని వాళ్ళు చేసిందే - శారదకి కోపం రాలేదు - నవ్వొచ్చింది. శారద మేడ దిగి పక్కింట్లో కెళ్ళింది తిన్నగా.
   
    బల్లముందు కూచుని ఊరికే పుస్తకంలోకి చూస్తున్నాడు కిరణ్. అమ్మమ్మలోపల గదిలో నిద్రపోతోంది.
   
    'ఇలారా! భయపడుతూ వచ్చాడు కిరణ్
   
    'ఇన్ని ఫోన్లు ఊరికే ఇలా చేస్తుంటే ఎంత ఫోను బిల్లు వస్తుందో తెలుసా" అంది కిరణ్ చేయిపట్టుకుని. చేయి విడిపించు కోవాలనుకున్నాడు ఎనిమిదో క్లాసు చదువుతున్న కిరణ్.
       
    ఆంటీ కనిపెట్టేసిందని, అబద్దాలాడటం అనవసరమనీ అర్ధమయిపోయింది కిరణ్ కి.
   
    'నువ్వు ఇలా ఎన్నిసార్లు చేశావో చెప్పు'
   
    'గుర్తులేదు ఆంటీ'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS