Previous Page Next Page 
త్రీ ఇన్ వన్ పేజి 50

    "అంతా సరిపోయింది. పోలీసులు అనుమానం వచ్చి మన వ్యాన్ ని వెంబడించారట. కానీ మన వ్యాన్ డ్రయివర్ తెలివిగా వాళ్ళ కళ్ళు కప్పి వచ్చాడు-"

    "వెరీగుడ్.... ఆయూసుఫ్ గాడు పిచ్చి వేషాలేమైనా వేస్తున్నాడా?"

    "ఇప్పటిదాకా మామూలుగానే ఉన్నాడు గానీ... వాడిని నమ్మలేం. శత్రు ముఠాలో చేరినా చేరిపోవచ్చు."

    "అలాగయితే ఈ రాత్రికే వాడిని చంపెయ్యి" కర్కశంగా పలికింది ఆ కంఠస్వరం.

    అంబాజీరావు కెవ్వుమని అరిచాడు.

    "అన్ని హత్యలు చేసినవాడివి యూసుఫ్ గాడిని చంపమంటే అలా అరిచావేం?!" ఆశ్చర్యంగా అడిగింది ఆ కంఠస్వరం.

    "ఇప్పుడు కెవ్వుమని అరిచింది నేను కాదు" జవాబు చెప్పింది రెండో కంఠం.

    "అలాగయితే ఎవరు అరిచారు?"

    "ఎవరో మనమాటలు వింటున్నారు..."

    "చాలా ప్రమాదమే... ఆ వింటున్న వాడి నెంబర్ ట్రాప్ చేసి వాడిని కూడా చంపెయ్యగలవా?"

    అంబాజీరావుకి కంగారు పుట్టింది.

    మనసులోనే కెవ్వుమని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాడు.

    అతని గుండెలు దడదడలాడాయి.

    "కొంపదీసి వాడెవడో ఇంటికి వచ్చి నన్ను చంపెయ్యడుకదా?" అనుకున్నాడు.

    "ఆ, అయినా నా ఫోన్ నెంబరు వాళ్ళెలా ట్రేస్ చేస్తార్లే!" మళ్ళీ తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు.

    ఒక అయిదు నిమిషాలాగి గుండెదడ తగ్గాక మళ్ళీ ఫోన్ చేసాడు వెంకట్రావు కోసం.

    ఈసారి ఇంకెవరో మాట్లాడ్తుంటే ఆ లైను కల్సింది. ఇంకేం కొంపలు మునిగే మాటలు వినాల్సివస్తుందో అని పెట్టేయ్యబోయాడు గానీ ఆడగొంతు వినబడ్డంతో ధైర్యంతోనూ కుతూహలంతోనూ వాళ్ళమాటలు వినసాగాడు.

                                      

     "ఊ... నూనె కాగిందా?" అడిగింది ఆడగొంతు.

    "కాగిందనే అనుకుంటున్నా!" అంది మగగొంతు.

    "నా ఖర్మకొద్దీ దొరికారు. నేనేమో ఆఫీస్ లో పనిచెయ్యడం-మీరేమో ఇంట్లో వంట చెయ్యడం! నూనె నుండి పొగలు వస్తున్నాయా?" విసుగ్గా అడిగింది ఆడగొంతు.

    "ఆ- వస్తున్నాయ్" జవాబు చెప్పింది మగగొంతు.

    "అయితే నూనె కాగినట్టే దాంట్లో ఆవాలు తగలెయ్యండి!"

    "అలాగే...."

    అంబాజీరావు నెత్తికొట్టుకుని ఫోన్ డిస్ కనెక్ట్ చేసి మళ్ళీ రింగ్ చేసాడు.

    మళ్ళీ అదే లైను కలిసింది.

    "అలా అయిదు నిముషాల సేపు పోపు వేగానీండి- మాడిపోనియ్యొద్దు...."

    "అలాగే-అలాగలాగే....."

    అంబాజీరావు మళ్ళీ డిస్కనెక్టు చేసి మళ్ళీ ఫోన్ చేసాడు.

    మళ్ళీ ఆవంటల కార్యక్రమమే కల్సింది.

    "అమ్మా తల్లీ! కాస్త ఫోన్ డిస్కనెక్టు చేస్తావా తల్లీ... నువ్వు ఫోన్ పెడ్తే తప్ప నా నెంబరు కలిసేలా లేదు.

    "నువ్వెవడివయ్యా మధ్యలో కలిశావ్, ఫోన్ పెట్టేయ్ ముందు-"

    "నువ్వే పెట్టేయ్యమ్మా తల్లీ! నేను ఫోన్ చేస్కోవాలి."

    "వీల్లేదు. పులుసు అయ్యేదాకా ఫోన్ పెట్టేది లేదు" ఖచ్చితంగా చెప్పింది ఆవిడ.

    "పులుసు ఎప్పుడు అవుతుంది?"

    "ఇంకో పావుగంట పడ్తుంది."

    విసుగ్గా ఫోన్ పెట్టేసాడు అంబాజీరావు. ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ నెంబరు తిప్పాడు."హాలో-" అంది అవతలి కంఠం.

    "ఒరేయ్ వెంకట్రావేనా?" అడిగాడు అంబాజీరావు.

    "ఆ వెంకట్రావునే! ఎవరు? ఏంటి సంగతులు?"

    "అంబాజీరావుని మాట్లాడుతున్నా. నీతో మాట్లాడి చాలాకాలం అయిందని ఫోన్ చేసా-"

    "అంబాజీరావా?.... అసలు మీకు ఏ వెంకట్రావు కావాలి!"

    "లంక చుట్టు వెంకట్రావ్!" చెప్పాడు అంబాజీరావు.

    "సారీ... రాంగ్ నెంబర్ ..... నేను డొంకరాయ్ వెంకట్రావుని!!...." ఫోన్ పెట్టేసాడు అతను.
    అంబాజీరావు తల పట్టుకున్నాడు. అప్పుడే గుడికి వెళ్ళిన పెళ్ళాం పిల్లలు ఇంటికి వచ్చారు.

                                             

   "నేనిప్పుడే వస్తా" కాళ్ళలో చెప్పులు దూరుస్తూ అన్నాడు అంబాజీరావు.

    "ఎక్కడికి?" అడిగింది అతని భార్య.

    "వెంకట్రావు తో మాట్లాడాలి"

    "అదేవిటి? ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా!" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
ఆమె మాటలు వినిపించుకోలేదు అంబాజీరావు. అప్పటికీ అతను రోడ్డుమీదికి వచ్చేసాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS