"ఏ జన్మలోనో కాదే, ఈ జన్మలోదే. నీ మొదటి భర్తను అన్యాయం చేసి నాన్నతో వచ్చావే. ఆ పాపం వెన్నాడుతోందే నిన్నూ, నన్నూ. లేచొచ్చినదాని కొడుకు ఇలా వుండక ఏలా వుంటాడు చెప్పు. జనాల అవహేళనలమధ్య పెరిగినవాడు ఇలాగే తయారవుతాడు" పృద్వీ కసిగా అన్నాడు.
ఆవిడ ముఖం తెల్లగా పాలిపోయింది.
ఏ కొడుకూ తల్లిని అనుకూడని మాట అన్నాడు.
అదీ ... కొత్తగా వచ్చిన కోడలి ముందు తన పరువు తీశాడు.
ఇంత దారుణంగా తన మనసును గాయపరచిన కొడుకును ఆవిడ విభ్రాంతిగా చూడసాగింది.
పృద్వీ పదవతరగతిలో వున్నప్పుడేమో మాధవరావు మొదటి భార్య తమ్ముడు వచ్చి తనని పరిచయం చేసుకుని "నీకో అన్న వున్నాడురా! ఆస్తిలో భాగస్తుడు. నీ అబ్బ మొదటి భార్య కొడుకు. మీ నాన్న మీ అమ్మను లేవదీసుకు వచ్చాడు తెలుసా?" అంటూ ఆనాటి సంగతులన్నీ చెప్పి పృద్వీలో విద్వేషానికి బీజంనాటి వెళ్లాడు. అప్పటినుండి తల్లి అంటే చులకన, తండ్రిపట్ల భయభక్తులు లేకపోవడం మొదలైంది.
భయభక్తులు లేకుండా పెరిగిన పిల్లల్లో వచ్చే అవలక్షణాలే అతడికీ వచ్చాయి. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఆటబొమ్మలుగా చూడడం! ఇంట్లో పని పిల్లతో మొదలైంది అతడి పతనం. తండ్రి పరపతితో, డబ్బుతో, డిగ్రీలు చేతికొచ్చినా, తరువాత లెక్చరర్ గా వుద్యోగం వచ్చినా అతడిలో ఆ బుద్ది పోలేదు. అది మరింత వికృతరూపం దాలుస్తోంది.
ధైర్యమూ, వ్యక్తిత్వమూ వున్న విశిష్టలాంటి అమ్మాయి అతడి పతనం ప్రారంభంలోనే ఎదురైవుంటే అతడింత దిగజారేవాడుకాదు. ఎప్పుడో మంచి మార్గానికి మళ్లింపబడేవాడు.
కొడుక్కి ఏం హితవు చెప్పినా చెవికెక్కదు సరికదా బురదలో రాయివేసి చిట్లించుకున్నట్లుగా అవుతుందనిపించింది.
ఆవిడ అవమాన భారంతో కంటతడి పెట్టుకుంటూ అక్కడినుండి నిశ్శబ్దంగా వెళ్లిపోతుంటే విశిష్టకి జాలేసింది.
కన్నతల్లిని కూడా కేర్ చేయని పృద్వీని చూస్తుంటే అతడిపట్ల ఆమెకున్న ద్వేషం రెట్టింపు అయింది. ఎంత సంస్కారహీనుడైతే కన్న తల్లిని ఇలా గాయపరుస్తాడు.
* * * *
కాంతం ఆ రోజు భోజనం చేయలేదు.
విశిష్ట వచ్చి పిలిచింది. "రండి అత్తయ్యా! నేను కూడా భోజనం చేయలేదు. ఇద్దరం కలిసి తిందాం."
"వద్దమ్మా! కడుపు నింపాడుకదా కన్నకొడుకు" ఆవిడ కళ్లొత్తుకుంటూ అంది. "తప్పులు ఎవరు చేయరు? కానీ కన్నకొడుకే ఎత్తి చూపి అవహేళన చేస్తే ఆ తల్లి మనస్సెంతగా గాయపడుతుందో నువ్వ ఊహించు."
"మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగనా?"
"నన్నింకా బాధించే ప్రశ్న అయితే అడగకపోవడమే మంచిది."
"మీరెంతో మంచివారిలా వున్నారు. ఎలా పడ్డారు మాధవరావు వలలో? ఆయనలో అస్సలు మంచితనమే కనిపించదు."
"బయటి ప్రపంచంలో ఆయన ఎలా వుంటాడోగాని ఇంట్లో నాతో బాగానే వుంటాడమ్మా! అమాయకురాలిని లేవదీసుకు వచ్చినా, అన్యాయం ఏమీ చెయ్యలేదు. ప్రేమగానే చూసుకున్నాడు."
"ఆయనకి మొదటి భార్య వుందని వున్నాను."
"ఆఁ వుంది! రాకపోకలేమీలేవు. ఆవిడ పుట్టింటివాళ్ల దగ్గరే వుండిపోయింది."
"కట్టుకున్న దాన్ని అన్యాయం చేసినవాడు మంచివాడు ఎలా అవుతాడు? మరో దానిని లేపుకొచ్చినవాడు మంచివాడు ఎలా అవుతాడు? పృద్వీ మీద తండ్రి ప్రభావం చాలా వుందనిపిస్తోంది."
"నువ్వే ఓపికతో వాడిని మంచి మనిషిని చేయలమ్మా! నీ దగ్గర ఆ శక్తి వున్నది. అధర్మ మార్గంలో సర్వనాశనం కాబోతున్న ఈ ఇంటిని ఉద్దరించాలి."
"నా మీద మీకెందుకింత విశ్వాసం ఏర్పడిందోగాని నేను బ్రతికి వుంటే ఈ ఇంట్లో మనుషులకి మానవత్వం అంటే ఏమిటో, సంస్కారం అంటే ఏమిటో తప్పక నేర్పుతాను అత్తయ్యా."
"నీకేమీకాదు, కానివ్వను! నీలాంటి వాళ్లు నిండు నూరేళ్లు జీవించాలమ్మా."
"కాని నా ఆయువు ఈ ఇంట్లో ఎప్పుడు తీరుతుందో తెలియదు. నన్ను నామరూపాలు లేకుండా చెయ్యడమే మీ ఆయన ఆశయం. రామకృష్ణ కూతురిగా హత్యచేయబడితే కేసులూ, విచారణలూ ఎదుర్కోవలసి వస్తుందని మాధవరావు కోడలిగా హత్య చేయబడితే ఇది ఆయన ఇంటి వ్యవహారం కాబట్టి గుట్టుచప్పుడుకాకుండా మాసిపోయేలా చేసుకోవచ్చు. పత్రికల వాళ్లకీ, పోలీసు వాళ్లకీ ఇది యాక్సిడెంట్ డెత్ గా చెప్పొచ్చు."
"నీకు ఈ ఇంట్లో ఏ ఆపదా రాకుండా నేను కాపాడుకొంటాను అమ్మా!"
* * * *
పృద్వీని డాక్టరు వచ్చి చూశాడు.
రాత్రి తన భార్య కావాలని తన్నిన విషయం చెప్పడానికి సిగ్గుపడ్డడు పృద్వీ. నామోషీగా ఫీలయ్యాడు.
"కొంతమంది అమ్మాయిలకి భార్యాభర్తల సంబంధం పట్ల సరైన అవగాహన వుండదు. కొంతమంది అమ్మాయిలకి ఫ్రీజుడిటీ కూడా వుంటుంది. దాన్ని నెమ్మదిగా పోగొట్టి దగ్గరికి తీసుకోవాలి. బలవంతంగా ఆక్రమించుకోబోతే ఆ పెనుగులాటలో ఏ ఆయువు పట్టులో దెబ్బ తగిలేది తెలియదు.
నెలరోజులపాటు నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఈ నెలరోజుల్లో ఆ అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించు! ఆమె మనసు నీదైందా స్వర్గసౌరభాలు తెచ్చి నీ దోసిట్లో పోస్తుంది. అంతవరకు నువ్వు తొందర పడకు."
డాక్టరు తన ఊహకు అందినంతమేరా సలహా ఇచ్చాడు.
మాధవరావుకి మాత్రం విషయం సరిగానే అర్దమైంది.
"అమ్మ, నా కోడలా! నీకు ఈ విద్యలు కూడా తెలుసునన్నమాట!' అనుకున్నాడు.
గదిలో ఏదో మాగజైన్ చదువుకొంటోంది విశిష్ట.
మాధవరావు వచ్చాడు.
