Previous Page Next Page 
తుపాన్ పేజి 50

    '' హేమా! ఎంతసేపయింది నువ్వులేచి?''

    '' చాలా సేపయింది. కథ మళ్ళీ చదవడం  ప్రారంభించాను.''

    '' కళ్ళు  విప్పగానే  నిన్ను  చూచి అదే అనుకున్నాను. నాకు మాత్రం వెఱ్ఱినిద్ర  పట్టింది. యింకా  మత్తు వదలలేదు. కాసేపు  నిద్రపోతా. నువ్వు  పుస్తకం పూర్తికాగానే లేపుతావు కదూ?''

    ఈ  ముక్కలంటూనే లోకేశ్వరి  ప్రక్కమీద  వాలిపోయింది. పడుకున్న పదినిమిషాల్లో లోకేశ్వరి నిదురకూరిందనే  హేమ  భావించుకుంది. కాని లోకేశ్వరికి  నిదురపట్టలేదు.  ఆమె అతిగాఢమైన   నిద్రలో  మునిగి పోయినట్టు నటించడం ప్రారంభించింది.

    హేమసుందరి  త్యాగతికథ   మళ్ళీ తీసింది. మళ్ళీ సోఫాపై  నుంచి లేచి వెళ్ళి కూజాలో  నీళ్ళు తాగివచ్చి,  చదవడం ప్రారంభించింది.
 
   
                                               o           o           o

   
    స్వామీజీ  బోధనలు వింటూ మా అమ్మ   హరిద్వారంలో   వారం రోజులు  ఉంది.  నేను  కైలాస  ప్రయాణానికి   వలసిన  సన్నాహాలన్నీ  స్వామీజీ సలహా  ప్రకారం  చేయడం  ప్రారంభించాను.

    వేడికి ఉన్ని దుస్తులు  కుట్టించుకున్నాను. చేతులకు  తోలు తొడుగులు  కొనుక్కున్నాను. దారిలో భోజనానికి వలసిన  సామగ్రి  సేకరించాను  మాతో  వచ్చేందుకు  ఒక  లేప్చాను  మాట్లాడుకొన్నాను. హృషీకేశం  వెళ్ళగానే  అక్కడ  మా  సామాను  మోసుకువచ్చేందుకు  హిమాలయపు  పొట్టి గుర్రాన్ని  ఏర్పాటు  చేసుకున్నాను. సిగరెట్లు, చుట్టలు, అగ్గిపెట్టెలు  దిట్టంగా  సేకరించాను. ఒక డబ్బా కిరసనాయిలు ప్రైమస్ స్టవ్ నూ కొన్నాను.

    నా  యాత్రాసంరంభం చూస్తూ  స్వామిజీ   నవ్వుకుంటూ ఉండేవారు. ఢిల్లీకి వ్రాసి ఒక చిన్న  డేరా  ఖరీదుకు తెప్పించుకున్నాను. ఆ  డేరాకు రెండు గుఱ్ఱాలు  అదనంగా  మాట్లాడాలట. ఒక చిన్న  మహారాజుకైన ఖర్చు అయినది. నా  సరంజామా  పూర్తికాగానే  మేమంతా హృషీకేశ్   నగరం  వెళ్లాము.

    మా తల్లి  కుడా నాతో ప్రయాణమయితే  స్వామీజీ వద్దన్నారు. అందుకు చాలా కారాణాలున్నాయన్నారు. మా  అమ్మ  స్వామీజీ  ఉపదేశ  ప్రకారం  హృషీకేశ యాత్ర  పూర్తిచేసుకుని  గయ, కలకత్తా, పూరీలమీదుగా భట్టిప్రోలు వెళ్ళడానికి నిశ్చయం  చేసుకున్నది. మా అమ్మ  నన్ను తన గదిలోకి  రమ్మని, ''నాన్నా! నాకు నువ్వు  నమస్కారంచేసి  చాలా రోజులయింది రా. ఒక్కసారి నాకు నస్కారం చేయరా! ''అన్నది.

    మా  అమ్మగారి  ప్రేమ పోగిపోయి, నన్ను ముంచెత్తింది. కరిగిపోయిన  హృదయంతో  అప్రయత్నంగా, నేల సాగిలబడి,  ఆమె పాదాలు రెండు  స్పృశించాను. ''దీర్ఘాయురస్తు. బహుసంతాన  ప్రాప్తిరస్తు. నాన్నా! నువ్వు తిరిగి వచ్చేవరకు నా పంచప్రాణాలు నీతోనే  ఉంటవి. ముందు సంవత్సరం మనమిద్దరం  వేసవికాలంలో మళ్ళా హిమాలయ  యాత్రలు చేద్దాము. ఇప్పుడు నేను జగన్నాథం మీదుగా భట్టిప్రోలు  వెళ్ళి,అక్కడ  నీ కోసం  ఎదురు చూస్తుంటాను'' అంటూ కన్నీళ్ళు తిరుగుతుండగా  కళ్ళుమూసుకొని  ఆశీర్వచన హస్తం  చాపి నిల్చుని ఉంది,పిమ్మట నా తల, హృదయం, భుజాలు, మోము తడివి, పెదవులు కదుపుతూ  నిశ్శబ్దంగా  ఆశీర్వదిస్తూ ''నాన్నా  వెళ్లి సర్దుకో''అన్నది.

    మా  ప్రయాణం ఏదో కొత్తలోకంలో  వలె పదివేల అడుగుల  ఎత్తున వుంటుంది, పదిహేనువేలు, ఇరవైవేల అడుగులవరకూ  ఎత్తు  పెరుగుతూ ఉంటుంది. హిమాలయాలను  తలచుకొంటూ, మా  అమ్మను  తలచుకొంటూ  గంగ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను. గంగామాయీ, మా అమ్మా  ఒకటిగా నాకు తోచారు.  నా  హృదయకలశం   ఏవో  వింత భావాలతో  నిండి  పోయింది. యేవో   తెలియరాని   వేదనలు, అర్ధంకాని  కాంక్షలూ, తెరచాటున ఉన్న   మూర్తులూ, నా  జీవితాన్ని  మూలమంటా   కదల్చివేస్తూ  ముందుకు వచ్చినట్లయింది.

    ఎవరి  బాధలు ఎవరికీ తెలుస్తాయి? ఆవేదనలు కాని, ఆనందాలు కాని  వ్యక్తి సంబంధమైన  గోప్యాలు. నేను  ఈ  ప్రపంచంలో  ఒక్కణ్ణే అయిపోయాను. దుఖంకానీ, సంతోషంకానీ, ఆవేదనకానీ అవి ఎవనిలో ఉద్భవించాయో  వానికే  తెలియకుండా  ఉంటాయి కాబోలు. అవి వ్యక్తం చేసుకున్న  కవీ, చిత్రకారుడూ, ప్రతి  సహృదయుని హృదయంలోనూ పతిద్వనిస్తారు. ఇదే  కాబోలు  వ్యక్తిగత  సృష్టిలోని  విశ్వత్వము.  ఆ  అఆలోచనలో  నాకు కృష్ణశాస్త్రి ఆవేదన అర్ధమైంది. ఆ మహాకవి  మధురుమైన  ఆవేదన  అంతా  అందుకోలేని  సౌందర్యం కోసం, ఆనందం కోసమే కదా! మహాకవీ నువ్వూ నావలెనే  వేదన పడ్డావా? 

    మనుష్యుడు  కోరే  ఆ  సౌందర్యం  ఏమిటో? అది స్త్రీ  స్వరూపంగా ఎక్కువ  సన్నిహితం కావచ్చును. అంతకు తక్కువ, ప్రకృతి సౌందర్యం కావచ్చును.  వీటికి  కొంచెం తక్కువగా మానవజీవిత  సౌందర్యం కావచ్చును.  కాని వీటి  అన్నిటినీ  మించిన  దేనికోసమో  మనలో   ఈ   ఆవేదన సర్వకాలమూ  ఉంటుంది. ఆ  ఆవేదన  మన బ్రతుకుకు  సన్నిహితంగానూ, అతీతంగానూ కూడా  ఉంటుంది.  ఈ  ఆవేదననే  విశ్వనాథ  సత్యన్నారాయణ కవి  సమ్రాట్టు  శ్రీకృష్ణనిర్వేదంగా  పాడాడు. ఈ  ఆవేదన  రసస్వరూపం తాల్చబోయే  దోరపండువంటి  భావం. పండగానే కావ్యం అవుతుంది. ఏవో  నా భావాలు   నా  తల  త్రిప్పివేసినవి. ఎదుట కేదారగౌళ పాడుకుంటూ  గంగానది  ప్రవహిస్తుంది.  గంగానదీ! నీలో  వున్న ఆవేదన ఏమిటీ  అని  ప్రశ్నించాను. అలా  సంతతజన్మయై, సంతత  వేగవతియై, సంతత జీవితయై, సంతత మరణయై, ఏదో మహాభావము సర్వవిశ్వానికి ప్రసరింపచేస్తూ ఉంది.

    '' గంగానదీ  నీ రహస్యము  నేను నీ దారి పొడుగునా ప్రయాణించి, నీ  పుట్టుపూర్వోత్తరాలు  గ్రహించి   నాలో  నీ ఘురీవేగ రాగిణీ స్వరాలాపన  శ్రుతిని  లయింప చేసుకుంటానమ్మా!  నువ్వూ, మా  అమ్మే  నా  ప్రపంచం. నా కింకేమీ అక్కరలేదు. ఈ  స్వామీజీ  నా  చేయి పట్టుకుని  నీ  మాతృహృదయాకాశ  యానం చేయిస్తాడు. నీ  ప్రవాహ  రహస్య  గాథను  అవగతం  చేస్తాడు'' అని అస్పష్టవాక్కులతో  అనుకున్నాను.

                                                         '' నీవు పుట్టెదవోయి!
                                                           నీవు నడచెదవోయి!
                                                           నీలోన ఝురులుగా
                                                           నీలోన  వరదలై
                                                           నేనే  ప్రవహింతునోయీ!''అని గంగ  పాడినట్లయింది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS