Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 50

 

    "నిజంగానే చెప్పడానికి ఏమీ లేదు. నేను చేసినది మాత్రం ఒకే ఒక పొరపాటు. నాగేశ్వరరావు షాపులోంచి రెండు వందల రూపాయల ఖరీదు చేసే వాచీ బయటకు తీసుకు వచ్చేయడం. అదైనా ఆవేశంలో కాసిన పందెం వల్ల చేశాను" అందామె.
    "పందెం కాశావా?" ఏమిటా పందెం?' అన్నాడు రాజారావు ఆతృతగా.
    "దానికీ ఈ దొంగతనానికి ఏమాత్రమూ సంబంధముండడానికి వీల్లేదు. ఇక్కడ్నుంచి రేపు ట్రాన్స్ ఫరై పోతాడనగా నాకోలీగ్ ఒకతను రామచంద్రం అని ఈ పందెం కాశాడు. అందమైన ఆడవాళ్ళ కు దొంగతనం చేయడం సులభమనీ, చటుక్కున ఎవరూ వాళ్ళను అనుమానించలేరనీ, అనుమానించినా చూస్తూ చూస్తూ అడ్డగించలేరని అన్నాడతను.
    "నేను అంగీకరించలేదు. ఆడది అందంగా ఉందంటే అందరూ ఆమె వంకే చూడడం వల్ల దొంగతనం చేయడం అసాధ్యమవుతుందన్నాను. వందరూపాయలు పందెం కాశాడతను. నాగేశ్వరరావు వాచీ షాపు పేరు చెప్పాడతను. వెళ్లాను. ఓ పట్టాన మనస్కరించలేదు. వాచీతో బయట పడుతుంటే అపుతాడని భయం వేసింది. రామచంద్రమే పందెం నెగ్గితే బాగుండునని ఆ క్షణంలో అనిపించింది.
    గేటు దాటేక ఊపిరి పీల్చుకున్నాను. ఎంత అదృష్టం?అప్పుడే సోమసుందరం గారి కారు షాపు ముందు ఆగి, శ్రీమతి సోమసుందరం షాపులోకి వెడుతోంది. నేను ఆమె కళ్ళముందు దొంగగా పట్టుబడి వుంటే ఎంత తలవంపులై వుండేది? మొత్తం మీద రామచంద్రం పందెం నెగ్గాడు. అతడికీ ఈ దొంగతనానికీ ఏమీ సంబంధ ముండడానికీ వీల్లేదు. ఎందుకంటె మర్నాడే అతనిక్కడ్నించి చాలాదూరం బదిలీ అయి వెళ్ళిపోయాడు."
    "సోమసుందరం గారి కంపెనీకి ఆంధ్రా అంతటా బ్రాంచీలున్నాయా?"
    'ఆంధ్రా ఏం కర్మ, ఇండియా అంతటా ఉన్నాయి."
    "అది సరే కానీ, నీ కొలీగ్ పందెం కాయడం, అదే టైములో దొంగతనం జరగడం, కొంచెం వింతగా లేదూ."
    "వింతగానే ఉందనుకో. కానీ అంతకంటే వింత పార్సెల్ లో ఆ వస్తువులు తిరిగి అందజేయడం."
    'అవును. అసలు ఈ దొంగతనం ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు" అన్నాడు రాజారావు సాలోచనగా.
    ఆ రాత్రి రాజారావు చాలాసేపు  తీవ్రంగా ఆలోచించాడు. రమను అతను మనసారా ప్రేమించాడు. ఆమె దొంగదేమోనన్న ఆశ ఏమూలో అతనిలో ఉంది! ఆమె లేకుండా తను బ్రతకలేడన్న అనుమానం కూడా ఉంది! తను కాదంటే అన్నంతపనీచేసి ప్రాణాలు తీసుకుంటుందన్న భయం కూడా ఉంది. ఇవన్నీ కలిపి రాజారావుని క్రమంగా రమ పట్ల సుముఖుణ్ణి చేశాయి.
    మర్నాడతను ఫోన్ చేసి రమకు తన నిర్ణయం చెప్పి, "మీ వాళ్ళ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించు" అన్నాడు.
    రమ బంధువుల ప్రయత్నాల ఫలితంగా రాజారావు అన్నయ్యకి కూడా పెళ్ళి సంబంధం కుదిరింది. ఇద్దరికీ రెండు నెలల్లో వివాహం జరిగిపోయింది.
    

                                    7

    పార్టీ ముగిసింది. రాజారావ్ కొలీగ్స్, రమ కొలీగ్స్ ఇతర స్నేహితులు , వాణీ సైన్సు కాలేజీ ప్రిన్సిపాలు దంపతులు, సోమసుందరం దంపతులు వగైరా అందరూ నూతన దంపతుల్ని అభినందించి వెళ్ళిపోయారు.
    అందరూ వెళ్ళిపోయాక రాజరావూ, రమ కాసేపు అలసటగా సోఫాలో ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. పార్టీ విజయవంతంగా ముగించగలిగినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. తర్వాత నెమ్మదిగా హల్లో అన్ని సర్ధసాగారు.
    వివాహ సమయంలో తమకు వచ్చిన బహుమతులన్నింటినీ రమ ఒక బల్ల మీద చక్కగా అమర్చింది. రిసెప్షన్ పార్టీకి వచ్చినవారు చూడడం కోసం ఆమె ఈ ఏర్పాటు చేసింది. ఇప్పుడిక అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి వాటిని నెమ్మదిగా బీరువాలో కి తరలించవలసి ఉంది. అందులో కొన్ని విలువైన వస్తువులున్నాయి. అలా బల్ల మీద వదిలేస్తే ఎంత నూతన దంపతులైనా వేరే ప్రదేశంలో స్థిమితంగా కాలం గడపలేరు.
    భార్యాభర్త లిద్దరూ ఒక్కొక్క వస్తువునే లెక్కపెట్టి బీరువా లో పెట్టసాగారు. తరలించడం అయింది కానీ లెక్క ప్రకారం ఒక వస్తువు తక్కువ వచ్చింది. అదేమిటో ఇద్దరికీ కూడా వెంటనే స్పురించలేదు. చాలాసేపు ఆలోచించాక అదేమిటో గుర్తుకు వచ్చింది. ఇద్దరకూ ఒకేసారి. దాంతో గుండె గుభేలుమంది. ఎనిమిది వందలు ఖరీదు చేసే ఒక వజ్రం అది. రమ అక్క, బావలు అది వివాహ దినం నాడు బహూకరించారు. తర్వాత దానిని ఏదైనా ఉంగరంలో పొదిగించుకోమని రమ అక్క ఆమెకు సలహా కూడా ఇచ్చింది.
    విందుకు వచ్చిన అతిధులందరూ గొప్పవారూ, పెద్ద మనుషులూ కావడం వల్ల దంపతులిద్దరూ అజాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడెం చేయాలి? వస్తువు ఖరీదు మాత్రమే కాదు, వివాహ దినం నాడు వచ్చిన బహుమతి కావడం వల్ల ఆ చిన్న వజ్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
    బల్ల మీద మరోసారి వెదికారు. బీరువా అంతా మరోసారి గాలించారు. హాలంతా వేయి కళ్ళు చేసుకుని వెదికారు. రమ చీపురు తెచ్చి హాలంతా తుడిచింది. హాలు శుభ్ర పడింది కానీ వజ్రం అంతు దొరకలేదు.
    దంపతులిద్దరకూ  మతి  పోయినట్లయింది. మనసు పూర్తిగా పాడయింది. ఎలా పోయివుంటుంది. ఎవరు తీసి వుంటారూ అని తర్జన భర్జన చేసుకున్నారు. అనుమానిస్తే అందర్నీ అనుమానించవలసిందే. కానీ అందులో ఏ ఒక్కరూ దొంగ అయి వుండే రకం మనిషి కాదు.
    రాజారావు దృష్టిలో ఎంతో కొంత అనుమానాస్పద చరిత్ర గల మనిషి రమ ఒక్కటే. అయితే అతనా మాట పైకి అనలేదు. ఆమె మనసు గాయపరచడం తప్ప ప్రయోజనముండదు. పోయిన వస్తువు కూడా రమదే. అందువల్ల ఆమె తీసే అవకాశం లేదు.
    ఆరాత్రి నిరుత్సాహంగా గడిచింది. తెల్లావారింది. వెలుగులో మరొక్కసారి వెతికి వజ్రం పోయినట్లు రూడీ చేసుకున్నారు.
    ఒకటి, రెండు, మూడు రోజులు గడిచిపోయాయి. వస్తువు పోయినందుకు కొద్దిగా బాధ అనిపించినా క్రమంగా దంపతులిద్దరూ కూడా మనస్సు సరిపెట్టుకో గలిగారు. ఎటొచ్చీ తమ దాంపత్య జీవితాని కిది అపశకునం కాకూడదని రమ దేవుడిని పదేపదే ప్రార్ధించుకుంది. అసలే రాజారావు దృష్టిలో తను దొంగ అన్న అనుమాన మొకటి ఉంది. అది ఇంకా నివృత్తి కాలేదను కుంటే ఇది మరో రకం అపశకునం.
    నాల్గవ రోజు కాలేజీలో వుండగా రాజారావు పేరిట ఒక రిజిస్టర్ పార్సిల్ వచ్చింది. తనకు పార్సిల్ ఎక్కడి నిండా అని ఆశ్చర్యంగా ఫ్రం అడ్రస్ చూసి ఉలిక్కిపడ్డాడు. పి. కామరాజు, హౌస్ నంబరు 63-5-101 , బంగారు వారు వీధి, రాజన్న పేట. అతను ఆతృతగా పార్సిల్ విప్పాడు. అందులో ఒక నీలం రుమాలు మూటకట్టి వుంది. రుమాలు ముడి విప్పితే ఒక ఎర్రని కాగితం, అందులో వజ్రం.
    రాజారావు ఉత్సాహానికి అంతు లేదు. పోయిందనుకున్న వజ్రం దొరికింది. ఎనిమిది వందల రూపాయల విలువగల వస్తువు. పోయి దొరకడం మాటలు కాదు. తను ఎంతో అదృష్టవంతుడు. కాదు, కాదు ఇది రమ అదృష్టం. అన్నట్లు రమ....    
    రమను తను అనుమానించిన దొంగతనాల్లో కూడా ఈ పార్సేలూ , ఈ కామరాజు ఉన్నారు. ఎవరీ కామరాజు? ఇతగాడు తన ఇంటికి విందుకు వచ్చిన వారిలో ఉన్నాడా? దొంగ తన మెందుకు చేశాడు? వసువు తిరిగి ఎందు కిచ్చేశాడు?
    వజ్రాన్ని జేబులో వేసుకుని రాజారావు ఒకసారి రుమాలుని పరీక్షించి చూశాడు. రుమాలుకి ఒక మూలగా విత్ లవ్ ఫ్రం 'ఆర్. టు ఆర్ ' అని వుంది. రాజారావు కి హటాత్తుగా గుర్తుకు వచ్చింది. ఈ రుమాలు తను ఒక సంవత్సరం క్ర్తితం రమకు బహుకరించాడు. తను రమకిచ్చిన రుమాలు ఈ కామరాజు దగ్గరకు ఎలా వచ్చింది?
    రాజారావు ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. కామరాజేవాడన్న బెంగా, వాడికీ రమకూ గల సంబంధ మేమిటన్న అనుమానంతో పాటు మరో ఆలోచన కూడా అతని మెదడులో మెదిలింది. తనకు రమ మీద కొన్ని అనుమానాలున్నాయని తెలుసు కాబట్టి, తన వస్తువు తనే దొంగలించి కామరాజు పేరుతొ తనకు పార్సెల్ చేస్తే తన మీద గల అనుమానాలన్నీ పోతాయని రమ అనుకుందేమో, ఆటువంటప్పుడీ రుమాలు ఎందుకు వాడిందీ? ఇంతకాలం ఎంతో తెలివిగా ప్రవర్తించి, ఇంత చిన్న తప్పు చేసి దొరికి పోతుందా?
    ఏమైనా తన భార్య గురించి మరీ ఎక్కువగా ఆలోచించ దల్చుకోలేదు రాజారావు. అన్నింటికీ తెగించే ఆమెను వివాహమాడాడు. ఇలా అనుక్షణం అనుమానించడం మంచి భర్తల లక్షణం కాదు. విషయాన్ని నిర్భయంగా ఆమెతో చర్చించడమే మేలనుకున్నాడతడు.
    తక్షణం అతను ఇంటికి వెళ్ళి భార్యకీ విషయం చెప్పాడు. పార్సెల్ ఓ తిరిగి వజ్రం వచ్చిందని విని ఆమె ఏంతో ఆశ్చర్య పోయిందో చెప్పడం కష్టం. "ఆ కామరాజు డేవడో కానీ వాడికి శతకోటి ధన్యవాదాలు. బహుమతిగా వచ్చినప్పటి కంటే ఎక్కువ ఆనందంగా ఉంది నాకు" అంది రమ.
    "కానీ ఆ వజ్రం ఒక రుమాలులో చుట్టబడి వచ్చింది. ఆ రుమాలు ఇది" అంటూ రాజారావు అమెకా రుమాలు కూడా ఇచ్చాడు. రమ దాన్ని పరిశీలించి చూసింది. "ఇది, ఇది" అంటూ ఆమె ఆలోచనలో పడిపోయింది.
    రాజారావు ఆమె వంకే పరిశీలనగా చూస్తున్నాడు. హటాత్తుగా ఆమె ముఖంలో మెరుపు కనబడింది. "ఈ రుమాలు శ్రీమతి సోమసుందరం గారి దగ్గరుండాలి. పార్సిల్ లో కేలా వచ్చింది?' అందామె తన్ను తానె ప్రశ్నించుకున్నట్లు.
    "ఏమిటీ?'అన్నాడు రాజారావు నమ్మలేనట్లు.
    "అవును. ఒకరోజు నగల షాపులో ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరి రుమాళ్ళు తారుమారయ్యాయి. ఇద్దరం షోకేసు మీద రుమాళ్ళు వదిలి నగలు పరిశీలిస్తున్నాం. తరువాత తీసుకోవడం లో ఒకరిదోకరు తీసుకున్నాం. సెంటు వాసన మార్పు బట్టి నేను వెంటనే గ్రహించాను కానీ ఆమెను అడగడానికీ భయపడ్డాను. చాలా గొప్పింటావిడ కదా మరి. కానీ ప్రేమ కానుక సామాన్యమైనది కాదు. వెతుక్కుంటూ మళ్ళీ నన్ను చేరింది."
    
                        *    *    *    *

    "హలో, వాణీ సైన్సు కాలేజీ కెమిస్ట్రీ డిపార్ట్ మెంటేనా?"
    "ఆ"
    "డిటెక్టివ్ బ్రహ్మచారిగారేనా మాట్లాడుతుంటా."
    "ఎవరది -- రమా?"
    "ఆ నేనేనండీ మీ అసిస్టెంటు రమను. అర్జంటుగా సెలవు పెట్టి ఇంటికి వచ్చేయండి. మీ కామరాజు కేసు రహస్యం చేధించబడింది" అవతల ఫోను క్లిక్ మంది.
    రాజారావు ఇంటికి వచ్చేసరికి రమ చక్కగా అలంకరించు కొని గుమ్మం దగ్గర చిరునవ్వుతో నిలబడి ఉంది. అతను లోపలకు రాగానే "ఇంతవరకూ నేను ఒకే ఒక్క దొంగతనం చేశాననీ, అదీ మీ హృదయాన్ననీ ఈరోజుతో ఋజువై పోయింది" అంది.
    "ఏమిటో వివరంగా చెప్పు రమా. నాకు చాలా కుతూహలంగా ఉంది" అన్నాడు రాజారావు ఆత్రుతగా.
    "ఈరోజు ఆఫీసుకి వెళ్ళి సోమసుందరం గారిని కలుసుకుని రుమాలు చూపించి వజ్రం దొంగతనం సంగతి చెప్పాను. అయన ముఖం పాలిపోయింది. ముందు దబాయించడానికి ప్రయత్నించి తర్వాత నిజం ఒప్పేసుకున్నారు. అంతేకాదు, ఇప్పుడొక కొత్తరకం ఒప్పందం కూడా కుదుర్చుకు వచ్చాను."
    రాజారావు నోరు తెరచి వింటున్నాడు.
    అయన భార్యకు అందం ఉంది. హోదా వుంది. డబ్బు ఉంది. యీ మూడింటితో పాటు ఓ చిన్న వ్యాధి కూడా వుంది. డ్రిస్తోమానియాన్ ఆవిడ. అంటే ఎక్కడకు వెళ్ళినా చిన్న చిన్న దొంగతనం చేయకుండా ఉండలేదు. దొంగతనం చేయడం లో నేర్పయితే ఉంది కానీ ఆ దొంగతనం అవసరం ఆమెకు లేదు. వివాహమైనాక తన భార్య కున్న రోగం గుర్తించాడాయన. అందుకోసమని ఆమెను ఇల్లు కదలకుండా ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతకాలమని ఆపుతాడు? జైల్లో వున్నట్లు ఆమె ఎంతకాలం ఇంట్లో గడుపుతుంది? అలాగని బయటకు వదిలితే, తన పరువు పోయే పనులు చేస్తుందామె? చిట్టచివరకు ఆమెను షాపింగ్ కు వదలక తప్పలేదాయనకు. అప్పుడాయన తెలివిగా పధకం వేసి నా కొలీగ్ రామచంద్రాన్ని నామీద ఉసి గొలిపాడు. నన్ను ఒక షాపువాడి దృష్టిలో అనుమానాస్పదురాలిని చేశాక తన భార్య షాపింగు కు వెళ్ళినప్పుడల్లా ఆమెకు నన్ను తోడుగా పంపడమో లేక ఆ ప్రాంతాల నేనుండటమో చేశాడు.
    తన భార్య షాపింగు నించి వచ్చేక ఆమెను సెర్చి చేసి ఆ వస్తువును మళ్ళీ పార్సెల్ లో వెనక్కి పంపిస్తున్నాడు.
    వివాహమయ్యాక అయన ఇబ్బందు లేక్కువయ్యాయి పాపం."
    రాజారావు కు కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. "ఎంత విచిత్రమైన నిజం. ఇలా అయన ఎంతకాలం ఇబ్బంది పడతాడు" అన్నాడతను.
    "వచ్చే వారంలో బొంబాయి లో ఆమెకు సైకోట్రీట్ మెంటు ఇప్పిస్తున్నాడట. ఈ విషయాలన్నీ రహస్యంగా ఉంచవలసిందిగా నన్ను కోరేడాయన. మన వివాహ సందర్భంగా పది వేల రూపాయలు బహూకరించాలనుకున్నాడట. అంతా క్యాష్ రూపంలో ఇచ్చాడు."
    రాజారావు కు అనుమానపు తెరలన్నీ తొలగిపోగా తేలికైన హృదయంతో రమను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. రమ హృదయం ఆనందంతో నిండిపోయింది.

                                                              ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS