పాడు లోకం
క్షమించాలి : కాని ఈ యిద్దరు మనుష్యుల్నీ
కలుసుకోవడం వారి సంభాషణా (క్రిందనే వ్రాయ బోతున్నాను
అదంతా). ఇవి జరిగిన పరిస్థితులూ- అన్నీ కూడా ఏదో
భయంకరమైన న్యూస్ పేపర్ కు సీరియల్ లాగున్నది.
ఓ పెద్దనగరంలో ఒకరాత్రి ఇదంతా జరిగింది. ఆనగరం 'ప్యారిస్' అనే అనడానికి వీల్లేదు. కాదనికూడా చెప్పడం కష్టం. ఒక నదిగట్టున ఇది జరిగింది. 'సేమ్'నదే అనడానికి వీలు లేదు. కాదనికూడా చెప్పలేము. ఏమంటే ఒక నదికీ మరొకనదికీ విశేషం భేదమేముంటుంది? చిమ్మచీకటి అప్పుడు చంద్రుడు లేడు. ఒంటిగంట అవుతుంది. వీధిదీపాలలో సగం ఆరిపోయాయి. అంచేత నదిలో పడవలున్నాయో లేదో తెలియలేదు. కాని అంత అంధకారంలో కూడా చలికాలపువానతో ఉప్పొంగి, నల్లనినీళ్ళతో ప్రవహిస్తున్న ఆ నది చావుబ్రదుకుల విభేదాన్ని తుడిచి వెయ్యడానికి సమర్ధంగా ఉన్నది. ఉరవడి తో ప్రవహిస్తున్న నీళ్ళు ఆత్మహత్య చేసుకోదలచు,కున్నవాళ్ళకు సులువుగా యమలోకానికి తీసుకుపోతామని ఆహ్వానిస్తున్నాయి.
నిజానికి జనసమ్మర్ధంతో క్రిక్కిరిసిన ఆ నగరంలో ఏడాది మొత్తంమీద చనిపోయే అయిదేసి వందలమందిలో నూరుగురు ఆ నదినే తమ పరలోక ప్రయాణానికి మార్గంగా ఎన్నుకున్నారు.
చవకగా చనిపోవాలనుకున్న మనుష్యులంతా ఈనదిని ఎన్నుకోవడం స్వాభావికమే కాని ఇతరులు కూడా ఇందులోనే పడుతున్నారు. ఏమంటే వార్తాపత్రికలన్నీ నీటిలోపడి చావడానికి మంచి ప్రాముఖ్యం ఇచ్చాయి. ఆ సంఘటన లన్నింటినీ వన్నెచిన్నెలతో వర్ణిస్తూ అట్టి మరణాలలో ఆకర్షణ హెచ్చించాయి. వీటిని చదువుతూ 'ప్రజలు ఇలాగే చచ్చిపోవాలని' కోరుకుంటారు. ఇక నదిలో పడిపోదలచుకున్న వాళ్ళందరికి తూర్పుకొస బాగా నచ్చినట్లు కనబడుతుంది. ఈ స్థలం ఏకాంతంగా ఉంటుంది. ఇటు నగరం ఇంకా బాగా పెరుగలేదు మళ్ళీ ఇక్కడ ఎడమగట్టు వాళ్ళకి ఇష్టం చనిపోయేవాళ్ళకు కూడా పద్దతులూ, పూర్వాచారాలూ ఉన్నట్టు తోస్తుంది.
సరే ఆ చీకటిరేయి ఒక మనిషి ఊరొకొసను నదికి ఎడమగట్టున తిరుగుతున్నాడు. అంత వృద్దుడూ అంత యువకుడూ కాకుండా, అంత పొడుగునా అంత పొట్టిగా లేకుండా, అంత తెలివీ అంత మూర్ఖత్వం లేని సామాన్యుడు అందరూ అతన్ని (ముఖ్యంగా పోలీసువాళ్ళు) ట్రిస్టాన్ మార్టినెజ్ అని ఎరుగుదురు.
నది ఒడ్డున పర్యటనం చేస్తున్న ఈ విషాదజీవి జేబులో కొన్ని దస్తావేజుకట్టలున్నాయి వాటిలో కొన్ని ట్రిస్టాన్ మార్టినెజ్ పేరిట మరికొన్ని ట్రిస్టానో మార్తినీ అనీ ఉన్నాయి. ఇవన్నీ అప్పుపత్రాలే. వాటితోబాటు మరో కాగితంకూడా ఉన్నది. అది ముఖ్యరక్షకభటాధి కారి దివ్యసముఖానికి ఇతడు రాసిన ఉత్తరం అందులో కేవలం ఈమాటలు ఉన్నాయి.
"సంఘానికి, నా అప్పులవాళ్ళకీ
నాకు వీలయిన ఈ ఒక్కమార్గంగా ఋణం తీర్చుకుంటున్నాను.
(సం) ట్రిస్టాన్ మార్టినెజ్
(ట్రిస్టానో మార్టినీఅనేవాని మారుపేరు. తండ్రి....ఫలానా ఫలానా)"
ఐనా ఈ ఉత్తరం జేబులో వేసుకుని తిరుగుతున్న మనిషి దుక్కలా గున్నాడు. హాయిగా జీవితం గడుపుతున్నాడు. హాయిగా జీవితాన్ని గడపడానికే తనకున్న కొద్దిపాటి తెలివినీ, జిత్తులనూ ఉపయోగించాడు. వీలయినన్ని విధాలుగా జీవితంనుండి సుఖాలను పిండుకున్నాడు. ఇప్పటికీ సాధ్యమైనంత దీర్ఘకాలం తనప్రాణాన్ని తన శరీరంలోనే ఉంచుకుందామని ఉద్దేశం. అయితే అందుకు తనపేరుమాత్రం ఇబ్బంది కలిగిస్తోంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే రెండుపేర్లనూ వదలగొట్టుకొని మరేమీ ప్రమాదం లేకుండా తప్పించుకొనవచ్చును.
అందువల్ల గతించిన రెండువారాలుగా ప్రతి రాత్రీ ఈ నదిఒడ్డున తిరుగుతున్నాడతడు. ఆత్మహత్య చేసుకుందామని కాదు. 'ఆత్మహత్య చేసుకునేవాడెవడైనా దొరుకుతాడా అని.
మొదట అతని ఆలోచన మరోవిధంగా పోయింది. సాంకేతికమైన ఆత్మహత్య చేద్దామని చూశాడు. అంటే ఏదో తన పాతకోటూ, హేటూ ఒడ్డున వదలిపెడితే చాలనుకున్నాడు. ఆకోటు జేబులో పత్రాలన్నిటినీ వదలిపెట్టడం, రైలెక్కి చాలాదూరం దాటిపోవడం కాని చిక్కేమిటంటే పోలీసులూ అప్పులవాళ్ళూ కేవలం ఒక పాతకోటులో దొరికిన 'నేను చచ్చిపోయాను' అనే వాక్యంతో తృప్తిపడతారా అని! తన శవం కనబడాలి. అప్పుడు అన్ని అప్పులు తీరాలి. కాని బ్రదికి ఉంటూనే 'నేను శవాన్ని' అని స్థాపించుకోవడానికి ప్రస్తుత నిరంకుశ ప్రభుత్వం అంగీకరించదు.
తర్వాత అతనికి తట్టిన భావం అమోఘమైనది. తనకోటు తొడుక్కున్నశవం నీళ్ళలో దొరికితే అప్పులవాళ్ళ పీడ వదలుతుంది. అయితే దీనికోసం ఒక హత్య చెయ్యాలా తాను? ఎంతమాత్రం కాదు. ట్రిస్టాన్ మార్టినెజ్ అన్న పేరుతోనూ, ట్రిస్టానోమార్టినీ అన్న పేరుతోనూ తాను చాలామార్లు శిక్షపొందాడు కాని ఎవ్వడూ ఈ రెండు పేర్లూ ఉన్న వ్యక్తి మరొకమనిషి మీద చెయ్యివేశాడని చెప్పలేడు. తన వ్యవహారమంతా ధనసంగ్రహంతో సంబంధించినది మనుష్యులనుండీ పెట్టెలనుండీ, కేవలం న్యాయంగానే సంగ్రహించే వాడని చెప్పడానికి వీలు లేదు.దాన్నే తాను ప్రోత్సాహం అంటారు. ఇతరులు మోసం అంటారు.
ప్రస్తుతం ప్రోత్సాహంమీద తాను ఆధారపడ్డాడు. ఎలాగంటే - ఆత్మహత్య చేసుకుందామని ఇదివరకే నిశ్చయించుకున్నవాడూ, దానికి ఇంచుమించు సరిపోయే ఒడ్డుపొడుగులు గలవాడూ ఎవడైనా ఒకవ్యక్తి దొరికితే వాడికోటును జ్ఞాపకార్ధం వదలవయ్యా అని కోరి తనకాగితాలను పంట్లాం జేబులో ఉంచుకొని చచ్చిపొమ్మని ప్రోత్సాహం చెయ్యలేకపోతానా అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేవాడు ఇలాంటి విషయాలలో అట్టే పట్టింపులు పెట్టుకోడనే నిశ్చయం ఇక ఒడ్డున తనకోటు దొరికి, నీటిలో కుళ్ళుతున్న శవం దొరికిందంటే తాను బతికిపోయినట్టే! ఇన్నాళ్ళూ ఇబ్బందిపెట్టిన తనపేర్లు నీటిలో కలిసిపోతాయి. తర్వాత మరోకొత్త పేరూ, కొత్తజీవితం ఇంకే ఉపాయం లేకపోతే కొత్త ఉద్యోగం చూసుకోవచ్చు.
ఇంతవరకూ పాపం ట్రిస్టానోకు అదృష్టం కలిసిరాలేదు. ఈ రెండు వారాలనుండీ తనకిక్కడ కనబడ్డది ఒక్క మనిషి మాత్రమే. అదైనా ఒక పండుముసలిది. ఆత్మహత్యకోసం కూడా కాదు - చాలా చిక్కులలో ఉన్నాననీ అయిదు 'లైరులు' మాత్రం ఇప్పించమనీ తన్ను కోరింది అంతే! తర్వాత ఒకయువకుడు అటు వచ్చాడు. నల్లటి దుస్తులతో ఆత్మహత్య చేసుకునే రకంలాగే కనబడ్డాడు. తీరా అతన్ని సమీపించి తనకోరిక తెలియజేసేసరికి వాడు ఉగ్రుడై 'నిన్నే నీళ్ళలో తోస్తాను. జాగ్రత్త!' అన్నాడు. క్షమాపణలు చెప్పుకుంటూ ట్రిస్టానో వచ్చేశాడు. బాగా ఆశాభంగమయింది. ఇక యత్నం వదులుకుందామా అనుకున్నాడు. కాని ఇది చాలా అవసరమైనదిగా కూర్చుంది. తాను మరి రెండు మూడు రోజుల్లో ఎడ్జస్టు కావడానికి సిద్దంగా ఉన్నాడుగా!
తుదకు ఆ సాయంకాలం రెండు గంటలనుండీ వేచివేచి అలసిపోయి ఒక చప్టామీద కూర్చున్న సమయానికి దూరంనుండి రోడ్డు బాగుచెయ్యడానికి వెయ్యబడ్డ కంకరరాళ్లపోగుకు వెనుకగా ఒకమనిషి తనవంకనే వస్తూ ఉండడం చూశాడు. ట్రిస్టానో నిపుణదృష్టికి వస్తున్నవాడు శాంతంగాపోయే మామూలురకం మనుష్యులలో వాడు కాదని స్పష్టంగా కనబడ్డది. 'అనుమానపు మనిషి'కి కావలసిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నవి. ఈ లక్షణాలు వ్యక్తులతోబాటు మారుతూనే ఉంటాయి. కాని తత్వం తెలిసినవాళ్ళకు అవి కరతలామలకం. ఈ వస్తున్నవాడు నేరంచేసే రకం కూడా కాదు. ఆ నడకలో కొంత ఆందోళన కనపడుతున్నది. రాత్రులు నేరాలకు బయలుదేరే వాళ్ళలో చాలా శక్తి సాహసం కనబడాలి.
అనుమానపు మనిషి ఇటు వీధిలోనికి మళ్లాడు. తనదాకా వచ్చాడు. రెండడుగులలో కలుసుకుని దాటిపోయాడు. తన్నుచూసి ఏదో కళవళపాటుతో హేటు కళ్ళమీదికి లాక్కున్నాడు తొందరగా గడిచిపోయాడు.
తన దృష్టినుండి తప్పించుకోకుండా ఉండాలని ట్రిస్టానో అతన్ని వెంబడించాడు. తన్ను ఎవరో వెంబడిస్తున్నట్లు గ్రహించి ఆ మనిషి నడకజోరు చేశాడు. నదిప్రక్క ఎత్తయిన ఒక పిట్టగోడ ఎక్కిపోయాడు. కటకటాలమీద ఒక కాలుపెట్టి ఇక నీళ్ళలోనికి దుముకడమే తరువాయిగా ట్రిస్టానో ఒక పరుగుపెట్టి అతడ్ని అందుకొని, 'ఒక్కక్షణం, ఒక్కక్షణం ఆగండి అని ఆదుర్దాగా అరిచాడు.
ఆమనిషికి వేదనపాటి లాఘవం లేకపోయినందున అతని ప్రమాదపు కొంటెతనం పూర్తి అయిందికాదు. అందువల్ల సమయానికి ట్రిస్టానో అతనికోటు చివర అందుకొని లాగడానికి అవకాశం కలిగింది.
అవమానింపబడ్డట్టు కనబడుతూ ఆ అపరిచితుడు నేలకు దిగిపోయాడు. వెనక్కుతిరిగి కోపంగా 'వదిలిపెడతావా, లేదా?' అన్నాడు.
'కాని ఒక్కక్షణం వినాలి నామాట?'
'చెబుతున్నాను కాదు. వదిలేసెయ్ మొదట! ఏమిటి నీ ఉద్దేశం? పోలీసు స్టేషనుకుగానీ నన్ను తీసుకువెళతావా?'
'అబ్బే ఎంతమాత్రం కాదు'
'అయితే ఆసుపత్రికి కాబోలు, సరే, నాకు శవాలగదిలో కనబడాలని ఉంది!"
మళ్ళీ ఎక్కబోతున్నాడు. కాని ట్రిస్టానో అతన్ని మళ్ళీ వెనక్కిలాగాడు రెక్కపట్టుకొని కోటుమీద కొన్ని చిరుగులు కనపడ్డాయి. ఆ దీనుడు చాలా జాలిగా.
'నిన్నేంచేశాను నాయనా? నేను చచ్చిపోవడం చూడలేకపోతే దూరంగా పోకూడదూ" నేను నేను మీరు వెళ్ళిపోయేదాకా కావలిస్తే ఆగుతాను.' అన్నాడు.
'మీయిష్టం వచ్చినట్లు చెయ్యడానికి నేనేమీ అభ్యంతరం చెయ్యను. మొదట నా మాటలుమాత్రం వినండి'
