చిన్నబాబు
పూవుల రోజులు గడచిపోయె; విషాద హిమావృతాంధకారా
విలమయ్యె ఈ ప్రకృతి యంతయు; ...
- శ్రీ సత్యనారాయణశాస్త్రిగారు
శిశిరాగమ వేళయది. మాఘమాసము లోకానికి మంచు
తెరలు కట్టుచున్నది. హేమంత నిశీధినులే పరిపక్వము
చెంది పవళ్ళను కొరికి బహుదీర్ఘములగుచున్నవి. వత్సరాని
కావహించిన వార్ధక్యము జీర్ణపర్ణపుంజీ భూతములైన చెట్టు
చేమలలో స్పష్టవిస్పష్టమగు చున్నది. పువ్వులతోబాటు
ప్రకృతికి నవ్వులును లేవు.
అట్టి ఆకాలమున ఆకసమాక్రమించినది మేఘమాలికలు. తదీయ విజయభేరి వరించిన దురుముల మిషమున మరు నిమిషమున జగతిని ముంచెత్తినది కుంభ ద్రోణముగా కురిసిన వాన.
శీతకాల వర్షార్భటి చిత్రాతి విచిత్రము. ప్రకృతికది రుజాపు పీడనము బోలినది. దరాహతులలో దైన్యమొక్కటే ధ్వనించుచుండును.
ఆ ప్రకృతి దైన్యమే ప్రాణముగొన్న విధాన ఒక కుక్కపిల్ల చలిచే గజగజ వడకుచు మంద్రరవళి నాక్రందించినది. ఆ చలిలో, వానలో, ఆ దరిద్ర దీన నాదరించువారున్నారా అని ప్రకృతి మాత ప్రశ్నించినది. అంతకుముందే అది యరచిన ఆక్రోశమొక్క పసియెడందరో ప్రతిధ్వనించి యుండెను. ప్రకృత్యాదేశమును పరిపాలించుట కట్లుగా, అట్లుగా కుక్కపిల్లను చేరినాడు చిన్నబాబు.
ఆ బాలుని అమృత శీతల లోచనాంతముల యందు ఘ్రుణాస్ర పూతనిధులే కలవు. నవనీత ప్రసన్నమగు నాతని లేతగుండెలలో వత్సల తారసాపగలే కలవు.
పదిలముగ కుక్కపిల్ల నెత్తికొని చిన్నబాబులోనికి తీసికొని వెళ్ళినాడు. పాలు త్రాగించి సేదదేర్చినాడు. దానిలో కళాకాంతులు స్ఫీతమైన క్షణము బాలునిలో సుదృఢహృదయ శాంతియు నెలకొన్నది.
బాలుడు కుక్కపిల్ల కన్నులలోనికి చూచినాడు. అర్ధమెరుగరానివా దృక్పాతములు బాలుని కన్నులలో సంత్రుప్తి. కుక్కపిల్ల కన్నులలో కృతజ్ఞత అన్వయించినచో తదీయమిదోబంధనమున వారియందు స్నేహబంధనమైనదని చెప్పవచ్చును. ఆ స్నేహము నామోదించిన ప్రకృతికూడా సుశీత హిమాశ్రువులు వేలార్చినది.
౨
'అన్నయ్యా, పెంచుకోవడం అంటే ఏమిటి?'
'నువ్వు, మమ్మల్ని వదలిపెట్టడం, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం.'
'వాళ్ళ ఇంట్లో నన్నెందుకుండనిస్తారూ?'
'నిన్ను పెంచుకుంటారు కాదూ మరి?'
'ఐతేను నేనిక్కడికి మళ్ళీ రాకూడదూ?'
'నువ్విక్కడికి రావు మేమే అప్పుడప్పుడు వచ్చి చూస్తూంటాము.'
'మరి నేనిక్కడ ఉండిపోవాలి కదా, నాతో మీరెవరూ రారుకదా పోనీ నా కుక్కపిల్లని తీసుకుపోవచ్చునా?'
'... ...'
'పాపం అదేమి చేసింది? నాతోనే ఉంటుంది. నేనంటే దానికెంతో ఇష్టం'.
'వాళ్ళది ఆచారమైన కుటుంబం కదా కుక్కపిల్ల నక్కడ నిలవనిస్తారూ?'
'అన్నయ్యా ఆచారమంటే ఏమిటి?'
'మడి కట్టుకొని ఉండడం. మడి కట్టుకొని భోజనం చేయడం.'
'పోనీ కుక్క కూడా మడిగానే ఉంటే?'
ఈ మాటకు అన్న నవ్వినాడు. ఇట్టి తమ్ముని వదలుటే ఇష్టము లేదనుకొన్నాడు కాని తన ఇష్టముతో ఏమి పని?
అన్న మాట్లాడక పోవుట చూచి చిన్నబాబు 'అన్నయ్యా పాపం కుక్కపిల్ల నాతో ఉంటేనేమి? అదంటే నాకు ఇష్టమే,' అన్నాడు.
'నీకక్కడ ఉపనయనం కాబోతున్నది. అప్పుడు పక్కనికుక్కపిల్లని కూచోబెట్టుకుంటారా ఎవరేనా?'
'ఉపనైనమా? అంటే?'
'ఒడుగన్నమాట, నువ్వు బ్రాహ్మడివవుతావు, బ్రాహ్మలు కుక్కల్ని ముట్టుకోరు.'
'ఇప్పుడు నేను బ్రాహ్మన్ని కానూ? ఇప్పుడు నేను కుక్కని ముట్టుకోలేదూ' నాయనమ్మ నన్ను పెద్ద బ్రాహ్మడి వంటుందే!'
'మనింట్లో మనకి తప్పులేదు మనింట్లో అయినా ఒడుగునాడు కుక్కని ముట్టుకుంటారా?'
'పోనీ తరువాతో?'
'తరవాత మాట చూసుకోవచ్చునులే. మొదట అక్కడికి కుక్కపిల్లని పట్టికెళ్ళకూడదు.
'బరువవుతుందనేనా? పోనీ ఆ తరవాత నా కుక్కపిల్లని తెచ్చిపెట్టవూ అన్నయ్యా'
'అలాగే తెస్తాను కానీ మొదట అక్కడ ఉండడం నీకు ఇష్టమేనా? ఆ పల్లెటూరిలో నీకు కాఫీ ఉండదులే.'
'మరేమిటి ఉంటుంది?'
'చద్ది అన్నం గేదె పెరుగూ, ఆవు నెయ్యి?'
"అయితేనేం? నాయనమ్మ ఇదే మంచిదంటుంది వంటికి.'
'అయితే నువ్వక్కడికి వెళతావన్నమాటే, అక్కడ నీకు ఆడుకుంది కెవ్వరూ ఉండరులే!'
'నాకు కుక్కపిల్ల ఉంటే అదే చాలు!'
౩
ఆ పల్లెటూరి అగ్రహారమున ఆచారమగు కుటుంబములే కలవు. అన్నియు చూచినంతనే బ్రాహ్మలు గృహములుగా పరిచయము కాగలవు. ఒక ఇంటిలో ఇప్పుడు చిన్నబాబు దత్తపుత్రుడు.
అతని ఉపనయనము జరిగినది. వటూత్తంసుడతడు! ద్విజుడు! ఉపనయనా నంతరము బంధువులందరు బయలుదేరి పోవుచున్నారు. చిన్నబాబు అన్నయు బరువైన గుండెతో పయనమగుచున్నారు వెనుక ఎవరో పిలువగా తిరిగిచూచి ఆగినాడు.
చిన్నబాబు దగ్గరగా వచ్చి 'అన్నయ్యా కుక్క పిల్లని తెచ్చిపెట్టవూ?' అన్నాడు. ఎట్లు గడిపినాడో ఈ రోజులు ఇప్పుడు మరల ఒక్కమారుగా కెరటమైపొంగిన దాతనిలో యాతన కుక్కపిల్ల కావలె - నిప్పుడతనికి.
అన్న సమ్మతి నగపరచినంత చిన్నబాబునకు శాంతి చేకూరినది క్షణక్షణ నిరీక్షణమే ఇప్పుడాతని పని.
౪
చలి గజగజ వడకించెను
జగతి గ్రమ్మెనంధకారము.
ఆకస మాక్రమించినవి మేఘమాలికలు లోకమును ముంచినది వర్షధార. ప్రకృతి నొక్కట ప్రబలముగ నూగించినది చలి, జగతికి కారుక్రమ్మిన చీకటి కప్పికొనుటకు కంబళియైనది.
చిన్నబాబు వ్యాధిగ్రస్తుడు, నిరీక్ష ఫలింపక నిరాశచే నిస్పృహ కలిగి అతని మనస్సు వాడి మ్రోడైనది. అన్న ఎన్నాళ్ళకును రాకపోవుటచే బాధమాత్రమే ప్రబలమైనది. కాని అతడేల రాలేదో బాలకుని కిచ్చట ఎట్లు తెలియును?
అన్న ఎందుకు రాలేదు? తమ్ముని అవసరము ఆత్రుత అతనికి పూర్తిగా తెలియునే! అయినను అతడు రాలేదు. ఎట్లు రాగలడు. ఏ చేతులతో రాగలడు? ఇంటిలో కుక్కపిల్ల లేదు అందరును ఊరికి పోయినప్పుడా కుక్కపిల్ల ఏకాకి ఎక్కడికి పోయినదో ఎవ్వరికిని తెలియదు.
అన్న ఎట్లు రాగలడు? రాగలడే అనుకొన్నను కుక్కపిల్ల లేకుండానా?
అన్న కుక్కపిల్లను తిట్టుకొన్నాడు. పారిపోయినదా? విశ్వాసము లేనిది?
* * *
తీవ్రముగా గాలి, క్షోణీపాతముగా వాన, కొరికి తినునట్లుగా చలి.
జంగమములు కదలవు. స్థావరములెగిరిపోవుచున్నవి :
చిన్నబాబు విహ్వలుడు.
చిన్నబాబు శోషిల్లిపోవుచున్నాడు.
* * *
గుమ్మములో మడి కట్టుకొని చలికి కప్పుకొని కూరుచున్నది. కుంపటి యొకటి కూడ కలదచ్చట. అప్పటికిని చలి ఆగుటలేదు. ఆ బాధ బోధ పడుచునే ఉన్నదామెకు.
* * *
చిట్టచీకటిని చీల్చి మెరసినదొక విద్యుల్లత ఒక్కమారు ఢీకొని కాలాంబురములు గట్టిగా గర్జించినవి ప్రకృతి కొక్కమారు యావేశము కల్గినది.
* * *
గుమ్మములోని యామె కూర్చుండియే ఉన్నది. చలిచే మూల్గుచుండక పోవనులేదు కుంపటియైనను వెచ్చదన మిచ్చుచుండుట లేదు.
అప్పుడతి దీనముగా, సన్న గొంతుతో జాలి జాలిగా ముర్మరించుచు ఒక కుక్కపిల్ల చేరవచ్చినది. ఒడలంతయు తడిసిపోయి కడుతీవ్రపు చలిచే గజగజ వడకుచున్నదా కుక్కపిల్ల.
ఆమె మాత్రము 'మడి చెడగొట్టినావే రాక్షసి ముండా' అని దయాశూన్యముగా కుక్కపిల్లను దూరముగా విసిరికొట్టినది.
చిన్నబాబు వోయి చెవులతో వినుచున్నాడు. అంత జ్వరముతో కూడ గుమ్మము లోనికి వచ్చినాడు. 'ఏదీ కుక్కపిల్ల?' అని అరచినాడు. వీధిలో మహా కరుణమైన అరుపు విన్పించినది. 'రుంయి' మని గాలి అప్పుడు రొదచేసినది.
'వానరా! తడుస్తావు ఆగు-ఆగు' అను మాటలు చిన్నబాబు వీధిలోనికి వెళ్ళి నంతలో విన్పించినవి. లక్ష్యపెట్టలేదు. పరుగెత్తిపోయి కుక్కపిల్ల నెత్తుకొన్నాడు.
ఆ వానలో గాలిలో నిర్మానుష్యమగు ఆ వీధిలో చిన్నబాబు చేత కుక్కపిల్లయూ మాత్రమే కాని ఆశాబకమున జీవకళ లేదు. తుది యరపుతో ప్రాణము లధికముగా ఎగిరిపోయినవి.
వేడి కన్నీటి తర్పణములతో చిన్నబాబు కుక్కపిల్లను జాలిగా చూచినాడు అప్పుడే అతని నింటిలోని కెత్తుకొని వచ్చిరెవ్వరో తొందర తొందరగా ఉష్ణమతనిలో ఉప్పొంగిపోవుచున్నది.
కుక్కపిల్లను వదలలేదు. వడకు చేతులతో హృదయమునకదుముకొన్నాడు. 'ఇది నా కుక్కపిల్ల నే నెరుగుదును. ఇదే ఇదే! ఇదే కావాలి నాకు' ఇవే అతడన్న మాటలు.
---౦౦౦---
