Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 50


    "జగ్గమ్మా!" ఆర్ద్రమయిన స్వరంతో పిల్చాడు వెంగళరాయుడు.
    "చెప్పండి" అన్నది తలదించుకునే.
    "నా శరీరమూ, ఆలోచనలూ అన్నీ ఏనాడో బొబ్బిలి రాజ్యానికి అంకితం అయిపోయినాయి. బొబ్బిలిరాజ్య రక్షణకు అంకితమైన నా హృదయంలో పౌరుషానికి, దేశభక్తికీ తప్ప మరిదేనికీ స్థానంలేదు. చాల వేళ అయింది. తిరిగి పోదాంపద!" అన్నాడు వెంగళరాయుడు.
    ఎదురుగా సంగీతానికి సంబంధించిన వస్తువులు అమ్మే ఒక అంగడి కన్పించింది. జగ్గమాంబ చెంగున గుర్రం దిగి "మిత్రమా నేను నీకు ఒక బహుమానం యివ్వదలిచాను. నువ్వుకూడా దిగు" అంటూ గుర్రం మీద అతనికి చేయి అందించింది జగ్గమాంబ. ఆమె సంబోధనకు ఆశ్చర్యపోతూ సంశయిస్తూనే ఆమె చేయి పుచ్చుకుని చెంగున గుర్రం మీదినించి దూకాడు వెంగళరాయుడు.
    యిద్దరూ లోనికి వెళ్ళారు. అది సంగీత సాధనాలు అమ్మే అంగడి అయినా అంగడి యజమాని వాళ్ళని వీరోచితంగా ఆహ్వానించాడు.
    జగ్గమ్మ తీగలు బిగించిన ఒక వీణ దగ్గరకు తీసుకుపోయింది వెంగళరాయుడిని. ఒక్కక్క తీగనూ తాకి ఒక్కొక్క స్వరం పలికించింది జగ్గమాంబ.
    "ఎలా పలికినాయి స్వరాలు?" అని అడిగింది.
    "ఎంతో చక్కగా!"
    "వాటికి అంత చక్కదనం ఎలా వచ్చింది"
    "అనేక స్వరాలు కలవటంనించి."
    "జీవితం కూడా అంతే చిన్న బావా! జీవితమంటే ఒక్క దేశభక్తి కాదు. జీవితమంటే ఒక్క వీరత్వం కాదు జీవితమంటే ఒక్క పౌరుషం కాదు. జీవితమంటే గుర్రపు స్వారీ చెయ్యటమో, ఒక్క కత్తి తిప్పటమో మాత్రమే కాదు. అనేక మధురమయిన సంగతులు పలికించేదే జీవితం అందులో నీవు ప్రేమ అనే ఒక మధురమయిన సంగతిని మర్చిపోయావు. కాబట్టి నువ్వు ఎన్నటికీ పరిపూర్ణ పురుషుడివి కాలేవు. నన్ను క్షమించు చిన్నిబావా! ఇంటికి పోదామన్నావు కదా! ఇహ వెళ్దాం పద" అంటూ ముందు నడిచింది. వెంగళరాయుడు సంభ్రమం నించి తేరుకునే సమయానికి ఆమె గుర్రంమీద వుంది. ఇహ ఆ పైన స్వారీచేస్తూ ఇంటికి రావాటమే కాని పెదవి విప్పటం లేకపోయింది.
    ఇంటికి చేరే సమయానికి జగ్గమాంబ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
    కొద్దిసేపటికి తిరుగు ప్రయాణం ఉండగా అలాపోవటం యేమిటి అంటోంది తల్లి.
    వెళ్ళేముందు చివరిసారిగా మహారాణి మల్లమ్మదేవిని చూచేందుకు ఏర్పాట్లు జరిగినాయి. రామరాయుడు, వెంకమాంబా, జగ్గమాంబా అంతఃపురంలోని అతిధులు కూర్చునే గదిలోకి వచ్చి కూర్చున్నారు.
    అంతఃపురంలోకి కబురు వెళ్ళింది. కాస్సేపు ఎదురు చూచాక ఒక పరిచారిక వచ్చి మహారాణి వారు విజయంచేస్తున్నారు అనే వార్తముందుగా అతిధులకి అందించి త్వరగా అక్కడనించి తప్పుకుపోయింది.
    మహారాణి మల్లమ్మదేవి మరొక క్షణంలో ఆ గదిలోకి విజయం చేస్తారనగా హెచ్చరిక గంట మ్రోగింది. తల్లీ చెల్లితోసహా అందరూ లేచి నిలబడ్డారు. మహారాణి మల్లమ్మదేవి ప్రక్కల వెనుకా పరిచారికలు వస్తూవుండగా విజయం చేసింది. రాణి తనం వచ్చేసింది. ఎంత రాచఠీవి!!
    "అక్కా....." అంటూ శరవేగంతోవెళ్ళి అక్కను కావిలించుకుంది జగ్గమాంబ ఒక్కరాత్రి కలసి ఉండకపోవటం ఆమెకు యుగాల వియోగంలా అనిపించింది. ఆమెను కావలించుకుని ఏడ్చింది.
    ఆ తొందరలో రాణివారి పైటకొంగు రవ్వంత భుజంమీదినించి జారింది వెంటనే ప్రక్కనున్న చెలకత్తె ఆ కొంగును యధావిధిగా సరిచేసింది. అదిచూచిన జగ్గమాంబకు అక్కను తాకకూడదు అన్న భయంకర సత్యం అర్ధమయింది కావిలించుకుని, మీదపడి, ముద్దాడి, ఉక్కిరి బిక్కిరిచేసి, నానా గోలచేసి ఆటలు పట్టించేందుకు యిహవీలుకాదు.
    ఆ ఆప్యాయతలకు, అనుభూతులకు యిహనుంచీ జీవితకాలం తెరపడింది.
    ఆమె రాణి బొబ్బిలికి ఏలిక శ్రీమతి గోపాలకృష్ణ రంగారావు దొర.
    దూరంగా జరిగి నిలబడింది జగ్గమాంబ.
    "అక్కగారూ!" అని పలకరించింది. ఆ పిలుపు మల్లమ్మదేవి చెవిలో తూట్లు పొడిచింది, అయినా ఆమె చలించలేదు, తన ప్రేమనీ, ఆవేదననీ, దుఃఖాన్నీ చెలికత్తెలకే తెలియనివ్వలేదు. రాణి తనానికి లోటు రానివ్వలేదు.
    ఠీవిగా ముందుకి కదిలి తనకోసం ప్రత్యేకించిన సింహాసనంలో కూర్చుంది. ఎదురుగా వున్న కుర్చీల్లో అందరూ కూర్చున్నారు.
    "మేము యీరోజే వెళ్ళిపోతున్నాం" అన్నది తల్లి.
    "మరి కొంతకాలం యిక్కడే ఉండకూడదా!"
    "వొద్దుతల్లీ! తొందర పనులున్నాయి. వీలుపడితే మరొకసారి..." అంతకన్నా ఎక్కువ మాటలు తండ్రిగొంతు పెగుల్చుకుని రాలేక ఆగినాయి.
    వీలుపడితే మరొకసారి అన్నమాట వుత్తి అబద్దం! యీ కుటుంబాలు మామూలు కుటుంబాలు కావు పిలువకుండా వచ్చేందుకు యీ మనుషులు మామూలు మనుషులు కాదు అభిజాత్యం వదులుకుని తగినంత కారణం లేకుండా ఆహ్వానించేటందుకు. రాచ కుటుంబాలు రాచ మర్యాదలకోసం మమతల్ని బలియిచ్చుకుంటున్న వాళ్ళు. వాళ్ళ  కలయిక ఎన్నాళ్ళకో! ఎన్నేళ్ళకో!
    యీ నలుగురి సమావేశం మళ్ళీ జగ్గమాంబ పెళ్ళిలోనే కుదురుతుంది. అప్పుడయినా వెనుకటి చనువులూ, స్నేహాలు వుండవు. మర్యాదలూ, గౌరవాలూ తప్ప రధం సిద్దమయిందన్న కబురువచ్చింది.
    వెంగళరాయుడు రాచ మర్యాదగా రధం తోలుతున్నాడు. చుట్టూ సైనికులు నడుస్తున్నారు తల వ్రేలవేసుకుని జగ్గమాంబ తల్లికి ఆనుకుని కూర్చుంది. ఆమె మనసు అంతా దిగులుగా గుబులుగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS