"వెంకటపతిగారికి బస్తీలో చాలా పనులున్నాయనీ, ఇంక ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేసే తీరిక ఉండదనీ, మీకేమో పొలం చేసే ఓపిక లేదనీ అమ్మాయిగారు చెప్పారు. పెద్దవారు మీతో ఓ మాట చెప్పి చేలో దిగుదామని వచ్చాం."
"బోడిముండ! దాని పెత్తనం ఏందయ్యా?" ఖాండ్రించి ఊసి అన్నాడు సాంబయ్య.
"మీ కుమార్డు వెంకటపతిగారే ఒప్పుకున్నారు. ఆయనకు ఆ హక్కు లేదా?" మొండిగా అన్నాడు రెడ్డెమ్మ.
"మళ్ళీ ఆ కూత కూశావంటే పళ్ళు రాలగొడ్తా! పొలం అంతా నా సొంతం. యీ ఆస్తంతా నా స్వార్జితం. కొడుకూ కోడలూ ఎవరికీ చిల్లికాని హక్కులేదు!" రౌద్రమూర్తిగా మారిన సాంబయ్య అన్నాడు.
రెడ్డెమ్మ తెల్లమొహంవేసి వెంకటయ్యకేసి చూశాడు.
"తమకిష్టం లేకపోతే మే మెందుకు తమ పొలంలో దిగుతాం సాంబయ్య గారూ! ఏదో! పొలం బీడుపడిపోతుంటే చూడలేక వచ్చాం!" అంటూ వెంకటయ్య పంచ దులుపుకుని రెడ్డెమ్మను చూసి అన్నాడు "పదవయ్యా పోదాం! తండ్రీ కొడుకుల మధ్య మనకెందుకూ?"
వెంకటయ్యా, రెడ్డెమ్మా వెళ్ళాక సాంబయ్య ఆలోచనలో పడ్డాడు -
"అది ఎంతకు తెగించిందీ? వీడు - వీడసలు మొగాడేనా?" వెంకటపతిని గురించిన ఆలోచనలు, సాంబయ్య మనసును తొలిచివేశాయి.
రాత్రంతా సాంబయ్యకు ఎండి నెర్రెలు కొట్టిన నేల కళ్ళల్లో తిరిగింది. గంపెడు చీకటి వుండగానే సాంబయ్య మాలపల్లి వెళ్ళి కూలీలను లేవగొట్టాడు. మొత్తం డెబ్బై ఎకరాల మాగాణి మూడు రోజుల్లో నాట్లువేయించాడు.
రేగడి భూమిలోనుంచి, వరద నీటి మీదగా లేచి నిలబడటానికి ప్రయత్నిస్తున్న ముదురాకు పచ్చ వరిచేనుకు, కనుచూపు మేరగా వున్న పొలం గట్లమీద నిలబడి చూసుకొన్నాక సాంబయ్య గుండెల్లోని ఆవేదన చల్లారింది.
కలుపు తీసే రోజుల్లో వెంకటపతి కనకయ్య పంపిన ఓ వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. కనకయ్య కొడుకు బావమర్దికి తగు సలహాలు ఇచ్చి వెంకటపతితో పంపించాడు. సాంబయ్య ఆ వచ్చిన వ్యక్తి ఎవరా అన్నట్టు పరిశీలించి చూశాడు.
"గాంధీ చౌకులో లక్ష్మీకాంత్ ఎంపోరియం వుంది చూడండి. అది మాదే!" అన్నాడు సుబ్బారావు.
"ఆహా!" అయితే ఏమంటావన్నట్టు చూశాడు సాంబయ్య.
"మాకు హోల్ సెల్ బట్టల వర్తకం కూడా వుంది."
"అట్టగా! మంచిదే!" ఖాండ్రించి పక్కకు ఊపి చుట్టకొసలు మునిపళ్ళతో కొరుకుతూ అన్నాడు, సాంబయ్య.
వెంకటపతి ఏదో పని వున్నట్లు లేచి గొడ్ల సావిట్లోకి వెళ్ళాడు.
"మావాడేమన్నా బట్టల తాలూకు బాకీ వున్నాడా?" సూటిగా అడిగాడు.
"అంత చిన్న బాకీ అయితే ఇంత దూరం వస్తావా?" నవ్వుతూ అన్నాడు సుబ్బారావు.
సాంబయ్య మళ్ళీ అడుగుతాడని ఎదురుచూశాడు. కాని మాట్లాడకుండా చుట్ట ముట్టించుకోసాగాడు. కంచెమీద కూర్చున్నట్లు కదిలాడు సుబ్బారావు.
"చుట్ట అలవాటుందా?"
"చుట్టా, బీడీలాంటి అలవాటు ఏమీలేదు నాకు. కాఫీ అలవాటు కూడా లేదు."
"ఎట్లా! చెడ్డ అలవాట్లు ఏమీ లేవన్నమాట?" నువ్వు చాలా బుద్దిమంతుడిలా వున్నావే అన్నట్టు చూశాడు సాంబయ్య. సుబ్బారావు కితకిత లాడిపోయాడు. అట్లా చూస్తుండగానే సాంబయ్య లేచి పొలం వెళ్ళిపోతాడేమోనని భయం పట్టుకుంది సుబ్బారావుకు. గొంతులో కొట్టుకాడుతున్నదాన్ని వెళ్ళగక్కాడు.
"నోటు చెల్లు వేస్తారేమోనని వచ్చాను."
"ఏ నోటూ?" సాంబయ్య ముఖం చిట్లించుకొంటూ అన్నాడు.
"మన వెంకటపతిగారిదే. సంవత్సరం దాటింది. ఆరునెలలకే ఇస్తానని తీసుకొన్నారు. ఇప్పుడు డబ్బు చాలా అవసరంగా వుంది."
సాంబయ్య ఊకొట్టనుకూడా లేదు. అయినా సుబ్బారావే చెప్పుకుపోసాగాడు.
"అసలు ముఫ్ఫైవేలు. రూపాయి పావలా వడ్డీ. నాలుగు వేల ఐదువందలదాకా వడ్డీ అయింది. వడ్డీతో కలిపి మొత్తం ముఫ్ఫై ఐదువేలకి నోటు తిరగరాస్తానంటున్నారు. కాని మాకు డబ్బు అవసరం. ఏభైవేల కిమ్మత్తు సరుకు తెప్పిస్తున్నాం."
"అయితే నన్నేం చేయమంటావ్?" తీవ్రంగా చూస్తూ అడిగాడు సాంబయ్య.
"మీరలా మాట్లాట్టం ఏం బాగుంది? దావా తేవటం ఇష్టంలేకనే ఇంతగా చెప్పటం".
"ఎవర్ని బెదిరిస్తావ్? దావా వేసుకోవయ్యా! సినిమాహాలు కట్టడంకోసమేగా అప్పు తెచ్చాడు. దావా వేసి, ఆ స్థలం వేలం వేయించి మీకు రావాల్సింది రాబట్టుకోండి."
"ఆ స్థలం వెంకటపతిగారి భార్యది. మా డబ్బెట్లా వసూలవుతుంది?"
"మొగుడ్ని జైలుకే పంపుతుందో, స్థలం అమ్మి బాకీయే తీరుస్తుందో ఆవిడ్నే అడగండి. మధ్య నా దగ్గర కొస్తారెందుకూ?"
"వెంకటపతిగారి ఆస్తిపస్తులు ఇక్కడున్నాయి; అందుకని."
"వాడిదేం లేదిక్కడ. అంతా నా స్వార్జితం. నాకు మా తండ్రి ఇచ్చింది పిత్రార్జితం రెండెకరాలే వచ్చింది. ఇదంతా నా కష్టార్జితం. భాగం పంచుకొంటే వాడికొచ్చేది తాత ఆస్తిలో సగమే. ఎకరం పొలం, వాములదొడ్డి వున్న స్థలంలో సగం- ఐదు సెంట్లు నేల .... అంతే! దావావేసి కట్టుకో నాకేమీ అభ్యంతరం లేదు."
"అయితే మీ కన్నకొడుకుని జైలుకు పంపుతారా?"
"ఒకళ్ళు పంపేదేమిటి? పోయే రోజు వస్తే వాడే పోతాడు. ఒకళ్ళు ఆపితే మాత్రం ఆగుతాడా?" సాంబయ్యకు గుండెలు అవిసిపోయినై. మాటకు మాట అంటున్నాడేగాని కడుపులో రంపం పెట్టి కోసినట్టుగా వుంది.
"అంతా ఆయనే సంపాదించినట్టు మాట్టాడతాడేమిటి? నా ఊహ తెలిసిందగ్గరనుంచీ నేనూ కష్టపడ్డాను. అందులో సగం నాకూ వుంది!" వెంకటపతి తండ్రిని ఉద్దేశించి సుబ్బారావుతో అన్నాడు.
కొడుకు తనవెనకే వచ్చి నిలబడింది అంతవరకూ సాంబయ్య గమనించలేదు.
"వాడి సంపాదన వాడికి ఇదివరకే ముట్టింది. పెళ్ళికి పదిహేను వేలదాకా ఖర్చు పెట్టాను. ఈ రెండేళ్ళలో ఎప్పుడన్నా కానియ్ - ఇరవై వేలకు పైగా తీసుకెళ్ళాడు. దానికి అది సరిపోయింది. మళ్ళీ మాట్లాడితే నాకే ఋణపడి వున్నాడు. రెండేళ్ళ పంటా వాడే తీసుకున్నాడు. నాకూ వాడికీ ఈ నాటితో ఋణం తీరింది. వాడు నా కొడుకేకాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో!" సాంబయ్య విసురుగా లేచాడు. కర్ర తీసుకుని పొలం వెళ్ళిపోయాడు.
సుబ్బారావు ఏడుపుముఖం వేసి వెంకటపతికేసి చూశాడు.
"కనకయ్యను తొందరపడొద్దని చెప్పు. రెండు రోజుల్లోనే వస్తాను. ఆయన బాకీ పరిష్కారం చేస్తాను. నాలుగు రోజులు ఆగమనండి." సుబ్బారావు సమాధానం కోసమైనా చూడకుండా వెంకటపతి లోపలకెళ్ళాడు.
సుబ్బారావు కాళ్ళీడ్చుకుంటూ కనకయ్యదగ్గరకు బయలుదేరాడు .... జరిగిందంతా ఎలా చెప్పాలో మననం చేసుకొంటూ.
21
"తొందరగా కానియ్, కారొచ్చింది!" ఇంటి ముందుకొచ్చి ఆగిన కారును చూసి వెంకటపతి అన్నాడు.
"ఆఁ! అయిపోయింది, వచ్చేస్తున్నా!" నిలువుటద్దం ముందు నిలబడి, అజంతా స్టయిల్లో చుట్టుకున్న ముడిలో మల్లెలమాల తురుముకుంటూ అన్నది వరూధిని. ఆ తర్వాత చీర మార్చుకుని కుచ్చిల్లు సర్దుకుని, తిరిగి తిరిగి చూసుకొంది. పెదవి విరిచి, కట్టుకున్న చీరవిప్పి, మరో చీర కట్టుకుంది. అద్దంలో ఎగాదిగా చూసుకొని "ఈ చీరకు ఈ బ్లౌజ్ మాచ్ అయిందా?" అంటూ భర్త వున్న గదిలోకి వచ్చింది. ఎదురు తెన్నులు చూస్తున్న వెంకటపతిని చూసి "అయ్యో రాత! నీకామ్త్రం తెలిస్తే ఇంకేం కావాలి?" అని మనసులోనే అనుకొని మళ్ళీ గిర్రున వెనక్కు తిరిగి గదిలోకి నడిచింది. బీరువాలో వున్న బ్లౌజులన్నీ వరుసగా ఏరి వెతికి లేత గులాబి వన్నె బ్లౌజు బయటికి తీసింది.
బ్లౌజు వేసుకుని మరోసారి పవిట సర్దుకొని అద్దం ముందు నిలబడి ప్రతిరూపాన్ని మనసారా చూసుకుంది. జగదేకసుందరి - ఇంకా ఎలాగో కన్పించింది తన ప్రతిబింబం వరూధినికి ఆమె పెదవులపై హాసరేఖలు వాన వెలసిన నాటి సాయంకాలం వీరెండలో మబ్బుల అంచుల్లా మెరిశాయి. విశాలమైన ఆమె కనురెప్పలు మెరుపుల్లా క్షణకాలం లేచి త్రుళ్ళిపడ్డాయి. ఆమె హృదయం రాగరంజితమైంది. వళ్ళు పులకరించిపోయింది. బయట వరండాలో నిలబడ్డ భర్త పిలుపు "ఏమిటి ఇంకా ఆలస్యం?" ఉరుమూలా - కఠినంగా ధ్వనించింది.

