Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 51


    వీళ్ళ లెక్కేమిటి? అన్నట్లుగా ఒక చూపుచూసి కామినీ తను కూడా బయలుదేరింది. "నేనూ వస్తున్నాను బాబాయ్!" అంటూ.
    రావుగారు రివాల్వర్ తీసి వారికేసి గురిపెట్టాడు. "ఆగండి!" అంటూ.
    దామోదరం కామిని తెల్లబోయారు.
    "ముందు ఆ బ్రీఫ్ కేస్ అక్కడపెట్టి వెళ్ళు. లేక పోతే ప్రాణం తీస్తాను" అన్నాడు రావుగారు.
    "నేపెట్టను." అన్నాడు దామోదరం బ్రీఫ్ కేస్ ని గుండెలకు హత్తుకుంటూ.
    "బెదిరింపా?" అంది కామిని.
    "డాడీ! నేను అనితను హత్య చేసిన విషయం కామినీకి తప్ప ఎవరికీ తెలియదు. ఆఖరుకి మీతోకూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పిశాచం మాత్రం దాని బాబాయ్ గాడితో చెప్పింది. మన్ని సర్వనాశనం చేసి డబ్బు కాజేయడానికి కామిని నాకు సహకరించింది. ఇరువురు కలసి అనిత డెడ్ బాడీని వదిలించుకున్నాం. కామినీ ఈ కధని అటుమార్చి ఇటుమార్చి వాళ్ళ బాబాయ్ కి చెప్పింది. వాడేమో మనదగ్గర డబ్బు కాజేయడానికి వాడింకో కధ అల్లి దొంగ ఫోటోలు సృష్టించి నీకు చూపెట్టాడు. ఇరువురూ మన డబ్బుకోసమే ఈ నాటకం ఆడారు. వారిరువురిని చంపిపారేస్తే నేను హత్య చేసినట్టు సాక్ష్యమే వుండదు. ఇంక ఆలస్యం ఎందుకు? వారిద్దరినీ కాల్చిపారేయండి" అన్నాడు ఆవేశంగా కిరణ్.
    కిరణ్ మాట్లాడుతూవుంటే రావుగారు వింటుంటే దామోదరం తెలివిగా చాలా క్విక్ గా తనచేతిలో పెట్టెని రావుగారి చేతిమీదకు విసిరేశాడు. రావుగారిచేతిలోని రివాల్వర్ కింద పడింది కంగున శబ్దంచేస్తూ.
    కిరణ్ కి పిచ్చి కోపం వచ్చింది. తను ఏం చేస్తున్నాడో తెలియని ఆవేశంతో జేబులోంచి మినీరివాల్వర్ తీసి దామోదరాన్ని కాల్చాడు. దామోదరం 'అమ్మా' అంటూ ఒరిగి పోయాడు. 'కామినీ ఇంక నీవున్నావ్' అంటూ రివాల్వర్ అటు త్రిప్పేలోపల కిరణ్ చేతికి పిస్టల్ గుండు వచ్చి తగలటం "అమ్మా" అని అరచి తన చేతిలోని రివాల్వర్ ని జార విడవటం బిలబిలమంటూ పోలీసులు లోపలికి రావటం, ఏకకాలంలో జరిగాయి. రావుగారికి, కిరణ్ కి నోట మాట రాలేదు.
    "ఎవరూ కదలవద్దు!" ఇన్స్ పెక్టర్ కంఠం ఖంగున మోగింది. వెంటనే కిరణ్ వైపు తిరిగి "యూ ఆర్ అండర్ అరెస్ట్!" అన్నాడు.
    
                                  30
    
    ఈ హత్యా వుదంతం పేపరులో పెద్దపెద్ద అక్షరాలతో ప్రచురితమయింది.
    ఆరోజు తనంతట తానుగా గోవిందరావు పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. తను భయంవల్ల, భార్యమాటలవల్ల పారిపోవటం జరిగిందని తనను క్షమించమని గోవిందరావు వలవల ఏడుస్తూ చెప్పాడు.
    "డోంట్ వర్రీ మిష్టర్ గోవిందరావు! నిజం చెప్పాలంటే నీవల్లనే మాకు హంతకుడు దొరికాడు. దొంగతనాలు హత్యలు, మోసాలు, నేరాలుకాని, పిరికిగా పారిపోవడం నేరంకాదు. కేవలం పిరికితనం. ఈ కథకు హీరో ఎవరో తెలుసా! కానిస్టేబుల్ కనకారావు అన్ని విషయాలు అతను చెబుతాడు విను!" అని చెప్పి ఇన్ స్పెక్టర్ మరో కేసు విషయంలొ అవతలికి వెళ్ళాడు.
    "రా మిత్రమా! అంటూ గోవిందరావుని ప్రక్క గదిలోకి తీసుకువెళ్ళాడు" కానిస్టేబుల్ కనకారావు.
    "నాకేమీ అర్ధం కావటంలేదు. అతను రెండో హత్య కూడా ఎలా చేశాడు?" గోవిందరావు అడిగాడు.
    "ఒక్కమాటలో వివరించడం కుదరదు. వివరంగా చెబితే కాని అర్ధం కాదు మిత్రమా! మొదటినుండి చెబుతాను జాగ్రత్తగా విను. అనిత డెడ్ బాడీ బయటపడిన తరువాత మాకే చిన్న సాక్ష్యమూ దొరకలేదు. నీవు చెప్పిన రెండు సంగతులు తప్పించి. ఈ కేసుకు నీ సాక్ష్యం ఉపయోగపడదన్నారు ఇన్ స్పెక్టర్ గారు. ఆ చిన్న సాక్ష్యంతోనే ఈ కేసుని బయటకు లాగొచ్చు అన్నాను నేను. కాని ఎలా లాగొచ్చో చెప్పలేకపోయాను నేను ఇప్పుడు. ప్రస్తుతానికి ఫైలు మూయటం తప్ప చేసేదేమీలేదు. నీవు ఛాలెంజ్ గా తీసుకుని ఈ కేసు సాధించగలిగితే నీకు ఇన్ స్పెక్టర్ గా ప్రమోషన్ ఖాయం. ఒక హంతకుడిని పట్టుకున్న వాడివీ అవుతావు అన్నారు ఇన్ స్పెక్టర్.
    ఆయన నవ్వుతూ అన్న మాటలని నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. వెంటనే రంగంలోకి దిగాను. మొదట నిన్ను కలుసుకున్నాను. నువ్వు పాతిక విస్కీ సీసాలతో కొంత వరకే సహకరించి వెళ్ళిపోయావు. కానీ, నువ్వు చెప్పింది నాకు ఉపయోగపడింది. నువ్వు చెప్పిన రూపురేఖలు గల వ్యక్తి రావుగారి కొడుకు. నా ఎంక్వయిరీ లో అతను ఆడపిల్లల తో తిరిగే వ్యక్తి అని తెలుసుకున్నాను. గట్టిగా బెదిరించే సరికి ఆ  హోటల్ లోని ఒక సర్వరు, అనిత, కిరణ్ గదికి రావడమూ, ఆ తరువాత ఆమె వెళ్ళడం చూడలేదు కాని, కామిని రావడము చెప్పాడు.
    అనితకు దొంగఫోన్ చేయడమూ, మారుపేరుతో హోటల్ లో దిగానని చెప్పడమూ, మరికొన్ని విషయాలు చెప్పాడు. కిషోరీలాల్ పేరుతో హోటల్ లొ దిగింది కిరణ్ అనీ! ఈ హత్య చేసిందీ అతనేనని నాకు రూడీగా తెలిసి పోయింది. అయితే సాక్ష్యం లేనిదే ఏ కేసూ నిలవదు. ఈ సాక్ష్యం చాలదు. అందుకని మరికొన్ని సాక్ష్యాలు నేను సేకరించడం లొ నిమగ్నమయినాను.
    అనిత డెడ్ బాడీ రిపోర్టును బట్టీ అనిత మరణించే సమయానికి గర్భవతి అని. టైము ఓంత్య్గంట తరువాత అని తెలిసింది. కిరణ్ కామినీని పెళ్ళాడినది అనితను హత్యచేసిన మరునాడు. హోటల్ లొ దిగి అంత అర్జంట్ గా పెళ్ళిచేసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళవలసివచ్చింది? ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగాను. కామినీ ఆమె బాబాయ్ దామోదరం ఇరువురూ మంచివాళ్ళుకాదు. వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. నా పరిశోధనలో చాలా విషయాలు తెలిశాయికని, కలుగులో దూరిన ఎలుకలు బయటకువచ్చే మార్గం కనపడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS