Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 50


    "మూడు కాదుకదా రెండుకూడా చేయలేదు. ఒకటి ఓన్ లీ వన్. అదికూడా పొరపాటున జరిగింది.
    "పొరపాటో, గ్రహపాటో, అలవాటో నాకనవసరం. నేను ఫోటోలు తెచ్చి ఇచ్చాను. మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఏమిటి? ఇవ్వటం అయిపోయిందిగా" అంటూ బ్రీఫ్ కేస్ ని తన ఒళ్ళో పెట్టుకున్నాడు దామోదరం. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది.
    బ్రీఫ్ కేస్ ని తీసుకోటానికి కిరణ్ లేవబోతూంటే రావుగారు కొడుకు భుజంతట్టి మళ్ళీకూర్చోబెట్టాడు. "డబ్బు ఎక్కడికీపోదు. నువ్వు ఆగు కిరణ్!" అన్నాడు.
    "డబ్బు పోదా? అంటే అర్ధం ఏమిటి? మీరిద్దరివరసా చూస్తూంటే నాకు అనుమానంగా వుంది. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పండి. కొంపతీసి ఈ హత్యచేయలేదు అంటావా ఏమిటి? కళ్ళకుకట్టినట్టుగా సాక్ష్యంకూడా కనిపిస్తోంటే. నాకు ఏం జరిగిందో అంతా తెలుసు." అన్నాడు దామోదరం.
    దామోదరం నుంచి నిజం తెలుసుకోటానికి "తెలిస్తే చెప్పు. ఆలస్యం ఎందుకు?" అన్నాడు రావుగారు.
    "ఈ అమ్మాయి పేరు శాలిని. నీవల్ల ఈ పిల్లకు కడుపొచ్చింది. ఆ విషయం చెప్పి నిన్ను పెళ్ళిచేసుకొమ్మన్నది శాలిని. నేను చేసుకోను నీ కడుపులో బిడ్డకు తండ్రినని నమ్మకం ఏమిటి? నేను మటుకు కాదు. వూళ్ళో ఎవడో నీకు బాయ్ ఫ్రెండ్స్ బోలెడు మంది వున్నారు. వాళ్ళల్లో ఎవరిని అన్నా అడుగు అన్నావు నువ్వు. శాలిని మంచిపిల్ల. అక్కడికీ నిన్ను బ్రతిమలాడింది. చివరికి తను పోట్లాటకి దిగక తప్ప లేదు. ఆమె మంచిగా మాట్లాడుతున్నకొద్దీ నీవు ఇష్టం వచ్చినట్లు వాగడం ఎక్కువయింది. దాంతో ఆమె నిన్ను బెదిరించింది. 'నాకు డబ్బు, పలుకుబడి, చేతికింద రౌడీలు అందరూ వున్నారు. నన్ను పెళ్ళి చేసుకోకపోతే నిన్ను రచ్చకీడ్చి నానా అల్లరి చేస్తాను' అంది. దానిమీద మీ ఇద్దరికీ మాటామాటా పెరిగింది. నువ్వు చాలా మంది ఆడపిల్లల్ని మోసం చెయ్యటం వాళ్ళని లొంగదీసుకోవటం, వాళ్ళా బెదిరింపులకి భయపడి వెళ్ళిపోవటం గతంలో చాలాసార్లు జరిగింది. కానీ శాలిని బెదరలేదు. శాలిని ఎంత గట్టిదో ముందే నీకు తెలుసు. అవసరమైతే ఉంటుందని కత్తి తీసుకునే వచ్చావు. ఆ కత్తితీసి బెదిరించావు. శాలిని పెద్దగా అరవబోయింది. వెంటనే ఆమెమీదకు దూకి, నోరు నొక్కావు. బలవంతానా ఒకచేత్తో నొక్కిపట్టి. మరోచేత్తో పొడిచి చంపావు. ఇదంతా ఒక హోటల్ లొ జరిగింది. అప్పుడేమీ ఇరువురి మాటలు రికార్డ్ చేయటం జరిగింది. ఫోటోలు తీయటం జరిగింది. అంతేకాదు ఆ శవాన్ని ఎలా మాయం చేసిందీ కూడా నాకు తెలుసు. టూకీగా చెప్పాను. అవునో కాదో నువ్వే తేల్చుకో" అన్నాడు దామోదరం.
    దామోదరం అంత వివరంగా చెబుతూంటే ఇదంతా నిజమేనేమో అని అనిపించింది.
    "ఇదంతా ఏమిటి కిరణ్!" అన్నాడు రావుగారు.
    "డాడీ! ఇదంతా అబద్దం హోటల్ గది, మా పోట్లాట అంతవరకూ కరెక్టే, కాని మిగతాది అంతా శుద్ద అబద్దం. నేను హోటల్ గదిలో అనితను ఎలా హత్యచేశానో అది కాస్త మార్చి, వ్యవహారం కత్తిపోట్లకు దించి, దొంగ ఫోటోలుతీసి, ఇక్కడకు తీసుకువచ్చాడు దొంగ వెధవ!" అన్నాడు రవ్వంత ఆవేశంతో కిరణ్.
    "దొంగవెధవా, పిచ్చివెధవా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు. నేను దొంగవెధవని అయితే నువ్వు హంతకుడివి. ఆ విషయం మరచిపోకు. కళ్ళకు కట్టినట్లు హత్య చేస్తున్నట్లు కళ్ళకు కనబడుతూవుంటే ఫోటోల్లో ఇది శాలినీని హత్య చేసిన ఫోటో అనిత ఫోటో ఇంకొకటి" అనిత ఎవరో తెలియకపోయినా చాలా తెలివిగా అన్నాడు దామోదరం.
    "మాకు కావలసినది అనితను హత్య చేస్తుండగా తీసిన ఫోటోలు. హోటల్ రూమ్ లో అనితా కిరణ్ లు వుండగా వాళ్ళ సంభాషణ క్యాసెట్. మేము అడిగింది అనిత కేసు లోవి. ఆ ఫోటోలు, క్యాసెట్ తీసుకువస్తేనే డబ్బు ఇచ్చేది" అన్నాడు రావుగారు.
    కామినీ నాకంతా చెప్పింది. క్యాసెట్లని, ఫోటోలని నాదగ్గరే దాచింది." దామోదరం అన్నాడు.
    "కామినే నిన్ను మోసంచేసింది. అదో పెద్ద దెయ్యం. అనిత మరణించగానే సమయానికి దెయ్యంలా ఊడిపడింది. ఫోటోలు, క్యాసెట్ లు అని నన్ను బెదిరించి నా భార్య అయింది. దానిదగ్గిర అనితను గురించిన సాక్ష్యాలు ఏమీ లేకపోవచ్చు. బుకాయించి నన్ను లొంగతీసుకున్నదనుకుంటాను. చంపబడింది అనిత కాదు శాలిని అని నువ్వు  అనుకుంటున్నావు. కామినీయే అలా పేరుమార్చి చెప్పివుంటుంది. నువ్వేమో ఏదో క్రొత్తనాటకం ఆడుతున్నావు." కిరణ్ అన్నాడు.
    "దీనిలో ఏదో పెద్ద మోసం వుంది." రావుగారు అన్నారు.
    "మోసం ఏమీలేదు. నేరం చేసింది మీరు. మీరు భయపడి చావాలి. నాకెందుకు? జరిగినదంతా చెబుతాను. అసలు కామిని..."
    దామోదరం అంటూవుండగా కామిని "బాబాయ్!" అంటూ ప్రక్కగదిలోనుండి దూసుకువచ్చింది.
    "నువ్వొచ్చావా!" తడబడ్డాడు దామోదరం.
    "బాబాయ్! నీకు నోటితొందర జాస్తి. మౌనంగా వూరుకోమంటే ఇదేమిటి? ఇంక నువ్వు నోరు మెదపకు" అంటూ దామోదరాన్ని చూస్తూ ఎడంకన్ను గీటింది. (కొట్టింది.)
    చాలా ప్రమాదంలో వున్నపుడు ఒకరినొకరు రక్షించుకోవాలని గతంలో దామోదరం, కామిని అనుకున్నారు. ఇప్పుడు దామోదరానికి కిరణ్ రావుగారి ప్రవర్తన చూస్తుంటే అనుమానం వచ్చింది. దానికితోడు కామిని ఎడమకన్ను గీటటంతో పూర్తిగా ఆ అనుమానం బలపడింది. దామోదరం పిచ్చిపిచ్చిగా వాగుతాడేమోనని కామిని వెంటనే వచ్చింది. పైగా ఇంకో అమ్మాయిని హత్య చేస్తున్న ఫోటో దామోదరం రావుగారికి ఇవ్వటంతో, మరో పాతకేసు అయివుంటుంది అనుకుంది. దామోదరం వాగకుండా వుండటానికి ఆ ఫోటో చూడటానికి కామిని ఇవతలకి రాక తప్పలేదు.
    వాళ్ళలా మాట్లాడుకుంటూ వుంటే రావుగారు లేచి నుంచున్నారు. "మీ ఇద్దరి నాటకం ఏమిటి?" అన్నాడు కాస్త కఠినంగా.
    కామిని మాట్లాడలేదు.
    దామోదరం మాత్రం పెట్టి చేతిలోకి తీసుకుని తనూ పైకిలేచాడు. "ఈ డబ్బు తీసుకునీ వెళ్ళనా అమ్మాయ్?" కామినీని అడుగుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS