"ఏంటి శ్రీ....మన యం.డి.కి నీ మీద విపరీతమైన అభిమానం డ్రైనేజీ కాలువలా పొంగి పొర్లి నీకే అవకాశం ఇవ్వలేదు. నీలో టాలెంట్ వుంది.....ఇచ్చాడు. దట్సాల్..."
"కావచ్చు....కానీ ఆ టాలెంట్ ని మిగతా వాళ్ళు గుర్తించలేదు."
"అది వాళ్ళ ఖర్మ.... ఇప్పుడు కృష్ణమూర్తి వీ టాలెంట్ ని గుర్తించాడు."
"అఫ్ కోర్స్....కానీ, ఇప్పుడు నా టాలెంట్-కన్నా నా అవసరం ఈ కంపెనీకి వుంది. నాకిచ్చే జీతం కూడా రీజనబుల్ గానే వుంది."
"బ్లడీ సెంటిమెంట్స్ వద్దు బాసూ....అవకాశాలను స్వాగతింపు వెళ్ళాలి."
"ఇది సెంటిమెంట్ కాదు....నా బాధ్యత, ప్రతి మనిషికీ మెంటాలిటీ వుండాలి కాస్తయినా..."
అంటే కృష్ణమూర్తి దగ్గర చేయనంటావు..."
"అనే కదా....ఇందాక కృష్ణమూర్తికి చెప్పింది."
"మరోసారి ఆలోచించకూడదూ..."
"సెకండ్ థాట్ వుంటే దాన్ని నిర్ణయం అనరు. కప్పదాటు అంటారు. ప్రతి విషయాన్ని నేను ఆలోచించే చెబుతాను."
"నాకైతే నీ అభిప్రాయం, పద్దతీ నచ్చలేదు."
శ్రీచరణ్ కు కోపం పీకల్ దాకా వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు"
"లీవిట్ శశి... ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. ఎవరి పద్దతులు వాళ్ళవి..."
"కానీ, ఆ పద్దతులు, నిర్ణయాలు మనల్ని ఉద్దరించనప్పుడు అనవసరమే..."
"ఇప్పుడు నాకిస్తోన్న శాలరీ బాగానే వుంది. నాకీ సంతృప్తి చాలు. అయినా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది..." చికాగ్గా అన్నాడు ఆ టాపిక్ కు ఫుల్ స్టాఫ్ పెట్టే ఉద్దేశంతో.
విసురుగా అక్కడ్నుంచి లేచిపోయింది శశికళ.
దాని తాలూకు రిజల్ట్ అతనికి ఆ రోజు సాయంత్రానికి గాని తెలియలేదు.
* * *
ఆ రోజంతా అనీజీగానే అనిపించింది శ్రీచరణ్ కు.
ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ వచ్చారు. ఆగ్రా గురించి, ఎర్రకోట గురించి అడిగారు. మరో క్లయింట్ ఆస్ట్లేలియా వెళ్ళాలనుకుంటున్న చెప్పి, దాని గురించి వివరాలు అడిగాడు. అన్నీ అన్యమనస్కంగా చెప్పాడు.
కృష్ణమూర్తి ప్రవర్తన అతనికి బాధని కలిగిస్తోంది.
మొన్నటి వరకూ ఈ సంస్థలో పనిచేసి, ఈ సంస్థ గుట్టుమట్లు తెలుసుకుని, ఈ సంస్థకే వెన్నుపోటు పొడవాలనుకోవడం...
అంతకన్నా అతడ్ని ఎక్కువగా బాధించింది శశికళ ప్రవర్తన.
కృష్ణమూర్తిని శశికళ సపోర్ట్ చేయడం అతని కెంత మాత్రం నచ్చలేదు.
ఆ విషయాన్ని సాయంత్రం శశికళతో స్ట్రిక్టుగా చెప్పాలనుకున్నాడు శ్రీచరణ్.
సాయంత్రం ఆఫీసు వదలగానే బయటకు వచ్చాడు. శశికళ కోసం ఎదురు చూస్తుంటే...అతనూహించని ఓ సంఘటన ఊహాతీతంగా జరిగి పోయింది.
అతని కళ్ళ ముందే ఓ స్కూటర్ వెళ్ళిపోయింది. ఆ స్కూటర్ మీదున్నది కృష్ణమూర్తి.
అది కాదు అతడ్ని ఆశ్చర్యపరిచింది.
అతని వెనకాల కూచున్నది శ....శి.....క.....ళ.
స్కూటర్ దుమ్మురేపుతూ ముందుకు కదిలింది శ్రీచరణ్ నిశ్చేష్టుడై చూస్తుండగానే.
* * *
"ఏయ్ ప్రనూషా! ఏమిటీ ఈ రోజు స్పెషల్ గా కనిపిస్తున్నావ్?" ఆఫీసులోకి ఎంటరవగానే ప్రశ్నించింది ప్రసూనాంబ.
"చెప్పుకోచూద్దాం" అని హేండ్ బ్యాగ్ టేబుల్ పై పెట్టి.
"పుట్టిన రోజు?"
"అబ్బ భలే కని పెట్టేశావే"
"పర్లే! పార్టీ ఎక్కడ....?"
"నీ ఇష్టం ఎక్కడ కావాలో అడుగు...."
"పిజ్జా కార్నర్ కి వెళదామే.....చాలా రోజులైంది."
"ఓ.....కే..... గ్రాంటెడ్. లంచ్ అవర్ లో వెళ్ళి వద్దాం. సరేనా?"
ఒప్పుకుంది ప్రనూష.
"మన మేనేజర్ గారికి ఈ సంగతి తెలీదేమో లేకపోతే ఏదో స్పెషల్ పార్టీ అరేంజ్ చేసేవారు..." కన్నుగీటుతూ అంది ప్రసూనాంబ.
మొహం ఎర్రగా కందిపోయింది ప్రనూషకు.
"ఛీ....స్పెషల్ పార్టీ ఎందుకిస్తాడు. అయినా నేను చెప్పలేదు..." అంది.
"ఇప్పుడు నువ్వు చెప్పకపోతావా? ఆయనగారు ఇవ్వకపోతారా? నేను చూడకపోతానా?....సాగదీసింది ప్రసూనాంబ.
"నా అంతట నేనేం చెప్పను తల్లీ సరేనా?"
"అదేంటి?"
"అదంతే నీ కర్ధం కాదు గానీ. ఇంకేంటి సంగతులు....?" అంది ప్రనూష.
ఎప్పుడూ ముభావంగా ఉండే ప్రనూష ఆ రోజు మాత్రం హేపీగా వుండటం ఆఫీసంతా గమనించారు.
ప్రభాత్ రావడంతోనే ప్రనూష టేబుల్ దగ్గరికి వచ్చి "ప్రనూషా! ఓసారీ లోపలికి రా!" అన్నాడు అందరికీ వినబడేలా.
ప్రనూష తెల్లబోయింది. ఆ తర్వాత కోపం వచ్చింది. తనని అందరి ముందూ "రా" అంటాడా! పైగా చనువుగా, ఇలా అతి చనువు ప్రదర్శించడం తనకి అసలు నచ్చదు. అది స్టాఫ్ ముందు.
"ఊ....వెళ్లిరా..." అంది ప్రసూనాంబ నొసలు చిట్లించి నవ్వేస్తూ.
ప్రనూష మనస్సు చివుక్కుమంది.
ప్రభాత్ ఛాంబర్ లోకి నడిచింది.
"ఏమిటి పిలిచారు?"
"ఆ! ప్రనూషా! నీకో సంగతి చెప్పాలి. హెడ్డాఫీసు నుంచి ఫోన్ వచ్చింది. మన కంపెనీ డెలిగేట్స్ మీటింగ్ వుందట రేపదు. అర్జెంటుగా ఈ రోజు ఈవినింగే బయలుదేరమని జి.యం చెప్పారు. నాకు అసిస్టెంట్ గా నిన్ను తీసుకెళ్తున్నాను. నువ్వే త్వరగా సూట్ కేస్ సర్దుకుని రెడీగా ఉండు. నేనొచ్చి పికప్ చేసుకుంటాను. బాంబే స్లయిట్ ఈవినింగ్ ఫైవ్ కే.... ఓ.....కే" అన్నాడు స్థిరంగా తన ఆర్డర్ కి తిరుగులేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది ప్రనూష. ఇంత సడన్ గానా.
అయినా అతనితో ఒంటరిగానా తనా? ఎలా? ఈ రోజు తన పుట్టిన రోజని శ్రీచరణ్ నైట్ డిన్నర్ కి తీసుకెళ్తానన్నాడు గ్రీన్ పార్కుకు, ఇతనికి రానని ఎలా చెప్పడం? పెళ్ళయిన తను పెళ్ళికాని ఓ వ్యక్తితో ఒంటరిగా ఓ ఊరికా!
"ఏమిటి ఆ సదిగ్ధం...." మౌనంగా వుండిపోయిన ప్రనూషను అప్పుడు పరీక్షగా చూస్తూ అన్నాడు ప్రభాత్.
"ఈ రోజు.....ఈ రోజు నా బర్త్ డే.....! నాకు రావడానికి అవ్వదు...." మొహమాటంగా అంది.
"మైగాడ్, నిజమా! మరి ఇంత మంచి విషయం ఇలా చెప్తావేంటి? నిన్ననే చెప్తే మంచి గిఫ్ట్ తెచ్చేవాడ్ని కదా...." అన్నాడు దర్పంగా.
"అందుకే చెప్పలేదు..." అంది నవ్వేస్తూ.
"సరే పద మీనా జ్యూవెలర్స్ కి వెళదాం. నీకు నచ్చింది తీసుకో..." అన్నాడు కారు కీస్ అందుకుంటూ.
"వద్దు ప్రభాత్ నాకేం వద్దు ఇప్పుడు..." అంది అతన్ని చెయ్యి పట్టి ఆపేస్తూ.
"పర్లేదు రమ్మంటుంటే..." అతను మరికాస్త బలవంతంగా చెయ్యి పట్టి లాగి అన్నాడు.
