Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 50

 

    "ఇంకేం తెలుసుకోవాలి! ఇంతవరకూ తెలియకుండా వున్నవాళ్ళేవరయినా వుంటే ఇక నుంచి వాళ్ళకు కూడా తెలిసేలా మంచి పనే చేశారు ......"
    "ఏమిటి నువ్వనేది?"
    "ఏమీ తెలియనట్టు మాట్టడడం నీకే చెల్లింది మిస్టర్...కాలేజీ లోని ఏ చెట్టు పుట్టను కదిలించినా మీ జంట పేర్లే వినిపిస్తున్నాయి. ప్రతి గోడమీదా మీ పేర్లే దర్శనమిస్తూ మీరెంత అమర ప్రేమికులో తెలియ చెబుతున్నాయి" నందిని గొంతులో అక్కసు ధ్వనిస్తున్నది.
    "నో.....నేను నమ్మను"
    "అంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారన్నమాట"
    "నందినీ స్టాపిట్' విసురుగా అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా గిరుక్కున వెనుదిరిగి బయటకు వెళ్ళాడు విష్ణు.
    అసలే తల్లి అక్కలు కనిపించనందుకు మనసులో ఆరాటంగా వుంటే , పుండు మీద కారం జల్లినట్టు నందిని ప్రవర్తన......దానికి తోడు కిరణ్మయి ప్రస్తావన.!
    కాలేజీలో అడుగుపెట్టిన విష్ణు వైపు ప్రతి ఒక్కరూ అదోలా చూస్తున్నారు.
    ఎప్పుడూ లేనిది .....ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు తన ముఖం వైపు వింతగా చూస్తున్న వాళ్ళను చూడలేక తల ప్రక్కకు తిప్పుకున్నాడు.
    "ఏమోయ్ విష్ణూ.......మంచి గ్రంధసాంగుడీవే......మంచి బ్యుటీనే వలలో వేసుకున్నావు ఫరవాలేదు....పైపెచ్చు సినిమా స్టయిల్ లో మీ పేర్లు ప్రతి చెట్టు మీద చేక్కుకోవడం థ్రిల్లింగ్  గా నే వున్నది."
    తోటి లెక్చరర్ భుజం తట్టి మరీ చెప్పడంతో విష్ణుకు విషయం కొంచెం అర్ధమయింది.
    తనకు తెలియకుండా తన వెనుక ఏదో కుట్ర జరిగింది.......
    ఎవరు చేశారు అ పని?
    చివరకు క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డు పై విష్ణు, కిరణ్మయి పేర్లున్నాయి. అంతేకాదు ......"ప్రేయసీ ప్రియులయిన జంటకు మా అభినందనలు'..... 'లైలా మజ్నులయిన విష్ణు, కిరన్మయిలకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు' అని కూడా రాశారు.
    కనిపించిన ప్రతి ఒక్కరూ అతనిని ఎగాదిగా చూడడం మొదలు పెట్టారు.
    మగపిల్లలు కోపంగా, ఆడపిల్లలు ఈర్ష్యగా ఆ ఇద్దరినీ చూస్తున్నారు.
    అలా ప్రచారం చేసింది ఎవరో అని ఆలోచిస్తున్నాడు విష్ణు.
    అప్పుడే మెరుపులా ప్రత్యక్షమయింది కిరణ్మయి.
    "మాస్టారూ చూశారా మన ఇద్దరి గురించి ఎలా చెప్పుకుంటున్నారో......నాకయితే ఎంతో ఆనందంగా వుంది" కళ్ళను చక్రాల్లా తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది కిరణ్మయి.
    "స్టాపిట్......ఐసే స్టాపిట్.....ఎస్....ఇదంతా నువ్వే చేశావు. నాకు ఇష్టం లేని పని నా చేత ఎందుకు చేయించాలనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమించడమనేది ఈ జన్మలో జరగదు" అంటూ విసురుగా కాలేజీ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు విష్ణు.
    ఇప్పుడు అతని మనసు అంతా వికలమైపోయింది.
    ఇంటా బయట అతనికి మనశ్శాంతి కరువై పోయింది.
    ఏదో తెలియని ఆవేశం అతనిని నిలువెల్లా దహించి వేస్తున్నది.
    కానీ తను ఎవరిని నిందించగలడు?
    ఏమని నిందించగలడు?
    తనంతట తను ఎన్నుకున్న బాటలో ముళ్ళు మొలచినా, రాతి బందలే ఎదురయినా తలరాత అని సరిపెట్టుకోడం తప్ప ఎవరిని తప్పు పట్టలేడు....
    కన్నవాళ్ళు దూరమై తోడబుట్టినవారి జాడ తెలియక, కట్టుకున్న అర్ధాంగి వల్ల మానసిక క్షోభననుభవిస్తూ ఏకాకిలా వున్న తనకు పిసరంతయినా మనశ్శాంతి దొరుకుతుందదనుకున్న కాలేజీలో సయితం కిరణ్మయి అలజడి రేపింది.
    అసలే సమస్యలతో సతమతమవుతున్న తనకు మరొక కొత్త సమస్యను తెచ్చి పెట్టింది.
    ఇన్నాళ్ళు మనశ్శాంతి వెదుక్కున్న చోట అశాంతి పేరుకు పోవడంతో తిరిగి కాలేజీకి వెళ్ళబుద్ది కాలేదతనికి.
    లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు విష్ణు.

    'అల్లుడూ ఎక్కడకు ప్రయాణం అవుతున్నావు?" గోవిందయ్య అనుమానంగా అడిగాడు.
    "మనశ్శాంతి వేదుక్కోవడానికి ......" టక్కున జవాబిచ్చాడు.
    'అదేంటి అల్లుడూ? ఇప్పుడు నీకొచ్చిన లోటు ఏంటి?" అల్లుడు అలిగాడన్నట్టు గ్రహించి అడిగాడు.
    "గోవిందయ్యా! సూటిగా అడుగుతున్నాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పు నా తల్లి, అక్కలు ఏమయ్యారు? వాళ్ళకు నువ్వు ఇస్తానన్న డబ్బు ఇచ్చావా?" అప్పటికే విష్ణు కళ్ళల్లో ఎర్రజీర ఏర్పడింది.
    'అల్లుడూ.....అప్పుడు....అది....." గోవిందయ్య నీళ్ళు నమిలాడు.
    "నువ్వు నిజంగా డబ్బు ఇచ్చి వుంటే వాళ్ళు దేశాల బట్టి పోవాల్సిన పని లేదు. వాళ్ళు- కనిపించక పోవడానికి పరోక్షంగా నువ్వే కారణం" చాకులా దూసుకు వచ్చాయి అతని నోటివెంట మాటలు.
    "నేను.....ఇవ్వకపోతే వాళ్ళే వద్దన్నారు.'
    "ఛీ....దుర్మార్గుడా......ఆ మాట ఇప్పుడు చెబుతున్నావా?"
    "నేను ఎంత బలవంతం పెట్టినా తీసుకోలేదు ఆత్మాభిమానం కల వాళ్ళు కావడం వలన ఆ విషయం చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోయారు. ఇందులో నా తప్పేం లేదు" అందంగా తప్పుని వాళ్లపైకి నెట్టే ప్రయత్నం చేశాడు గోవిందయ్య.
    "గోవిందయ్య........ను..వ్వు.... అబద్దం చెబుతున్నావు, ఆ మాట అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు. నువ్వు ఎందుకు చెప్పలేదో తెలుసా? చెబితే నేను ఎక్కడ నీ కూతురుని వదిలి వెళ్ళిపోతానో అని భయపడ్డావు. అసలు నా వాళ్ళకు డబ్బు ఇచ్చే ఆలోచనే నీకు వుండి వుండదు. నిజంగానే వుంటే ఏదో ఒక రూపంలో ఇచ్చి వుండే వాడివి లేదా నా కయినా చెప్పి ఉండేవాడివి........."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS