"వాడెవడు మధ్యన?" కనుబొమలు ముడివేస్తూ అడిగాడు.
"వాడా? రోజుకి రెండు రేప్ లు, వారానికో హత్య, పక్షానికో బందిపోటు దొంగతనం చేసి నూటిరవై ఏళ్ళు కఠిన శిక్ష పడ్డవాడు. జైలు నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు__ముఖ్యంగా నన్ను జైలు నుంచి తప్పించిన దేవుడు__"
అదిరిపడ్డాడు వెంకట్రామయ్య ఆ ఊహలకి "రేయ్ మోహన్! వాడితో మనకి పొత్తు వద్దు. వాడెప్పుడూ ప్రమాదకరం వ్యక్తే అవుతాడు. స్వప్నకి ప్రాణాపాయం తలపెట్టినా పెట్టొచ్చు."
"అలాగే కానీ నష్టమేమిటి? స్వాతి నెత్తికెళితే రవి దిగొస్తాడు. ఆస్తి అంతా రాయించుకుంటే సరి!"
వెంకట్రామయ్య ఏదో అనబోయాడు.
"ఇక చాలు నీ నిర్వాకం అర్థమైంది! నే చెప్పినట్టు విను. ఈ రాత్రికే స్వప్నకి ఫోన్ చెయ్యి. ఇదిగో చెప్పాల్సిన మాటలు, ఇక నే వస్తా! మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వస్తా!"
నిర్ఘాంతపోయి చూస్తూ వుండిపోయాడు వెంకట్రామయ్య.
39
స్వప్న, స్వాతి యిద్దరూ యింటి ముందు తోటలో కూర్చున్నారు. సాయంకాలం ఆరుగంటల సమయం. రవి ఇంట్లో లేడు. ఎక్కడికో వెళ్ళేడు. అతనికీ మధ్య ఇంటి వ్యవహారాలతో అంతగా తీరిక చిక్కటం లేదు. ఇంటిని, ఇల్లాలిని మరిచి ఇంటి వ్యవహారాలు చూస్తూ వున్నాడు.
స్వప్న ఏదో అల్లుతోంది. స్వాతి మౌనంగా, నిశితంగా దాన్ని పరిశీలిస్తూ కూర్చునుంది.
"మీ అమ్మగారు యిక్కడికి రారా?" హఠాత్తుగా, సందర్భం లేకుండా ప్రశ్నించింది స్వప్న.
హఠాత్తుగా అలా ప్రశ్నించేసరికి విస్తుబోయింది స్వాతి. ఆమెకి ఏ సమాధానం చెప్పాలో చప్పున స్ఫురించలేదు.
"ఊఁ"
"ఎందుకు రారు?" నోటి వెంట దొరిలిన మాట అనేసింది.
"ఎప్పుడొస్తారు?" తలెత్తకుండానే అడిగింది స్వప్న.
"ఏమో? నాకేం తెలుసు?"
చప్పున తలెత్తి చూసింది స్వప్న. తెల్లబోయిన స్వాతి ముఖం చూసి పకపక నవ్వింది. ఆ నవ్వుతో స్వాతి మరీ బిక్కముఖం వేసింది. ఆమెకి ఆ ప్రశ్నా, ఆ నవ్వూ రెండూ అసంగతంగానే తోచాయి.
"మీ అమ్మగారు బావుంటారా?"
తలూపింది స్వాతి.
"ఎలా? నీలా వుంటారా? మీ అన్నయ్యలాగానా?"
"మా యిద్దరి లాగా వుంటారు. కొన్ని పోలికలు నాకూ, కొన్ని మా అన్నయ్యకి వచ్చాయి!"
"ఆమె కోపం ఎవరికీ రాలేదా?"
ఆ ప్రశ్న అర్థం కాలేదు స్వాతికి.
"మీ అమ్మగారికి పట్టుదల ఎక్కువటగా! స్వాతీ! ఓ మాట అడుగుతాను నిజం చెబుతావా? మీ అమ్మగారికి నన్ను కోడల్ని చేసుకోవటం యిష్టం లేదటగా?"
"అవన్నీ నాకేం తెలుసొదినా?"
బేలగా అంది స్వాతి. ఆ సమాధానానికి కరిగిపోయింది స్వప్న. ఆమెకి స్వాతిపై అంతులేని జాలి కలిగింది. "పోన్లే!" అంది మృదువుగా.
కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మాటల మధ్యలో చిక్కుబడిపోయిన నూలు వుండని విడదీస్తూ కూర్చుంది స్వప్న. చీకట్లు కొద్ది కొద్దిగా చిక్కబడుతూ వుండటం వల్ల లైట్లు వెలిగించాడు తోటమాలి. నియాన్ లైట్ కాంతి ఇద్దరిమీదా ప్రసరించసాగింది. తెల్లటి ఆ పాల వెన్నెల వంటి లైటు వెలుతుర్లో అప్పుడే వెన్నెల స్నానం చేసి వచ్చిన అప్సర్సలా వుంది స్వప్న.
"ఈ రోజు సంగీతం మాస్టారు రాలేదేం?"
"ఏదో సినిమాకి వెళతామన్నారు. అంతా సంగీతమయం సినిమాట అది. రిక్షావాళ్ళు కూడా భలేగా వుందని పొగుడుతున్నారట. ఎవరో కొత్త యాక్టరట. ఆయన ఆ పాత్ర కోసమే పుట్టాడన్నట్టుగా వున్నారట. ఆయన్ని నటుడను కోవటం లేదందరూ! ఆ పాత్రే ఆయన అనుకుంటున్నారు!" కుతూహలంగా చెప్పింది స్వాతి.
