తనకి.
వెంటనే నారంగ్ ని కాంటాక్ట్ చేసింది తను.
ఒకటే రిక్వెస్ట్! తనకి టికట్ దొరికింది. కానీ ఎయిర్ పోర్టుకి చాలా దూరంలో ఉంది తను! ఎయిర్ పోర్టుకి చేరుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.
అప్పటిదాకా ఫ్లయిట్ డిలే చెయ్యడం కుదురుతుందా? తనకోసం?
"ఇట్ కెన్ బి డన్!" అన్నాడు నారంగ్ చాలా ఆత్మవిశ్వాసంతో." నువ్వు తక్షణంబయలుదేరు. యూకెన్ సర్టెన్లీ కేచ్ ద ఫ్లయిట్!"
సరిగ్గా గంట తర్వాత ఎయిర్ పోర్టు చేరుకుంది తను. ఫ్లయిట్ కేచ్ చెయ్యగలిగింది, నారంగ్ చెప్పినట్లే. అది ఎలా మేనేజ్ చెయ్యగలిగాడో ఇంకాసేపట్లో తనే వచ్చి చెబుతాడు నారంగ్.
సంతోషంలేని నవ్వు నవ్వుకుంది సీత. తలుచుకుంటే మానాలని ఆపేసే స్టేజ్ కి చేరుకుంది తను. చెప్పలేనంత పలుకుబడీ, లెక్కలేనంత డబ్బూ సంపాదించింది.
కానీ సార్ధకత ఏమిటి దీనికి? బతుకంటేనే విరక్తి తనకి! అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు?
ఎందుకు సంపాదించింది తను?
ఎందుకో తెలుసు సీతకి!
ఈడబ్బూ, ఈ పరపతీ ఇవి అన్నీ ఉపయోగించి క్షణక్షణంనరకం సృష్టిస్తుంది తను రాఘవులుకి. తను తలుచుకుంటే రాత్రికి రాత్రే ఫినిష్ చేయించగలదు. కానీ అలా చెయ్యదు.
అసలు ఎందుకు పుట్టానా అని వాడు ప్రతి క్షణం విలవిల్లాడుతూ, వల వల ఏడుస్తూ, క్షణమొక యుగంగా మిగిలిన జీవితం గడిపేలాచేస్తుంది.
రాఘవులుని తలుచుకోగానే ఆమెమొహం ఆగ్రహంతో ఎర్రబడింది.
జాన్, ఉస్మాన్, రాఘవులూ....
"బాస్టర్డ్స్!"
"రాఘవులూ! హియర్ ఐ కమ్!" అనుకుంది కసిగా.
వ్వవ్వవ్వవ్వవ్వవ్వ
ఎప్పుడూ లేనిది ఆరోజున రైల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణం చెయ్యడం అంటే చిరాకు వచ్చింది అలేఖ్యకి ఫస్ట్ క్లాస్ కి బదులు సెకండ్ క్లాస్ లో ఎక్కి ఉంటే బాగుండేదా అనిపించింది.
దానికి కారణం ఒక ఆరడుగుల శాల్తీ. ఆ కంపార్టుమెంటులో తనుకాక అతనొక్కడే ఉన్నాడు. రాత్రంతా ఇతనితో కలిసిప్రయాణం చెయ్యాలని తలుచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తిపోతోంది.
ఫస్టు క్లాసులో బెర్తులు మామూలుగా ఖాళీ ఉండవు. కానీ ఈ రైలు చిత్రంగా ఉంది. దీనికి 'గాడిదలబండి' అని నిక్ నేమ్ కూడా ఉందట!
ఫస్ట్ క్లాస్ లో ఎక్కి పొరబాటు చేసింది తను నిజంగానే.
ఎదుటిబెర్తుమీద కూర్చున్న తను ఇప్పటికి నాలుగుసార్లు తన గుండెలవైపు చూశాడు. చూడడానికి చదువుకున్న వాడిలాగానే కనబడుతున్నాడు కానీ చదువు ఇతనికి మేనర్స్ నేర్పినట్లులేదు.
మళ్ళీ ఇంకోసారి అలేఖ్యవైపు చూశాడు అతను. ఆమె పమిటను చూపులతోనే తొలగించేస్తున్నట్లు ఉన్నాయి ఆ చూపులు. విసురుగా తల పక్కకి తిప్పుకుంది అలేఖ్య.
అతను లేచి నిలబడ్డాడు. తలుపు దగ్గరికి నడిచి హాండిల్ ని అటూ ఇటూ తిప్పి చూశాడు. తలుపు గట్టిగా పడుతుందని రూఢీ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి కారిడార్ మొత్తం ఒకసారి తిరిగి చెక్ చేసి వచ్చాడు. తిరిగి రాగానే అతని చూపులు అలేఖ్య సూట్ కేసు మీద పడ్డాయి. అతని ప్రతి చర్యనీ గమనించి జాగ్రత్తగా చూస్తోంది అలేఖ్య.
రాబోయేది మీల్సు హాల్టుట. అక్కడ అందరూ భోజనాలు ముగించి లైట్లు ఆర్పి నిద్రలోకి జరిపోగానే ఇతను తలుపులు బిగించి తనను.....
ఆ ఆలోచన రావడంతోనే అలేఖ్య పెదిమలు తడి ఆరిపోయాయి.
అప్రయత్నంగా అతని చూపులతో కలుసుకున్నాయి ఆమె చూపులు. అతని చూపులు మామూలుగా లేవు. ప్రతిదాన్నీ జాగ్రత్తగా పరిశీలించి మనసులో నోట్ చేసుకుమ్తున్నట్లు చూస్తాడు అతను.
వెధవపనులు విజయవంతంగా చేసేవాళ్ళందరికీ ఇలాంటి జాగ్రత్తలు అలవాటయే ఉంటాయేమో!
ఎరక్కపోయి ఇందులో ఇరుక్కుపోయింది తను. లాభంలేదు మీల్స్ హాల్టురాగానే టి.టి.ఇ/తో చెప్పి బెర్తు మార్పించుకోవాలి. అంతగా అయితే సెకెండ్ క్లాస్ లేడీస్ కంపార్టుమెంట్ లో రెండు బెర్తులు మధ్య దుప్పటి అయినా పరుచుకు పడుకోవాలి.
లేదారాత్రంతా మేలుకుని జాగారమైనా చేయాలి.
అంతేగానీ ఈ కంపార్టుమెంట్లో మాత్రం పడుకోదు తను. ష్యూర్!
అతను మరోసారి లేచి బోగీ అంతా పరిశోధించి వచ్చి సూట్ కేసు తెరిచాడు.
ఓరగా చూస్తోంది అలేఖ్య.
సూట్ కేసు తెరవగానే ఆమె దృష్టిని ఆకర్షించింది ఒక రివాల్వరు.
ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లయింది అలేఖ్యకు అదేక్షణంలో రైలు కూడా స్టేషన్ లో ఆగింది.
చటుక్కున లేచి నిలబడింది అలేఖ్య.
వెంటనే అతను కూడా లేచి నిలబడ్డాడు. "మీరు మీల్సు కి ఆర్డర్ ఇచ్చినట్లులేదు. స్నాక్స్ ఏమన్నా కావాలా? నేను చెయ్యగలిగినది ఏమన్నా ఉంటే సందేహించకుండా ఆర్డర్ చెయ్యండి!" అన్నాడు.
"ఏమీ అవసరం లేదు" అంది అలేఖ్య కటువుగా. అతని అతి చనువు ఆమె సహనాన్ని పరీక్షిస్తోంది.
అతను సూట్ కేస్ పట్టుకుని తలుపు దగ్గరకు నడిచి అక్కడ ఆగి వెనక్కి తిరిగాడు.
"మిస్! నేను వెళ్ళి పక్క కంపార్టుమెంటులో పడుకుంటాను. మీరేమీ అనుకోకపోతే ఒక్కమాట!"
ఊపిరిబిగపట్టి చూసింది అలేఖ్య.
"మీరు మెడలో మూడుచెయిన్లు వేసుకున్నారు. నగలు పెట్టుకుని రైలు ప్రయాణం చెయ్యడంచాలా ప్రమాదకరం. దొంగలని భుజంతట్టి పిలిచినట్లవుతుంది అది. మీరు కిటికీవైపు తలపెట్టి పడుకుంటే రైలు అర్దరాత్రి పూట ఏ స్టేషన్ లోనో ఆగినప్పుడు ఎవరన్నా కిటికీలోనుంచి చెయ్యి పెట్టి మీ గొలుసులు తెంపుకుపోవచ్చు. అందుకని పడుకునేటప్పుడు గ్లాస్ విండోస్ మూసి వుంచండి. కంపార్టుమెంట్ తలుపులు గట్టిగానే పడుతున్నాయి. చూశాను. భద్రంగా వేసుకోండి. ఈ లైన్ లో దోపిడీ దొంగల భయం ఎక్కువై పోయింది. ఆ మధ్య కొన్నాళ్ళపాటు సాయుధులైన కానిస్టేబుల్స్ ని ప్రతి బోగీలో కాపలాగా ఉంచారు.
దోపిడీలు కాస్త తగ్గగానే మళ్ళీవాళ్ళని తీసేశారు. మనజాగ్రత్తలో మనం ఉండడం ఎందుకైనా మంచిది."
ఒక్కసారిగా తెరిపిన పడింది అలేఖ్య మనసు. అనవసరంగా అనుమానించింది ఇతన్ని తను. అందుకని అతనితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ "పోలీసు కానిస్టేబుల్స్ లేకపోవడమే మంచిదిలెండి. ఈ లాకప్ మరణాలు అవి చూస్తుంటే పోలీసులంటేనే భయం పుడుతోంది. కాపలాకి అని ఉంచిన కానిస్టేబులే అఘాయిత్యం చెయ్యబోతే దొంగలు వచ్చి రక్షించవలసివస్తుందేమో!" అంది.
అతను పెద్దగా నవ్వాడు.
"కరెక్టే! ఒకసారి నిజంగానే ఏం జరిగిందోతెలుసా? దారికాచి బస్సులని దోచుకోవడం నిత్యకృత్యమైపోయింది. కొన్నాళ్ళపాటు ఈ ప్రాంతంలో అడ్డంగా రోడ్డుకి రాళ్ళు పెట్టి ఒక బస్సుని ఆపి లోపలికి జొరబడ్డారు. దారి దోపిడీదొంగలు కొంతమంది ప్రయాణికులందరి దగ్గర ఉన్న డబ్బు దస్కం గుంజుకున్నారు. అంతా కలిసి లెక్క పెట్టాక వాళ్ళ మొహాలు చిన్నబోయాయి. వెంటనే ఎవరి డబ్బు వాళ్ళకి మర్యాదగా తిరిగి ఇచ్చేశారు. ఆశ్చర్యపోయిన ప్రయాణీకులు ఇదేమిటని అడిగారు.
