'ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తాను. ఎవర్ని ఎక్కడ ఎలా ఇరికించాలో యీ కరణానికి వెన్నతో పెట్టిన విద్య" అన్నాడు ఆవేశంగా.
"ఛి పోరా! ఇంకా మాట్లాడతావే...." అంటూ ఛేయిర్ ఎత్తి కొట్టబోయాడు.
కరణం వెంటనే అక్కడినుండి పారిపోయాడు.
"చీ వెధవ ......మైండంతా ఖరాబు చేశాడు" అంటూ సీసాలో మిగిలిన బ్రాందిని గ్లాసులో పోసుకుని, నీళ్ళు కూడా కలుపుకోకుండా గబగబా త్రాగేశాడు.
"సుందరం బాబూ! నా మాట విని మీరు రేపట్నుంచి నా దగ్గరకు రాకండి. మీరు ఇప్పటికే నాకెంతో యిచ్చారు. మీలాంటి కల్మషం లేని వ్యక్తుల్ని నేను ఇంకా మోసం చేయలేను. ఆ కరణంగాడు గుంటనక్క, మీ పరువు తియటానికే కంకణం కట్టుకున్నాడు. దయచేసి రేపటినుంచి మీరు రాకండి" అంటూ ప్రాధేయపడింది వరాలు.
"ఏంటే ఆడికి భయపడేది....! నేను నీ దగ్గరకు రాకుండా మనుకోవాలా? నీ దగ్గరకు రాకుండా నిగ్రహించుకోగలను కానీ, ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే, వాడిని భయపడే రాలేదనుకుంటాడు...." అన్నాడు సుందరం.
"అయ్యో....అదేం కాదండి! పోనీ, నేనే అసలు ఈ ఊరు వదిలి పోతాను. సుందరం బాబూ! మీరు మాత్రం నన్ను మర్చిపోండి. నేను మంచిదాన్ని కాను బాబూ! నాకు నీలాంటివారు చాలామందితో పరిచయం వుంది" అంది వరాలు.
"ఆ సంగతి నాకు తెలిదనుకుంటున్నావా? ఎందుకో నిన్ను చుసిన తర్వాత, నీ నవ్వు చూశాక నేను నీకు బానిసనయిపోయాను. ఈ విషయంలో కరణంగాడిదే విజయం! నన్ను తాగుబోతును చేశాడు. తిరుగుబోతును చేశాడు. రాస్కెల్...." అన్నాడు సుందరం.
"అందుకే ఇప్పటికి మించిపోయిందిలేదు, మీరు నన్ను మర్చిపోండి, జరిగిందేదో జరిగిపోయింది" అంది వరాలు బ్రతిమాలుతూ.
"సెత్ నోర్ముయ్యవే. నాకు మందయిపోయింది. ఇప్పుడు మందు కావాలి" అన్నాడు సుందరం.
"అయ్యో--ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది బాబూ! మీరు వెళ్ళండి. తాగింది చాలు, జరిగిన గొడవ చాలు. ఇంకా అల్లరికావొద్దు ఇప్పటికే ఆలస్యమయింది. టైం ఇప్పుడు పదిగంటలు అవుతోంది" అంది వరాలు.
"నేను వెళ్ళనే. ఈరాత్రికి ఇక్కడే వుంటాను. నాకు మందు కావాలి తీసుకురా. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు" అంటూ జేబులో నుంచి బంగారు గొలుసు తీశాడు.
"వద్దు బాబు...నాకేం వద్దు. మీ పరువు ముఖ్యం. మీరు దయచేసి వెళ్ళిపొండి నా మాట విని" అంది వరాలు.
సుందరం వరాలు చెంప మీద చెళ్ళున కొట్టాడు.
"రమ్మనటం నీ వంతే, పోమ్మనటం నీ వంతేనా? చంపేస్తానే.....నాకు మందు కావాలి తీసుకురా. నీ దగ్గిర వుంటుందని నాకు తెలుసు...." అన్నాడు.
వరాలు నిశ్శబ్దంగా ఏడుస్తూ లోపలికి వెళ్ళి భ్రాంది సీసా తెచ్చింది.
సుందరం దానిని ఆనందంగా అందుకుని, ఓపెన్ చేసి గ్లాసులో పోసుకున్నాడు.
వరాలు ఏడుస్తోంది.
"ఎందుకే ఏడుస్తావు? నీలో వున్న నీతి వాడిలో లేదు. నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు నీ తప్పుల్ని, ఈరాత్రికి ఇక్కడే వుండి వెళ్ళిపోతాలే. ఇక రేపు నీ దగ్గరకు రాను. రేపే కాదు ఇక ఎప్పటికి రాను....నువ్వు కూడా నేనిచ్చిన డబ్బుతో కొత్త జీవితాన్ని ప్రారంభించు. కావాలంటే ఇంకా యిస్తాను" అన్నాడు సుందరం.
"వద్దు బాబూ వద్దు. నాకిక మీ ఆస్తులు వద్దూ....బంగారం వద్దు. మీరు నాలో మార్పు తెచ్చారు. అది వెలకట్టలేని బహుమానం! మీరిచ్చిన ఆ బహుమానం చాలు బాబు నాకు. నాకు పునర్జన్మను ప్రసాదించారు. రేపే నేను యీ ఊరు వదిలి వెళ్ళిపోతాను. నాకు ఉహా తెలిసినప్పటినుంచి తప్పుడు జీవితాన్నే గడిపాను. మా అమ్మే నన్ను యీ రొంపిలోకి దింపింది" అంది వరాలు.
"వద్దు.....నాకిక నీ గతం గూర్చి ఏమి చెప్పొద్దు. నీ భవిష్యత్ ఉన్నతంగా వుండాలి. దానికోసం ఇంకా నానుంచి ఏ సాయం కావాలన్నా చేస్తాను...." అన్నాడు సుందరం బ్రాందిని గ్లాసులో వొంపుకుంటూ.
బాబుగారూ! మీరిప్పటికే చాలా తాగారు. ఇక చాలు, భోజనం పెడతాను. తిని పడుకుని, పొద్దున్నే లేచి వెళ్ళిపొండి......" అంది వరాలు.
"భోజనమా! నాకు మందు, ఎదురుగా నువ్వుంటే ఇక భోజనం ఎందుకే? ఇదే చివరి రాత్రి.....హాయిగా తాగని.....ఏది---దీన్లో నీళ్ళు కలుపు" అన్నాడు.
వరాలు కూజాలో నీళ్ళు గ్లాసులో వొంపి వాటిని అతని భ్రాందిలో కలిపింది.
సోమసుందరం దానిని అపురూపంగా అందుకుని గటగటా తాగేశాడు.
"ఇప్పుడు షానా తృప్తిగా వుందే....వ...రా...లు......" అన్నాడు మత్తుగా.
"ఇకచాలు, లేవండి భోజనం చేద్దాం" అంది ఆమె అతన్ని ప్రాధేయపడుతూ.
"వద్దు నాకు....భోషణం....వద్దు.....నువ్వు....కావాలి" అంటూ ఆమె మీదకు వాలిపోయాడు.
వరాలు అతన్ని జాగ్రత్తగా పొదివి పట్టుకుని మంచం పైన పడుకోబెట్టింది. అతనికి జాగ్రత్తగా దుప్పటి కప్పి, తను అతని పక్కనే చాప వేసుకుని, దిండు దుప్పటి పర్చుకుంది. టేబుల్ పైన వున్న కూజా , మందు సీసా గ్లాసులు అన్ని తీసి శుభ్రంగా ఉడ్చింది. ప్లేటులో అన్నం మీద మూత బోర్లించి వంటగదిలో పెట్టింది. అన్ని సర్ది చాపమీద నడుం వాల్చి పడుకుంది.
