Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 51


    ఇదే అమ్మాయి ఆనాడు ప్రేమ్ వీణ ఇస్తే "ఇంత విలువైన బహుమతి తీసుకునే అర్హత నాకు లేదని" తిరస్కరించింది. ఈనాడు ఇంత పెద్ద సహాయం ఆనందంగా స్వీకరిస్తోందంటే కారణం నవీన్" ప్రేమ, పిచ్చీ ఒకటేనని తేల్చినవాళ్ళు నిజంగా మేధావులే...! ఆ స్థితిలో వున్నవాళ్ళకి వివేకం, విచక్షణా వుండవు. తాత్కాలిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ, తొందరపాటుతో వ్యవహరిస్తారు.
    
    ధృతి నవీన్ కోసం ఏమైనా చేసి అతని బాధని పటాపంచలు చేయాలనుకుంది. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో వుండగా, ప్రేమ్ పరిష్కారం సూచించాడు. ఆమెకి సృష్టిలో వున్న ఆనందమంతా చేతికందినట్టనిపించింది.
    
    లోకంలో ఇంకా మానవత్వం వుంది. సాటి మనిషిని ఆదుకోవాలనే తపన అంతర్గతంగా అందరిలోనూ వుంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడే బయటపడుతుంది. బంధాలూ, అనుబంధాలూ ఎంత తియ్యనివి! ఇవి మనుషులకి మాత్రమే ఇచ్చిన దేవుడెంత కరుణామయుడు! అనుకుందామె.
    
    ఆమె నమ్మకాలను దెబ్బతీసే సంఘటన ఒకటి మరునాడే ఎదురు కాబోతోందని ఆమెకి ఆ నిమిషంలో తెలీదు.
    
                                                                 * * *
    
    ధృతి హడావిడిగా మెట్లు దిగి వచ్చింది. ఎదురుగుండా కారు ఆగి వుంది.
    
    డ్రైవర్ దగ్గరకొచ్చి "ప్రేమ్ బాబుగారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా" అన్నాడు.
    
    ఆమెకి తప్పించుకోలేని పరిస్థితి....! ఓ నిమిషం సందిగ్ధంగా చూసింది.
    
    "డ్రైవర్! ఏమిటీ ఆలస్యం?" అంటూ కార్లోంచి ధర్మారావుగారి కంఠం వినిపించింది.
    
    "మిమ్మల్ని దిగబెట్టి బాబుగారిని ఆఫీస్ కి తీసుకెళ్ళాలి. త్వరగా రండమ్మా" అంటూ డ్రైవర్ కంగారుపెట్టాడు.
    
    ఆమెకి కారు ఎక్కక తప్పలేదు.
    
                                                                   * * *
    
    నవీన్ తనకోసం ఎదురుచూస్తూ వుంటాడని ధృతికి తెలుసు. తను తప్ప అతనికి ఈ సమయంలో ఓదార్పు నిచ్చేవారు ఎవరూ లేరు. కనిపించని సంకెళ్ళు తనచుట్టూ బిగుసుకుంటున్నట్లు ఆమెకి అనిపించసాగింది.
    
    ప్రేమ్ సంతోషంతో వున్నాడు. తనచుట్టూ వున్న స్నేహితులతో ఏవో జోక్స్ చెప్తూ మధ్య మధ్యలో స్టయిల్ గా డ్రింక్ చేస్తూ, అమ్మాయిలతో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. ధృతిని చూసినప్పుడల్లా దగ్గరకొచ్చి పలకరించి "కమాన్! కాసేపు కార్డ్స్ ఆడు" అనో, "ఒక్కదానివీ అలా బిగుసుకు కూర్చున్నావే కమాన్" అనో పిలుస్తున్నాడు.
    
    ఆమె విధిలేక నవ్వేసి వూరుకుంటుంది కానీ, ఆమెకి భోరుమని ఏడవాలనిపిస్తోంది. మనసంతా హాస్పిటల్లోనే వుంది. సమయం పరిగెడుతూనే వుంది.
    
    "ఈపాటికి ఆపరేషన్ అయిపోయి వుంటుంది" అనుకోగానే ఇంక ఒక్క నిమిషం కూడా ఆమెకి అక్కడ కాలు నిలవలేదు. ప్రేమ్ దగ్గరికి వెళ్ళి.....
    
    "నే వెళ్ళాలి" అంది.
    
    అతను మొదట అర్ధంకానట్లు చూసి ఆ తర్వాత "ఎక్కడికి....?" అన్నాడు.
    
    "నవీన్ దగ్గరికి, హాస్పిటల్ కి" అంది.
    
    అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు. రెండు నిమిషాలాగి "కారు కూడా లేదు- ఎలా వెళతావు?" అన్నాడు.
    
    "బస్సెక్కి వెళతాను."
    
    "ఊ! నీ యిష్టం" అన్నాడు కాస్త చిరాగ్గా.
    
    అప్పటికే అందరూ నిశ్శబ్దంగా వారి సంభాషణ వినసాగారు.
    
    వడివడిగా నడుస్తూ వూరి చివరున్న గెస్ట్ హౌస్ దాటి బయటపడింది ఆమె.    

                                                                    * * *
    
    హాస్పిటల్ వరండాలో బెంచిమీద నిస్సత్తువగా కూర్చుని కనిపించాడు నవీన్.
    
    ఆత్రంగా మెట్లెక్కి వచ్చిన ధృతి ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకోవడానికన్నట్లు ఆగింది.
    
    ఆమె చాలా కష్టపడి వచ్చింది. సరయిన బస్సు దొరకక రెండు బస్సులు మారి బోలెడు దూరం నడిచి వచ్చింది. ఖాళీ కడుపులో నరాలు మెలిపెడుతున్నాయి. నవీన్ ని చూడగానే దుఃఖం, నీరసం ముంచుకువచ్చాయి.
    
    అతికష్టం మీద నడుస్తూ "నవీన్" అని పిలిచింది.
    
    అతను తలెత్తి చూశాడు.
    
    "ఆపరేషన్ అయిందా? అమ్మకెలా వుందీ?" ఆతృతగా అడిగేసింది.
    
    జవాబివ్వకుండా ఆమెకేసి తీవ్రంగా చూశాడతను.
    
    ఆ కళ్ళల్లో ఆమె మునుపెన్నడూ చూడని సరికొత్త భావం. అది కోపమో, బాధో, జాలో తెలీడంలేదు.
    
    "ఏమైంది నవీన్? మాట్లాడు." అతని భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగింది.
    
    "అమ్మ బాగానే వుంది" చెప్పాడు.
    
    "హమ్మయ్య!" నిశ్చింతగా వూపిరి పీల్చుకుంది. "ఒక్కడివీ చాలా అవస్థపడుంటావు కదూ? ఏం చేయనూ మరి..."
    
    "ప్రేమ్ తోబాటు పిక్నిక్ కి వెళ్ళక తప్పలేదు. లేదంటే తప్పక వచ్చేదానివి."
    
    "నవీన్!" ఊహించని సంఘటన ఎదురయినట్టు చూసింది.
    
    "అని నాకు ధర్మారావుగారు చెప్పారు."
    
    "ఆయన ఇక్కడికి వచ్చారా?"
    
    "అవును."
    
    అతనిలో మార్పుకి కారణం ఆమెకి బోధపడింది కానీ ఏం చెప్పడానికీ, అతన్ని సమాధానపరచడానికీ ఆమెకి ఓపికలేదు. నిస్త్రాణగా కూలబడింది.
    
    అతను లేచి నిలబడి "నువ్వు రాలేదనీ, పిక్నిక్ కి వెళ్ళావనీ నాకు బాధ లేదు. కానీ పాతికవేలు ధర్మానందరావుగారు యిచ్చారని అబద్దం చెప్పి తప్పుచేశావు ధృతీ! నాతో నువ్వు అబద్దమాడలేవన్న నమ్మకాన్ని వమ్ము చేశావు. అందుకు బాధగా వుంది" అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS