ప్రేమ్ లేచి ఆమె రెండు భుజాలూ పట్టుకుని "ధృతీ! నవీన్ నీ ఫ్రెండయితే నాకూ ఫ్రెండే అతనంత విపత్తులో వుంటే చూస్తూ వూరుకుంటామా?" అన్నాడు.
ఆమెకేమీ అర్ధమవడంలేదన్నట్లు ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తుండిపోయింది.
"డబ్బుకి ప్రాణంపోసే శక్తి వుందనుకుంటే, ఆ డబ్బు నేను యిస్తాను. నవీన్ బాధల్లో వుంటే నువ్వు ప్రశాంతంగా వుండలేవు. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ వుండలేను" అన్నాడు.
ఆమెకతని మాటలప్పుడే అర్ధమయినట్లు "ప్రేమ్..." అంది ఆమె కళ్ళు మెరుస్తుండగా ఆమెకి పరిస్థితి చాలా అనూహ్యంగా వుంది. ఆరగించుకోవడానికి కూడా ఆమెకి చాలా కష్టంగా వుంది. నవీన్ కి ఎక్కడనుండయినా సహాయమందాలని దేవుణ్ణి పదేపదే ప్రార్ధిస్తోందిగానీ, ఎక్కడి నుండో ఆమెకే అర్ధంకాని పరిస్థితి! ఈ పరిస్థితుల్లో ప్రేమే సహాయం చేస్తానంటూ ముందుకు రావడం నిజమగ భగవత్ కృప అనిపించింది. ప్రేమ్ రూపంలో సాక్షాత్తూ దేవుడు ఎదురుగా నిలబడినట్లనిపించింది.
" "నేను నవీన్ ని వెంటనే కలిసి మాట్లాడాలి" అన్నాడతను ఆమె భుజాలు వదిలిపెడుతూ.
అంతసేపూ ప్రేమ్ తనని పట్టుకునే వున్నాడని కూడా ఆమె గమనించలేదు. ప్రేమ్ వదిలి పెడుతూండగా గమనించి, కాస్త వెనక్కి జరిగి "నవీన్ ఒప్పుకుంటాడా?" అందప్పుడేవచ్చిన అనుమానంలా.
"ఒప్పుకోడా....?" ప్రేమ్ కాసేపు ఆలోచిస్తున్నట్లు నుదుటిమీద వేలితో అరసుకుని "ఆ.....ఓ పనిచేద్దాం..." అన్నాడు.
"ఏమిటీ?"
"నా పేరు బయటికి రాకుండా, ఈ సహాయం నువ్వే చేస్తున్నట్లు చెప్పు."
"నేనా? నా పరిస్థితికి ఇంత డబ్బు సహాయం చేయడమా? నవీన్ నమ్మడు.
"అబద్దం చెప్పు."
"ఏమని?"
"ధర్మానందరావుగారు యిచ్చారని."
"అమ్మో...."
"ఫర్లేదు! ఓ ప్రాణం నిలబడాలంటే ఆ మాత్రం అబద్దం ఆడినా తప్పులేదుగా!"
ఆమె ఔనన్నట్లు తల వూపింది.
* * *
ధృతి ఒకేసారి రెండు రెండు మెట్లచొప్పున ఎక్కి పైకి చేరుకోవాలనుకుంటోంది. ఆమె మనోవేగానికి, కాళ్ళకీ లంకె కుదరటంలేదు. ఎంత త్వరగా నవీన్ తో యీ విషయం చెబుదామా, అతన్ని సంతోషపెడదామా అని ఆతృతగా వుంది.
ఆమె వెళ్ళేసరికి దయామణి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. డాక్టరు, నర్స్ ఇద్దరూ బెడ్ దగ్గరే వున్నారు.
నవీన్ చాలా గంభీరంగా బాధని పెదవి క్రింద నొక్కిపెడుతూ చేతులు కట్టుకుని ప్రక్కనే నిలబడి వున్నాడు.
ధృతి వెళ్ళి నవీన్ ప్రక్కనే నిలబడింది.
"ఆపరేషన్ వెంటనే జరగకపోతే ప్రమాదం" ఆపైన మీ యిష్టమన్నట్లు చెప్పి డాక్టరు ముందుకి కదిలాడు.
"డాక్టరుగారూ!"
వెళ్ళబోతున్న డాక్టరు ఆగి, తనని పిలిచిన ఆమెవైపు ఏమిటన్నట్లుగా చూశాడు.
"ఆపరేషన్ కి సుమారు ఎంతవుతుంది?" గబగబా అడిగేసింది.
"పాతికవేలదాకా ఔతుందమ్మా.....! స్పెషలిస్టులను పిలిపించాల్సి వస్తుంది. ఆపైన మందులూ, అవీ... ఇవీ..."
"ఇంకో పదివేలవుతాయనుకుంటా! ఫర్వాలేదు. త్వరగా ఆపరేషన్ ఏర్పాట్లు చేయించండి. డబ్బు మూడు రోజులలో సర్దుబాటవుతుంది.
ఆయన అపనమ్మకంగా ఆమెవైపు చూశాడు.
నవీన్ ఆమెని అదోలా చూస్తూ "ధృతీ! ఏమంటున్నావో నీకేమైనా తెలుస్తోందా? అంత డబ్బు..."
"ఒక పుణ్యాత్ముడు ఇస్తానన్నాడు. డాక్టరుగారు...! కాలయాపన చేయకండి. ప్లీజ్ త్వరగా ఏర్పాట్లూ..."
"అలాగే! వెళ్ళేముందు నన్నోసారి కలిసి మాట్లాడి వెళ్ళండి" అని ఆయన వెళ్ళిపోయాడు.
"ధృతీ!" అన్నాడు నవీన్ ఇదంతా ఏమిటన్నట్లు చూస్తూ.
"నవీన్! ఇప్పుడేమి మాట్లాడి తర్కించుకోడానికి సమయం కాదు. అమ్మ పోతె మళ్ళీ దొరకదు. ఆమెని కాపాడుకోవలసిన బాధ్యత మనిద్దరిమీదా వుంది" అంది.
"కానీ అంత డబ్బు ఎవరు ఇస్తున్నారు? అదైనా చెప్పు?"
"ధర్మానందరావుగారు."
"నేను నమ్మను."
"ఏం, ఎందుకు నమ్మవూ?"
"ఇంత డబ్బు ఉట్టి పుణ్యానికి ఆయన యివ్వడు. నాకు తీర్చే స్తోమతలేదని ఆయనకి తెలుసు."
'నమ్ము, నమ్మకపొ! నా కనవసరం..... పని కావడం ముఖ్యం, నేను వెంటనే వెళ్ళాలి. మళ్ళీ రేపు కలుస్తాను" అంటూ ఆమె వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయింది.
అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినా, అనుకోనివి జరగకపోయినా అది జీవితమనిపించుకోదు.
* * *
ధృతి ప్రేమ్ ని నిలదీసి "ఏమిటి నీ ఉద్దేశ్యం? నాకూ నవీన్ కి వున్న అనుబంధం తెలిసి కూడా ఇలా నన్ను "ప్రపోజ్" చెయ్యడంలో నీ ఉద్దేశ్యమేమిటి?" అనడిగెయ్యాలని ప్రేమ్ ని పిలిచింది. కానీ అనుకోని రీతిలో ప్రేమ్ సహాయాన్ని స్వీకరించి అతనికి ఆజన్మాంతం కృతజ్ఞురాలైపోయింది. దీనివల్ల వచ్చే పరిణామాలు ఏమిటోనన్న సందేహం కూడా ఆమెకి రాలేదంటే...ఆమెకి నవీన్ అంటే ఎంత పిచ్చి ప్రేమో తెలుస్తోంది.
