Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 50

 

      'బాబాయిగారూ, నన్ను క్షమించండి - ఇందులో నా బాధ్యత ఎంత వుందోనాకు తెలియటం లేదు - అతన్ని నమ్మినేను ఎంత నష్టపోయానో ఎవరికర్ధమవుతుంది' - శారద కన్నీళ్ళాపుకునే ప్రయత్నం చేస్తోంది -
   
    'నువ్వేం చేస్తావులే - కొన్నిసార్లు అనుకోని లాభాలు వచ్చి మనకి ఆనందం వస్తుంది - కొన్నిసార్లు అనుకోని నష్టాలు వచ్చి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఏం చేస్తాం. సుఖం, దుఃఖం వెలుగు నీడ - ఇదే జీవితం. "వీరసామి వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తూ.
   
    శారద నెత్తి పట్టుకు కూచుంది. ఆ అర్ధరాత్రి పన్నెండు గంటలు కివచ్చి తలుపుకొట్టినపుడైనా అతనిపై అనుమానం కలగలేదు తనకి సూట్ కేసులో దాచిన అన్నయ్య రూపాయలు తీసుకుంటున్న పుడయినా అనుమానం కలగలేదు అతనిపై తనకి ఎంత నమ్మించాడూ ఆడది అయిన నీరజ - దీప్తి - రజని - ఆ అమ్మాయికయినా బుద్దిలేదే - ఇల్మాతి వ్యాపారాల్లో దూరటానికి - తను మొండిది కనక దీన్ని తట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది బలహీనమైన మనసువుంటే ఏ ఆత్మహత్యకో పాల్పడరా. శారదకి పిచ్చిపుట్టినట్టేవుంది. ఈ పాటికి ఈ వార్త అందరికీ తెలిసే వుంటుంది. లలిత, రామం ఈ న్యూస్ చదివి నవ్వుకున్నారో తనని తిట్టుకుంటున్నారో సుబ్బలక్ష్మి ఆ ఫోటోలో మనిషిని గుర్తించి ఎంతనీచంగా మాట్లాడుకుంటున్నారో - అంతేకాదు - ఆ మనిషికి వున్న స్నేహితులు ఇళ్ళలో డబ్బుదాచాడేమోననే అనుమానంతో ఇల్లు సోదా చేయిస్తారేమో - ఛీ, ఛీ, చివరకి తన బతుకు ఇలా అయిందేమిటీ - ఇప్పుడేం చేయాలి - బొంబాయి ప్రయాణం - కోటీశ్వరురాలు కావటం - పదేళ్ళవరకూ ఎవర్ని ముఖం చూడకూడధనుకోటం - అన్నీ, అన్నీ, పగటి కలలయి పోయాయి. గాజు ముక్కలై నేలరాలిపోయాయి -భవిష్యత్తు అందకారమై భయపెడుతుంటే శారద గుండెలు కరిగిపోయేలా ఏడ్చింది - శారద అహంకారం నేలకొరిగిపోయింది - నీరు వర్షిస్తుందనుకొన్న మేఘం అగ్ని వర్షిస్తే - పూలవాన అని తల ఎత్తితే, రాళ్ళవాన కురిస్తే - అమృతం అనుకున్నది గొంతులో కెళ్ళాక హలాహలమైతే - ఐతే, - శారద కన్నీళ్ళతో దిండుతడిసిపోయింది. కానీ చిత్రం - ఎన్ని కన్నీళ్ళు దిగమింగాలో, ఇంకెన్ని కన్నీళ్ళు తనలో ఇంకిపోవాలో -
   
    రాజారావుకి మెలకువ వచ్చింది. పేపరు చూస్తూతల ఆడించాడు. 'ఏమిట్రాసందడి' - వెంకడిని ప్రశ్నించాడు. వాడికర్ధమయినంత వరకూ వాడు చెప్పాడు. రాజారావు చాలా మేధావి. నివురు కప్పిన నిప్పు !! - చిరునవ్వునవ్వాడు - ఒరేయ్ వెంకడూ ఏనాడూ చూడని పులి నిన్నుపిలిచి, నేను ఎంతోమంచి వాడిని - నా దగ్గర దాచిన బంగారు కంకణం వుంది. తీసుకో అంది అనుకో' ఏం చేస్తావురా" -
   
    'అమ్మ బాబోయ్ - పులి బంగారం యిచ్చినా వద్దండి, వజ్రాలిచ్చినా వద్దండి - నా పాటికి ఇట్టా రెండు పూటలూతిని బతికితేచాలండి" - అయ్యగారికి తలనూనె రాస్తున్నాడు వెంకడు.
   
    "ఆ బుద్ది ఎంతమంది కుంటుందిమరి. చిన్నప్పుడు చదువు కున్నా దురాశ దుఃఖంచేటు' అని ఇది అంతే" - ఇది నేను అనుకున్నదే - ఆయనెవరో ఎవడికీ తెలియదు ఈ ఊర్లో ఊర్లో వాణ్ణి నమ్మరుకానీ ముక్కుముఖం తెలియని ఆయన్ని నమ్ముతారు - విన్నావా తమాషా. పిల్లికి బిచ్చం పెట్టనివాళ్ళు కూడా షేర్స్ అనీ, స్టాక్ ఎక్సేంజి అని బ్రోకర్ల గా నియమింపపడాలంటే మరి ఖర్చు అవుతుందంటే సరేననీ, కంపెనీలని - ఓయబ్బో - ఎన్నిఎన్నెన్ని, వాడు చెప్తే వాళ్ళు నమ్మారు. ఎందుకనీ, - మళ్ళీ అదే దురాశ మూడు రూపాయలు మూడొందల రూపాయలు, మూడువేల రూపాయలూ - ఇంకేముంది అందరూ కోటీశ్వరులుకావాలనే - మరి ఇలాటి వెర్రి లోకాన్ని తెలివైనవాడు పసికట్టాడు - ఉపయోగించుకున్నాడు - వాడిదేం తప్పు - ఏడవనీ మనమేం చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం అంతే - రాజారావు మాట్లాడుతూనే వున్నాడు. వెంకడు రాజారావు కాళ్ళ దగ్గరకునికిపాట్లు పడుతున్నాడు.
   
    అంతలో ఉరుము ఉరిమింది - చిన్నబ్బాయి గొంతు "నేను అక్కడి కెళ్ళి - అక్కడ నుంచి వచ్చాను. అదీ, దీన్ని చంపి పారేయాలి - నన్ను పూర్తిగా ముంచింది. వ్యవహారాలు ఎప్పుడు తేల్తాయి - మా డబ్బులు మాకెప్పుడొస్తాయి - దీని మాటనమ్మిగోతిలో దిగామంతా. వాడి అండ చూసుకుని మననెంతతీసి పారేసింది - శారదా, శారదా" - ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తున్నాడు. శారద గదిలోంచి బయటకి రాలేదు - తలుపు విరిగిపోయేట్టుగా తన్నాడు - శారద తలుపుతీయలేదు -
   
    రాజారావుకి పిచ్చి కోపమొచ్చింది - 'ఏంటిరా - ఇదిరా యిల్లు - అది నాగది - ఆ తలుపు ఊడిపోతే నువ్వు పెట్టించి వెడతావా.
   
    'నాన్నగారూ'
   
    "నాన్నగారూ లేదు - ఎవరూ లేరు - గెట్ అవుట్ - మీ అందరికీ ఇవ్వాల్సిన ఆస్తి అంతా ఎప్పుడో ఇచ్చేసాను - ఈ ఇల్లునా కష్టార్జితం నాది - నా యిష్టమొచ్చినట్టు చేసుకుంటా - ఎవరూ అడిగే ప్రసక్తి లేదు - ఫో, నువ్వూ, భార్య, పిల్లలు - అంతే నీకు కావలసింది - వెళ్ళు - శారదతోనీకేంపని - నీ చేత డబ్బు షేర్స్ కొంటానని అది తీసుకుందా -
   
    "కాదండీ - నా మాట వినండి"
   
    "నాకు తెలుసు నువ్వేం చెప్తావో ఇవాళ పేపరు చూసి నువ్వు రంకెలు వేస్తూ వచ్చావు - దాన్నేం చేయమంటావు. నువ్వు ఒక నీతి మంతుడివా -    దాన్ని ప్రశ్నించేందుకు - అది నమ్మి మోసపోయింది. నువ్వు ఒక లక్ష పోగొట్టుకున్నావేమో - అది జీవితంలో చాలా నష్టపోయింది - కొందరు పదివేలు, ఇరవై వేలలో మోసం చేస్తారు. కొందరు లక్షలలో, మరికొందరు కొట్లలో మోసం చేస్తారు. కొందరు భార్యా పిల్లల్ని మోసం చేస్తారు. మరి కొందరు తల్లితండ్రుల్ని మోసం చేస్తారు. అలాగే నన్ను చెప్పనీ. కొందరూ తండ్రులూ పిల్లల్ని మోసం చేస్తారు. కొందరు భార్యలూ భర్తల్ని మోసం చేస్తారు. కొందరు కొందరు స్నేహితులమంటూ, మరికొందరు సేవకులమంటూ మోసం, మోసం - పైగా అదేం చేసిందని - దాని మీద విరుచుకుపడ్డావు. వెళ్ళు నాకు ఎక్కువకోపం తెప్పించకు. రాజారావు వీరావేశంతో అరుస్తుంటే, శ్రీనివాసుకి తను రాసిన పెద్ద ఉత్తరం ఆనేలమీద పడి వున్నది కనిపించింది. ఇదీ సంగతి -వృద్దాశ్రమంలో వుండమన్నానని నా మీద కోపమా యిది - దాన్ని, ఆడపిల్లని అలాగారాబం చేసి మొండిగా తయారు చేశారు.
   
    'మీ మూలాన్నే అది అలా తయారయింది' -
   
    'ఎలా నిన్నూ నేనే పెంచాను. దాన్ని నేనే పెంచాను - ఇద్దరు ఇలా ఇలా తయారయ్యారు.
   
    గదిలో వున్న శారద ఈ గొడవంతా వింటోంది. తలుపు తీసుకువద్దామనుకుంది. కానీ, నాన్నగారు తనను అంతగా వెనకేసుకొస్తుంటే తనింకేం చెప్పాలీ. తలుపుని ఆనుకుని నిలబడింది శారద. గుండె వేగంగా కొట్టుకుంది ఆవేశం పొంగి పొర్లింది. కాగితం పెన్ను తీసుకుంది.
   
    ఆరోజు నాన్నని, పిన్నికి పంపించేసినపుడు ఒక్కసారయినా తను చేయకూడని పని చేస్తోందేమోనని అనుకుందా తను! ఆ రోజు అన్నయ్య అలిగి వెళ్ళిపోతుంటే వెళ్ళద్దని అనగలిగిందా తను! ఈ రోజు నాన్నగారు తనని ఎంత కాపుకాస్తున్నారో తల్చుకుంటూ శారద మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. "నాన్నగారూ. మీరు, ఈ ఇల్లు వెంకడికే రాయండి. కాని ఆ విల్లులో మాత్రం ఒక్కటి మార్చండి - మీ కర్మ నేను చేస్తాను - అలాగే ఋణం తీర్చుకోనీయండి - కొడుకులు కాకుండా తండ్రికి కొరివి ఆడపిల్లపెడితే మహపాపమొస్తే, ఆపాపం నాదే - నేను మీ కూతురిని నాన్నగారు. అమ్మ ఎప్పుడూ అనేది గుర్తుందా 'నువ్వు మీనన్నా కూతురివే - అన్నీ అవే బుద్దులు' అని - ఇంతవరకు నేను నాకోసం బతికాను - ఇకనుంచి మీ కోసం బతుకుతాను. జీవితం ఏమిటో తెలిసిపోయింది నాకు - జీవితమంటే డబ్బుకాదు, సుఖంకాదు, కీర్తి కాదు! - ప్రేమ, మానవత్వం - అంతే అవిరెండే! జీవితమంటే - నేను తెలిసోతెలియకో చేసినతప్పులన్నీ మన్నించండి - మీరు ఏ వృద్దాశ్రమాలకూ వెళ్ళద్దు. మీరెక్కడుంటే అదే ఆశ్రమం - శారద చేతులు ఒణికాయి. అక్షరాలు తడబడుతున్నాయి - రాసిన కాగితాలు మడిచి బాగ్ లో పెట్టుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS