Previous Page Next Page 
త్రీ ఇన్ వన్ పేజి 49

                                                       టెలిపోన్ గోల

    భోంచేసి సోఫాలో కూర్చుని తీరుబడిగా వక్క నముల్తున్న అంబాజీరావుకి ఏమీ తోచినట్లు అనిపించలేదు. ఆ రోజు శలవు రోజు. దానికి తోడు ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళావిడ పిల్లల్ని తీస్కుని గుడికి వెళ్ళింది. అందుకే అతనికి ఏమీ తోచి చావడంలేదు.

    ఏం చేద్దామబ్బా?!.... అని ఆలోచించాడు కాస్సేపు.

    ఏదైనా నవల చదివితే?

    రాక్స్ లోని నవలలు చూస్తూ ఉంటే వాటిల్లో క్షుద్రరచయిత పిశాచిరావు రాసిన 'భూతప్రేమ' నవల కనిపించింది.

    ఆ నవల తను చదవలేదు.

    చదువుదామని దాన్ని తీసి మంచంమీద బోర్లా పడుకున్నాడు. అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగు తీయసాగాయ్.

    నాలుగు పేజీలు చదివాడో లేదో భళ్లున వాంతి చేసుకున్నాడు.

                                           

  "పాడు నవల! తిన్నదంతా బయటికి వచ్చేసింది. మళ్ళీ తినాలో ఏంటో పాడు!! దీనికంటే దీని ఒరిజినల్ ఇంగ్లీషులోనే చదివితే బాగుండేది!...."

    పిశాచిరావుని తిట్టుకుంటూ లేచి మళ్ళీ భోజనం చేసి వక్కపలుకు వేస్కున్నాడు.

    ఆ తరువాత భయపడ్తూ భయపడ్తూ మరో నవల రాక్ లోంచి తీసాడు అంబాజీరావు.

    ఈసారి మంచంమీద వెల్లకితలా పడుకుని చదవడం మొదలుపెట్టాడు.

    మొదటి ఛాప్టర్....

    జాకెట్ ఫర్ మని చిరిగిపోయింది... లంగా ఫటక్.... ఫటక్......... ............

    మొదటే రేపుసీనుతో ప్రారంభం అయింది ఆ నవల.

    "ఓ.... ....క్" మళ్ళీ వాంతి చేసుకున్నాడు.

    "ఛీ ఛీ.... ఇలా ఎన్నిసార్లు తినాలో ఏంటో! గదంతా పాడయింది...." విసుక్కుంటూ లేచి చెంబుతో నీళ్ళు, చీవురూ తెచ్చి గది క్లీన్ చేసి మరోసారి భోంచేసి హాల్లోకి వచ్చాడు.

    అతని చూపు ర్యాక్ లో వున్న నవలల వంక పడింది.

    భయంగా వాటివంక చూస్తూ చెంపలు వేసుకున్నాడు.

    ఏంచేయాలి అన్న విషయం మీద అంబాజీరావు మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాడు.

    హఠాత్తుగా అతనికి తన స్నేహితుడు వెంకట్రావు గుర్తుకు వచ్చాడు.

    "వాడిని కల్సి చాలా రోజులయింది... ఓసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటేనో...." అనుకున్నాడు.

    అనుకున్నదే తడువుగా డైరీలోంచి వెంకట్రావు టెలిఫోన్ నెంబర్ తీసి డయల్ చేసాడు.

    అవతలి నెంబర్ రింగయి రెండు క్షణాల తరువాత ఫోన్ ఎత్తారు.

    "హలో.... కౌన్ బోల్ రహాహై?" అంది అవతలి కంఠం .

    "ఓర్ని.. హిందీ బాగానే నేర్చుకున్నావే!!" ఆశ్చర్యంగా అన్నాడు అంబాజీరావు.

    "క్యా బోల్ తా హై? ఆ!" సీరియస్ గా అడిగింది అవతలి కంఠ్.

    "చాల్లేబోడి స్టయిలూ నువ్వూ. ఇంకా హిందీలో మాట్లాడ్డం మాని తెలుగులో మాట్లాడు. సన్నాసి వెధవా..." హాస్యాలాడ్తూ అన్నాడు అంబాజీరావు.

    "కౌన్ రే బద్మాష్?.... క్యా బోల్తాహై- ఆయ్...."

    అంబాజీరావు ఖంగుతిన్నాడు."కొంపదీసి ఆ మాట్లాడుతుంది వెంకట్రావు కాదా?"

    "హలో... వెంకట్రావుగారు లేరాండీ......జీ, వెంకట్రావు నైనైజీ?" అవస్థపడుతూ హిందీలో అడిగాడు.

    "ఇదర్ వెంకట్రావ్, గింకట్రావ్ కోయినహీ హై... రాంగ్ నెంబర్ .... మై చమన్ లాల్ హూ" అంటూ పెట్టేసాడు వటాలి వ్యక్తి.

    అంబాజీరావు మరోసారి డయల్ చేసాడు. అవతల ఫోన్ రింగయింది. కొన్ని క్షణాల్లో ఫోన్ ఎత్తారు.

                                          

      "హలో!" అంది అవతల కంఠం.

    "హలో... వెంకట్రావేనా?" అడిగాడు అంబాజీరావు.

    "హర్రే బధ్మాష్... ఫిర్ సే ఫోన్ కియా, ఫోన్ రక్ దో సాలె... కామ్ కుచ్ నహీహై క్యాం.....హమేషా రాంగ్ నెంబర్స్ ఫిరాతే...." అట్నుంచి అరుస్తున్నారు చమన్ లాల్.

    అంబాజీరావు కంగారుగా ఫోన్ పెట్టేశాడు.

    అతనికి అనుమానం వచ్చి డైరీలోని నెంబర్ వంక మరోసారి చూసాడు. అది వెంకట్రావు నెంబరే.

    అంటే తను సరియైన నెంబర్ కే చేస్తున్నాడు గానీ అది రాంగ్ నెంబర్ కి వెళుతున్నదన్నమాట. వెంటనే చేస్తే మళ్ళీ చమన్ లాల్ నెంబర్ తగుల్తుందేమోనని భయపడి కాస్సేపాగి మళ్ళీ డయల్ చేసాడు.

    అవతలివైపు ఫోన్ మోగలేదుగానీ వేరే లైనేదో కల్సింది. ఎవరో ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంబాజీరావు ఆ సంభాషణని వినసాగాడు.

    ".... చెప్పు...... మాల్ అందిందా?" ఒక వ్యక్తి గొంతు.

    "ఆ.... అందింది... రెండోవ్యక్తిగొంతు బొంగురుగా పలికింది.

    "సరుకంతా సరిపోయిందా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS