Previous Page Next Page 
విశిష్ట పేజి 49

    "చెప్పాను కదా మీరేమీ చెయ్యలేరని!" నిశ్చలంగా చెప్పింది.

     "చూడు చూడు.... .ఇంకో క్షణంలో నలిగి నలిగి రేకులు చిదిమిన పువ్వులా పడతావు పక్కమీద!"

    క్రూరత్వం నింపుకున్న ఏకాక్షి చూపు...

     జలదరించిపోయింది విశిష్ట.

     అతడి పట్టునుండి విడిపించుకోడానికి పెనుగులాడసాగింది.

     నూతన దంపతులకి మొదటి రాత్రి.

     అనురాగ వర్షం కురవాల్సిన కళ్లలో కసి, పగ!

    హఠాత్తుగా  చూస్తే పాము ముంగిసలు పోట్లాడుకొంటున్నట్లుగా వుందా దృశ్యం.

     ఆ పెనుగులాటలో ఆమె మోకాటి చిప్పఅతడికి తగలరానిచోటే తగిలింది.

    భీభత్సంగా అరిచి విలవిల్లాడుతూ కూలబడిపోయాడు.

    "రాక్షసీ! చంపావు కదా? నీకు కరాటే వచ్చా?"

    "నా మొహ!నాకు కరాటే రావటం ఏమిటి?" నన్ను నేను రక్షించుకునే తపనలో, ఆ పెనుగులాటలో  ఎక్కడ  ఏం తగిలిందీ తెలియదు.  ఏదో తగలరాని చోటే తగిలినట్టుంది సారీ!  మొదటి రాత్రి ఏ భార్యా ఏ భర్తకూ ఇలాంటి బహుమతి ఇచ్చి వుండదు"అమాయకంగా ముఖం పెట్టి  అంది విశిష్ట.

     "నాటకాలాడకు! కావాలనే చేశావు!'

    "అవును! కావాలనే చేశాను. నన్ను నేను రక్షించుకోడానికి అంత కంటే మార్గం కనిపించలేదు మరి."

    "ఏం రక్షించుకొంటావే? నీ మీద పెట్రోలుపోసి సజీవంగా తగలబెడతాను. ఏమనుకున్నావో!" కసిగా పళ్లునూరాడు పృద్వీ. బాధతో చేతులదుముకుంటూనే.

     "అలా ఒక్కసారే చంపేస్తే మీకేం  ఆనందం? కొంచెం కొంచెం కాలుస్తూ నేను బాధతో కేకలు పెడుతుంటే నీ ఆనందం రెట్టింపు అవుతుంది. నేను కొంచెం కొంచెం చస్తూ వుంటే నీలోని శాడిస్టు సంతృప్తి పడతాడు కదా?"

    బయట గొళ్లెం పెట్టిన ఆ గది తలుపులు తెల్లారితేగాని తెరుచు కోవు. ఆ రాత్రంతా మూలుగుతూ ముక్కుతూ మూడంకెలు వేసి పడుకున్న పృద్వీ, ప్రొద్దున తలుపులు తెరిచిన తల్లిని పట్టుకుని బావురుమన్నంత పని చేశాడు.

     "డాక్టరు గారికి ఫోన్ చేయమ్మా! ఈ రాక్షసి.... రాత్రి...."
     
    ఆవిడ ఆత్రంగా "ఏం చేసిందిరా?" అనడిగింది.

    "నన్ను సంసార జీవితానికే పనికిరాకుండా చేసిందమ్మా!'

    ఆమె కొడుకును మంచం మీద విడిచి, తలొంచుకుని ఓ ప్రక్కగా ము్దదరాలిలా నిలబడిన కోడలి భుజాలు పట్టుకుని ఊపేసింది ఆగ్రహంగా. "ఏం చేశావే నా కొడుకును. రాక్షసీ?"

    "ఏం చేయలేదత్తయ్యా! ఆయన నన్ను బలవంతం చేయబోయాడు. ఆ పెనుగులాటలో... నా కాలు.... ఆయనకు తగలరానిచోట తగిలినట్టుంది!"

    విశిష్ట భయాన్నీ, అమాయకతనూ అభినయిస్తూంటే పృద్వీ ఆశ్చర్యపోయాడు.

    "ఔరా! ఎంతటి జాణ? మామూలు ఆడపిల్లగా అంచనావేసి తను బోల్తా పడ్డాడు. ఒక్కసారికాదు. రెండు సార్లు. ఆమె తన ముఖం మీద ఏసిడే పోసి కురూపిని చేసినప్పుడైనా తనకు బుద్దిరాలేదు. ఆడది ఏం చేస్తుంది? నల్లిలా నలిపివేయొచ్చుననుకున్నాడు.

     ఆమె ప్రతిసారీ ఆడదాన్ని కాదు, ఆది శక్తినని నిరూపించుకుంటూంది.

     పృద్వీలో మూసుకుపోయిన జ్ఞాననేత్రం పొరలు కొద్ది కొద్దిగా తెరుచుకోసాగాయి.

     "అది వట్టి అబద్దాలకోరు. చక్కగా నటిస్తోంది. రాత్రి కావాలనే తన్నానని నాతో చెప్పింది" ఆక్రోశంగా చెప్పాడు.
 
     "ఓసి దుర్మార్గురాలా....! నీకు అన్ని విద్యలూ వచ్చినట్టున్నాయే!" ఆమె కోపంగా విశిష్ట జడ పట్టి లాగింది. "ఇది నా కోడలు కావడానికి ఎంత మాత్రం ఒప్పుకోనని మీ నాన్నతో చెప్పానురా! దెబ్బలాడానుకూడా.  అయినా ఆయన వినలేదు. కేసుల నుండి బయట పడొచ్చు. ప్రజల నోళ్లు మూయించొచ్చునని ఆశపడ్డాడు. కాని, ఒక పామును....అచ్చంగా ఒక పామును తన కొడుకి మెడకి భార్యగా చుడుతున్నానని ఆయన అనుకోలేదు. దీన్ని ఈ రోజే ఇంటి నుండి తరిమివేస్తాను. ఇదిక్కడే వుంటే నీ ప్రాణాలకు ముప్పని నా మనసు శంఖిస్తోంది.

     "పాము నన్నారుకదా!పాముల కథలు వినలేదా అత్తయ్యా?పగపట్టిన పామును ఎంత దూరం తరిమివేసినా తమ పగను ఏది విధంగా తీర్చుకొంటాయని వినలేదా?"

    "నా కొడుకు నిన్నేంచేశాడే పగబట్టడానికి? చందమామలా వుండే నా కొడుకు ముఖాన్ని నువ్వే ఏసిడ్ పోసి కాల్చి అందవికారంగా మార్చావు. వాడి వుద్యోగం పోగొట్టావు. ఇప్పుడు ఆలిగా వచ్చి పామవయ్యావు. వాడిని సంసార జీవితానికి పనికిరాకుండా చేశావు."

    "నా అంత నేను రాలేదు! మీ ఆయన గొప్ప ఎత్తుగడతో నన్ను తన కొడుకుని చేసుకొమ్మని అడగడానికి వచ్చాడు మా ఇంటికి. కాదన్న మా నాన్ననూ, మా కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తానన్నాడు. వాళ్లందరినీ పోగొట్టుకున్నాక నేను పోరాడి గెలిచినా ఒకటే ఓడినా ఒకటే ననిపించింది. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను.

     నేను నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను-  అత్తయ్యా! స్వార్దానికి జరిగినా, పంతానికి జరిగినా పెళ్లి పెళ్లే మనస్పూర్తిగా ఈ పెళ్లికి విలువ ఇవ్వాలనే అనుకున్నాను. ఈ ఇంటి కోడలిగా, ఈయన భార్యగా నా బాధ్యతలు నేను నిర్వహించాలనుకున్నాను. ఉత్తమ గృహిణి కావాలనుకున్నాను. ఏదీ నాకు ఆ అవకాశం ఎవరిచ్చారు?"

    నన్ను పగతీర్చుకోడానికే చేసుకున్నారట. నన్ను క్షణం క్షణం చిత్రహింసకు గురిచేసి చంపుతాడట. మొదటిరాత్రి అన్న భర్తపట్ల  ఏ భార్య అయినా ఎలా స్పందిస్తుంది? మీరూ ఆడవాళ్లే కదా! ఆలోచించండి?

    పరస్పరం అనురాగంతో ఏకమవ్వాల్సిన శయ్యమీద భార్యను బలాత్కరించే భర్త ఎక్కడైనా వున్నాడా? ఆయన నన్న పువ్వులా, నల్లిలా నలిపివేస్తానంటుంటే, ప్రతీకార జ్వాలలు చిమ్ముతూంటే నేనెలా మౌనంగా బలి అవుతాను?

    నాకు శక్తి వున్నంతవరకూ పోరాడతాను!పోరాటంలో నా ప్రాణాలు పోయినా సరే, నాలో వూపిరి వున్నంతవరకు ప్రతిఘటించి తీరుతాను."

    కాంతం కొడుకువంక కోపంగా చూస్తూ "అవునా? అలా అన్నావా? నీకిదేం బుద్దిరా? అయిందేదో అయింది. బంగారంలాంటి భార్య దొరికింది. అన్నీ మరిచిపోయి చక్కగా కాపురం చేసుకోక పెళ్లాంమీద పగబట్టడం ఏమిటిరా? ఏ ఘడియలో కన్నానో అన్నీ  రావణాసురుడి  బుద్దులొచ్చాయి. పుణ్యం కొద్దీ పురుషుడూ, దానంకొద్దీ బిడ్డలూ అన్నారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS