Previous Page Next Page 
తుపాన్ పేజి 49

    ఇంతలో  స్వామి  లోపలనుంచి  మావద్దకు  వచ్చారు.  మేమంతా  లేచి  నుంచున్నాము.  స్వామీజీ  మోము అంత  అందమైనది  కాదు. కాని ఆ  మోములో  ప్రసరించే  అద్భుతమైన  కాంతులు  నేను  వర్ణింపలేనివి, అవి  ఆ  గదంతా  వెలిగించినట్లే  నాకు తోచింది.  ఆరడుగుల పొడవు,   డబ్బపండు  చాయ, ముప్ఫయి  ఏళ్ళు  పైన  ఉండవచ్చును.  నాకు  మాత్రం ఆయన  ఇరవై ఏళ్ల  యువకునిలా  కనుపించారు. మమ్మల్నందరినీ   కూర్చుండ నియమించి, స్వామీజీ  చిరునవ్వుతో  నావైపు  చూచి, ''బాబా! నా  ఈడు   యెంతని   నీ  ఉద్దేశం''అన్నారు.

    నే నాశ్చర్యంతో '' చిత్తం! చిత్తం! ముప్ఫయి  ఉండవచ్చును'' అన్నాను.

    '' నా  కిప్పుడు  ఏభై  ఆరేళ్ళు!  నీ  వంత   ఆశ్చర్య  పడనక్కరలేదు. మా  గురువుగారికి  తొంబది ఏళ్లున్నాయి. ఆయన  నాకన్న చిన్నవారుగా కనబడతారు. నీ  హృదయంలో  అనుమానాలు   పూర్తిగా వదలలేదు. వదిలితే   నువ్వు అందరితోపాటే  అవుతావు. మూర్తీ!  నీ  పేరు నాకు మంత్రశక్తివల్ల  తెలియలేదులే....మీ  వాళ్ళే చెప్పారు, నీ  భార్యపోయింది.

    నీ  భార్యను  నువ్వు  అతిగాఢంగా  ప్రేమించావు. దాంతో నువ్వు  డ్రైవరులేక  పరుగెత్తే   మొటారుకారు  వయ్యావు. ఆ  కారు చివరకు గంగలో ఉరికింది. నువ్వు వట్టి  భ్రమవల్లనే గంగలో ఉరికావని నాకు  తెలుసును. బాబా! నేను నీకోవైద్యము  చెబుతాను. నువ్వు  నాతో  కైలాసయాత్రకు  రా. మీ అమ్మగారు, ఈ సుబ్రహ్మణ్యం  మీ మేనమామల  ఊరు  వెడతారు.''
    మా అమ్మ  భయంతో  చేతులు  జోడించి, ''స్వామీ, మా  అబ్బాయిని  నేనెలా వదలి ఉండగలను? ''అన్నది.

    ''అమ్మా! భయపడకండి. నన్ను నమ్మండి.  ఆరునెలల్లో  మీ అబ్బాయి  తిరిగి  మీ  ఇంటికి వస్తాడు. ఈలోగా  మీకో  చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది మీరు  పునశ్చరణ చేసుకుంటూ  ఉండండి.''

    మా అమ్మ స్వామివైపు చూచింది. ఆయన మోము, పాదాలు రెండుసార్లు  తిలకించింది. ''తమ  ఆజ్ఞకు  నేను బద్దురాలను ''అన్నది.

    నాకిదంతా ఆశ్చర్యంగా వుంది. నేను కైలాసమూ  రాను, గియలాసమూ, రాను అనడానికి సిద్దంగా ఉన్నాను. స్వామీజీ నావైపు చూచి, ''బాబా! నువ్వు నాతో  కైలాసపర్వత  దర్సనానికి   రా. అక్కడ అందమైన  ఆడపిల్ల   లెవరూ  లేరు. నువ్వు భక్తితో  ప్రార్థనలు  చేయనక్కరలేదు.  నీకు దైవము వద్దు.  నేను '' దై  వాన్ని  నమ్ము ''అని నీతో  ఒక్కమాటూ అనను. ఆ మాట నీకు ఇస్తాను. కాని  క్షతమైన నీ  హృదయానికి  శాంతి  ఆ  ప్రయాణంలో  లభించి  తీరుతుంది. నీ  మనస్సులో  ఉన్న  అనుమానాలు  ఆ నిర్మల  నిశ్చల  ప్రదేశాలలో  నివృత్తి అవుతాయి.  ఆ  ప్రదేశాల  అందమే నీకు  భోజనం అవుతుంది. ఆ  ప్రాంతాలనుండి  మనం  తిరిగి వచ్చిన  తర్వాత  నీ  ఇష్టం వచ్చినట్లు  నువ్వు సంచరించు. నా  అభ్యంతరం  లేదు. నేను నిన్నేరకమైన  వాగ్ధానమూ  ఇమ్మని కోరను'' అని అత్యంత  గంభీరంగా  పలికినారు. నేనవశుడనై''  తప్పక వస్తానండీ''అన్నాను.
   
   
                                   విష్కంభము

    హేమసుదరి  త్యాగతికథ ఇంతవరకు  చదివేటప్పటికి తెల్లవారగట్ల  రెడున్నర అయినది. ఎంత విచిత్ర  సంఘటన! త్యాగతి  అలా  అయినాడా? తన బావ స్త్రీనాథమూర్తేనా  ఈ  త్యాగతి? ఎన్ని భాదలు తెచ్చి పెట్టుకున్నాడు. అతన్ని  గర్హించాలా, లేక  అనుక్రోశించాలా? ఆమె ఆ పుస్తకాన్ని  పక్క  సోఫామీద  పెట్టింది. సుశీల  విషయంలో  అతడు  పప్పులోకాలు  వేశాడు! కాని  అతడేమి  చేయగలడు? కాశ్మీరంలో, లాహోరులో, సుక్కూరులో  అతని పోకడలు  అసహ్యంగా,జుగుప్సారకంగా ఉండలేదా? స్త్రీ   అంత  చులకనా? స్త్రీ  అంటే అంత  పశుభావమా? కాని  ఈ  గ్రంథం  ఇంత  బట్టబయలుగా  త్యాగతి  రాయడంలో  ఉండే పరమార్ధ  మేమిటి? ఈ  గ్రంధం అచ్చు వేస్తాడా?

    ఆ  గ్రంథాన్ని మళ్ళా  తీసింది. మొదటి  పేజీ  చదివింది.'' ఈ  నా  తుపాను  హేమకుసుమదేవికోసం  మాత్రమే! ఆమె  నేను ఎవరినో తెలియక  నన్ను గురించి   అనేక ఊహలు ఊహించుకొంటున్నది. ఇంక  నేను  రహస్య  వ్యాజాన  అసత్యదోషాన్ని  ఆచరిస్తూ ఉండలేను. నేను చేసిన  పని గురువు  ఆదేశం మీదనే! ''నీకు  ఉచితమని  తోచిన  మరుసటి క్షణంలో  నీ  రహస్యం  నీ  వాళ్ళకు  చెప్పు''అని గురువుగారన్నారు. అయినా ఆ కాలపరిమితిని కూడా  నేను  కావాలని దాటబుచ్చాను.

    '' హేమసుందరితో  స్నేహం వాంఛించాను.  నాలో  బయలుదేరిన సమస్యను  నేను విడదీయలేకపోయాను.  ఆ  కారణంచేత    నా  గురువు అజ్ఞా ప్రకారం  కొన్ని నెలల  క్రిందటనే  హేమకు  నా విషయం  యావత్తు పూర్తిగా  చెప్పుదామని ప్రయత్నం చేశాను.

    ''కాని,అలా  చేయలేకపోయాను. ప్రచ్ఛన్నంగా  ఉండి  మాయవేషం  వేసిన  దోషం నన్ను పూర్తిగా అలముకొన్నది.  ఆ   దోషానికి నేనే  భాద్యుణ్ని.

    ''అయితే   హేమా! నా  కథ  చివరివరకూ  చదువు. అప్పుడు నన్ను క్షమించు అంతే  నేను కోరేది.''

    తన కోసమేనా? త్యాగతి  ఈ  కథ  వ్రాసింది?  అతని ఉద్దేశం?

    హేమ అలా ఆలోచనతో కూర్చుండపోయినది.  త్యాగతి అంటే  ఏవేవో  స్వప్న సౌధాలు కట్టడం   ప్రారంభింది. అతడంటే  ఏవేవో విచిత్ర  భావాలు   తనకు  కలగడం  ప్రారంభించాయి. అతన్ని  తాను....ప్రేమిస్తున్నానా  అనుకుంది. అతడంటే  తనకున్న  గౌరవం   అప్రతిమానమైన  స్థితికి వచ్చింది.

    అతడు  తన బావ  శ్రీనాథమూర్తేనని  తెలియగానే హేమసుందరి  అత్యంతాశ్చర్యంలో   మునిగిపోయింది. అతని  కథ తెలుస్తున్న కొలదీ  ఆమెలో ఏవేవో విచిత్రభావాలు కలిగి  అణగిపోతున్నవి. అతని ఆ  జీవితానికి ఈనాటి త్యాగతికీ ఏమి  సంబంధం ఉంది?

    లోకేశ్వరి మంచంమీద  లేచి కూర్చున్నది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS