5
"ఏమిటిది రమా? ఈరోజు మదనమోహన్ నగల దుకాణానికి వెళ్ళావా నువ్వు?' అనడిగాడు. రాజారావు తీవ్రంగా.
"వెళ్ళాను. మాబాస్ తన శ్రీమతికి తోడుగా వెళ్ళమన్నారు. వెళ్ళక తప్పుతుందా?' అంది రమ.
"తప్పదు , నిజమే! కానీ అక్కడ నుంచి నగ దొంగిలించవలసిన అవసరమేముంది?"
"రాజా మాటలు కాస్త తిన్నగా రానీ, ఏమిటి నువ్వనేది?"
"ఏమంటాను? ఉన్నమాటే . ఎక్కడ దొంగతనం జరిగినా ఇప్పుడు నిన్ను మాత్రమె అనుమానించే వ్యక్తులు కొందరు తయారయ్యారు. వాళ్ళ అనుమానానికి తగ్గట్లే దొంగతనం నువ్వున్న చోటే జరుగుతోంది. నాకేమీ పాలు పోవడం లేదు.
"నిజంగా ఈరోజు కూడా అక్కడి దొంగతనం జరిగిందా?'ఆశ్చర్యంగా అడిగింది రమ.
'ఆహా జరిగింది. నాలుగైదు రోజుల్లో పోయిన నగ తిరిగి అందకపోతే పోలీస్ రిపోర్టిస్తామని నాకు బెదిరింపు టెలిఫోన్ కాల్ వచ్చింది. కర్మ - నీ మూలంగా నేను దొంగనైపోయాను. ఆ నాగేశ్వరరావు మదనమోహన్ ఫ్రెండ్ నట. అతనే ఫోన్ చేశాడు."
రమ తేలిగ్గా నవ్వింది. "నేను నీ అర్ధాంగిని కాబోతున్నా కదా! నేను దొంగనైతే నువ్వు మాత్రం దొంగవు కావా? ఇంతకీ డిటెక్టివ్ బ్రహ్మచారి ఏం చేస్తున్నట్లు?"
రాజారావు ముఖం సీరియస్ గా మారిపోయింది. "డిటెక్టివ్ బ్రహ్మచారి సంగతికేం గానీ నువ్వు నిజంగా దొంగవే అయితే నా అర్ధాంగివి కావడం అసంభవం" అన్నాడు.
"ఎలా అసంభవమో చూస్తాను. నేను దొంగనైతే వాచీలూ, నగలూ కంటే నేర్పుగా నీ హృదయాన్ని ఏనాడో నేను దొంగిలించాను. నన్ను తప్ప వేరొకర్ని నువ్వు వివాహం చేసుకోలేవు" అంది రమ వివర్ణమైన ముఖంలో ధైర్యాన్ని అభినయించడానికి ప్రయత్నిస్తూ.
రాజారావు ఏం మాట్లాడలేదు. మాటలు నడవకపోవటం వల్ల ఆరోజు చాలా తొందరగా వాళ్ళు విడిపోయారు.
నాలుగు రోజుల అనంతరం నాగేశ్వరరావు నించి మళ్ళీ రాజారావుకి ఫోన్ వచ్చింది. పార్సల్ అందిందనీ, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాననీ అంటూ అతను "రాజన్న పేటలో బంగారు వారి వీధి లేదు. కానీ సమస్యలేదురైనప్పుడు వాణీ సైన్సు కాలేజీ లో డాక్టర్ రాజారావు గారున్నారు" అన్నాడు. రాజారావు కి చాలా ఆవేశం వచ్చింది. "మళ్ళీ పార్సిల్ మీద అదే చిరునామా ఉందా?' అనడిగాడు. 'అవుననుకోండి కానీ మార్పు కావాలని మీరనుకుంటే పెద్ద కష్టం కాదు. మీ రమకు చెప్పండి" అన్నాడు నాగేశ్వరరావు.
రాజారావుకు ఏం చేయాలో తోచలేదు. తన కోపాన్నంతనీ రిసీవర్ మీద చూపిస్తూ అతను క్రింద పెట్టేశాడు.
క్రమంగా అతనికి రూడీ అవుతోంది. రమకీ ఈదొంగతనానికీ సంబంధముండి ఉండాలని. కానీ - రెండు సంవత్సరాల పరిచయంలో రమలో తను ఏ లోపాన్నీ చూడలేకపోయాడు. ఆమె అందానికీ, చమత్కారానికీ, మంచి తనానికీ , చిలిపి తనానికీ , అమాయకత్వానికీ - అన్నిటికీ దాసుడై పోయాడు. ఎన్నో విభిన్న లక్షణాలు సమపాళ్ళలో కలిపి వున్న ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. కాని ఇప్పుడామెలో మరో విభిన్న లక్షణం గుర్తించడం తో ఇబ్బందిలో పడ్డాడు. ఆమె దొంగ. ఒక దొంగను తను భార్యగా స్వీకరించలేడు. అయితే నిజంగానే ఆమె తన హృదయాన్ని కూడా దొంగలించింది. ఇప్పుడెం చేయాలి.
6
ఒక వారం రోజుల అనంతరం మరో సంఘటన జరిగింది.
రాజారావు స్టూడెంట్ ఒకతని పేరు మాణిక్యాలరావు. అతగాడు ఆ ఊళ్ళో ప్రసిద్ది కెక్కిన కళ్ళజోళ్ళ షాపు యజమాని గోవిందరావు కుమారుడు. మాణిక్యాలరావు కు ఒక చక్కని నలద్దాల కళ్ళజోడు వుంది. అద్దాలు, ఫ్రేమ్ - అన్నీ ఇంపోర్టేడే. దాని ఖరీదు సుమారు వెయ్యి రూపాయలుంటుంది.
ఆరోజు అతను దాన్ని సరదాకు షాపులో షో కేసులో పెట్టేడుట. ఏం జరుగుతుందో చూద్దామని. దానికి ఖరీదు లేబుల్ కూడా తగిలించాడట. ఎందరో దాన్ని చూడడం, ఖరీదు చూసి ఒకసారి ముక్కు మీద వేలేసుకోవడం - ఈ ఫన్ అతను చాలాసేపు ఎంజాయ్ చేశాడట. ఆ తర్వాత ఒక అరగంట సేపు మాత్రం దాని సంగతి మర్చిపోయేడట. మళ్ళీ వెళ్ళి చూసేసరికి కళ్ళజోడు లేదుట. తండ్రికి తెలిస్తే దెబ్బ లాడతాడని నోరు మూసుకుని ఊరుకున్నాడు. అది ఎలా పోయిందో మాత్రం తెలియడం లేదు.
అతను దిగులుగా రాజారావు కు తన కధ చెప్పాడు. రాజారావు అనుమానం వెంటనే రమ మీదకు పోయింది.
ఆ సాయంత్రం అతను రమను కలుసుకుని - "ఈరోజు ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర మధ్య నువ్వు గోవిందరావు కళ్ళజోడు షాపులో ఉన్నావు - అవునా?' అన్నాడు.
"పెద్ద జ్యోతిష్కుడిలా చెబుతున్నావు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో నువ్వు ఉండి ఉంటావు. అందుకే తెలుసుకోగలిగావు" అంది రమ.
'అయితే నిజంగా ఆ షాపులో ఆ సమయంలో నువ్వున్నావా?" అన్నాడు రాజారావు బాధగా.
"ఆ! అవసరమైంది కాబట్టి ఉన్నాను- ఇందులో తప్పేముంది?"
"తప్పు కాదు రమా, నా కర్మ. ఆ సమయంలో ఆ షాపులోంచి ఒక ఖరీదైన కళ్ళజోడు దొంగిలించబడింది."
"నిజం - ' అంది రమ. ఈ పర్యాయం ఆమె ముఖం వివర్నమై పోయింది. "రాజా! అయితే నువ్వు నన్ను దొంగగా అంచనా వేసేశావన్న మాట !" అందామె.
"ఏం చేయమంటావు చెప్పు! రోజు రోజుకీ నిజానికి దగ్గరవుతూ , నీకు దూరామై పోతున్నాను-"
"కానీ - రాజ - ఇది నాకూ విడ్డురంగా ఉంది. నేనున్నా చోటల్లా దొంగతనం జరుగుతోందంటే అది నా దురదృష్టమేనా, లేక ఏదైనా మిస్టరీ ఉందంటావా?"
"ఇన్నిసార్లు జరిగిందంటే అది కాకతాళీయం. కావడానికి వీల్లేదు. తప్పకుండా మిస్టరీ ఉండి వుంటుంది. అంతేకాదు మిస్టరీ నీలోనే ఉంది!"
'అంటే?"
"నన్ను క్షమించు రమా! ఇదే మన ఆఖరి కలయిక. ఇన్నేళ్ళ నీ పరిచయాన్ని ఒక పీడ కలగా భావించి మర్చిపో, నేను, నీ సంగతి అలా ఉంచు, అసలు వివాహం చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను."
రమ, రాజారావు ముఖంలోకి చిత్రంగా చూసింది. అల్ రైట్ రాజా! మన ప్రేమ కధ ఇటువంటి మలుపు తిరుగుతుందని నేనూహించలేదు. ఒక్క చిన్న మనవి, మన ఆఖరి కలయిక ఈనాడు కాదు. రేపు జరుగుతుంది. అది నిజంగా ఆఖరిదే అవుతుందని హామీ ఇస్తున్నాను. తర్వాత ప్రయత్నించినా మనం మళ్ళీ కలుసుకోలేము. కానీ రేపు సాయంత్రం మాత్రం తప్పకుండా ఇక్కడకు రా. నీతో చాలా మాట్లాడవలసి వుంది" అందామె.
"రేపు కాదు, ఆ కళ్ళజోడు పార్శిల్ షాపు అతనికి అందెక వస్తాను. తప్పకుండా వస్తానులే. కానీ అదే ఆఖరుసారి" అన్నాడు రాజారావు దృడంగా.
నాలుగైదు రోజులు గడిచేక రాజారావు మాణిక్యాలరావు ను అడిగాడు. "ఏమోయ్ -- నీ కళ్ళజోడు సంగతేమయింది?"
అతనుత్సాహంగా "దొరికిందండీ, నిన్న మధ్యాహ్నం భద్రంగా పార్సిల్ లో షాపు చేరింది. ఎవడో కామరాజు పంపించాడు. అదిప్పుడు ఇంట్లోనే వదిలేస్తున్నాను. ఒకసారి పోగొట్టుకున్నాక అదంటే భయం పట్టుకుంది" అన్నాడు.
ఆరోజు సాయంత్రం రాజారావు. రమను కలుసుకున్నాడు.
"నువ్వు చెప్పదల్చుకున్నది క్లుప్తంగా చెప్పు. ఫోన్ లో అన్నీ చెప్పెనుగా. ఆ పార్సెల్ అందింది. నీ గురించి ఇప్పుడింక నాకే అనుమానమూ లేదు. నేను త్వరగా వెళ్ళాలి" అన్నాడతను.
"వెడుదువు గానీ రాజా" అంటూ తన హ్యాండ్ బాగ్ లోంచి ఒక చిన్న పొట్లం తీసి ఇచ్చింది.
"ఏమిటది?"
'ఎమిటైనదీ నీ కనవసరం. నీ చేత్తో ఇది నా నోట్లో వేయి" అప్పుడు ఇది నిజంగా మన ఆఖరి కలయికే అవుతుంది' అందామె.
'అంటే- ఇది విషమా?"
"అదేమిటో నేను వివరించ నవసరం లేదు. లాబరేటరీ లో పరీక్షించి నువ్వే తెలుసుకోగలవు. నేను నీ హృదయం దొంగలించాను. అందువల్ల నువ్వు హృదయం లేనివాడి వై పోయావు. నీమీద అన్ని ఆశలూ పెట్టుకున్న నన్ను పూర్తిగా నిరుత్సాహ పరిచావు. తప్పు నాదే అని నాకు తెలుసు. కానీ నువ్వు అనుకుంటున్న తప్పు మాత్రం నేను చేయలేదు. కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. కానీ మన విషయంలో అబద్దం నిలకడ మీద బలపడుతోంది. అందుకే నీ సమక్షంలో...."
రాజారావు కంగారుగా "రమా!" అన్నాడు.
"మనది రెండు సంవత్సరాల పరిచయం రాజా. ఈ రెండు సంవత్సరాలు ఎంత హాయిగా గడిచిపోయాయి. ఒకరినొకరం ఎంతగానో అర్ధం చేసుకున్నా మనుకున్నాను. కానీ ఇలా అపార్ధాలతో విడిపోతామనుకోలేదు. నేను పైకి ఎంత ఈజీగా , చిలిపిగా కనిపించినప్పటికీ మామూలు ఆడదాన్నే! నీ తిరస్కారాన్నీ , అనుమానాన్నీ నేను భరించ లేను. అందుకే తనువూ చాలించ దల్చుకున్నాను. ఇప్పుడే నీ సమక్షంలో...."
"బెదిరిస్తున్నావా, రమా!"
"నా ఈ చర్యకు నువ్వే పేరైనా పెట్టుకో. కానీ అది నా చావుకు దారితీసే చర్య అంతే!"
రాజారావు ఒక్క నిముషం ఆలోచించాడు. "నేనాలోచించుకోవాలి. కొంచెం టైము ఇవ్వు. ఇంతకాలం ఇది మామూలు సమస్య అనుకున్నాను. కానీ ఇది ప్రాణాలు తీసుకునేవరకూ వచ్చింది. కాబట్టి మరికొంచెం గడువు కావాలి. అనవసరంగా తొందరపడకు. కానీ ఒకచిన్న మనవి. ఇంతవరకూ జరిగిన ఈ మూడు దొంగతనాలు నువ్వు చేయలేదనుకో. అసలు వాటి గురించి నీకు ఏ మాత్రమూ తెలియదా? ఎంత చిన్న విషయమైనా సరే, ఏమైనా తెలిస్తే నాకు చెప్పకూడదా?"
