Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 49


    "శంకరం ఆవిధంగా ఆక్రమించి ఆవిడవేపు చూస్తూ 'యోగ్యులండీ మీరు! మీరు పెళ్ళాడే ఆయన!' అని మొదలుపెట్టాడు.
    "ఇలా జరుగుతుందని ఆవిడ కేలా తెలుసును? అదీగాక ఒక క్రొత్తవాడు తన యెదుట ఈ మాట లేమిటి? అందుచేత ఆవిడ గట్టిగా కేకవేయక తప్పింది కాదు.
    'కొంప ముంచుతారేమిటి! వినరేం తుదిదాకా? ఎవడు మిమ్మల్ని పెళ్ళాడుతారో కాని వాడు చాలా అదృష్టవంతుడు.' అని శంకరం అతి దృఢంగా అన్నాడు. అప్పుడు దృష్టులు అప్రయత్నంగా ఆమె నుండి తన చుట్టూ ఉన్న సదుపాయాల వంక మరలింది.
    ఆమె పూర్వంకంటే ఆశ్చర్యపడుతూ ఒక్కమారుగా లేచి నిలవడానికి ప్రయత్నం చేసింది. కాని శంకరం అభిప్రాయపూర్వకంగా ఆవిడ అరచేతిని నొక్కినాడు. ఆమె తుదకు కూర్చున్నదే కాని వెళ్ళిపోలేదు. మా తాత చెప్పడం ఏమంటే వితంతువులకి భయమనేది చాలా దూరమట.
    "విసుగును సగము నవ్వుతో కప్పిపుచ్చుతూ 'ఇంతకంటే ఏమైనా చెప్పవలసింది ఉందా?' అని ఆవిడ 'నేనే మళ్ళీ పెళ్ళిచేసుకొంటే... ..."అంటూ ఏమిటో అనబోయింది.
    ఆతృతతో అందుకొన్నాడు శంకరం : 'చేసుకొంటే?' అన్నాడు. చిత్రంగా ఎడమనుండి కుడిప్రక్కనుండి చూపులు వరిగిస్తూ 'చేసుకొంటే?'
    ఇప్పుడావిడ పూర్తిగానే నవ్వి 'మళ్ళీ చేసుకొంటే మంచి వరున్నే చేసుకోవచ్చును అన్నది.
    'స్వామివారినా? తగినవారే!' అన్నాడు శంకరం.
    'ఈ దారుణం ఏమిటి!' అన్నది వితంతువు. శంకరం 'హుఁ' అన్నాడు. ఆవిడ ఇక ఏడుపు మొదలుపెట్టవలసిన దారుణం వచ్చిందనుకొన్నది వెంటనే పైటచెరుగుతో కళ్ళని అద్దుకొంటూ - శంకరానికిదేమీ బాగాలేదని, ఒక్క పెద్దమనిషిని అతని పరోక్షాన అందులోనికి తనవంటి అబల ముందర అగౌరవించడం ఏమి మగతమని ఈ అన్నమాట అతని యెదుటే ఎందుకు అనకూడదని, అలాగా ఇలాగని ఏవో ఏకరువు పెట్టింది.
    'మీ కెందుకు! ఈ మాటలతని యెదుటే అనగలను. భయమని కాదు- ముందు మీకు జాగ్రత్త చెప్పాలని. ఈ సంగతి మొదట మీకు తెలియవలసి వుంది' అన్నాడు శంకరం.
    'ఏమిటా సంగతి? ఏమిటి మీరు చెప్పదలచుకొన్నదీ?'
    'మీ కాశ్చర్యం కలిగించబోతున్నాను.'
    'ఏమిటది? ఆయనకి ధనం అనవసరంగా ఉందిప్పుడు. అదేనా మీ రిప్పుడు చెప్పేది? అయితే ఆ చింత మీ కక్కరలేదు.
    'అదా! ఆ మాటకొస్తే నాకూ డబ్బు కావాలి. అది కాదు.'
    'మరైతే ఏమిటి చెప్మా అది?'
    'భయపడకండి ఇదిగో చూడండి' అంటూ శంకరం ఉత్తరం పైకి తీసి చేత్తో పట్టుకొని 'గట్టిగా కేకలు  వెయ్యరుకద" అన్నాడు.
    లేదు. లేదు. చూపించండి ఏమిటది?'
    మూర్చపోవడం అలాంటి వేమి చెయ్యరు కద.'
    లేదండి! ఏముందో అది ఇలా ఇవ్వండి.'
    'ఇల్లూ వాడా ఏకముచేసి నలుగురి నోట్లో పడవెయ్యరు కదా? నేనీ కార్యక్రమమంతా క్రమంగా నడిపిస్తాను మీరు శ్రమపడకండి.'
    మొట్టమొదట అదేమిటో చూపించండీ! చంపుకు తినకా?'
    "ఇంతసేపటికిగాని శంకరం ఉత్తరం ఆమె చేతిలో పెట్టలేదు. ఆమె ఉత్తరం పూర్తిచేసిందో లేదో ముఖ లక్షణాలు మారిపోయినాయి. మీరు నమ్ముతారో లేదో కాని శంకరం మా తాతకు చెప్పేవాడట కదా-ఆ సమయమప్పుడు ఆమె ఏడ్చిన ఏడ్పులు ఎంత కటిక గుండెనైనా కరిగించగలిగినవేనట అటువంటప్పుడు శంకరం వంటి నవనీత హృదయుడు కరగి కాలువ కావడంలో లెక్కేమిటి చెప్పండి. ఆవిడ రోదనం అతడి గుండెలలో లోతులకు దూసుకుపోయింది. చేతులు నులుపుకుంటూ ఆవిడ 'అయ్యో! నేనేం చేయగలను? అతడింత మోసము చేశాడే!' అంటూ విచారించినప్పుడు శంకరం విధిగా ఆమెను ఓదార్చసాగినాడు.
    'అయ్యో! నాకు యింకా ఊరట ఎక్కడిది! ఈ లోకంలో ఇంక నే నెవ్వరిని నమ్మడం!' అని ఆమె దుఃఖించింది.
    "ఏడవకు! ఏడవకు! లోకంలో నమ్మకమైనవాళ్ళు ఉన్నారు." అంటూ శంకరం ముక్తాఫలాల వంటి పెద్దసైజు కన్నీటిబొట్లు రాలుస్తూ జాలి కనబర్చాడు. అంతటి జాలితో కూడిన అతని హృదయం ప్రోత్సహించడం చేత ఆ తొట్రుబాటులో అతని చేతులు తమంతటగా ఆవిడను చుట్టివేశాయి. అతి దుఃఖంవల్ల ఆమె కూడా అతని మీదికి ఒరిగింది. అట్లా ఒరిగి అతని మొగము మీది చూస్తూ ఆవిడ నీళ్ళు నిండిన కళ్ళతో చిన్న నవ్వు నవ్వింది. ఆమెను పడిపోకుండా పట్టుకొని శంకరం అమాయకంగా ఆమె మొగం క్రిందికి చూస్తూ నీళ్ళు నిండిన కళ్ళతోనే చిరునవ్వులు నవ్వినాడు.
    "ఈ సందర్భంలో నాకు ఎంత ప్రయత్నించినా ఆమెనప్పుడు శంకరం ముద్దుపెట్టుకొన్నాడో లేదో తెలిసింది కాదు. 'లేదు' అని శంకరం మా తాతతో ప్రతిజ్ఞా పూర్వకంగా పలికేవాడట. కాని నా అనుమానం నన్ను బాధిస్తూ వుంది. మనలో మనమాట అప్పుడు శంకరం అలా చేసే వుంటాడు.
    "ఏమయితేనేం శంకరం రామస్వామిని తగిలివేయడం అరగంటలో పూర్తి అయింది. తర్వాత యజమానురాలిని అతడు తొందరతొందరగా పెళ్ళిచేసికొన్నాడు. అప్పటినుండి ఆ యింటికి శంకరమే యజమాని. అప్పుడప్పుడు ఆవిడతో చిన్న బండిలో బుచ్చి గుర్రాన్ని తోలుతూ అతను బయలుదేరేవాడు. కొంతకాలం తర్వాత అతడూ, భార్యా అదెక్కడకో వెళ్ళిపోయారు. ఇల్లు యిప్పుడు శిథిలమై పోయింది."
    ఈ విధంగా సోములు కథ పూర్తిచేశాడు. భోగట్టాలు చేస్తున్నవారు యింకా తమకో అనుమానం మిగిలిపోయిందన్నారు. ఆ కుర్చీ సంగతి కూడా ఆయనకి కావాలట!
    సోములు ఈలాగు చెప్పినాడు : "పెళ్ళినాడు ఆ కుర్చీ మరీ అధికంగా తన్నుకొందంట. కీళ్ళనొప్పి వల్లనో, అధిక సంతోషం చేతనో ఎవరికీ తెలియదంట.
    జనాభిప్రాయం దేహావస్థే అని.
    "అయితే ఉత్తరం సంగతి అందరూ నమ్మారన్నమాట!" అని ఎవరో ఎక్కడనుండో అడిగినారు.
    సోములన్నాడు : "శంకరం శత్రువులు తప్ప! వారి దుర్మార్గపు కూతలు ఎప్పుడూ ఉన్నవేనట! శంకరమే ఆ ఉత్తరం సృష్టించాడన్నారు. కొందరు త్రాగినమత్తుమీద శంకరం తన పెట్టెకు బదులు మరొకటి తీశాడన్నారు. అయినా వారి అరుపులకి ఎవరు లక్ష్యపెడతారులెండి!"
    శంకరం మాత్రం యిదంతా నిజమే అంటాడు!
    "ప్రతిముక్కా"
    "మీ తాతయ్యో!"
    "ప్రతి అక్షరమూ!"
    "శంకరమూ, తాత-తమాషా మనుష్యులు మొత్తానికి."
    చిన్నవాడు నిరభ్యంతరంగా ఒప్పుకొన్నాడు: సోములు నాతి కష్టమైన కనుగీటడన్న పనిలో మునిగిపోయాడు.
    
                                      ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS