శ్రమైకజీవన సౌందర్యం అంతా ఆ వైశ్యవీధిలో నిండారి వుంది.
కొంతమంది వెలమవనితలు బావి దగ్గరనించి మట్టికుండల్లో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. పెద్దబాన, బానమీద బుంగ, బుంగమీద దుత్తలతో పూసకూర్పు చేసిన ప్రభల్లా కనిపిస్తున్నారు వాళ్ళు.
మాటలు చెప్పుకుంటూ నడుస్తున్నవాళ్ళు మద్యమధ్య నవ్వుకుంటున్నారు. దృఢంగా, ఆరోగ్యంగా, ఆనందంగా కన్పించే బొబ్బిలివారి వెలమ వనితల్ని చూచి జగ్గమ్మకు సంతోషమయింది.
వెలమ యువకులు తలపాగాలు ధరించి రవ్వమీసాలు దువ్వుకుంటూ వ్యవసాయం పనులమీద పోతున్నారు. పరిగ, సజ్జ, మొక్కజొన్న, ఆముదాలు వాళ్ళు పండించే పంటలు.
ముచ్చటయిన జంట గుర్రాలమీద రావటం అందరికీ కన్పిస్తోనే వుంది. వాళ్ళకి వెంగళరాయుడు తెలుసు. ప్రక్కనున్న ఆమె గురించి కొందరికి తెలుసు. కొందరికీ తెలియదు.
ఒక గుర్రాలు అమ్మే శాలముందు గుర్రం దిగి వెంగళరాయుడు లోపలకు పోయాడు. వెంట జగ్గమాంబ కూడా వెళ్ళింది.
ఒక వైశ్యుడు పరుగున వచ్చి వెంగళరాయుడుకు వీరోచితమయిన స్వాగతం చెబుతూ వీరోచితమయిన మర్యాదలు చేశాడు.
ఒరనించి కత్తిలాగి వెంగళరాయుడు పాదాలదగ్గరపెట్టి అభివాదం చేశాడు. గుర్రాలనుచూస్తూ ముందుకుపోయారు వాళ్ళు.
నూనె రాచినట్లు వాటి శరీరాలు నిగనిగ లాడుతున్నాయి సూర్యకిరణం సోకితే తళుక్కున మెరుస్తున్నాయి. విల్లులా ఒంపు తిరిగిన నడుమూ, నల్లగా మెరిసిపోతున్న శరీరమూ, ముఖాన తెల్లమచ్చా, తోక చివర తెల్లకుచ్చూ, తెల్ల గిట్టలూ, గుండ్రని పొట్టమీద ఉబ్బిఉన్న నరాలూ, సన్నని ముఖమూ, పలకలా విశాలమయిన నుదురూ, మెరిసే కళ్ళు కాటుకవర్ణం రెప్పలూ, ఎగుమిట్టలాంటి గిట్టలూ, సన్నని కాళ్ళూ బలమయిన తొడలూఉన్న ఒకగుర్రాన్నిచూసి ఆగిపోయినాడు వెంగళరాయుడు దానిమీద మనసయింది.
దాని నడ్డిమీద ప్రేమగా చిన్న దెబ్బవేశాడు. అది వీపును మరింత విల్లులా వంచి పొట్టమీది చర్మాన్ని దులిపింది. పులకింత కాబోలు గొప్పగా స్వారీ చెయ్యకలిగిన గుర్రం గొప్ప రౌతును గుర్తిస్తుంది. అతని చేతి స్పర్శకు పులకిస్తుంది. ఆ గుర్రం విశ్రాంతికోసం ఎడంగా పెట్టవచ్చు కాళ్ళని దగ్గరగా మార్చుకుని స్వారీకి సిద్దమయినట్లు నిలబడింది.
వెంగళరాయుడు గుర్రంమెడమీద జూలుపట్టి సున్నితంగా లాగుతూ సవరించాడు. గుర్రం తల విదిలించింది సకిలిస్తూ.
గుర్రం వెనుకప్రక్కకు వెళ్తూ ప్రక్కటెమూకల మీద చేతిలో సవరించి వెనుక తొడమీద యినుపసుద్దల్లా ఉన్న కండరాల మీద ఒక్కదెబ్బ వేశాడు వెంగళరాయుడు అది సకిలిస్తూ ముందుకాళ్ళు రెండూ ఎత్తి వెనుక కాళ్ళమీద నిలబడింది. వెంగళరాయుడు సహదేవుడల్లే నవ్వాడు.
తన సైగలని గుర్రం గ్రహిస్తోందని అర్ధమయింది వెంగళరావుడికి. దాని రూపురేఖలు చూస్తూవుంటే దాన్ని విడిచి వెళ్ళబుద్ధికాలేదు దానిమీద అతని కన్నుపడింది. కావాలన్న కోరిక కలిగింది.
వైశ్యుడు గుర్రానికి జీను తగిలించి సిద్దంచేశాడు. దానిమీద ఎక్కి దౌడు తీయించాడు, ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని చక్కర్లు తీయించి దాని నడకకూడా ఖచ్చితమయినదే అని తేలాక దాన్ని కొన్నాడు.
ఆ గుర్రాన్ని ఎక్కి తన గుర్రాన్ని వైశ్యుడికి అప్పగించాడు ఆ వైశ్యుడు గుర్రాన్ని దివాణంలో అప్పగించి డబ్బు తెచ్చుకుంటాడు.
కొత్తగా వచ్చిన తెల్లమచ్చల నల్లగుర్రం నాట్యం చేసినట్లుగా వినిపిస్తోంది.
"జగ్గమాంబా!"
"ఏమిటి చిన్నిబావా?"
"ఎందుకు మౌనంగా ఉన్నావు"
"నీ అభిరుచుల్ని మనసులోపలే అభినందించుకుంటున్నాను."
"వెలమ యువకులకు యిటువంటి అభిరుచులు ఉండటంలో విచిత్రం ఏముంది?"
"చాల చిత్రమే ఉంది."
"ఏమిటా చిత్రం?"
"చిత్రాతి చిత్రమే! అయితే ఆ చిత్రం యేమిటో నీకు నేను చెప్పను. ఎప్పుడో ఒకప్పటికి నీకే తెలుస్తుంది." వెంగళరాయుడు ఆలోచనలో పడ్డాడు.
"పోనీ చెప్పరాదూ యిప్పుడే తెలుసుకుంటాను."
"నువ్వు ఎప్పుడయినా యుద్దరంగానికి పోయావా."
"ఓ చాలాసార్లు"
"యుద్దరంగంలో వున్నప్పుడు నీకేమనిపించేది."
"విరోధుల్ని చీల్చి తుంపులు చెయ్యాలని......"
"వేటకు కూడా అనేకసార్లు వెళ్ళిఉండాలి."
"వేట అంటే నాకెంతో యిష్టం."
"వేటకు వెళ్తే అడవిలో నీకేమనిపించేది?"
"గురి తప్పకుండా జంతువుల్ని కొట్టాలని."
"దేవాలయానికి వెళ్తే"
"బొబ్బిలివారి శౌర్యపరాక్రమాలు చిరకాలం నిలవాలని ప్రార్ధిస్తాను"
"యుద్దరంగంలో ఎన్నడయినా వేట గురించి ఆలోచించావా?"
"లేదు."
"దేవాలయంలో ఎన్నడయినా యుద్దరంగం గురించి ఆలోచించావా?"
"లేదు ఏమిటలాంటి ప్రశ్నలు____?"
"ఈ క్షణంలో నువ్వు గుర్రాల గురించి కత్తుల గురించి ఆలోచించటం ఔచిత్యం ఏమిటా అని....." వెంగళరాయుడు తలఎత్తి చూచాడు జగ్గమ్మ ఎత్తి ఉన్న ముఖాన్ని దించుకుని పాదాలవంక చూచుకుంటోంది.
