Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 49


    "వరూధిని వద్దంటేమాత్రం మీరెలా ఊరుకున్నారు? గుండెల్లో నొప్పి అంటే అశ్రద్ద చేయకూడదు. హార్టు స్పెషలిస్ట్ భుజంగరావు నాకు చాలా దగ్గిర స్నేహితుడు. ఆమెగార్ని బయలుదేరమనండి. ఇప్పుడే కార్లో తీసుకెళ్ళి చూపించి వద్దాం." రామనాథబాబుకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో వేంకటపతికి తెలియలేదు. అతనికి గుండెలమీదనుంచి ఏదో పెద్ద బరువు దించినట్లయింది.
    "రండి! లోపలక పడుకొని వుంది. మీరు చెప్తేనన్నా వింటుందేమో!" రామనాథబాబును పడకగాదిలోకి తీసుకెళ్ళాడు వెంకటపతి.
    రామనాథబాబును చూసి గభాల్ను లేవబోయి నీరసంగా చూసింది వరూధిని.
    "మీరు లేవకండి. భుజంగరావు అయిదు దాటితే వుండడు. విజిట్స్ కు వెళ్తాడు. త్వరగా వెళ్తే దొరుకుతాడు" అన్నాడు రామనాథబాబు.
    వెంకటపతి బలవంతంమీద వరూధిని చీర మార్చుకొని తయారయింది.
    "కమల ఎక్కడా? ఇంకా రాలేదా?" అన్నది భర్తతో. వెంకటపతి కొడుకుని ఎత్తుకొని తాళం వెతుకుతుండగా మళ్ళీ అన్నది - "బాబెందుకూ ఆస్పత్రికి? వాడికి ఇంకా పాలు పట్టలేదు."
    ఒక్క క్షణం ఆగి రామనాథబాబుతో "ఏమండీ? ఓ అరగంట ఆగితే పనిపిల్ల వస్తుంది. అది వచ్చాక బాబును దానికిచ్చి వెళ్ళొచ్చుగా?" అన్నది.
    రామనాథబాబు గడియారం చూసుకొన్నాడు. "అప్పటిదాకా ఉంటాడో లేదో?" అన్నాడు.
    "ఎందుకూ ఆలస్యం? మళ్ళీ డాక్టరుగారు వెళ్ళిపోతే ఇబ్బంది కదా? బాబును పెట్టుకొని నేను ఇంట్లో వుంటా. మీరెళ్ళిరండి" అన్నాడు వెంకటపతి.
    వరూధిని వెళ్ళి కార్లో కూర్చుంది. రామనాథబాబు కారు స్టార్టు చేశాడు. ఇంటిముందు నుంచి కారు కదిలిపోతుంటే వరూధిని భర్తతో "బాబుకు పాలలో పంచదార తక్కువ వెయ్యండి." అని లేని ఓపిక తెచ్చుకొని పురమాయించింది.
    రాత్రి తొమ్మిదయినా వరూధిని తిరిగి రాలేదు. వేంకటపతికి మతిపోయినట్టయింది. ఇంట్లోకీ వీదిలోకీ ఆదుర్దాగా తిరిగాడు. వరూధినికి ఎలావుందో? మరో జబ్బు మరో జబ్బు కాదాయె? గుండెజబ్బు! డాక్టరేమన్నాడో? తనూ వెళ్తే బాగుండేదేమో? తను వెళ్ళి మాత్రం చేసేదేముందిలే! రామనాథబాబు అన్నీ చూసుకుంటాడు. ఆ డాక్టరు ఆయన స్నేహితుడుకూడానాయె! ఏదన్నా అయితే ఆయన తనకు కబురు పెట్టడా?
    గుండె జబ్బు వున్న వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూనే పోతారన్న సంగతి గుర్తొచ్చి, వెంకటపతి గాబరాపడిపోయాడు. భుజానవున్న రవికిరణ్ నిద్రకుపడి జోగుతున్నాడు. కొడుకుని పడుకోబెట్టి వెంకటపతి వీధిగుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. డాక్టర్ భుజంగంగారి ఆసుపత్రి ఎక్కడో? గాంధీపార్కు దగ్గర్లోనా? అక్కడున్న డాక్టరు పేరు అది కాదనుకుంటానే? పోనీ, సినిమాహాలు దగ్గరకెళ్ళి అడిగితే మరి అక్కడ రామనాథబాబు ఉండడుగా?
    వెంకటపతి వీధిగుమ్మం మెట్లుదిగి వీధిలోకి వస్తుండగా కారు హారన్ విన్పించింది. కారు హెడ్ లైట్స్ కాంతికి కళ్ళు చిడతలారాయి: మరుక్షణంలో కారొచ్చి వాకిట్లో ఆగింది. వరూధిని మందులూ, టానిక్కూ బాటిల్స్ పట్టుకొని ముందు సీట్లోనుంచి కారు దిగింది. రామనాథబాబు ఇంజన్ ఆపి కారు దిగాడు, వెనక డోర్ తెరచి పళ్ళబుట్ట పట్టుకొని వరూధిని వెనకే నడిచాడు.
    "అలా చూస్తూ నిలబడతారేం?" గుమ్మం ఎక్కుతూ భర్తను ఉద్దేశించి అన్నది.
    "డాక్టరుగారు ఏమన్నారు?" ఆదుర్దాగా అడిగాడు భర్త.
    "ముందా బుట్ట తీసుకోండి. మీ రొకరూ?" చిరుకోపంతో అన్నది వరూధిని.
    వెంకటపతి రామనాథబాబు చేతిలో వున్న బుట్టను అందుకోబోయాడు.
    "ఫర్వాలేదు. ఎవరు తెస్తేనేం?" అంటూనే పళ్ళబుట్టను అందించాడు వెంకటపతికి.
    వరూధిని మందులూ, టానిక్కులూ టీపాయ్ మీదవుంచి సోఫాలో జారగిలబడింది. రామనాథబాబు టానిక్కుల సీసాల మూతలు తీసి పెట్టాడు.
    "ఇదిగో, ఇది అన్నం తినకముందు రోజూ రెండుసార్లు. ఇదేమో ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయేప్పుడు రెండు చెంచాలు తేనెతో కలిపి తీసుకోవాలి. యీ ఎర్రబిళ్ళలు రోజుకు ఆరు. రెండేసి - మూడుసార్లు. వారం గడిచాక ఇదిగో యీ బాటిల్ లోది వాడాలి. తర్వాత పోతే....." రామనాథబాబుకు అడ్డొచ్చి "మీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడంలేదు." అన్నది వరూధిని అతని కళ్ళల్లోకి చూస్తూ.
    "అవెం మాటలు, పరాయివాళ్ళతో అన్నట్టు?" అన్నాడు రామనాథబాబు.
    వెంకటపతికి కూడా వరూధిని ధోరణి నచ్చలేదు. అయితే ఏమనాలో బుర్రకు తప్పలేదు.
    "ఈ రోజుల్లో సొంతవాళ్ళే చూడం,లేదు. మీరు...." ఏదో అనబోయి ఆగి "మా అదృష్టం" అన్నది వరూధిని.
    
                           20
    
    రెండేళ్ళ క్రితం భర్తతో బస్తీకి వచ్చిన వరూధిని బస్తీలోనే స్థిరపడిపోయింది.
    ఈ రెండేళ్ళల్లో తండ్రి చనిపోయినప్పుడు మాత్రం తన ఊరికి వెళ్ళి దినం అయిందాకా వుండి వచ్చింది. మళ్ళీ ఆమె ఆ ఊళ్ళో కాలు పెట్టలేదు. వెంకటపతి మాత్రం నెల రెండు నెలలకు వచ్చి పోతున్నాడు. వ్యవసాయ తరుణంలో వారం పదిరోజులపాటు ఉండి వెళ్ళేవాడు. వెంకటపతికి బస్తీనీళ్ళు వంటబట్టినై. కొన్న స్థలంలో సినిమాహాలు కట్టే ఆలోచన వెంకటపతికి నరనరానికీ ఎక్కించింది వరూధిని. ఆరునెలల క్రితం తండ్రితో చెప్పాడు.
    'కట్టుకో! నన్నడుగుతావెందుకు?' అన్నాడు సాంబయ్య.
    అప్పట్లో అంతకంటే ఏమీ మాట్లాడలేకపోయాడు వెంకటపతి. ఆ యేడు, నీళ్ళు పెట్టి పొలాలకు దమ్ముచేసి నాట్లు వెయ్యవలసిన తరుణంలో వెంకటపతిని వెళ్ళకుండా బస్తీలోనే ఆపుచేసింది భార్య. కొడుకుకోసం ఎదురు చూసిన సాంబయ్య నిరాశ చెందాడు. మనిషిచేత కబురుపెట్టాడు. అయినా వెంకటపతి రాలేదు. కొడుకు మీది కోపంతో పొలం దమ్ము చేయించకుండా నాలుగు రోజులు ఇంట్లోనే వుండిపోయాడు. ఊళ్ళో పొలాలన్నీ నాట్లు పడ్డాయి. సాంబయ్య పొలం బీడుపడివుంది. ఇంకా నాలుగు రోజులుపోతే నారు దొరకదు. చింతడూ, రాముడూ, బిచ్చాలూ ఒకటే గోల పెడ్తున్నారు. సాంబయ్య బింకంగా కూర్చున్నాడు. పొలం నాటు పడలేదనీ, ఆ ఏడు వచ్చే ఆదాయం కూడా రాదనీ తెలిస్తేనయినా కొడుకు వస్తాడని ఆశించాడు. అయినా వెంకటపతి రాలేదు. వాడి పెళ్ళాం వాడ్ని రానివ్వదు. వాడు రాడు! ఈ ఏడు డెబ్బై ఎకరాల సుక్షేత్రం వంటి మాగాణి బీడుపడుతుంది. సాంబయ్య గుండెలు విచ్చిపోయాయి.
    ఒకరోజు మునిమాపువేళ వెంకటయ్యా, రెడ్డెమ్మా వచ్చి సాంబయ్యను కలిసి చెప్పారు:
    "వెంకటపతిగారు పొలం ఈ ఏడు కౌలుకు చేసుకోమన్నారు. మీతో చెప్పి చేలో దిగుదాం అని వచ్చాం!"
    సాంబయ్య పడగవిప్పిన పాములా బుసకొట్టాడు.
    "వాడెవడూ పొలం మగతాకు ఇవ్వటానికి? నా పొలంలో ఎవరు కాలు పెట్టినా నేను ఊరుకొనేది లేదు."
    "మీరూ చెయ్యకా మమ్మల్నీ చెయ్యనియ్యకా పొలం బీడు పెట్తే ఏమొస్తుందండీ? ఎకరానికి పదమూడు కాటాబస్తాలు ఇస్తాంగా?"
    "బీడు పెట్టుకుంటానో మురగబెట్టుకుంటావో అది నా యిష్టం. ఇక మీరు వెళ్ళండి."
    "మరి మీ అబ్బాయి మాకిచ్చాడు. ఖర్చులు కోసం పైకం కూడా పంతాన చేసుకోన్నాక మీరిట్లా మాట్లాడితే ఎట్టా సాంబయ్యగారూ?"
    "ఇవ్వడానికి వాడెవడు? తీసుకోవడానికి మీరెవళ్ళూ?"
    "మీరెంత హక్కుదారులో మీ కుమారుడూ అంత హక్కుదారుడేగా?" అన్నాడు రెడ్డెమ్మ పట్టుదల చూపిస్తూ.
    "ఓహో! అంతదాకా వచ్చిందా వ్యవహారం? బుద్దిలేని మాటలు మాట్లాడక వెళ్ళండి." విసురుగా అన్నాడు సాంబయ్య.
    "సాంబయ్యగారూ, ఇందులో మా తప్పు ఏముందండీ? కనకయ్యగారు చెబితే మొన్న బస్తీకి వెళ్ళి వెంకటపతిని కలిశాం. ఆరిముందే మీ కోడలుగారు చెప్పారు." వెంకటయ్య తగ్గి మెత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
    "ఏం చెప్పిందేమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS